Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ మీద నిఘా కోసం చైనా పంపిన పెద్ద బెలూన్ను కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి 4 శనివారం మధ్యాహ్నం రెండు గంటల 39 నిమిషాలకు తీరానికి ఆరు నాటికల్ మైళ్ల దూరంలోని సముద్రం మీద పేల్చివేసింది. పరిసరాలలో కొద్ది గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేసి అనేక ఫైటర్ జెట్ విమానాలను రంగంలోకి దింపినప్పటికీ ఒక్క విమానం నుంచి మాత్రమే బెలూన్‌పై కాల్పులు జరిపారు. సముద్రం మీద కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలో పడిన శకలాలను సేకరించేందుకు పూనుకున్నారు. సముద్రంలో మునిగిన వాటిని తీసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చు. వాటిలో దొరికినదేమిటి? ఎలాంటి సమాచారాన్ని అవి నిక్షిప్తం చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది.
ఈ ఉదంతాన్ని సాకుగా చూపుతూ నిరసనగా ఫిబ్రవరి 6న జరపాల్సిన చైనా సందర్శనను వాయిదా వేసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద డ్రామా నడిచింది. దాన్ని ఒక పెద్ద ఉదంతంగా అమెరికా, ప్రపంచం ముందు ఉంచేందుకు నానా హడావుడి చేసి, ముందుగా ప్రచారదాడికి పాల్పడ్డారు. వాతావరణాన్ని విశ్లేషించేందుకు తాము పంపిన బెలూన్ గాలి తీవ్రత కారణంగా అదుపు తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది తప్ప కావాలని పంపిందో మరొకటో కాదని, దాన్ని కూల్చివేసి అమెరికా అతిగా స్పందించిందని చైనా విమర్శించింది. దీన్ని గమనంలో ఉంచుకొని తాము కూడా చేయాల్సింది చేస్తామన్నట్లుగా హెచ్చరిక కూడా చేసింది. అది వాతావరణం కోసం కాదు తమ మీద నిఘా కోసమే పంపినందున కూల్చివేసినట్లు అమెరికా చెబుతోంది. ఏది నిజమో కాదో తరువాత ఎప్పుడో వెల్లడి అవుతుంది. అది మూడు బస్సులు లేదా లారీలకు సమానమైన పరిమాణంలో ఉన్న మానవరహిత బెలూన్, సముద్రం మీద కూల్చివేసినందున ఆస్తినష్టం కూడా జరగలేదు గనుక సుఖాంతంగా ముగిసిందని కొందరు చెప్పారు. నిజానికి ఈ ఉదంతం అమెరికా-చైనా మధ్య ఇప్పటికే ఉన్న వివాదాల పుస్తకంలో మరొక అధ్యాయానికి నాంది పలికింది. దానిలో ఎవరేమి రాస్తారో చూద్దాం!
ఇతర దేశాలపై నిఘా అంకానికి తెరతీసింది, ప్రపంచానికి నేర్పింది అమెరికానే. నూటికి నూరుశాతం ఖ్యాతి దానికే దక్కాలి. దొంగకళ్ల బెలూన్లను, విమానాలను పంపి వాటిని, ఎగిరే పళ్లాలు, గ్రహాంతర వాసులుగా ప్రపంచాన్ని నమ్మించటమే కాదు, పలు సినిమాలు తీసి జనం మీదకు వదిలింది కూడా అమెరికన్లే అన్నది దాచేస్తే దాగదు. పిల్లలు ఆడుకొనే బంతిని కూడా గగనతలం నుంచి స్పష్టమైన ఫొటోలను తీయగల ఉపగ్రహాలను నేడు అనేక దేశాలు తిప్పుతున్నది తెలిసిందే. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మన ప్రాంతంలో చైనా గ్రామాలను నిర్మిస్తున్నదంటూ అమెరికా పంపిన చిత్రాల సంగతి తెలిసిందే. ఆ గ్రామాలను తమ ప్రాంతంలోనే చైనా నిర్మించినప్పటికీ వక్రీకరించి మనలను ఎగదోసేందుకు అమెరికా చూసింది. దేశాల మధ్య పరస్పరం విశ్వాసలేమి, ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న స్థితిలో బెలూన్లతో సహా రకరకాల నిఘా అన్నది బహిరంగ రహస్యం. రెండవ ప్రపంచ పోరు తరువాత అనేక దేశాల మీదకు అమెరికా పాలకులు బెలూన్లు వదిలారు. వాతావరణం కోసం వదిలినవి కూడా వాటిలో కొన్ని ఉండవచ్చు. దేన్ని ఎందుకోసం వదిలిందీ ఇదమిద్దంగా చెప్పలేం.
