Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలక పగిలిపోయింది
గుడి ముందు బడిని
మోకరిల్ల జేసిన మతోన్మాదుల దాడికి
అదిప్పుడు చిద్రమైంది
పలకంటే పలక కాదు సుమా!
అది ఉపాధ్యాయుని మనోఫలకం
అక్షరాలను అస్త్రాలుగా మార్చి
విద్యార్థి అమ్ములపొది నింపే కర్మాగారం
రేపటి పౌరుల నగిషీలుచెక్కే కార్యక్షేత్రం
విశ్వమంతా విస్తరించిన
విజ్ఞానానికి పాదు అదే
అక్కడ ప్రశ్నలు పాదుకుంటే
పాలకులు బాదుకుంటారు
అందుకే
ప్రశ్నల పీకనులిమేందుకు
ఇప్పుడు మూకల్ని వదిలారు
వాళ్ళు ఉత్త మూకలేం కాదుసుమా!
బ్రూనో హంతకుల వారసులు
ఏలేవాడి మస్తిష్కానికి ప్రతీకలు
వాళ్లనిప్పుడుపేక్షిస్తే...
ఉదయించే సూర్యుడు
దేహంలో రక్తం యొక్క రంగు
ఎర్రగా ఎందుకుందంటూ
మనలో అనుమానాలు రాజేస్తారు
ఇంకేముంది
అనుమానం చుట్టూ మనం
అధికారం చుట్టూ వాళ్లు
అలా ఎంతకాలం సహిద్దాం
రండీ!
జీవించి ఉన్నవాల్లెవరైనా ఉంటే
లేచిరండి!
పగిలిన పలక ముక్కల్ని
ఏరి ఒక్కటిగా కూర్చి
స్వేచ్ఛా కపోతానికి రెక్కలుగా చేద్దాం
- ఏబూషి నర్సింహ,
సెల్: 9542806804