Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్నటి మన్మోహన్-చిదంబరం నుండి నేటి మోడీ-సీతారామన్ వరకూ తమ సంస్కరణలన్నీ భారతదేశాన్ని ఉద్ధరించేం దుకేనని చెప్పడం చూశాం. దేశంలో సింహభాగంగా ఉన్న వ్యవసాయ ఆధారిత ప్రణాళికలన్నిటినీ కేంద్రీకరించామని చెప్పు కొస్తున్నారు. మానవీకరణ అనే పూతతో నడిచే మొన్నటి అభివృద్ధి ''ఆత్మ నిర్భరత'', ''అమృత్ కాల్'' కవచాలు తొడిగిన నేటి 'ముందడుగు' రైతుల బాగు కోసమేనన్నారు పాలకులు. మరో అడుగు ముందుకేసి 2023 నాటికి రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేస్తామన్నారు. పాలనా రంగ పైలెట్ చైనాను మించిపోయే ఆర్థిక స్థాయి సాధించబోతున్నట్లు పదే పదే ప్రకటిస్తున్నారు. బుకాయింపు ఏ స్థాయికి వెళ్లిందంటే... ''శ్రీ అన్న'' పథకం ద్వారా భారత దేశాన్ని చిరుధాన్యాల నిలయంగా (మిల్లెట్ గ్రెయిన్ హబ్) గుర్తింపు తేబోతున్నట్లు పలికారు. తాము ప్రవేశపెట్టే డిజిటల్ సాంకేతికాల నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగడమే గాదు, డిజిటల్ ప్లాట్ఫారమ్స్ స్టార్టప్ సంపదలు సమకూర్చబోతున్నామన్నారు. దాని కోసం ప్రస్తుత బడ్జెట్లో 20లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారట. పరపతి సౌకార్యాన్ని పెంచారట. ముఖ్యంగా పశుపోషణ డెయిరీలు, జల జంతువుల ఉత్పత్తిదారులకు వీటిని కేటాయి స్తారట. దాన్నే వారు ''వ్యవసాయ వేగవంత అభివృద్ధినిధి''గా ప్రముఖంగా పేర్కొన్నారు. సమాంతరంగా కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ పంటల సాగులోకి దించబోతు న్నారట. దానికి తగిన జీవ సంబంధ లేక సేంద్రీయ వనరుల ఉత్పాదకాల కేంద్రాలను నెలకొల్పుతారట. దేశీయంగా రూపొందించ బోతున్న బడ్జెట్ రాబోయే 25సంవత్సరాల ప్రగతికి నాందిగా ఉంటుందట. తమ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటైన మార్కెట్ ధర కల్పించాలని చలిలో, వానలో, ఎండలో వీధుల్లో నిలబడి రైతులు పోరాడారు. పని లేకపోవడంతో రైతు కూలీలు వలసబాట పట్టారు. ఆహార భద్రతా చట్టం నీరుగారిపోయిందని ఆకలి చావులు సూచిస్తున్నాయి. పౌష్టికాహారం అందని కుటుంబాలు, బరువు తక్కువ పిల్లలు, రక్తహీనతకు గురవుతున్న మహిళలు దేశంలో ఎక్కువగా ఉన్నారని అంతర్జాతీయ సూచికలు బహిర్గతపరుస్తూనే ఉన్నాయి. అయినాసరే నిస్సిగ్గుగా అబద్ధాలతో, దొంగ అంకెలతో, ఆర్థిక సర్వేలు, బడ్జెట్లు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆహార పంపిణీ వ్యవస్థను, ఉపాధి హామీ చట్టాలను నీరుగార్చే కేటాయింపులు, విశ్లేషణలు, మాటల గారడీ ప్రావీణ్యతను సూచిస్తూనే ఉన్నాయి. గద్దెనెక్కే ముందు చేసిన వాగ్దానాలకు, రైతు ఉద్యమాలకు భయపడి వ్యక్తపరిచిన క్షమాపణ లకు విలువ లేకుండా చేసిన 'దేశభక్తులు' ఈ పాలకులు. వీరికి ''ఆహార ఉత్పత్తిదారుల'' సంక్షోభం, సామాన్య ప్రజల బతుకు పోరాటం అర్థమవుతుందని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారని ఆశించడం అవివేకం.