ప్రపంచాన్ని తప్పుదారి పట్టించటంలో అమెరికాను మించింది లేదు. ఇరాక్‌లో లేని మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేసి దాని మీద దాడికి దిగి అధ్యక్షుడు సద్దామ్ హుస్సేన్‌ను హతమార్చింది. తరువాత ఎలాంటి మారణాయుధాలు లేవని ప్రకటించింది. తానే సృష్టించిన తాలిబాన్లనే మతోన్మాదులు ఏకుమేకుగా మారటం, తమ మీదకే ఎదురు తిరిగిందీ మన కండ్ల ముందే జరిగింది. అంతకు ముందు ఆప్ఘనిస్తాన్ విముక్తి వీరులుగా చిత్రించిందీ, ఆయుధాలు ఇచ్చిందీ, తరువాత ఉగ్రవాదులని ప్రచారం చేసి అణచివేసే పేరుతో రెండు దశాబ్దాల పాటు అక్కడ తిష్టవేసి, చివరికి వారితోనే రాజీచేసుకొని పారిపోయింది అమెరికా అన్నది తెలిసిందే. అందువలన అమెరికా నందంటే నంది పందంటే పంది అని నమ్మాల్సినపని లేదు. ప్రతిదేశమూ తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.
అనేక రంగాల్లో ముందున్న అమెరికా తన దగ్గర ఎంత ప్రమాదకర అస్త్రం ఉందో ప్రపంచాన్ని బెదిరించేందుకు అవసరం లేకున్నా జపాన్‌పై అణుబాంబు వేసింది. దాన్ని సమర్థించుకొనేందుకు తమ పెరల్ హార్బర్ మీద దాడి జరిపిందనే కట్టుకథను ప్రచారం చేసింది. నిజానికి ఆ బాంబును చూపి సోవియట్ మీద పైచేయి తమదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. సరే తరువాత స్టాలిన్ కూడా అణుబాంబును తయారు చేయించి, అంతరిక్ష విజయాలను చూపి అమెరికాను అదుపులో ఉంచాడనుకోండి. స్టాలిన్ తరువాత కృశ్చెవ్ అధికారానికి వచ్చాడు. అణుబాంబు తరువాత ఆందోళన చెందిన అమెరికా ఇంకా సోవియట్ వద్ద ఉన్న అస్త్రాలేమిటో తెలుసుకొనేందుకు నిఘా విమానాలను దాని గగనతలం మీద తిప్పింది. అవి భూమికి 70వేల అడుగుల ఎత్తున ఎగురుతున్నట్లు సోవియట్ పసిగట్టింది. 1956 నుంచి అలాంటి విమానాలను తిప్పుతున్నట్లు గమనించినప్పటికీ మౌనంగా ఉంది. వాటిని కూల్చగల క్షిపణి తయారు చేసి పైన పేర్కొన్న విమానాన్ని కూల్చివేసి తమ సత్తాను లోకానికి చాటింది. అమెరికా బండారాన్ని వెల్లడించింది. ఇప్పుడు అమెరికాను ఢ కొంటున్న చైనా నాటి సోవియట్ కంటే ఎంతో బలమైనది, కొన్ని రంగాల్లో అమెరికాకు ధీటుగా లేదా కాస్త పైచేయిగా ఉంది. అందువలన పాతబడిన బెలూన్ ప్రయోగాలతో అమెరికా మీద నిఘా పెట్టాల్సిన స్థితిలో లేదు. హీలియం వాయువుతో నింపిన బెలూన్లను గగనతలంలో 24 నుంచి 37 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురవేయవచ్చు. యుద్ధ విమానాలు 20, వాణిజ్య విమానాలు 12 కిలోమీటర్ల ఎత్తువరకు ఎగురుతాయి. వాటికి అవసరమైన ఇంథనాన్ని అందించేదుకు సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చే పరికరాలను అమర్చుతారు. వాటితో పాటు నిఘాకెమేరాలను కూడా పెడతారని చెబుతారు.
