Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిస్థితి మొత్తంగా చూసినప్పుడు దారీ తెన్నూ లేని పరిస్థితి కనిపిస్తోంది. ఆహార దినుసుల ధరలు, ఇంధనం (విద్యుత్తు, చమురు) ధరలు బాగాపెరిగి మొత్తం జీవన వ్యయం భారంగా తయారైంది. వడ్డీ రేట్లు పెరగడంతో పెట్టుబడి వ్యయం కూడా పెరిగింది. దానితోబాటు ద్రవ్య నిల్వలు కూడా భద్రంగా ఉండే దేశాలకు తరలిపోతున్నాయి. ఈ స్థూల ఆర్థిక సూచికలతోబాటు ఉత్పాదకతలో వృద్ధి కూడా మందగించడం ప్రస్తుత సంక్షోభపు లోతును సూచిస్తోంది.
ఆర్థిక పెట్టుబడులకు, ఉత్పత్తి అయిన ఆర్థిక సంపదకు మధ్య నిష్పత్తిని స్థూలంగా ఉత్పాదకత అనవచ్చు. ఒక కార్మికుడిపై చేసే ఖర్చుకి, అతడినుండి రాబట్టే ఉత్పత్తికి మధ్య నిష్పత్తి శ్రామిక ఉత్పాదకత అవుతుంది. శ్రామిక ఉత్పాదకత పెరుగుదల సాంకేతిక అభివృద్ధి మీద, కొత్త సాంకేతికతను ఇముడ్చుకోగలిగిన సామర్థ్యం మీద, కార్మికుడి నైపుణ్యంలో పెరుగుదలమీద-ఇలా అనేక అంశాలమీద ఆధారపడి ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో తనతో పోటీపడే వారి మీద పైచేయి సాధించడానికి, పరిశ్రమ మొత్తంగా సాధించే సగటు లాభం కన్నా ఎక్కువ లాభం పొందడానికి ఒక్కో పెట్టుబడిదారుడూ నిరంతరం కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తన పరిశ్రమలో ప్రవేశపెడుతూ వుంటాడు. అదే పని తక్కినవారందరూ కూడా చేయగానే, పరిశ్రమ సగటు ఉత్పాదకత కూడా పెరుగుతుంది. తిరిగి తక్కినవారిమీద పైచేయి కోసం మళ్ళీ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతీ పెట్టుబడిదారుడూ తీసుకువస్తూనే ఉంటాడు.
ఆ విధంగా పెట్టుబడిదారీ విధానం అభివృద్ధితోబాటు ఉత్పాదకతలో వృద్ధి కూడా సద్యోజనితంగా జరిగిపోతూ ఉంటుంది. ఉత్పాదకత పెరుగుదల పెట్టుబడిదారుల లాభాలను మరింత పెంచుతుంది. దానితోబాటు కార్మికుల నిజవేతనాలు కూడా పెరుగుతాయి. అంతేగాక ప్రభుత్వానికి పన్నుల రూపేణా లభించే ఆదాయం కూడా పెరుగుతుంది. దానివలన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి, మౌలిక సదుపా యాల కల్పనకు మరింత హెచ్చుగా ఖర్చు చేయ గలుగుతాయి. ఆదాయాలు పెరిగినందువలన మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. దానిని అందుకోడానికి అదనంగా పెట్టుబడులు అవసరం అవుతాయి. కొత్త యంత్రాలు అవసరమౌతాయి. అయితే ఉత్పాదకత వృద్ధి వలన వచ్చిన ప్రయోజనాలు ఎవరెవరికి ఎంతెంతమేరకు పంపిణీ చేయబడ్డాయి అన్నదానిమీద ఆధారపడి ఈ అభివృద్ధి వలయం కొనసాగుతుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఎక్కువమందికి అందుబాటులోకి వచ్చింది. విద్య, నైపుణ్యం ఏ మేరకు వృద్ధి చెందుతున్నాయి, వంటి అంశాలు ఇక్కడ కీలకం. ఈ అంశాలమధ్య పరస్పరం లంకె ఉంటుంది. ఏ కారణం చేతనైనా ఆ లంకె తెగిపోతే. ఉత్పాదకత అభివృద్ధి పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభంలో పడుతుంది. గత మూడు దశాబ్దాలుగా ఉత్పాదకతలో వేగం తగ్గడం అనేది నిరంతరాయ ధోరణిగా వ్యక్తం అవుతోంది. ముందు సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లోను, ఆ వెంబడే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను ఇది వ్యక్తం అవుతోంది.
