Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతేడాది సెప్టెంబరు నెలలో ఇరాన్లో నిర్భంధ హిజాబ్ వద్దంటూ మహిళలతో మొదలైన ఆందోళన ఇప్పుడు కొత్త స్వభావాన్ని సంతరించుకొంటోంది. కొత్త రూపాలు, పద్ధతుల్లో వందలాది పట్టణాలకు పాకింది. ప్రతి శుక్రవారం ప్రార్ధనల తరువాత నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని టెహరాన్‌తో సహా రాత్రుళ్లు సమావేశాలను ఏర్పాటు చేసి పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారికి ప్రతిరూపంగా ఉన్న చిహ్నాలు, స్థలాల మీద దాడులు చేస్తున్నారు. దేశంలోని 282 పట్టణాలకు ఇవి పాకినట్లు వార్తలు. సెప్టెంబరు నుంచి వివిధ సందర్భాలలో భద్రతా దళాలు 750 మందిని చంపినట్లు, 30వేల మందిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. దేశ అధినేత అలీ ఖమేనీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జిసి), పారామిలిటరీ ''బాస్‌జీ'', వీరుగాక పోలీసు ఏజెంట్లు, గూఢచారులకు జనం నిరసన తెలుపుతున్నారు.
మహిళల ప్రతిఘటనతో హిజబ్ ధారణ గురించి పునరాలోచిస్తామని ప్రకటించి ఆందోళనను నీరుగార్చేందుకు చూసిన పాలకులు ఇప్పుడు కొత్త పద్ధతులను ముందుకు తెస్తున్నారు. హిజబ్‌లను ధరించకుండా పనిచేసేందుకు మహిళలను అనుమతించారనే పేరుతో క్వాజ్‌విన్ అనే పట్టణంలో ఐదు దుకాణాలను అధికారులు మూసివేశారని వార్తలొస్తున్నాయి. పార్లమెంటులోని ''సాంస్కృతిక'' కమిటీ సభ్యుడు హుసేన్ జలాలీ ఒక ప్రకటన చేస్తూ హిజబ్ ధరించని వారిని ముందుగా గుర్తించి ఎస్ఎంఎస్ పంపుతామని, తరువాత హెచ్చరించి, అప్పటికీ వినకపోతే అలాంటి వారి బ్యాంకు ఖాతాలను మూసివేస్తామని చెప్పాడు. మరింత ఆధునిక చట్రంలో హిజబ్‌ను అమలు చేస్తామని మరొకడు, జనవరి ఒకటి నుంచి బహిరంగ స్థలాల్లో అమలు చేస్తామని ఓ పోలీసు అధికారి ప్రకటించారు.
పశ్చిమాసియాలో అమెరికా, ఇతర సామ్రాజ్య వాదులను వ్యతిరేకించటంలో తిరుగులేని వైఖరితో ఉన్నప్పటికీ అంతర్గతంగా మతఛాందసాన్ని మరింత పెంచేందుకు, విమర్శకులను అణచివేసేందుకు తీసుకున్న చర్యలతో పాటు ఆర్థికంగా జనజీవితాలు ప్రభావితం కావటంతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. దానికి ఒక రూపమే డైనమెట్ మాదిరి పేలిన హిజాబ్ వ్యతిరేక ఆందోళన. దేశంలో తాజా నిరసనలు ప్రారంభమై ఆదివారం నాటికి 129 రోజులు. ''సయద్ అలీ (ఖమేనీ)ని గద్దె దింపే సంవత్సరమిదే, నియంతకు ఉరి, ఉరితీతల పాలనకు అంతం పలకాలి, హంతక ఐఆర్‌జిసిని శిక్షించాలి, ముల్లాల అధికారమింకేమాత్రమూ వద్దు'' వంటి నినాదాలు చేస్తున్నారు. ఐఆర్జిసి మింగిన తమ సొమ్మును తిరిగి ఇచ్చివేయాలంటూ టెహరాన్‌లోని న్యాయాధికారుల భవనం ముందు క్రిప్టోలాండ్ ఆన్లైన్ ఎక్సేంజ్‌లో పెట్టుబడులు పెట్టిన వారు ఆదివారంనాడు ప్రదర్శన జరిపారు. దాదాపు మూడులక్షల మంది దాచుకున్న పొదుపు మొత్తాలను తిరిగి తమకు ఇచ్చివేయాలని గత రెండు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ పాలకుల నుంచి ఎలాంటి స్పందన లేదు. బాధితుల్లో పెన్షనర్లు, రిటైరైన వారు ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో దిగజారుతున్న కరెన్సీ రియాల్ విలువ, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్లు పెంచాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టటం కూడా వీరిని ఆందోళనకు పురికొల్పుతోంది. దేశ సామాజిక భద్రతా నిధి పెట్టుబడి కంపెనీ ఒక వైపు ప్రతి ఏటా లాభాలు పొందుతుండగా వాటిని పెన్షనర్లకు బదలాయించక పోవటం, పెంపుదల గురించి చేసిన వాగ్దానాలను విస్మరించటం, గత బకాయిలు చెల్లించక పోవటం కూడా అసంతృప్తికి దోహదం చేస్తోంది. తప్పుడు కేసులతో ఉరిశిక్షలు వేసిన తమ వారి విడుదల కోరుతూ రాజధాని టెహరాన్‌లో జనవరి నెలలో మూడుసార్లు కుటుంబాలు, బంధుమిత్రులు ప్రదర్శనలు జరిపారు. తమ దండ్రులను ఉరితీయ వద్దంటూ పిల్లలు ప్లకార్డులు ప్రదర్శించారు. విదేశాల్లో ఉన్న ఇరానియన్లు కూడా పలుచోట్ల ప్రదర్శనలు జరిపి తమ ప్రభుత్వం మీద వత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇరాన్ రాజుగా ఉన్న రెజా షా పహ్లవీ కాలంలో ఇరాన్‌లోని చమురు సంపదను అమెరికా, బ్రిటన్ కార్పొరేట్ల పరం చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1941లో సింహాసనాన్ని వదిలిన తరువాత అతని కుమారుడు మహమ్మద్ రెజా షా అధికారంలోకి వచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1952 ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా అధికారానికి వచ్చిన మహమ్మద్ మొసాదిక్ భూ సంస్కరణలు, చమురు కంపెనీలను జాతీయం చేయటంతో అమెరికా, బ్రిటన్ కుట్రపన్ని ఆ ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. మొసాదిక్‌ను గృహ నిర్భంధంలో ఉంచటంతో ఏడాదిలోనే అధికారం కోల్పోయాడు. రాజు షా ఎంతగా కసి పెంచుకున్నా డంటే 1967లో మరణించిన మొసాదిక్‌ను ఇంట్లోనే ఖననం చేయించాడు. తరువాత కాలంలో షాను వ్యతిరేకిస్తూ అనేక మంది ఉద్యమించినా 1979లో మతశక్తులు అధికారాన్ని కైవశం చేసుకున్నాయి. కమ్యూనిస్టులను, ఇతర పార్టీలను నిషేధించాయి. పౌరహక్కులను కాలరాశాయి. షా వ్యతిరేక ఉద్యమం లో పాల్గ్గొన్నవారిలో ఒకరైన మరియం రజావీ (69) ప్రతిపక్షాల తరఫున అధ్యక్షురాలిగా ప్రకటించుకొని ఫ్రాన్స్‌లో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆమెను, ఆమె మద్దతుదార్లను ఉగ్రవాదులుగా చిత్రించి అరెస్టుచేసిన ఫ్రెంచి పాలకులు తరువాత వదలిపెట్టారు. ముల్లాల పాలనకు చరమగీతం పాడాలన్న తమ పౌరుల డిమాండ్‌ను పశ్చిమ దేశాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె తాజాగా పునరుద్ఘాటించారు.