పరస్పర విశ్వాసంలేని కారణంగా 1983లో దక్షిణ కొరియా విమానం గూఢచర్యానికి పాల్పడుతున్నదనే అనుమానంతో సోవియట్ మిలిటరీ దాన్ని కూల్చివేసింది. తరువాత అది పౌర విమానం అని తేలింది. 2001లో దక్షిణ చైనా సముద్రం మీద నిఘా కోసం వచ్చిన అమెరికా విమానాన్ని చైనా విమానాలు వెంటాడి, తమ స్థావరంలో దిగేట్లు చేశాయి. చైనా సత్తాను తక్కువ అంచనా వేసిన ఆ విమాన సిబ్బంది, దాన్ని నడిపించిన విభాగానికి ఆ ఉదంతం పెద్ద ఎదురుదెబ్బ. మనం చైనా గుట్టు తెలుసుకోవటం సంగతి అటుంచి విమానాన్ని దారి మళ్లించకుండా, పేల్చివేయకుండా వారి స్థావరానికి పంపి మన ఆధునిక నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాకు సమర్పించుకున్నామని అమెరికన్లు లోలోపల కుమిలిపోయారు. ఏ దేశ గగన తలంలోనైనా అనుమతి లేకుండా ఇతర దేశాల విమానాలు ఎగరటం, అవీ నిఘా తరహా విమానాలైతే సదరు దేశాలపై దాడితో సమానమే. కంటికి కనిపించని వస్తువును కూడా పసిగట్టగల పరిజ్ఞానం అమెరికా వద్ద ఉందన్న సంగతి తెలిసి కూడా మూడు బస్సులంత పరిమాణం గల బెలూన్ను అనుమతి లేకుండా అమెరికా గగనతలం మీద నిఘాకోసం చైనా పంపిందని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. 1962లో భారత్-చైనా యుద్ధం తరువాత కోపంతో చైనా మీద నిఘావేసేందుకు అమెరికా సిఐఏ-భారత గూఢచార సంస్థ ప్రతినిధులు హిమాలయాల్లోని నందాదేవి శిఖరం మీద ప్లుటోనియం ఇంథనంతో పని చేసే నిఘాపరికరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ఏర్పాటు చేసిన ఆ పరికరాలతో అటు చైనా ఇటు మనదేశం మీద కూడా నిఘావేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ అమెరికాను గుడ్డిగా నమ్మి నాటి మన పాలకులు అంగీకరించారు. తరువాత ఆ ప్లూటోనియం కారణంగా ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో వరదలు వచ్చినట్లు కొందరు చెప్పారు. అదేమైందో ఇప్పటికీ రహస్యమే. నిఘా అంశంలో ఎవరూ తక్కువ తినటం లేదు.
