Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాత పెన్షన్ విధానానికి తిరిగిపోవ టానికి వ్యతిరేకంగా కేంద్ర-రాష్ట్ర ప్రభు త్వాలు, బడా పెట్టుబడిదారులు, వారికి అనుకూలంగా ఉన్న మీడియాతో పాటు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కూడా రంగంలోకి దిగింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తే ప్రభుత్వ వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. నూతనంగా ఎన్నికైన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు జరుపుతామని ప్రకటించిన కొద్దిరోజులకే ఆర్బిఐ ఈ ప్రకటన చేసింది. విద్య, వైద్యం, కాలుష్యరహిత విద్యుత్, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రాలు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇతర పథకాలకు పెట్టే ఖర్చులు పోనూ మిగతా మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయించాలనే ఆలోచన సరైనది కాదని ''భారతదేశంలో పెట్టుబడుల పెంపుదల- రాష్ట్రాల పాత్ర'' అంశంపై రూపొందించిన నివేదికలో ఆర్బిఐ పేర్కొంది. పాత పెన్షన్ విధానానికి తిరిగిపోవద్దని, సిపిఎస్‌నే అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈమధ్యనే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది.
ఈ విధంగా ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం కలిగించే పాత పెన్షన్ విధానానికి తిరిగిపోవటానికి చేస్తున్న ప్రయత్నాలను సరళీకరణ విధానాల సమర్ధకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడి, బిజెపి నాయకత్వం అంతా పాత పెన్షన్‌కు తిరిగిపోవటానికి వ్యతిరే కంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విధానాన్ని అమలు చేయటం అంటే రానున్న తరాల భవిష్యత్‌ను తాకట్టు పెట్టటమేనని వీరంతా వాదిస్తున్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే ప్రభుత్వాలకు అయ్యే ఖర్చు ఎంత, పెరుగుతున్న జిడిపి, ప్రభుత్వ ఆదాయాలు తదితరాలను పరిశీలిస్తే ఈ వాదనలోని డొల్లతనం బయటపడుతుంది.
ప్రస్తుతం లభిస్తున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 48 లక్షలు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు 10 లక్షలు, ప్రభుత్వబ్యాంకుల ఉద్యోగులు 8 లక్షలు, రాష్ట్ర ప్రభు త్వాల ఉద్యోగులు 1.32 కోట్లు. మొత్తం కలిపితే 1.98 కోట్లమంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మనదేశ జనాభాలో సుమారుగా 1.5 శాతం, 50 కోట్లమంది శ్రామిక ప్రజలలో 4శాతంగానూ ఉన్నారు. 2014లో పెన్షన్ పొందుతున్న రిటైరైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 51.96 లక్షల మంది ఉన్నారు. వీరిలో రక్షణరంగంలో పనిచేసి పెన్షన్లు పొందుతున్నవారు 46.5 శాతం ఉన్నారు. త్రివిధ సైనిక బలగాలలో ఉన్నవారు తక్కువ వయసుకే రిటైరవటం వారిలో పెన్షనర్ల శాతం ఎక్కువగా ఉండటానికి కారణం.రిటైరయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించటం కోసం కేంద్ర ప్రభుత్వం 2013-14లో 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.ఇందులో 44శాతం రక్షణ బలగాల నుండి రిటైరైన వారికి చెల్లించారు. మొత్తం వ్యయంలో 7.8 శాతం జీతాలకు, 4.6 శాతం పెన్షన్లు చెల్లించటానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ ను 34,83,236 కోట్ల వ్యయంగా ప్రతి పాదించింది. 2019-20 ఫైనల్‌గా జరిగిన వ్యయం లెక్కల కన్నా ఇది 14 శాతం అధికం. దీనిలో ప్రణాళికేతర ఖర్చు 29,29,000 కోట్ల రూపాయలు. ఇది 12 శాతం అధికం. ప్రణాళిక ఖర్చు 5,54,236 కోట్ల రూపాయలు.ఇది 29శాతం అధికం. పెరుగుతున్న ప్రభుత్వ ఆదాయాలు, ఖర్చులు పెన్షన్లకు ఖర్చు పెడుతున్న మొత్తం కంటే అనేక రెట్లు అధికంగా ఉన్నాయని పై లెక్కలు వెల్లడిస్తున్నాయి. సంఘటితరంగంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాతం క్రమంగా తగ్గిపోతున్నది. 1994లో సంఘటితరంగ ఉద్యోగులలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 12.4 శాతం ఉండగా, 2012 నాటికి 8.5 శాతంకు తగ్గిపోయారు.
