Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నువ్వక్కడ... నేనిక్కడ... పాటక్కడ... పలుకిక్కడ... మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...' అంటూ 'మంచి మనసులు'లో ఆచార్య ఆత్రేయ రాసిన లిరిక్‌ను ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు 'హమ్మింగ్' చేస్తున్నారు. ఎందుకనే డౌటనుమానం వస్తుంది కదా...! ఇగో ఇదీ విషయం... ఈ మధ్య మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్‌కు దూరం దూరంగా ఉంటున్నారని టాక్... అదేంటో... బీఆర్ఎస్ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌తో కలిసి వేదిక పంచుకోవడం తక్కువైంది. అటు పార్టీలోనూ కేసీఆర్ తర్వాతి స్థానం కేటీఆర్‌దే. ఆయన అధ్యక్షుడు అయితే, ఈయన కార్యనిర్వాహక అధ్యక్షుడు. అయినా... అనేక ప్రధాన సందర్భాల్లో ఏదో కారణం చెపుతూ, ఆయన సీఎం కేసీఆర్‌కు దూరంగానే ఉంటున్నారు. ఆ మధ్య ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ డుమ్మా కొట్టారు. తాజాగా సీఎం కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు, యూపీ మాజీ ముఖ్యమంత్రి సహా పాల్గొన్న బీఆర్ఎస్ ఖమ్మం భారీ బహిరంగ సభలోనూ మంత్రి కేటీఆర్ పాల్గొనలేదు. ఆ టైంలో ఆయన దావోస్ అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో ఉన్నారు. ఢిల్లీ, ఖమ్మం బీఆర్ఎస్ కార్యక్రమాలకు కేసీఆర్ కుమార్తె కవిత అటెండ్ అయ్యారు. ఈ రెండు ప్రోగ్రాంలకూ కొడుకు కేటీఆర్ డుమ్మా కొట్టారు. ఇప్పుడు దీనిపైన రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చే జరుగుతుంది. పార్టీపై కుటుంబ పాలన ముద్ర పడకుండా 'కల్వకుంట్ల' ఫ్యామిలీ హుషారైతందని కొందరు సమర్థిస్తుంటే... దేశ రాజకీయాలకంటే మంత్రి కేటీఆర్‌కు రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ మక్కువ అనే ఇండికేషన్స్‌ను కేడర్‌కు పంపుతున్నారనే విశ్లేషణలు జరుగుతున్నాయి. 'గాంధీ' కుటుంబ వారసత్వ రాజకీయాల్ని వ్యతిరేకించే పార్టీలతో జట్టు కట్టాలంటే ఈ ఎడబాటు తప్పదంటూ ఆపార్టీ నేతలు నోళ్లు నొక్కుకుంటున్నారు. మరి 'కల్వకుంట్ల' వారు ఏం క్లారిటీ ఇస్తారో!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి