Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ గణతంత్ర శుభదినాన మనదేశ స్వాతంత్య్రం కోసం పోరాడినవారిని యాది చేసుకోవాలి. వారి జీవితాల్లోని ముఖ్యమైన సంఘటనల్ని గుర్తుచేసుకోవాలి. వారి త్యాగాలను మననం చేసుకోవాలి. మనకో రాజ్యాంగాన్ని రాసిన మహనీయులను, ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణ తంత్ర దినోత్సవాన్నీ సగర్వంగా జరుపు కోవాలి... అలా నాయకుల ఉపన్యాసాలు సాగి సా.... గిపోతూ ఉంటాయి. అలా పాత నాయకులు చేసిన త్యాగాలేమిటి, నేటి నాయకులు చేసిన త్యాగాలేమిటి అని తెలుసుకుందామని మనసు లబలబలబలాడిపోయింది, గుండె డబడబడల కొట్టేసు కుంది...
చేయడం కష్టంగా, చెప్పడం సులభంగా ఉండేది ఏది? ఒక ఉదాహరణ ఇవ్వండి అని అడిగితే టక్కున సలహా ఇవ్వడం అని చెబుతారు చాలామంది. అయితే దానికి తోడు ఇంకోటి కూడా ఉంది. అదే త్యాగం చేయడం. త్యాగం చేయండని చెప్పడం చాలా సులువు. స్వయంగా చేయడం చాలా కష్టం.
మనవి త్యాగం చేయడం ఒక రకమైతే, ఇతరులవి త్యాగం చేయడం మరో రకం. మొదటిదాన్ని తీసుకున్నట్టైతే స్వాతంత్య్ర పోరాట కాలంలో తమ ఇళ్ళను, ఆస్తులను, తాము చేస్తున్న ఉద్యోగాలను కూడా జాతికోసం త్యాగం చేసేసి బ్రిటిషు వారిపై పోరాటం చేసినవారు ఎందరో. గాంధీ సినిమా చూస్తే తమ మెడలోని దండలను, చేతులకుండే గాజులు, ఉంగరాలు ఒకటేమిటి బంగారం కంటే దేశ ప్రజలందరికీ వచ్చే స్వేచ్ఛనే అసలైన బంగారమనుకొన్నవారు కనిపిస్తారు. అంతేనా, ఎందరో కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు కూడ ఓపక్క స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ఇంకోపక్క తాము నమ్మిన సిద్ధాంతాల కోసం, పార్టీకోసం సర్వం త్యాగం చేశారు.
ఇక రెండోరకం అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడంటారు కదా! ఆ టైపు. నేను పదో తరగతి పాసైతే నీ తలవెంట్రుక లిస్తానని దేవుడి దగ్గర ప్రమాణం చేశాను అన్నట్టే ఉంటుంది. నీతల, నీ తలనీలాలు నీ ఇష్టం. అందులోనూ నీ పరీక్ష కాబట్టి నీ వెంట్రుకలు ఇవ్వడం న్యాయం, ధర్మం కూడా. అలాకాదని నీ పరీక్ష నీవు పాసై, పై తరగతికి నీవు ఏ మంచి కాలేజీకో అంతకంటే మంచి క్రాపుతో పోయి నన్ను గుండుతో ఉండమనడం అన్యాయం కదా! అంటే అందరూ అవును నిజమేనంటారు. అన్యాయమే నంటారు. కానీ ఎన్నుకున్న నాయకుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు దేశానికి, ప్రజలకు చెందిన ఆస్తులను, ప్రభుత్వ సంస్థలను చవకగా అమ్మేస్తుంటే అన్యాయాన్ని అన్యాయంగా చూడరు. అందుకే ప్రజలకు ఇన్ని కష్టాలు.