భవిష్యత్‌లో తగ్గనున్న పెన్షన్ భారం
2022 సంవత్సరంలో మనదేశ జిడిపి 3.469 లక్షల కోట్ల డాలర్లు. రూపాయల్లో 284 లక్షల 45వేల 8 వందల కోట్ల రూపాయలు. దీనిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు చెల్లించేది 1.20 లక్షల కోట్ల రూపాయలు. మొత్తం జిడిపిలో 0.4 శాతం ఉంటుంది. మొత్తం ఉద్యోగులలో రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు 66 శాతం ఉన్నారు. కేంద్రం చెల్లిస్తున్న నిష్పత్తిలో వారి పెన్షన్లకు మరో 2.40 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఇది జిడిపిలో 0.8 శాతం. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెన్షన్లకు చెల్లించేది జిడిపిలో 1.2 శాతం అవుతుంది. జనాభాలో 1.5శాతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులను కూడా కలుపుకుంటే 6 శాతం అవుతారు. మొత్తం జిడిపిలో 1.2 శాతాన్ని శ్రామికశక్తిలో 4 శాతంగా ఉన్న ప్రభుత్వోద్యోగుల పెన్షన్ కోసం ఖర్చు పెట్టలేమని చెప్పటం హస్యాస్పదం. ఈ వాదన ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టటానికి ఉద్దేశించినది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తే భవిష్యత్‌లో భరిం చలేని భారం అవుతుందని వాదిస్తున్నారు. దేశ జిడిపి పెరుగుదల, ప్రభుత్వాల ఆదాయం, ఖర్చులలో పెన్షన్ చెల్లింపులకు చేస్తున్న ఖర్చు అతి తక్కువగా ఉండటం వలన ఇపుడివ్వలేమని చెబితే హాస్యాస్పదంగా ఉంటుంది కాబట్టి భవిష్యత్ పేరుతో పాత పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తు న్నారు. సంవత్సరానికి 6 శాతంకు పైగా పెరుగుతున్న జిడిపి, తగ్గుతున్న ప్రభుత్వోద్యోగుల సంఖ్య కారణంగా భవిష్యత్‌లో ఇప్పటికన్నా పెన్షన్ భారం బాగా తగ్గుతుంది. పాత పెన్షన్ విధానం ద్వారా జనాభాలో 6శాతంగా ఉన్న ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు జీవన భద్రత లభిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్న మన జిడిపి రానున్న సంవత్సరాలలో చైనాను అధిగమిస్తుందని ఏలికలు గొప్పలు చెప్పుకుం టున్నారు. తక్కువలో తక్కువ 2022-23లో జిడిపి 6 శాతానికి మించి పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. ఆ లెక్కన పెరిగినా ఈ దశాబ్దం చివరికి మన జిడిపి రెట్టింపుకు పైగా పెరుగుతుంది. అదే నిష్పత్తిలో ప్రభుత్వాల ఆదాయం కూడా పెరుగుతుంది. కాని ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరగకపోగా తగ్గుతున్నది.కాబట్టి రానున్న సంవత్స రాలలో జిడిపి, ప్రభుత్వాల ఆదాయాలలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు చెల్లించే మొత్తం తగ్గుతుంది. కాని ఈ విషయాన్ని కప్పిపెట్టి, రానున్న కాలంలో ఉద్యోగులకు చెల్లించే పెన్షన్ భారం పెరుగుతుందని, ఆదాయం మాత్రం ఇపుడున్నంతే ఉంటుందన్న అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి.
ఉద్యోగులకు పెన్షన్ చెల్లించటంపై ఇంత గగ్గోలు పెడుతున్న ప్రభుత్వాలు, సరళీకరణ విధానాలను సమర్ధించే మేధావులు, ఆర్థికవేత్తలు మోడి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వలన పెరుగుతున్న జిడిపిలో సింహభాగం బడా పెట్టుబడిదారుల చేతుల్లోకి పోవటాన్ని గురించి మాత్రం నోరు మెదపటం లేదు. ప్రభుత్వ విధానాల వలన అదాని, అంబాని లాంటి బడా పెట్టుబడిదారులు దేశ సంపదను తమ స్వంతం చేసుకుంటున్నారు. అదాని ఆదాయం గంటకు 100 కోట్లు దాటిపోగా, అంబాని గంటకు 90 కోట్ల రూపాయలకు పైగా సంపదను స్వంతం చేసుకుంటున్నాడు. వీరిరువురి ఆదాయం కలిపితే రోజుకు 5,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. వీరికి 24 రోజులలో వచ్చే ఆదాయంతో రిటైరయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంవత్సరం పాటు పెన్షన్ చెల్లించవచ్చు. మరో 48 రోజుల ఆదాయంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులందరికీ సంవత్సరం పాటు పెన్షన్ చెల్లించవచ్చు.
అందువలన ఉద్యోగులకు పెన్షన్ చెల్లించటం భారం అవటం వలన కాక, మొత్తం ఆదాయాన్ని అదాని, అంబాని లాంటి బడా పెట్టుబడిదారులకు తరలించటానికి ఆటంకంగా ఉంటుందనే పాత పెన్షన్ విధానానికి తిరిగిపోవటాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. బడా పెట్టుబడిదారులకు ఏజంట్లుగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే దారిలో నడుస్తు న్నాయి. కేవలం పెన్షన్లపైనే కాక, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై కూడా దాడి చేస్తున్నాయి.
అందుకే సరళీకరణ విధానాలతో ప్రభుత్వో ద్యోగుల పెన్షన్‌పైనే కాక, జీతాలు, ఇతర సదు పాయాలపై కూడా దాడి చేస్తున్నారు. ఈ దాడిని ప్రతిఘటించి, తిప్పికొట్టకపోతే ఉద్యోగ భద్రతతో పాటు అన్నింటినీ హరిస్తారు. అందుకే పాత పెన్షన్ విధానంపై ప్రభుత్వాల దాడిని ప్రతి ఘటించటం అత్యవసరం. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకాకపోతే ప్రైవేటు రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు పెన్షన్ ఊసే ఉండదు. అందువలన పెత పెన్షన్ విధానం కావాలని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పోరాటాన్ని ప్రైవేటురంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు సంపూర్ణంగా బలపరచాలి.
- ఎ. కోటిరెడ్డి