Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పుష్పవిలాపం కాదు కాని, బంతి పువ్వులు, గులాబీలు, తెల్ల చామంతులు గొల్లున ఏడ్చాయి. బిల్కిస్ బానో రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను ''పెద్ద మనుసు''తో గుజరాత్ సర్కార్ విడుదల చేసినందుకే కాదు, విశ్వహిందూ పరిషత్‌వారు ఈ దోషులను తమతో కట్టిన దండలతో సత్కరించినందుకు భోరు మన్నాయి. ఇటువంటి ఘటనలను ఎవరూ మర్చిపోరాదనే ''రిపోర్టింగ్ టు రిమెంబర్'' (గుర్తుపెట్టుకోడానికే వార్తలు రాయడం) అనే సంస్థ వెలిసింది. తమాషాగా అది స్థాపించిన జాస్మీన్ (మల్లెపువ్వు) పథేజా పేరు కూడా మరో పువ్వుపేరుతో ప్రారంభం కావడం కాకతాళీయమే. నిత్యం నాలుగు మాటలు తన బుర్రలో సవ్వడి చేస్తూంటా యంటారామె. అవి 'స్పందించడం', 'తెలుసు కోవడం', 'మనసును తాకడం', 'మానవత్వం'. మనకి మనం కొన్ని విషయాలపై స్పందించి, ఆ స్పందించిన విషయాలను తెలుసుకుని, ఆ తెలుసుకున్న విషయాలను మనసుకు హత్తుకునేలా చేసి, మానవత్వంతో కూడిన అంశాలను ఇతరులతో పంచుకోవాలంటారు జాస్మీన్. తనకు తాను కళాకారినిగా చెప్పుకునే జాస్మీన్ పథేజా గత 20ఏండ్లుగా తాను సృజనాత్మక పద్ధతుల్లో ప్రజలు మర్చిపోయే (బహుశా ఎప్పుడూ నేర్చుకోని) ప్రపంచంలో పనిచేస్తున్నానంటారు.
ఆలోచనా పూర్వక విషయాల నుండి క్రియాశీలక అంశాల వరకు చర్చించే, తాను సృష్టించిన ''బ్లాంక్ నాయిస్'' అనే ఫెమినిస్టు సంస్థ తాను బెంగుళూరులో ''సృష్టి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్, డిజైన్ అండ్ టెక్నాలజీ సంస్థ విద్యార్థిగా ఉన్నప్పుడే పురుడు పోసుకుందని చెపుతారు. పథేజా ఆ సంస్థను తన సొంత ఇల్లుగా భావిస్తారు.
'షీ' రోస్
'బ్లాంక్ నాయిస్' మొట్టమొదట చేపట్టిన అంశం 'ఈవ్ టీజింగ్'. ఆమె ఒక 'ఈవ్‌టీజింగ్ ఫుడ్ చార్ట్' రూపొందించారు. రోడ్లపై మహిళల్ని 'లాలీపాప్', 'చామ్ చామ్', 'హరిమిర్చి' తమను తాము రక్షించుకునేందుకు కారంపొడి వగైరా పట్టుకు తిరుగుతారు కాబట్టి 'ఆత్మరక్షణ పరికరాల మ్యూజియమ్స్' అంటూ బనాయిస్తూంటారని జాస్మీన్ పథేజా చెపుతారు. ఇటువంటి వివిధ ఆలోచనలను అమల్లోకి తెచ్చే ఈ 'బ్లాంక్ నాయిస్' కార్యకర్తలను ఆమె హీరోల్లాగే 'షీరోల'ని పిలుస్తూంటారు.
ఆమె బెంగుళూరు కబ్బన్‌పార్క్‌లో ఒక చిన్న కునుకు తీస్తే, చిన్న అలికిడికి కూడా ఉలిక్కిపడి లేచేది. ఆ సందర్భంలో 'మీట్ టు స్లీప్' అనే ఆలోచన వచ్చింది. దేశంలో వేల మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో నిద్రించాలనే ఆలోచన ఆమెకొచ్చింది. మహిళలపై అత్యాచారాలు చేసే వారి చెంప చెళ్ళుమనిపించేలా హింసకి గురైన మహిళల దుస్తులు ఆమె పోగుచేయడం మొదలుపెట్టింది. అటువంటి వాటిని పదివేలు పోగుచేసి ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ప్రదర్శించాలని ఆమె స్వప్నిస్తోంది. ఆ రకంగానైనా మహిళలపై హింస తగ్గుతుందేమోనని ఆశిద్దాం...
పూలను, ఆడపిల్లలను ఒకదానికొకటి పర్యాjపదాలుగా రాస్తుంటారు కవులు. కుటుంబాల్లో భారం మోస్తూ, బాధల్ని భరిస్తూ నెట్టుకొచ్చే, నెగ్గుకొచ్చే స్త్రీలైనా పూలైనా విలపించ కుండా చూడటం సమాజం బాధ్యతే!
- ఆరెస్బీ
(ప్రియారమణి హిందూలో రాసిన వ్యాసానికి స్వేచ్ఛానువాదం)