ఉత్పాదకత వేగం తగ్గుదల
1980 దశకం నాటికి బ్రహ్మాండమైన సాంకేతిక పురోభివృద్ధి సాధించారు. సమాచార రంగ టెక్నాలజీలోను, కృత్రిమ మేధో సాంకేతికతలోను, సైబర్ టెక్నాలజీ, ఆటోమేషన్ లోను, జెనెటిక్స్లోను, వివిధ పారిశ్రామిక రంగాల్లోను (ఇవన్నీ కలిపి 4.0 టెక్నాలజీ అని అంటున్నారు) అద్భుత పురోగతి ఉంది. అయినప్పటికీ, రెండో చమురు సంక్షోభం తర్వాత సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో ఉత్పాదకత మందగించడం మొదలైంది. తాజా ఐఎల్వో నివేదికలను బట్టి 1990 తర్వాత ఉత్పాదకత వృద్ధి వేగం మళ్ళీ పుంజుకుంది. అయితే ఆ తర్వాత మళ్ళీ మందగించడం మొదలైంది. 1991 నాటికి సంపన్న దేశాల్లో కార్మికుల ఉత్పాదకత అభివృద్ధి చెందుతున్న దేశాల కార్మికుల ఉత్పాదకత కన్నా 14 రెట్లు ఎక్కువగా ఉండేది. 2021 నాటికి ఇది 18 రెట్లు అయింది. సంపన్నదేశాల కార్మికుల ఉత్పాదకత పెరగడం వలన ఇది జరగలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వేగం తరుగుదల వలన జరిగింది. గత మూడు దశాబ్దాలలో సంపన్న దేశాలలో కార్మికుల ఉత్పాదకత 46శాతం పెరిగితే అల్పాదాయ దేశాలలో అది 16శాతమే పెరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో చైనాలో ఉత్పాదకత పెరుగుదల వేగం తక్కిన దేశాలకన్నా చాలా ఎక్కువగా ఉంది. 2000 ముందు వరకూ దక్షిణాసియా దేశాలలోనూ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత బద్దలైన ఆర్థిక సంక్షోభం తర్వాత అక్కడ మందగించడం మొదలైంది. ఇప్పుడున్న వేగంతోటే ఉత్పాదకత వృద్ధి కొనసాగితే సంపన్న దేశాలలోని ఉత్పాదకత స్థాయిలో సగం వరకూ చేరుకోడానికి పేద దేశాలకు 175సంవత్సరాలు పడుతుంది. గనుక వెనుకబడిన దేశాలు ఉత్పాదకత విషయంలో సంపన్న దేశాలతో సమాన స్థాయికి చేరుకోవడం అనేది కనుచూపు మేరలో సాధ్యం అయ్యేలా లేదు. ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ ఉత్పాదకత రేటు మందగమనాన్ని చవిచూస్తున్నాయి.
ఒక కొత్త సాంకేతిక విప్లవం జరుగుతున్న దశలో, టెక్నాలజీ ప్రపంచంలో ఏ మూలనుండి ఏ మూలకైనా తరలించగలిగిన నయా ఉదారవాద శకంలో ఈ ఉత్పాదకత మందగమనం సంభవించడమే విడ్డూరం అనిపిస్తుంది. ఇలా జరగడానికి కారణం నయా ఉదారవాద వ్యవస్థలోనే ఉంది. దీనికి సమాధానం శాస్త్ర సాంకేతిక రంగంలో వెతికితే కనపడదు. ఉత్పాదకత వృద్ధికి, దాని ఫలితంగా వచ్చే అదనపు సంపద పంపిణీకి మధ్య ఉన్న లింకు తెగిపోవడంలోఉంది.
అదనపు సంపద పంపిణీలో అసమానతలు
ఉత్పాదకత పెరిగినందువలన ఉత్పత్తి అయ్యే అదనపు సంపదను, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్థిక వ్యవస్థ మొత్తానికి అందుబాటులోకి తెచ్చేలా పంపిణీ జరగాలి. అలా జరగనందువలన వాటి నడుమ ఉండే లంకె తెగిపోతుంది. ఇప్పుడు కొత్త సాంకేతికత ఉపయోగించినందువలన పెరిగిన ఉత్పాదకత ఫలితాలను సంపన్నులే చేజిక్కించు కుంటున్నారు. దానికి తోడు పెద్ద పెద్ద సంస్థలు కొత్త సాంకేతిక పరిజ్ఞానం మీద (పేటెంట్ల వ్యవస్థ ద్వారా) గుత్తాధిపత్యం కలిగివున్నాయి. దానివలన ఆ పరిజ్ఞానం ఆర్థిక వ్యవస్థ మొత్తానికి విస్తరించకుండా పరిమితం అయిపోతున్నది. ఇప్పుడు ప్రతీ వినియోగదారుడి ప్రత్యేక అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను డిజైన్ చేయడానికి పూనుకుంటున్నారు. అందుకు వినియోగదారులకు సంబంధించిన డేటా కీలకం. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఆ డేటా చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దానిని చేజిక్కించుకుని డిజిటల్ ప్లాట్ఫారంలలో పదిలపరిచి వినియోగిస్తున్నారు. తద్వారా మొత్తం ప్రపంచమార్కెట్ పైన తమ గుత్తాధిపత్యాన్ని చెలాయించబూనుకుంటున్నారు. కొద్ది సంస్థల చేతుల్లో ఈ డిజిటల్ డేటా ఇరుక్కుపోయినందువలన టెక్నాలజీ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద విస్తరించడానికి ఆటంకం కలుగుతోంది. నయా ఉదారవాద వ్యవస్థలో కార్మికులు ఉత్పత్తిలో పొందే వాటా బాగా తగ్గిపోతున్నది. పెట్టుబడి దారుల వాటా పెరిగిపోతోంది. కార్మికుల వాటా గనుక పెరిగితే అప్పుడు మార్కెట్లో సరుకులకు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఏర్పడే వైవిధ్యపూరితమైన డిమాండ్‌ను అందుకోడానికి కొత్త పెట్టుబడులు, కొత్త పరిశోధనలు అవసరమవుతాయి. అది ఆర్థికవృద్ధికి అదనపు ఊపు తెస్తుంది.
