Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిమ్మ సీకటిలో మిణుగురు అయినా వెలుగే. భరణి ఎండలో ఇంకుతున్న కుంటనీరయినా జీవ జలమే. వరద ప్రవాహంలో కొట్టుకపోయే పడవకు చిన్న రెల్లుగడ్డి అయినా ఆధారమే. అకారణంగా అవమానాలు ఎదురవుతున్న వేళ దరికితీసి, ఆదరించే బంధం ఆత్మబంధమే. వేదనతో కూడిన మా బడి బాల్యాన్ని గతంగా మార్చి ఆనందపు తీరాలకు చేర్చిన తెరచాప నావ మా గురువు వెంకటరెడ్డి తోవ. ఆ తోవకు బతుకంతా రుణపడి ఉంటాం.
అది మూడమేసిన కాలం. అందరికి చదువెంతో దూరం. అణగారిన బిడ్డలకు సమాజమిచ్చిన వివక్ష ఒక శాపం. అరకొర వసతులున్న జైలును తలపించే హాస్టల్ మా పాలిట నరకం. కులంపేర చిన్నచూపు చూసే కొందరు ఉపాధ్యాయుల తిట్లు, కనపడగానే కర్రదెబ్బలు ఆ రోజుల్లో సాధారణం. దానికి భిన్నంగా సంప్రదాయకులైన మంచి ఉపాధ్యాయులు కూడా మా పాఠశాలలో ఉండేవారు.
బడి చదువంటే మాకో వింత. పదవ తరగతి పాస్ అయితే చిన్న కొలువు ఏదైనా మా పిల్లలకు దొరుకుతుందనే ఒక ఆశ తల్లిదండ్రులకు. పదవ తరగతి గట్టెక్కితే ఎవరెస్టు ఎక్కినంత ఆనందం. మా ఊళ్లో మూడవ తరగతి వరకే ఉండటం వల్ల రఘుపతిపేట స్కూల్ హాస్టల్లో చేర్చినారు. నిత్యం ఆలమంద అరుపులతో, మేకల గుంపులతో, అమ్మమ్మల తాతయ్యల అనుబంధాలతో హాయిగా ఉన్న మాకు హాస్టల్ మెట్లెక్కినప్పుడే ఏదో దిగులు కమ్మేది. ఆ దిగులుతోనే సదువు కొనసాగేది. మాలాంటి వారికి చదువు వికాసంగా కాక ఏదో బరువు మోస్తున్నట్లు ఉండేది. పది పాస్ అయితే కాలేజీ సీటు వస్తుందో రాదో తెలియదు కానీ పది పరీక్ష తప్పితే పారతట్ట, కాడిమేడి పని మాత్రం గ్యారెంటీ అనుకునేవాళ్లం.
అలాంటి కఠిన యాతనల కాలంలో ఎడారిలో నీటిసెలిమలా మాకోసం వచ్చిన వాడే మా వెంకట్ రెడ్డి సారు. చల్లని చూపులతో మమ్ముల అక్కున చేర్చుకున్న ఆదర్శమూర్తి. అంతకు ముందున్న ఉపాధ్యాయుల ఇళ్లలో వాకిళ్లు తొక్కడానికి కూడా సందేహించే మేము వారి ఇంటిలో సొంత బిడ్డలా కలిసి పోవడం అనేది మాకు ఊహకందనిది. గోలెం దగ్గర నీళ్ల లోటాను ముట్టుకోవడానికి వెరిసే మేము వారు తినే పల్లెంలోనే మాకు వడ్డించి మాతో కలిసి భోంచేసిన రోజులు గుర్తుకొస్తే సాపకూటి బ్రహ్మనాయుడుని సార్లో చూసుకునేది. మా ఇంటి దగ్గర వేగు జామున లేచి మోటకో, గుంటుక పనికో, పశువుల కాపుకో బయలెళ్లడం మాకు తెలిసిన పని. కానీ మా వెంకట్‌రెడ్డి సారు అదే వేకువ జామున నాలుగు గంటలకు నిద్రలేపి స్నానానికి పారే దుందుభి వాగులోకి తీసుకెళ్లేవారు. సబ్బులు లేని విద్యార్థులకు తానే సబ్బులు ఇచ్చి శుభ్రతకు పాదువేసేవారు. ఇవాళ మా వంటి మెరుపును, తెల్లని వస్త్రాలను చూసుకున్నప్పుడు అద్దంలో సారు మోమే మాకు కనిపిస్తుంది.
క్రమశిక్షణకు మారుపేరు కాని కర్ర ఉపయోగించడం తెలియదు. మా బిడ్డల కోసం ''చలం బిడ్డల శిక్షణ'' పేజీలు తిప్పినప్పుడల్లా ఆ పిల్లలపట్ల మా సారు ప్రేమకు అది అక్షర రూపమేమో అనిపిస్తుంది. పిల్లలకే జీవితం అంకితం పుస్తకం రాసిన స్లుహనోమస్కిలా మా సారు. గిజుభాయి పగటికల మా సారు. ఏ విద్యార్థి ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉంటే ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేవారు. వారికి స్పెషల్ క్లాసులు చెప్పాలని వివరించేవారు. సారు సమక్షంలో అమావాస్య కూడా వెన్నెల కాసినట్లుగా ఉండేది.
