Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో 2014 నుంచి మీడియా క్రమంగా స్వేచ్ఛను కోల్పోతున్నది. ప్రమాదంలో పడుతున్నది. కార్పొరేట్ సంస్థలు ,పెట్టుబడి మీడియాపై పట్టు సాధిస్తున్నాయి. ఆయా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు, ఉద్యోగులు, సిబ్బంది యాజమాన్యం ఆదేశించినట్టుగా వార్తలు, సమాచారం. సర్వే రిపోర్టులు పంపాల్సి వస్తున్నది. ప్రజానుకూల వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వ్యతిరేక వార్తలకు కాలం చెల్లుతున్నది. ప్రజలకు చేరనీయడం లేదు. కొన్ని పెట్టుబడిదారీ గుత్త సంస్థలే ప్రింట్ మీడియాపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టుల స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతున్నది. నాలుగు నెలల క్రితం పత్రికా స్వేచ్ఛపై 'రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్' అనే సంస్థ 180 దేశాల్లో సర్వే నిర్వహించింది. అందులో భారతదేశం 142వ ర్యాంకులో ఉండటం గమనార్హం.
దేశంలో మొట్ట మొదటి పత్రిక 1818 మే 23న గవర్నర్ జనరల్ లార్డ్హెస్టింగ్స్ ఆధ్వర్యంలో వచ్చింది. ఇంగ్లీషు, బెంగాలిలో ప్రచురణలు ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు భారతదేశంలో పత్రికా వ్యవస్థ బాగా విస్తరించిందనే చెప్పొచ్చు. దేశ వ్యాప్తంగా 2023 జనవరి 16 నాటికి 1,05,443 పత్రికలు ప్రింట్ అవుతున్నాయి. ఇందులో యూపీ 16,000, మహారాష్ట్ర 14,000 పత్రికల ముద్రణతో మొదటి , రెండో స్థానాలలో ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠిలలో ఎక్కువ పత్రికలు పబ్లిష్ అవుతున్నాయి. పత్రికలపై వ్యయం రూ.1500 బిలియన్లకు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పత్రికలు భారీగా పెరిగాయి. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తరువాత ప్రింటింగ్ మీడియాలో చిన్న పత్రికల ఉనికి ప్రశ్నార్థకమైంది. దాన్ని కరోనా మరింత దెబ్బతిసింది. దీనికితోడు ఆన్లైన్, ఈ-పేపర్ రావడంతో ప్రింటింగ్ మరింత తగ్గింది. అదే సమయంలో జర్నలిస్టులు, సిబ్బంది స్వేచ్ఛపై నియంత్రణలు పెరిగాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ),1950 ద్వారా పత్రికా స్వేచ్ఛ కల్పించబడింది. ప్రతి సంవత్సరం మే మూడున పత్రికా దినోత్సవం సైతం జరుపుతున్నారు. దేశంలో జరుగుతున్న హింసా కాండను, ప్రభుత్వాల దుష్పరిపాలనను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. కానీ ఆ బాధ్యత నిర్వహణలో అనేక మంది జర్నలిస్టులు, ఉద్యోగులు, ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.
రక్షణ చట్టాలు
వర్కింగ్ జర్నలిస్టులు, ఉద్యోగుల -45/1955 యాక్ట్ వచ్చింది. ఆ తరువాత వర్కింగ్ జర్నలిస్టులకు వేతనాలు నిర్ణయించడానికి 1958లో మరో చట్టం కూడా తెచ్చారు. ఆ తరువాత రాష్ట్రాలలో ప్రెస్ కౌన్సిళ్లనూ ఏర్పాటు చేసి ఉద్యోగులకు, సిబ్బందికి తగిన రక్షణలు కల్పించడానికి ప్రభుత్వాలు చట్టాలు రూపొందించాయి. యాడ్స్, బ్రాడ్కాస్ట్, కంటెంట్ సెన్సార్షిప్ , కాపీరైట్, కార్పొరేట్ చట్టం, ప్రైవసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ తదితర సమాచారాన్ని సేకరించడానికి తగిన స్వేచ్ఛను కల్పించడం జరిగింది. అయినా ఈ చట్టాలు అమలు కాకపోవడంతో మీడియాలో పనిచేసే సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. భౌతిక దాడులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. ఇందుకోసం సమాచార, పౌరసంబంధాల శాఖ పర్యవేక్షణలో నియమించాల్సిన దాడుల నిరోధక కమిటీలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు.
