Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలోని విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట్ కోచ్ ప్యాక్టరీతో పాటు ఆదిలాబాద్లో అపార సహజ వన రులను కలిగివున్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణకు అవకాశమున్నప్పటికీ కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు.
కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ పేదలను దోచి పెద్దలకు పెట్టేలా ఉన్నది. ఇది అంకెలగారడీ తప్ప అభివృద్ధికి ఉపయోగపడేలా లేదని విశ్లేషకులు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. రూ.45లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆద్యంతం తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదన్న వాదన విద్యావంతులు, మేధావుల నుంచి వ్యక్తమవుతోంది. తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో బడ్డెట్ ప్రతులను రోడ్లపై దహనం చేసి ప్రజలు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. దేశానికి అన్నంపెట్టే రైతు సంక్షేమమే ధ్యేయంగా ఇటీవల కేసీఆర్ 'అబ్కీ బార్ కిసాన్ సర్కార్..' అనే నినాదాన్ని దేశానికి సందేశంలా పంపారు. ఆ నినాదం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో మొన్నటి కేంద్ర బడ్జెట్ను చూసిన తరువాత ప్రజలకు అర్థమవుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి చాలా వరకూ కేంద్ర బడ్జెట్లో తీవ్ర నిరాశ కలిగించింది.ఇది తెలంగాణకు ఉద్దేశపూర్వకంగా చేసిన నష్టమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా బడ్జెట్ను నిశితంగా పరిశీలించిన వారికి అందులోని డొల్లతనం తెలుస్తుంది.
అన్నిరంగాల్లో కోతలే..
ప్రధానంగా దేశంలో సుమారు 60కోట్ల మందికి పైగా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని హర్షం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి జాతీయ హోదాను కానీ, అందుకు సంబంధించిన చర్చ కానీ బడ్జెట్లో లేకుండా చేశారు. పాలమూరు ఎత్తిపోతలపై కూడా మాటలేకుండా పోయింది.ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఎరువులు, ఆహారం, పెట్రో ఉత్కత్తులపై భారీగా సబ్సిడీ కోత విధించి రాబోవు కాలంలో మరింత కష్టాలున్నాయని చెప్పకనే చెప్పారు. ప్రధానంగా ఎరువుల సబ్సిడీని రూ.2,25,220కోట్ల నుండి రూ.1,75,100 కోట్లకు కుదించారు. ఆహార రంగం విషయంలోనూ రూ.2,87,194కోట్ల సబ్సిడీని ఏకంగా 1,97,350 కోట్లకు, పెట్రో ఉత్పత్తులైన గ్యాస్, తదితర అంశాలపై రూ.9,171కోట్ల సబ్సిడీని రూ.2,257కోట్లకు కోత విధించారు. ఈ లెక్కన మొత్తం ఈ మూడు రంగాల్లోనే భారీగా 28శాతం సబ్సిడీలకు మంగళం పాడారు. తెలంగాణలో దాదాపు సగటున 55లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుచేస్తున్నారు. కానీ ప్రస్తుత బడ్జెట్లో పత్తి రైతులకు కష్టకాలంలో మద్దతుగా నిలవాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి కేంద్ర బడ్జెట్లో కేటాయించింది శూన్యమనే చెప్పాలి. ఇక్కడ దేశీయంగా ఉత్పత్తి అవుతున్న పత్తిని కాదనీ, విదేశాల నుండి పత్తిని దిగుమతి చేసుకోవాలన్న తపన కనిపిస్తోందన్న చర్చ కూడా ఉంది. మద్దతు ధరను కూడా గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా సున్నా చేశారు. క్రమక్రమంగా ఎంఎస్పీని కుదిస్తూ వచ్చారు. 2020-21 బడ్జెట్లో రూ. 2,288కోట్ల నిధులు కేటాయించిన కేంద్రం, 2022-23లో రూ.15కోట్లకు కుదించి తాజా బడ్జెట్లో ఏకంగా జీరో చేసింది.అంటే భవిష్య త్తులో మద్దతు ధరల విషయంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సాయం ఏమీ ఉండదనే సంకేతాన్ని పంపింది. తెలంగాణలోని విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట్ కోచ్ ప్యాక్టరీతో పాటు ఆదిలాబాద్లో అపార సహజ వన రులను కలిగివున్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణకు అవకాశమున్నప్పటికీ కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు.
- వనం నాగయ్య, 9441877695