Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజిక మాధ్యమాల్లో రాజకీయ చర్చలు పెరిగాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆయా రాజకీయ పార్టీల మద్దతుదారులతో పెట్రేగి పోతున్నాయి. నువ్వా-నేనా అన్నట్టుగా దీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ధరల పెరుగుదల నుంచి ప్రతి విషయంపై ఎవరు కారకులనే దానిపై ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. సమస్యలకు రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్ దే బాధ్యత అంటూ ఒకరు పోస్ట్ పెడితే, వెంటనే కాదు... కాదు కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణమని మరొకరు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నుంచి రాష్ట్ర విభజన హామీలు, వందే భారత్ ఎక్స్ప్రెస్... ఇలా ఒకటేమిటీ? దొరికిందే అంశమంటూ దానిపై డిబేట్లు కొనసాగిస్తున్నారు. ఆన్లైన్లో జరుగుతున్న ఈ చర్చలతో ఉపయోగ ముంటున్నా... కొన్ని సార్లు నాయకుల పట్ల వ్యక్తిగత వీరాభిమానం ప్రదర్శిస్తూ గుడ్డిగా సమర్థించుకునే వారు రెచ్చిపోతున్నారు. మధ్యలో శాంతిదూతల్లా ప్రవేశించే వారు అలాంటి చర్చలొద్దంటూ ముగింపు పలుకుతున్నారు. విద్య, వైద్యం, జీవనోపాధి, ఉద్యోగాల కల్పన తదితర ప్రజావసరాలపై జరుగుతున్న చర్చలు ఆయా రాజకీయ పార్టీల విధానాలను సామాన్యులు అర్థం చేసుకునే దిశగా ఉంటున్నాయి. అదే సమయంలో ఆయా చర్చలను పక్కదారి పట్టించేలా భావోద్వాగాలను రెచ్చగొట్టే అంశా లను చర్చకు పెట్టే వారు ఆయా గ్రూపుల్లోకి చేరి చర్చలను పక్కదారి పట్టిస్తున్నారు. వాట్సప్ గ్రూపుల అడ్మిన్ చర్చలను పక్కదారి పట్టకుండా నియంత్రిస్తే సామాన్యులు మరింత చైతన్య వంతులయ్యేందుకు సామాజిక మాధ్యమాలు దోహదపడే అవకాశముంది.
-కొత్తూరు ప్రియకుమార్