Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడ్జెట్ 2023-24ను పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ప్రపంచంలోనే భారతదేశంలో వ్యవసాయ రంగానికి నిధులు పెద్ద ఎత్తున కేటాయించామని, సేంద్రియ వ్యవసాయంలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్నామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా బిజెపి ఎంపీలు పదేపదే బల్లలు చరిచారు. సంతోషం వ్యక్తం చేశారు.కానీ గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తగ్గించిన సందర్భంలో కూడా బల్లలు చరవడం విచారకరం.2023 బడ్జెట్లో ఉన్న పద్దులను రివైజ్డ్‌లో తగ్గించారు. ఆ ప్రాతిపదికన 2023-24కు బడ్జెట్ కొంత పెంచినట్టు చూపారు. వాస్తవానికి వ్యవసాయ బడ్జెట్లో కిసాన్ సమ్మాన్ రూ. 71,379 కోట్లు, ఇతర ఆర్థిక సంస్థలకు (వడ్డీమాఫీ)కి రూ.21,050 కోట్లు, ఉత్తర రాష్ట్రాలకు సహాయంగా రూ.11,552.35 కోట్లు, రాష్ట్రాలకు 8,326.57 కోట్లు కేటాయింపులు చూపారు. ఈ పథకాలు తొలగిస్తే వ్యవసాయరంగానికి కేటాయింపులే లేవు. గత బడ్జెట్లో వ్యవసాయరంగానికి 1. వడ్డీమాఫీ, 2. కిసాన్ సమ్మాన్, 3. ఫసల్‌బీమా, 4. మార్కెట్ జోక్యం పథకం, 5. పంటల సంవర్ధనకు స్పష్టంగా కేటాయింపులు చూపారు. ఈ సారి బడ్జెట్లో స్పష్టమైన వివరాలు ఇవ్వకుండా పంటల సంవర్ధన పేరుతో, ఆర్థిక సంస్థల పేరుతో పెద్ద మొత్తాలు కేటాయించారు. కిసాన్ సమ్మాన్ యేటా రూ.6,000లకు మరో రూ.2,000లు అదనంగా ఇస్తున్నానని ప్రకటించిన మోడీ అందుకు తగిన కేటాయింపులు బడ్జెట్లో చూపలేదు. రాబోయే ఎన్నికలకు ఉపయోగపడే బడ్జెట్‌గా దీనిని రూపొందించినప్పటికీ వ్యవసాయరంగానికి 2022-23 బడ్జెట్ కేటాయింపుల్లో రూ.1,24,000 కోట్లకు బదులు రాబోయే సంవత్సరం రూ.1,17,489 కోట్లకు తగ్గించారు. ఈ బడ్జెట్ వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచదు. 6.35 కోట్ల ఎకరాలలో హార్టికల్చర్ వేసినప్పటికీ వాటికి తగిన నిధులు కూడా కేటాయింపులో చూపలేదు. 2022-23 సంవత్సరానికి వరి పంట విస్తీర్ణం 1.5 కోట్ల ఎకరాలు తగ్గింది. ఏటా పండుతున్న 12 కోట్ల టన్నుల బియ్యం ఈ సంవత్సరం 10.5 కోట్ల టన్నులకు పడిపోయినట్లు ముందస్తు అంచనాలు చెప్తున్నాయి. ప్రస్తుతం భారత దేశం నుండి ఎగుమతి అవుతున్న నూకలు, బియ్యాన్ని నిషేదించారు. వ్యవసాయోత్పత్తుల దిగుమతులు వంటనూనెలు, పత్తి, పప్పులు, పంచదారలను తగ్గించబోతున్నట్టు ప్రకటించలేదు. పైగా దిగుమతులపై సుంకాలు ఎత్తివేశామని చెప్తున్నారు. భారత దేశం ధనిక దేశాలకు దిగుమతి కేంద్రంగా తయారవుతున్నది. 140 కోట్ల ప్రజల ఆహార భద్రతను కాపాడాల్సిన ప్రభుత్వం వ్యవసాయానికి మొత్తం బడ్జెట్లో 3.2 శాతం మాత్రమే కేటాయింపులు చేసింది.
పరిశోధన బడ్జెట్
వ్యవసాయ పరిశోధనలు అత్యంత కీలకం. 1965 నుండి 85 వరకు విస్తృతమైన వ్యవసాయ పరిశోధనలు చేసి దేశాన్ని ఆహారంలో స్వయం సమృద్దం చేశారు. అలాంటిది దేశంలోని పరిశోధనలన్నింటిని మూసి వేసి విదేశాల నుండి విత్తన టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నాం. మ్యాన్‌శాంటో, బేయర్, డూపా యింట్, కార్గిల్, సిన్జెంట లాంటి కంపెనీలు అమెరికా, జర్మని, స్విట్జర్లాండ్ నుండి విత్తన టెక్నాలజీని దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడి వాతావరణానికి ఆ విత్తనాలు పనిచేయక మొలకెత్తడం లేదు. పరిశోధన కేటాయింపులు పరిశీలిస్తే ఐసిఎఆర్‌కు కేటాయించింది 5 వేల కోట్లకు మించలేదు. ఇందులో కూడా సిబ్బందికి వేతనాలు పోగా పరిశోధనలకు మిగిలేది అతి తక్కువ. పరిశోధనలు వ్యవసాయానికి ప్రాణత్యాగం వంటివి. కొన్ని పరిశోధనల ఫలితాలు 4, 5 సంవత్సరాల తరువాతగానీ రావు. సుదర్ఘీకాలం మారుతున్న వాతా వరణానికి అనుకూలంగా నిరంతరం పరిశోధనలు కొనసాగించాలి. పరిశోధనల నిలుపుదల అంటే వ్యవసాయ రంగానికి ఆత్మహత్యా సదృశం లాంటిది. ప్రస్తుత కేటాయింపులకు రెట్టింపు కేటాయింపులు చేయాలి.