ఎవరినీ హేళన చేసి ఎరగడు. తప్పులు ఎత్తిచూపకుండ సరిదిద్దుకునే ఆత్మవిశ్వాసం కలిగించేవాడు. నేను నాతోపాటు కొంతమంది విద్యార్థులం గణితం అంటే వణికిపోయేవాళ్లం. ఇది గమనించిన వెంకట్ రెడ్డి సారు గణిత ఉపాధ్యాయులైన గోవర్ధన్ రెడ్డి సార్‌తో మాట్లాడి మా పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే విధంగా చూడాలని చెప్పారు. ఎవరు ఏ సబ్జెక్టులలో వీక్ ఉంటే ఆ సబ్జెక్టుల ఉపాధ్యాయులతో అదనపు క్లాసులు చెప్పించేవారు. విద్యా బోధనలకు సంబంధించి వారి కృషిని వివరిస్తే ఒక మహా గ్రంథమే అవుతుంది.
సార్ కమ్యూనిస్టు కావడం వల్లనే మా యెడల అంత వాత్సల్యంతో ఉండేవారని తర్వాత మాకు అర్థమైంది. మాకు బడి చదువుతో పాటు బతుకు విలువలు నేర్పినవారు. మాకు తెలియకుండానే మమ్ములను అభ్యుదయమార్గం వైపు చేరువచేశారు. మాటకు చేతకు పొంతన కలిగిన ఆచరణ సారుది. సమయం దొరికినప్పుడల్లా గతితార్కిక భౌతికవాదం, అర్థశాస్త్రం, చారిత్రక భౌతికవాదం, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం, జాతీయోద్యమం గురించి సులభంగా మా స్థాయికి దిగి చెప్పేవారు. ఆర్. రాంరెడ్డిలాంటి ఉపాధ్యాయులతో క్లాసులు ఇప్పించేవారు. మా జిల్లా కమ్యూనిస్టు నాయకులు కె. కిష్టన్న, బాలకిష్టయ్య గౌడ్, లింగోజిరావు, కందికొండ రామసామి, తెప్ప బలరాం, వనగంటి ఈశ్వర్ లాంటి నాయకులను రప్పించి, వారితో మాకు సాన్నిహిత్యం పెంచేవారు. ఆ రోజుల్లోనే మేము విజయవాడ, వనపర్తి అనేక ప్రాంతాలలో జరిగిన మార్క్సిస్టు పార్టీ రాజకీయ తరగతులకు పోవడానికి ప్రధాన కారకుడు సారే. బతుకు బాటలో, ఉద్యమ పాటలో ఎదగడానికి ఊతం సారుదే.
పార్టీ పిలుపు మేరకు డీఈఓ స్థాయి ఉద్యోగాన్ని వదలి హౌల్ టైమర్‌గా వచ్చారు. ఎన్నో భూ పోరాటాలు నిర్మించి, పాలుమూరు జిల్లా వామపక్ష విప్లవోద్యమానికి సార్ కీలక భూమిక పోషించారు. తన సొంత ఊరిలో తన కుటుంబీకుల భూమిని కూడా దళితులకు పంచిన ధన్యశీలి. తన ఊరిలో కులరహిత ఆచరణలో ఉన్నందుకు కులం నుంచి తను వివక్షకు గురయ్యాడు.
సారు మృదుభాషి, సరళ స్వభావి. నిరాడంబరతకు మారుపేరు. ఏ ప్రలోభాలకు లొంగని నికార్సయిన కమ్యూనిస్టు. ఇప్పటికీ నేను ఏదో మేరకు ప్రజల పక్షం ఉన్నానంటే దానికి కారణం మా వెంకటరెడ్డి సారు, మా బాలకిష్టయ్య గౌడ్. సుందరయ్యగారి మార్గంలో కడవరకు నడిసిన ధన్యజీవి మా సారు. ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా పోరాటం నుంచి మడమ తిప్పని నిజమైన కమ్యూనిస్టు యోధుడు.
సారు దస్తూరీ ఎంత అందంగా ఉండేదో, రూపం కూడా అంత ప్రసన్నంగా ఉండేది. తన నోటి నుంచి ఏనాడు ఒక పొల్లుమాట వినలేదు. మేం పదవతరగతిలో ఉన్నప్పుడు మాతో ఎలా ఉన్నాడో, మా పిల్లలు పదవ తరగతికి వచ్చినప్పుడు కూడా మాతో అలాగే ఉన్నాడు. నిరంతరం మా నడవడిని గమనించేవాడు. మా కుటుంబాల క్షేమాన్ని కాంక్షించేవాడు. చిన్న సమస్య ఉన్నా ఓపికతో విని తగిని పరిష్కారం చూపేవాడు. మా కుటుంబాలలో ఎవరి ఆరోగ్యం బాలేకున్నా, తనకే బాగాలేనట్టు భావించి, తగిన సేవలు అందేందుకు తన పరిచయాలను ఉపయోగించేవాడు. సారు బతికున్నంతకాలం వారంలో కనీసం రెండుమార్లయినా ఫోన్ల ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ మాకు మార్గనిర్దేశం చేసేవాడు.
నిబద్ధతకు మారుపేరు. కీర్తి ప్రతిష్టలకు దూరం. మితభాషి. సూక్ష్మగ్రాహి. అన్నిటికి మించి నిత్య అధ్యయనశీలి. మా ఎదుగుదలను చూసి సంతోషపడేవాడు. నిత్యం మా మేలుకోరిన మానవీయమూర్తి. కరుణ తొణికే కళ్లు మూసుకున్న మా సారును చితిపైన చూసి సందె వాలకముందె మా ఆశలకు మబ్బులు కమ్మినాయి. సారు సహచరి విజయమ్మగారు, మూసిన సారు కనులకు కళ్లజోడు నాతో తొడిగించి చివరిసారి చూసుకోమని కన్నీరయింది. సారు భౌతికంగా లేరు. నా గుండెలో దీపమై వెలుగుతున్నాడు.
- గోరటి వెంకన్న