సూదికోసం సోదికి పోతే పాత గుట్టులన్నీ బయటపడినట్లుగా బెలూన్ ఉదంతం మీద అమెరికా చేసిన రచ్చ ఒక విధంగా దానికే ఎదురుతన్నింది. డోనాల్డ్ ట్రంప్ హయాంలో కూడా అమెరికా గగన తలం మీద చైనా బెలూన్లు కనిపించినా కూల్చివేత వంటి పనులకు పాల్పడలేదని వెల్లడైంది. అప్పుడెందుకు ఉపేక్షించారు, ఇప్పుడెందుకు రచ్చ చేసి కూల్చివేశారు అంటే అంతర్గత రాజకీయాల ప్రభావంతో పాటు చైనాతో వైరాన్ని కొనసాగించేందుకు ఒక సాకుగా దీన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కూల్చివేత గురించి జో బైడెన్ తాత్సారం చేయటం చైనా పట్ల మెతకవైఖరే కారణమని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ దాడికి దిగింది. అంతే కాదు తమకు మెజారిటీ ఉన్న ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదిస్తామని బెదరింపులకు దిగింది. ప్రతిపక్షం చేసిన దాడిని ఎదుర్కొనేందుకు ట్రంప్ ఏలుబడిలో కూడా చైనా బెలూన్లు ఎగిరినప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని అధికారపక్షానికి చెందిన వారు ఎదురుదాడికి దిగారు. అంతేకాదు అది నిజమే అని అప్పుడు పెంటగన్ నివేదించినా గుట్టుగా ఉంచారని, ఎందుకు అలా చేశారో చెప్పాలని అనేక మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. చైనా పట్ల తమ నేత ట్రంప్ గట్టిగా ఉన్నారని రిపబ్లికన్లు చెబుతుంటే కాదు తమ నేత తక్కువేమీ కాదని బెలూన్ కూల్చివేత, మంత్రి బ్లింకన్ పర్యటన రద్దును అధికార డెమోక్రాట్లు చూపుతున్నారు. చైనాను ఎవరు గట్టిగా ప్రతిఘటిస్తే వారు అంత పెద్ద దేశభక్తులని అమెరికన్ల ముందు ప్రదర్శించుకొనే పోటీలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి.
చైనా బెలూన్ ఎగిరిందని చెబుతున్న మోంటానా ప్రాంతంలో అమెరికా అణ్వస్త్రాలను నిలువ చేసే సిలోస్ (పురులు లేదా పాతర్ల వంటివి) ఉన్నట్లు జనం భావిస్తున్నందున నిఘావేసినట్లు చెబుతున్నారు. అమెరికా వద్ద పెద్ద సంఖ్యలో అణుబాంబులు, క్షిపణులు ఉన్నది బహిరంగ రహస్యం. వాటిని దాచిన సిలోస్ ఎవరికైనా కనిపించేట్లు ఎవరూ పెట్టరు. వ్యూహాత్మక ప్రాంతాల్లోనే మోహరిస్తారన్నది అందరికీ తెలిసిందే. అంతరిక్షంలోని నిఘా ఉపగ్రహాలు అనేక అంశాలను పసిగట్టినప్పటికీ కొన్నింటిని తెలుసుకోవాలంటే బెలూన్లే అవసరమన్నది కొందరి వాదన. రేడియో, సెల్యులర్, ఇతర సంకేతాలను బెలూన్లకు అమర్చిన శక్తివంతమైన సెన్సర్లు మాత్రమే గ్రహిస్తాయని చెబుతున్నారు. చైనా పంపిన బెలూన్ దారి తప్పి వచ్చింది కాదని, వారి నియంత్రణ మేరకు అమెరికా మీద తిరిగిందని అంటున్నారు. అదేగనుక నిజమైతే, దానిలో నిఘాపరికరాలే ఉండి ఉంటే అమెరికాలో రచ్చ మొదలు కాగానే చైనా వారే దాన్ని పేల్చి ఆధారాలు దొరకకుండా చేసి ఉండేవారు కదా? లేదూ నిజంగానే చైనా నిఘాపరికరాలను అమర్చిందని అనుకున్నా అలాంటి పని చేస్తున్నది చైనా ఒక్కటే కాదు కదా! అమెరికా సిఐఏ వద్ద కాంట్రాక్టరుగా పని చేసి దాని గుప్త పత్రాలను భారీ సంఖ్యలో ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడి చేసిన వివరాల ప్రకారం నాసా ఇతర సంస్థలు నిరంతం చైనా మీద నిఘా పెడుతున్నాయి. చైనా టెలికమ్యూనికేషన్స్ సంస్థ హువెయిలో అమెరికా చొరబడి చైనా నేతలు, సైనికుల కదలికలు, అణ్వస్త్రాల సమాచారాన్ని తెలుసుకున్నదని స్నోడెన్ పత్రాల్లో ఉన్నది. అందువలన ప్రతి దేశం నిరంతరం తనను కాపాడుకోవటంతో పాటు ఎదుటి వారి బలం, బలహీనతలను పసిగట్టేందుకు నిరంతరం చూస్తూనే ఉంటాయి. అది వాటికి ఉన్న హక్కు, బాధ్యత.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288