అవగాహనా వైరుధ్యం
1950-60 వరకూ 70శాతం గ్రామీణు లను ఇముడ్చుకున్న వ్యవసాయ వృత్తి రూపాంతరం చెందిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన అంశం ఈ వృత్తిని వదిలేసిన గ్రామీణులు అధికమవుతూ రావడం. ఫలితంగా 2000 సంవత్సరం నాటికి 55-60శాతం మంది 2020 నాటికి 45-50శాతం మాత్రమే వ్యవసాయాన్ని తమ మూల వృత్తిగా భావించే స్థితి నెలకొన్నది. దానికి ముఖ్య కారణం మిగిలిన గ్రామీణ వృత్తుల్లానే వ్యవసాయం వ్యాపారానికి తగినట్లుగా పరిణితి చెందకపోవడం. అంటే ఉత్పత్తికీ వినియోగానికి మధ్య రూపొందిన మార్కెట్ వ్యవస్థ పాత్ర పెరుగుతూ రావడం. దానికితోడు వృత్తి పరంగా సుస్థిరత, భద్రత లోపించడం. అంతేగాక శారీరక శ్రమ నుండి దూరంగా జరిగే తాత్వికతతో రూపొందించిన ''విద్యా రంగ'' విస్తరణ. ఫలితంగా వ్యవసాయ వృత్తి పూర్తిగా వ్యాపార స్వరూపాన్ని సంతరించు కొన్నది. దానికి ప్రత్యక్ష నిదర్శనమే కేవలం శ్రమ జీవితానికే నెట్టబడ్డ గ్రామీణ కుటుంబాలు కౌలు రైతులుగా మారడం. భూ సొంతదారులకు, శ్రమతోనే బతుకుతున్న గ్రామీణులకు మధ్య రూపొందిన ఘర్షణ పూరిత జీవన సరళి. ఈ ఒరవడికి పరోక్షంగా పరిశోధనా రంగ నిపుణులు, విస్తరణ రంగ అధికారులు తోడ్పడ్డారు. కూలీలు (శ్రమజీవులు) అవసరంలేని సాంకేతికాలను రూపొందించడం, విస్తరించడం ముఖ్య కర్తవ్యంగా భావించారు. పంటల సాగుతో అనుబంధంగా నడిచే పశువుల, పక్షుల, ఇతర జీవుల పెంపకాన్ని విడివిడిగా నడిపే సాంకేతికా లను ప్రవేశపెట్టగలిగారు. ఈ స్థితి ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కనపడుతున్నది. డెయిరీలు, పౌల్ట్రీలు, చేపల చెరువులు పంట సాగుదార్లకు నష్టకరంగా మారాయి. ఈ దశలోనే ''వ్యవసాయ వ్యాపకం'' అనేది రూపొందింది. దాన్ని ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, మిద్దె పంటల సాగు, (ఆటవిక) వ్యవసాయ సాగుగా చెప్తున్నారు. ఇతర వృత్తుల ద్వారా భద్రతగల జీవితాలను నడపగలుగుతున్న మధ్య తరగతి పౌరులు, నగరాల్లో సొంత గృహ వసతి, మైదానాల వనరులుగల గృహిణులు ఈ భద్రతగల వ్యాపకంలోకి ప్రవేశించడాన్ని చూస్తున్నాం. అలాగే పెద్ద ఉద్యోగులుగా ముఖ్యంగా ఐ.టి. రంగంలో ఇతర దేశాల్లో పనిచేసిన ప్రముఖులు కూడా ఈ వ్యాపంకంలో ప్రవేశించి ఈ వ్యాపకాన్ని విస్తరించడాన్ని చూస్తున్నాం. ఈ తరహా వ్యవసాయ వ్యాపకానికి ప్రేరణ అనేకమంది పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు. ప్రఖ్యాత విశ్లేషకులు, ప్రపంచ స్థాయి ప్రకృతి వనరుల అధ్యయన సంస్థలు. సమాంతరంగా వివిధ నేపథ్యాల్లో రూపొందిన రసాయనేతర ఉపకరణాల పాత్రను పెంచగల నిపుణుల తోడ్పాటు ఈ వ్యాపకాన్ని విస్తరింపచేస్తున్నది. రానురానూ ఇది వ్యాపార రూపాన్ని సంతరించు కోవడాన్ని చూస్తున్నాం. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థ రూపొందింది. ఫలితంగా ఈ వ్యాపకాన్ని లాభకర వృత్తిగా మార్చుకున్న ''రైతులు కాని రైతులు''ను చూస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్నొక ఉద్యమంగా ప్రస్తుత సంక్షోభ పరిష్కార మార్గంగా రైతుల ముందుకు దీన్ని (ప్రకృతి పంట సేద్యం) తెస్తున్నారు. ఈ సంవత్సర కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు కూడా దీన్నే సూచిస్తున్నాయి. అంటే ఈ ''వ్యాపక వ్యవసాయాన్ని'' సన్న, చిన్నకారు రైతు, కూలీలకు 'వృత్తి' కల్పించిన కౌలు వ్యవసాయంలోకి ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. పెట్టుబడి, పంట భద్రత, ప్రత్యామ్నాయ వనరులు, మార్కెట్ సౌకర్యాలకు దూరంగా నెట్టివేయబడిన ఈ రైతులు... ఈ వ్యాపకం లాంటి వ్యాపారంలో నిలబడగలరా? వినియోగదారుణ్ణి రక్షించడానికి భూమి వంటి వనరులను పొదుపు చేయడానికి, ఈ రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని నడపగలరా? నమ్ముకోగలరా?
గతంలో ఒక గ్రోత్ ఇంజిన్ల కలల వ్యాపారి బియ్యాన్ని, చేపలను, రొయ్యలను ఎగుమతి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథకంలో పెట్టబోయాడు. ఇప్పుడు వీళ్లు విష అవశేషాల్లేని ఆహారాన్ని ఎగుమతి చేసి దేశాన్ని ఉద్ధరించబోతున్నారు. వీళ్లే సమాంతరంగా జన్యు మార్పు సాంకేతికాల ద్వారా రూపొందించిన ఆవాలకు, డ్రోన్ సాంకేతికాల ద్వారా నడిచే ఘాటు రసాయన మందులకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు.
అందుకే వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరిం చడం ఈ పాలకుల వల్ల కాదు. వీరి బడ్జెట్లు, ప్రణాళికలు ఆహార ఉత్పత్తిదారున్ని భక్షించడానికే. ఉపాధి హామీ, ఆహార భద్రతా హక్కు చట్టాలను అటకెక్కించడమే వీరి లక్ష్యం. ఇలాంటి పాలకులను మార్చడమే ప్రజల తక్షణ కర్తవ్యం.
- ప్రొ|| ఎన్. వేణుగోపాలరావు
సెల్ : 9490098905