నిర్బంధాలు
కర్నాటకలో 2015 ఆగస్టు 30న ఎంఎం కాల్బుర్గి, సెప్టెంబరు ఐదు, 2017న గౌరి లంకేష్ హత్యలకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ఈ హత్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. వీరితోపాటు 2015 నుంచి 2021 వరకు దాదాపు 22 మంది జర్నలిస్టులను చంపేశారు. దీనికితోడు కొందరిపై ప్రభుత్వం ఆక్రమ కేసులు బనాయించి జైళ్ళలో పెట్టింది. కొన్ని మీడియా సంస్థలకు రాజకీయ పార్టీల నేతృత్వం ఉండడం వల్ల వారి అభీóష్టానానికి భిన్నంగా రాసినప్పుడు నిర్బంధాలు మరిన్ని పెరుగుతున్నాయి. ఈ మధ్య ఎన్డీటివీని ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఆదాని గ్రూపు కొనుగోలుచేసి అంతకు ముందు నుంచి పని చేస్తున్న వారిని తొలగించడం జరిగింది. ఎడిటర్, రిపోర్టర్, కరస్పాండెంట్, ఫొటోగ్రాఫర్‌గా పనిచేసే వారికి స్వేచ్ఛ ఉండాలి. కొన్ని వార్తలను అసైన్ చేస్తున్న సందర్భంలో సమాచార సేకరణలో కూడా అది కచ్చితంగా అవసరం. యుద్ధాలు జరిగినప్పుడే యుద్ధ రంగంలో వార్తలు సేకరించ డానికి అనుమతులు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు మీడియా, కానీ నేడు అందులోని జర్నలిస్టులపై నిర్భంధానికి పాల్పడటం మూలానా వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉండటం లేదు. 2021లో 488 మంది జైలుకు వెళ్ళగా, 46 మంది హత్యలకు గురయ్యారు. గత 20 సంవత్సరాలలో అనగా 2003 నుంచి 2022 వరకు 1668 మంది హత్యచేయబడ్డారు. ఆక్రిడిటేషన్ ఉన్నప్పటికి కూడా కొన్ని సందర్భాలలో సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వకపోవడం , గదుల్లో పెట్టి తాళాలు వేస్తుండటం అన్యాయం. ఇది పౌర స్వేచ్ఛకు, పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే.
ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు
1966లో పార్లమెంట్ చట్టం ద్వారా పత్రికా స్వేచ్ఛతోపాటు జర్నలిస్టుల స్థాయిని పెంచడానికి ప్రెస్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా కౌన్సిల్‌ను నియామకం చేస్తుంది. 1978లో ప్రెస్‌కౌన్సిల్ చట్టంలో స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ నిబంధనలు రూపొందించారు. ప్రెస్ కౌన్సిల్ అటానమస్ (స్వతంత్ర) సంస్థ. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ ప్రెస్ కౌన్సిల్‌పై కూడా ఆధిపత్యం చెలాయిస్తోంది. నేడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాతోపాటు ఫిల్మ్‌లు, శిక్షణా సంస్థలు, మీడియా ఆఫెక్ట్స్ ఆథారిటీలు కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కేంద్రమంత్రిత్వశాఖ నేతృత్వంలోనే పని చేస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిని దేశద్రోహ చట్టంకింద జైళ్ళలో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల అవి మరింతగా చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రాల్లో ప్రెస్ అకాడమీలది కూడా దాదాపు ఇదే పరిస్థితి. జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్ప డం- విలువలు పెంచడం ప్రధాన ఉద్దేశ్యంగా ఏర్పడిన ఈ సంస్థలన్నీ ఏలినవారి బాకాలుగా మార్చే ప్రయత్నాలను ప్రతిఘటించాలి.
- బి. బసవపున్నయ్య
సెల్:9490099108