పశుసంవర్ధక శాఖ
ఈ శాఖ బడ్జెట్లో గత బడ్జెట్‌పై 400 కోట్లు మాత్రమే పెంపుదల చేశారు. గత బడ్జెట్‌ను రివైజ్డ్‌లో రూ.800 కోట్లు తగ్గించారు. దేశంలో పశు అభివృద్ధికి తగిన విధంగా బడ్జెట్ లేదు. డైరీ, చేపలు కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి. ఆర్థికమంత్రి బడ్జెట్ సందర్భంగా చేపల అభివృద్ధికి రూ.6,000 కోట్లు కేటాయి ంచినట్లు చెప్పడంతో అందరూ సంతోషించారు. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. డైరీ అభివృద్ధిలో భారత దేశం ప్రపంచంలోనే ముందున్నది. 28 కోట్ల టన్నుల పాల ఉత్పత్తితో ప్రథమ స్థానంలో ఉన్నాం. ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి పాల ఉప ఉత్పత్తులను 3వ ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ పశు సంవర్ధక శాఖకు నిధుల కేటాయింపు చాలా తక్కువగా ఉంది. పశు సంవదర్దనకు రూ.2,650 కోట్లు మాత్రమే కేటాయింపు చూపారు. పాల అభివృద్ధికి రూ.849 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ. 837 కోట్లు కేటాయించారు. నేడు పాల ఉత్పత్తిపై, చేపల పరిశ్రమపై కోట్లాది మంది ఆధారపడి ఉండడమేగాక, పౌష్టికాహారంగా ఉపయోగపడే ఈ ఉత్పత్తులను విస్తృతంగా పెంచాలి. 70 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దళిత, గిరిజన, మైనార్టీ, బిసి వర్గాలలో 5 సంవత్సరాలలోపు పిల్లలు పౌషికాహార కొరత వల్ల నేటికి ఎక్కువ మంది మరణిస్తున్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అర లీటరు పాల చొప్పున ప్రతిరోజు ఇవ్వాలి. అందుకు తగ్గిన బడ్జెట్‌ను కేటాయి ంచాలి. చేపల ఉత్పత్తి కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. స్థానిక వినియోగాన్ని పెంచలేకపోతున్నాం. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం ఇందుకు ఆటంకంగా ఉంది. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో 8 శాతం ఉత్పత్తి భారత దేశంలోనే జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాలలో ఉత్పత్తి బాగా జరుగుతున్నది. ఎగుమతుల ద్వారా రూ.334.41 బిలియన్ రూపాయలు మారక ద్రవ్యం సంపాదిస్తున్నది. 7,516 కి.మి సముద్ర తీరం ఉంది. సముద్ర చేపలేగాక దేశీయ చేపలను కూడా పెద్ద ఎత్తున పెంచుతున్నాం. వీటిని మరింత ప్రోత్స హించడానికి తగిన విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. 2.80 కోట్ల మంది ఈ వృత్తిపై ఆధారడి ఉన్నారు. కానీ, బడ్జెట్ మాత్రం కేటాయింపులలో నిరాశ పరిచింది. అందుకు భిన్నంగా ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి ప్రకటనల్లో పశుసంవర్దక శాఖను బాగా అభివృద్ధిలోకి తెస్తున్నట్లు చెప్పారు. కానీ వాస్త వాలు వీటికి విరుద్దంగా ఉన్నాయి. సహజ సంప దలను కూడా వినియోగించుకొని దేశా భివృద్ధికి తోడ్పడడానికి వ్యవసాయోత్పత్తులతో పాటు అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. గొర్రెలు, మేకల పెంపకం, పందుల పెంపకం, బాతులు, కోళ్ళ పెంపకం లాంటి వాటి వల్ల గ్రామీణ ఉపాధిని జీవన ఆదాయాన్ని పెంచడానికి వీలు ఏర్పడుతుంది. జపాన్, స్విట్జర్లాండ్ లాంటి చిన్న దేశాలలో ఈ వృత్తులపైన ప్రజలకు ఆదాయం పెంచడమేగాక, పౌష్టికాహార లోపం లేకుండా చేశారు. తమ అవసరాలకు మించిన వాటిని మాత్రమే ఎగుమతులు చేస్తున్నారు. కానీ, భారత దేశం తన ప్రజలను పౌష్టికాహార లోపానికి గురిచేసి కార్పోరేట్ల లాభాల కోసం ఎగుమతులు చేస్తున్నది. అందుకు అనుగుణంగా బడ్జెట్లో కోతలు విధించారు. గత 8 సంవత్సరాలుగా మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో ఏ వృత్తి అభివృద్ధిలోకి రాలేదు అనేది అంకెల ద్వారా తెలుస్తున్నది. విదేశీ సర్వే సంస్థలు కూడా భారత దేశ వ్యవసాయ దివాలా విధానంపై అనేక నివేదికలు రూపొందించాయి. అయినప్పటికీ ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రస్తుత బడ్జెట్లో ప్రాథమిక రంగమైన వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్లో కనీసం 8 శాతం నిధులు కేటాయించాలి. అప్పుడే అనుబంధ రంగాలు అభివృద్ధిలోకి వస్తాయి.
- సారంపల్లి మల్లారెడ్డి
9666174897