కుర్దిస్తాన్ ప్రాంతం నుంచి తన కుటుంబ సభ్యులతో కలసి టెహరాన్ వచ్చిన మాషా అమిని అనే 22ఏండ్ల యువతి హిజాబ్ సరిగా ధరించలేదంటూ గతేడాది సెప్టెంబరు 13న ''ఉపదేశ దళాలు'' పట్టుకొని ''నైతిక పోలీసులకు'' అప్పగించాయి. వారు ఆమెను దారుణంగా కొట్టటంతో పదహారవ తేదీన మరణించింది. ఈ వార్తను విన్న మహిళలు పెద్ద ఎత్తున హిజాబ్‌ను వదలివేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆందోళనకు దిగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక చోట ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో కార్మికులు, ఇతరులు కూడా తమ డిమాండ్లతో వారితో కలిశారు. వందలాది మందిని భద్రతాదళాలు చంపినట్లు చెబుతున్న అంకెలను ప్రభుత్వం అంగీకరించటం లేదు. అధికారిక మీడియా రెండువందల మంది మరణించినట్లు వార్తలు ఇచ్చింది. తాజా ఆందోళన ఇరాన్ వ్యవస్థలో నెలకొన్న తీవ్ర వైరుధ్యాలను వెల్లడిస్తున్నది. మొత్తంగా మత ఛాందసపాలన, పాలకులు పోవాలని కోరుకుంటున్నారు. ఇది మరొక విప్లవ పోరాటం అని కొందరు వర్ణిస్తున్నారు.
వర్తమాన ఆందోళన జిన్(మహిళలు), జియాన్ (జీవితం), ఆజాదీ(స్వేచ్ఛ) అనే భావనలతో నడుస్తున్నది. ప్రపంచ గ్యాస్‌లో 15శాతం, చమురు సంపదలో పదిశాతం ఇరాన్లో ఉంది. ఇప్పటి వరకు తోడింది పోను 2020లో వెలికి తీసిన మాదిరే తరువాత కూడా కొనసాగిస్తే మరో 145సంవత్సరాల పాటు తోడుకోవచ్చు. ఇంత సంపద ఉండి కూడా జనం ఇబ్బందులు పడుతున్నారంటే అంతర్గత విధానాలతో పాటు అవినీతి, అవకతవకలు, 2018 నుంచి పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి. 2021నాటికి జీడీపీలో అప్పు 48, నిరుద్యోగం 12, ద్రవ్యోల్బణం 30శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబరు తరువాత కరెన్సీ విలువ 20శాతం పతనమైంది. ఇలాంటి కారణాలతో 60 నుంచి 70శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. వారిలో 18.4శాతం మంది దుర్భరదారిద్య్రంలో ఉన్నారు. దేశంలో 60శాతం ఉపాధి అసంఘటిత రంగంలో ఉంది. చట్టాలు అమలు జరిగే స్థితి లేదు, అసమానతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 6,700డాలర్లు కనీసవేతనంగా ఉంది. జనాల కొనుగోలు శక్తి రోజు రోజుకూ క్షీణిస్తున్నది. నెలల తరబడి వేతనాలు ఇవ్వని స్థితి. సంఘం పెట్టుకొనే వీల్లేదు. ఇస్లామిక్ రిపబ్లిక్కుగా ప్రకటించిన గత 43సంవత్స రాలుగా కార్మికులకు ఎలాంటి హక్కులు లేవంటే నమ్మలేని నిజం. ఆర్థికంగా దిగజారుతూ వత్తిడి తట్టుకోలేక ఇటీవల అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఇరాన్‌లోని ఇస్లామిక్ గార్డులు ప్రజావ్యతిరేకులు, జనాన్ని అణచివేస్తూ సమాజాన్ని వెనక్కు నడిపిస్తున్న మతోన్మాదులు అన్నది నిజం. వారు 1979 నుంచీ చేస్తున్నది అదే, కానీ ఐరోపా పార్లమెంటు ఇప్పుడు వారిని ఉగ్రవాదులుగా ప్రకటించాలని తీర్మానించటం జనం మీద ప్రేమ కంటే ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవటమే అన్నది స్పష్టం. గార్డుల సంగతి జనం చూసుకుంటారు. విదేశాల జోక్యం తగనిపని. మిలిటరీ, పారామిలిటరీ, పోలీసులు ఉన్నప్పటికీ, అదనపు సృష్టి ఇరాన్ గార్డులు. ఆ సంస్థకు గతంలో కమాండర్‌గా పనిచేసి ప్రస్తుతం పార్లమెంటు స్పీకర్‌గా ఉన్న గాలిబఫ్ తీర్మానానికే పరిమితమైతే సరే, అంతకు మించి ముందుకు పోతే ప్రతికూలంగా స్పందిస్తామని అన్నాడు. నవాబియాన్ అనే ఎంపీ మరొక అడుగు ముందుకు వేసి సమర్ధించిన వారిని, ఆసియాలో తమను వ్యతిరేకించే వారిని కూడా ఉగ్రవాద దేశాలుగా ప్రకటించి తమ చట్టాల ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించాడు. వారి కంపెనీలు ఎక్కడ ఉన్నా ధ్వంసం చేస్తామన్నాడు. ఐరోపా దేశాలు తమ స్వతంత్రతను కాపాడుకోవాలని, అమెరికాకు తోకలుగా మారవద్దని ఇరాన్ అధికారపక్ష పత్రిక హెచ్చరించింది. 1988లో ఇరాన్‌లోని వేలాది మంది అసమ్మతి ఖైదీల ఉరితీతకు కారకుడనే పేరుతో స్వీడన్ కోర్టులో విచారణ జరిపి శిక్షించిన ఉదంతాన్ని పేర్కొంటూ స్వీడన్ అధికారులను తమ వారు బంధించి తీసుకువచ్చి ఇరాన్లో విచారణ జరుపుతామని మరొక పత్రిక సంపాదకుడు హెచ్చరించాడు. ఇటీవల కొంత మంది టెహరాన్‌లోని బ్రిటన్, ఫ్రెంచి రాయబార కార్యాలయాలపై దాడి చేశారు.
గతేడాది అక్టోబరులో క్యూబా రాజధాని హవానాలో జరిగిన ప్రపంచ దేశాల, కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల మహాసభలో పాల్గొన్న సీపీఐ(ఎం), సీపీఐతో సహా 62దేశాల పార్టీలు ఒక ప్రకటనలో ఇరాన్ ఆందోళన కారులకు, ఇరాన్ కమ్యూనిస్టులకు మద్దతు ప్రకటించాయి. పాలకుల అణచివేతను తీవ్రంగా ఖండించాయి. ''దేవుడిని వ్యతిరేకించారు, ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, ఇస్లామిక్ రాజ్యానికి, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారు'' వంటి అభియోగాలను మోపి వేలాది మందిని కోర్టులలో విచారణ తతంగం జరుపుతున్నారని ఆ ప్రకటన పేర్కొన్నది. ఇరాన్లో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండాలన్నది ఇరానీయులకు సంబంధించిన అంశమని స్పష్టం చేస్తూ పశ్చిమ దేశాలూ, మధ్య ప్రాచ్యంలోని మితవాద ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని పేర్కొ న్నాయి. ఇరాన్లో చరిత్ర పునరావృతం అవుతోందా అంటే అవకాశం ఉందని చెప్పవచ్చు. గతంలో రాజు షాను ఉరితీయాలని నినదించిన వారే నేడు సుప్రీం లీడర్ అలీ ఖొమేని ఉరికోసం డిమాండ్చేస్తున్నారు. మతాధికారులు గతంలో అమెరికా, బ్రిటన్ సామ్రాజ్యవాదులకు మద్దతు పలికిన చరిత్ర ఉంది. ఒక వేళ వర్తమాన ఆందోళన వారి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తే వారు స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటారా? జనాన్ని అణిచివేసేందుకు పశ్చిమ దేశాలతో చేతులు కలుపుతారా? అన్నది ప్రస్తుతానికి ఊహాజనిమే కావచ్చు గానీ, జరిగినా ఆశ్చర్యం లేదు!
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288