Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్విట్జర్లాండ్ దేశపు దావోస్ నగరంలో జరుగుతున్న 'వరల్డ్ ఎకనమిక్ ఫోరం-2023' అనబడే ప్రపంచ సంపన్నుల సదస్సు వేదికగా తొలిరోజు విడుదల చేసిన 'సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ - ది ఇండియా సప్లిమెంట్' అనబడే నివేదిక పలు ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలను వెల్లడించింది. అత్యంత సంపన్నులు, కడుపేదల మధ్య పెరుగుతున్న అగాధాలతో ప్రపంచ జనాభాలో అధికశాతం ఆకలి చావుల అంచున నిలబడ్డారని తేల్చింది. 2021లో భారత దేశంలోని ఒకశాతం సంపన్నుల వద్ద 40.5శాతం సంపద మూలుగుతుండగా, 50శాతం పేదల వద్ద 3శాతం సంపద మాత్రమే ఉందని తెలుస్తున్నది. కరోనా మహావిపత్తు ప్రారంభం నుంచి (మార్చి -2020) నవంబర్ 2022 వరకు బిలియనీర్ల సంపద 121శాతం పెరిగినట్లు (రోజుకు 3608 కోట్లు నిమిషానికి 2.5 కోట్లు) విశ్లేషించారు.
దేశంలోని 10శాతం అత్యధిక ధనవంతుల నుంచి జీయస్టీ పన్ను కేవలం 3శాతం వసూలవుతుండగా, 50శాతం దిగువ వర్గాల బడుగుల నుంచి 64శాతం వసూలు అవుతునట్లు వివరించారు. బిలియనీర్ల నుంచి 20శాతం పన్నులు వసూలు చేయగలిగితే ఆ డబ్బుతో 50లక్షల పాఠశాల ఉపాద్యాయులకు ఒక ఏడాది వేతనాలు ఇవ్వవచ్చని అంచనా వేశారు. 2020-22 మధ్య భారత బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 166కు పెరగగా, నిరుపేదల సంఖ్య మాత్రం 19కోట్ల నుండి 35కోట్లకు పెరిగినట్లు తేల్చారు. దేశంలోని 100మంది అత్యంత ధనవంతుల వద్ద 54.12లక్షల కోట్ల సంపద పోగు అయ్యిందని, ఈ సంపదతో కేంద్ర ప్రభుత్వం 18మాసాలు దేశాభివృద్ధికి కావలసిన నిధులు విడుదల చేయవచ్చని పేర్కొనబ డింది. బిలియనీర్లకు నందనవనంగా నిలిచిన భారతదేశం, పేదలకు మాత్రం ఆకలి రాజ్యంగా మారినట్లు ఆక్స్ఫామ్ వ్యాఖ్యానించడాన్ని ఓ హెచ్చరికగా తీసుకోవాలి.
బిలియనీర్లు అంతులేని లాభాలతో దూసుకుపోతున్న వేళ పేదలు కనీస అవసరాలకే నానా తంటాలు పడుతున్నారు. 2018లో 190 మిలియన్ల పేదలు ఉండగా, 2022లో వారి సంఖ్య 350మిలియన్లకు ఎగబాకడం గమనార్హం. 2022లో ఐదేండ్ల లోపు పిల్లల మరణాల్లో 65శాతం ఆకలి చావులేనని తేల్చారు. ధనవంతులకే దేశ ఫలాలు అందుతున్నట్లు, పేదలు పట్టెడన్నానికి పరితపిస్తున్నట్లు విశ్లేషించారు. 2020 నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక శాతం జనాభా 66శాతం నూతన సంపదను చేజిక్కించుకున్నారని, 90శాతం దిగువ తరగతి జనాభా అతి తక్కువ (ఆరు రెట్లు తక్కువ) సంపద పొందారని వర్ణించబడింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆసియా, ఆఫ్రికా, యూరోప్, అమెరికా దేశాల్లో ధనవంతులపై పన్నులు తగ్గించడంతో పాటు పేదల వద్ద సరుకుల కొనుగోలు రూపంలో పన్నులు అధికంగా పొందినట్లు వివరించారు. భారత్లో కూడా పేదలపై పన్నుల పోటు పెంచడం, ధనికులపై పన్నులు తగ్గించడం అనాదిగా జరుగుతోంది. 2019లో కేంద్రప్రభుత్వం కార్పొరేట్ పన్నులను 30శాతం నుంచి 22శాతానికి తగ్గించగా, నూతన కంపెనీలకు 15శాతం పన్నులు మాత్రమే వేశారు. కార్పొరేట్లకు తగ్గించిన పన్నుల మొత్తం దాదాపు ఒక లక్ష కోట్లుగా అంచనా వేయగా, ఈ మొత్తంతో 1.4ఏండ్లు పనికి ఆహారం పథకాన్ని నిర్వహించవచ్చని అంచనా వేశారు.
ధనికుల కన్న పేదలు కట్టే పన్నుల రేటు అధికంగా ఉండడం ఆక్షేపణీయం. నేటి ప్రభుత్వాలు కుబేరుల నుంచి అధిక సంపద పన్నులు, వారసత్వ పన్నులు వేస్తూ రాబడి పెంచకపోవడం వల్ల అసమానతలు, లింగ భేదాలను తగ్గించే ప్రయత్నాలు సఫలం కావడం లేదు. కరోనా విపత్తు కాలంలో లాభాలార్జించిన సంపన్నుల నుంచి కనీసం 30శాతానికి పైగా పన్నులు వసూలు చేయాలని 80శాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కుబేరుల నుంచి కనీసం 5శాతం అధికంగా పన్నులు వసూలు చేసినా ఆ నిధులతో 200కోట్ల ప్రపంచ మానవాళిని పేదరిక ఊబీలోంచి బయటకు లాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడానికి సూపర్ రిచ్ వర్గం నుంచి అధిక పన్నులు వసూలు చేయడం, పేదలపై పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ప్రభుత్వాలు కృషి చేయాలని సూచనలు కూడా ఇవ్వడం ఈ నివేదిక ప్రత్యేకతని చెప్పాలి. సంపద కూడబెట్టడానికి కాదని, అర్హులకు పంచడానికని ప్రభుత్వాలు తెలుసుకోవాలి.
- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి - 9949700037