గత మూడు దశాబ్దాల కాలంలో సంపన్న దేశాలలోని సాంకేతిక పరిజ్ఞానం మీద, వెనుకబడ్డ దేశాలలోని సహజ వనరుల మీద, చౌకగా లభించే కార్మికశక్తి మీద ఆధారపడి నయా ఉదారవాద వ్యవస్థ ప్రధానంగా నడిచింది. దీనివలన ఎటువంటి నాణ్యత గాని, ప్రమాణాలు గాని లేని ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. ఈ అసంఘటిత కార్మికుల అస్థిర పరిస్థితులను బాగా ఉపయోగించుకుని పెట్టుబడి దారులు లాభాలు బాగా ఆర్జించగలిగారు. అంతర్జాతీయంగా సాగుతున్న మార్కెట్ పోటీలో నిలదొక్కుకోడానికి వెనుకబడిన దేశాలు తమ లేబర్ మార్కెట్లను కనిష్ట స్థాయికి తీసుకుపోతున్నాయి. అతి తక్కువ వేతనాలతో హీనమైన సర్వీసుకండిషన్లతో కూడిన ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, తదితర పద్ధతులలో ఉండే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. కార్మికుల శ్రమను పిండు కోవడం పెరిగింది. దీని వలన తక్షణమే పెట్టుబడిదారులకు లాభాలు పెరుగుతాయి. కాని వెనుకబడిన దేశాల నడుమ నెలకొన్న పోటీ వాతావరణం వలన ఆ పెట్టుబడిదారులు తమ లాభాల మార్జిన్లను తగ్గించుకోక తప్పని పరిస్థితి వస్తోంది. ఎంత హీనస్థాయికి కార్మికుల వేతనాలు కుదించబడు తున్నాయో, అంత ఎక్కువగా బహుళజాతి సంస్థలు ఆ కార్మికులు ఉత్పత్తి చేసిన అదనపు విలువను కొల్లగొడుతున్నాయి. .
కాని అదే క్రమంలో ఉత్పాదకతలో సంక్షోభం కూడ మెల్లమెల్లగా మొదలవుతుంది. తక్కువ వేతనాలకే పని చేసే కార్మికుల ఉత్పాదకత కూడా తక్కువగానే ఉంటుంది. వారి ఉత్పాదకత పెరగాలంటే వారికి అందించే చదువులో నాణ్యత పెరగాలి. కొత్త టెక్నాలజీని ఉపయోగించగల శిక్షణను వారికి ఇచ్చి వారి నైపుణ్యాన్ని పెంచాలి. ఇది దీర్ఘకాలిక స్వభావం కలిగినటువంటిది. ఇప్పుడు మార్కెట్లో ఏరోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియనటు వంటి అనిశ్చిత స్థితి ఉంది. అటువంటప్పుడు దీర్ఘకాలిక స్వభావం గల అంశాలలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ సిద్ధం కావడం లేదు. పైగా నయా ఉదారవాదం విద్యను ప్రయివేటీకరించాలని పట్టుబడు తుంది. దాని ఫలితంగా అత్యధిక యువజనులు నాణ్యతగల విద్యకు, శిక్షణకు దూరమవుతున్నారు. అందువలన సామర్థ్యం కలిగిన శ్రామికులకు కొరత ఏర్పడుతోంది. అయితే అటువంటి శ్రామికులను తయారు చేయడానికి కావలసిన పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడంలేదు. చిన్న తరహా పెట్టుబడిదారులకు, సంస్థలకు అంత స్థోమత ఉండదు. ఈ కారణాల వలన తక్కువ పెట్టుబడితో, తక్కువ వేతనాలతో, తక్కువ ఉత్పాదకతతో కూడిన పారిశ్రామిక రంగం పెరుగుతోంది. ఇంకోపక్క కొద్దిపాటి బహుళజాతి సంస్థలు మాత్రం అత్యంత ఆధునిక టెక్నాలజీతో, అధిక ఉత్పాదకతతో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అధిక ఉత్పాదకత - అధిక వేతనాలు - అధిక డిమాండ్ వలయం కొనసాగడం సాధ్యం కావడంలేదు. దానివలన కొత్త పరిశోధనలు మందగి స్తున్నాయి. ఇదంతా చూసినప్పుడు పెట్టుబడిదారీ విధానం తాను వేసిన ఉచ్చులో తానే చిక్కుకు పోయిందని స్పష్టమవుతోంది.
- సరళానువాదం: సంజయ్ రాయ్