ఒక సినిమాలో బాబూమోహన్ భలే మంచి చౌకబేరమూ అంటూ అసెంబ్లీ భననాన్ని అమ్ముతూ ఉంటాడు. త్వరగా కోనుక్కోండయ్యా ఇంకా సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ, జూ అలా ఇంకెన్నో అమ్మాలి అంటుంటే ఏదో తమాషాకు అనుకున్నాం. అది నిజమని తెలుస్తోందిప్పుడు. అలా ప్రభుత్వ అంటే ప్రజల సొమ్ములను అమ్ముతూ ఉన్నారు అని అపోహ పడకుండా వాటిని తొంభైతొమ్మిదేళ్ళు తక్కువ బాడుగకు లీజుకివ్వడం, అలా లీజుకు తీసుకున్నవాళ్ళు దాన్ని బాగా డెవెలప్ చేస్తారని చెప్పడం చూస్తే అబ్బో మన నాయకులు హాస్యం కూడా బాగా పండిస్తారని తెలిసిపోతుంది మనకు. హాస్యం పరమౌషదం కాబట్టే ఆ ఔషదాన్ని కరోనా సమయంలో గంటలు కొట్టించి ఉచితంగా సేవ చేయలేదూ!! దేనికైనా మన ప్రజలు ఎంతో విశాల హృదయులు కాబట్టి ఓపికా ఎక్కువే, తట్టుకునే శక్తీ ఎక్కువే అదంతా కూడా త్యాగమే అనుకోవాలి.
ఉద్యోగుల సొమ్ములైన పెన్షన్ నిధులు, పి.ఎఫ్ ఖాతాలోని సొమ్ములను కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే త్యాగం చేస్తున్నాయని వార్తలు బయట కొస్తున్నాయి. కూతురు పెళ్ళి ఉంది నాసొమ్ము నేనే డ్రా చేసుకుంటానంటే కూడా దయతలచడంలేదు. ఆ మాత్రం ప్రభుత్వంకోసం త్యాగం చేయలేవా, నీకామాత్రం త్యాగ గుణం లేదా అని ఎదురు మాట్లాడే అవకాశమూ ఉంది.
త్యాగయ్య అంటే ఓ సంగీత విద్వాంసుడని ఎవరైనా చెబుతారు. కానీ కాలం, దేశం, ప్రపంచం, మనుషులూ మారిపోయి అపర త్యాగయ్యలు, త్యాగమ్మలూ తయారయ్యారు. ఇక ఎన్నికలొస్తే చాలు నోరులేని నాలుక ద్వారా సంగీత ప్రపంచాన్ని, గాయకులను తలదన్నేలా తమ నోటితో హామీల మీద హామీలు కుమ్మరించి తడాఖా చూపిస్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకంతో ఇహ చూస్కో అని షురూ చేసినట్టు కనిపిస్తుంది. చెప్పినవాటిల్లో చేసేది అదే మొదటిది, చివరిదీ. ఎన్నికలముందు ఇచ్చిన మ్యానిఫెస్టోలోని మిగతా అంశాలు మరుసటి ఎన్నికలకు త్యాగం చేసేస్తారు.
రెండు రోజుల్లో ఎల్.ఐ.సి సొమ్ము పద్దెనిమిది వేల కోట్లు అమాంతం గాలిలో కలిసిపోయింది. ఇది ఒక మిత్రుడికోసం చేసిన త్యాగమని తెలుసుకోవాలి. స్నేహ బంధం ముందు అన్నీ దిగదుడుపే. ఈ త్యాగాన్ని ప్రజలు భరించాలి. ఊరికే దేశభక్తి అంటూ సినిమా హాల్లో జాతీయ గీతం వచ్చేటప్పుడు నిలబడితే సరిపోదు. ఇలాంటి త్యాగాలే అసలైన భక్తికింద లెక్క. అప్పుడే మీరు దేశ పౌరుల లిస్టులో ఉంటారు. కాబట్టి త్యాగధనుల లిస్టులో ఉంటేనే మంచిదని కొందరి ప్రయత్నం.
ఎమ్మెల్యే లేదా ఎంపీ అయితే ఐదు సంవత్సరాలు ఉండొచ్చు. ఒక్కోసారి ముందస్తు ఎన్నికలంటూ తమవారి నందరినీ రాజీనామా చేయమంటారు. నాకోసం మీరంతా త్యాగం చేసి తీరాలంటారు. మళ్ళీ సీటు గ్యారెంటీనో కాదో చెప్పరు.
అందుకే త్యాగధనుల దేశంలో ప్రజలు తమ బతుకుల్ని త్యాగం చేసినా దేనికోసం చేస్తున్నామో తెలిసి చేయాలి. అంతే తప్ప అపాత్రదానం చేసినట్టు దేశానికి చేటు తెచ్చే త్యాగాలను చేయరాదు. చేయనివ్వ రాదు.
- జె. రఘుబాబు
సెల్:9849753298