Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేసి వివాదాలు పెంచవద్దని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చెప్పడం బాగా ప్రచారం పొందింది. ఆలస్యంగానైనా మోడీ సరైన పిలుపునిచ్చారని కొందరు కొనియాడారు. సహజంగానే చిత్రపరిశ్రమ సంఘాలు స్వాగతించాయి. ఆ ఉపన్యాసానికి కొద్దిగా ముందే మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా 'పఠాన్' సినిమా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. చాలాకాలం తర్వాత హిందీ తెరపై మళ్లీ తన స్థాయిలో పునఃప్రవేశం చేసిన షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే 'బేషరమ్ రంగ్...' అనే ఒక పాట విడుదలైంది. అందులో నాయిక ధరించిన బికినీ కాషాయ రంగులో ఉండటం సంఫ్‌ు పరివార్ దాడికి కారణమైంది. ఇది పదిహేను సెకన్ల వ్యవహారం మాత్రమే. వారితోపాటు ఎప్పుడూ బీజేపీకి వత్తాసుగా ఉండే కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే కూడా వంతపాడారు. కాషాయం కేవలం బీజేపీ రంగు మాత్రమే కాదు, గౌతమ బుద్ధుడు కూడా అవే ధరించేవాడు అంటూ తనకు తోచిన చరిత్ర చెప్పారు. ఇది పార్లమెంటులోనూ చర్చకు వచ్చింది. బీఎస్పీ సభ్యుడు దానిష్ అలీ మాట్లాడుతూ సనాతన ధర్మం గానీ, ఇస్లాం గానీ ఒక పాటతోనే కొట్టుకు పోయేంత బలహీనమైవని కావని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ పాటలో ఆకుపచ్చ రంగు వాడటంపై కూడా కొందరు మౌల్వీలు నిరసన తెలిపారట. బేషరమ్ రంగ్ అంటే సిగ్గులేని రంగు అనే పాటపదాలు కాషాయాన్ని అవమానిస్తున్నాయని వారి ఆరోపణ. అయితే పూర్తి పాట వింటే గనక నా అసలు రంగు మీకు తెలియదు అని అర్థం. కాని కావాలని చేసిన దుష్ప్రచారంతో ఆ పాటను, చిత్రాన్ని నిషేధించాలనే వరకూ కథ నడిచింది. ఈ మొత్తం పాట వేరే రంగులతో రీషూట్ చేయాలంటూ షారుఖ్ దీపికల ఫొటోలను దగ్ధం చేశారు. కొన్నేండ్లు పోతే తాము మన సంస్కృతికి అనుగుణంగా ఉండే రంగులనే ఉపయోగించేలా చేస్తాం గనక రంగు రాజకీయాలు చెల్లబోవని బీజేపీ కార్పొరేటర్ వినోద్ మిశ్రా హెచ్చరించారు. ఒక రంగును సిగ్గులేనిదిగా చెప్పడమే తప్పు అని కూడా ఆయన సెలవిచ్చారు. మొత్తంపైన ఇది తీవ్ర వివాదంగానే పరిణమించింది.
ఈ వివాదంపై దర్శకుడు ఆనంద్ పట్వర్థన్ మాట్లాడుతూ మితవాద పార్టీలు సినిమాను రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని విమర్శించారు. వినోదం కోసం ఉద్దేశించిన సినిమాను మత రాజకీయాల కోసం వివాదంగా మారుస్తున్నారన్నారు. కాశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాన్ని కేవలం ఈ భావాల కోసమే ప్రోత్సహించారు. అది కేవలం ప్రచారం కోసం తీసిన సినిమా. ఆఖరుకు దాన్ని గోవా చలన చిత్రోత్సవంలోనూ తగాదాగా మార్చారు. ప్రచార చిత్రంగనక అవార్డుకు ఎంపిక చేయలేదని జ్యూరీ అధ్యక్షుడు చెబితే అతనిపై దాడి చేశారు. ఈత దుస్తుల్లో స్త్రీ శరీర కదలికలున్నాయని మతవాదులు ఎప్పుడూ గొడవ చేస్తుంటారు. కాని 'దిల్ వాలే' చిత్రంలోనూ 'రంగ్ దే తూ మోహె గేరువా...' అని పాట ఉంది కదా! దానికి ఎలాంటి అభ్యంతరం రాలేదే? అని రచయిత శ్రీమోయి పి కుందు ప్రశ్న వేశారు. ఈ విషయం అలా ఉంచితే షారుఖ్ ఖాన్ పాత వ్యాఖ్యలను కూడా తవ్వి తీసి వివాదం రగిలించే కుట్రలు చాలా జరిగాయి. సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత కంగనా రనౌత్ వంటి వారు రేపిన రభస కారణంగా ఆమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్‌లను బహిష్కరించాలనే రచ్చ చాలాకాలం నడిచింది. ఈ కారణంగా లాల్ సింగ్ చద్దా, రామ్ సేతు వంటి చిత్రాలు ఊహించినదానికన్నా చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. బ్రహ్మాస్త్ర కూడా. వాస్తవానికి చివరి రెండు చిత్రాలు హిందూత్వ భావజాలానికి కొంత అనువుగా ఉన్నవే. అయితే వాటిలో నటించిన వారిపై విద్వేష ప్రచారంతో నడవకుండా చేశారు. ఇవన్నీ బాలీవుడ్‌ను కుదిపేశాయి.
ఇదే సమయంలో కాశ్మీర్ ఫైల్స్‌ను ఆకాశానికెత్తారు. ఏకపక్ష హిందూత్వ భావజాలంతో తీసిన ఆ చిత్రాన్ని ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ ఆకాశానికెత్తి ప్రచారం కల్పించారు. అదే కోవలో ఆర్ఆర్ఆర్కూ ఊతమిచ్చారు. అచ్చంగా అలాంటిదే కాకున్నా తెలుగు వీరుల గురించి ఊహలు జోడించి తీసిన ఈ చిత్ర కథకుడు విజయేంద్ర ప్రసాద్‌ను రాజ్యసభకే నామినేట్ చేశారు. దాంట్లో ఒక నాయకుడుగా నటించిన జూనియర్ ఎన్టీఆర్‌ను స్వయంగా అమిత్‌షా వచ్చి కలుసుకున్నారు. తనతో ఆరెస్సెస్ ఇతివృత్తంతో ఒక చిత్రం తీయనున్నట్టు సమాచారం. కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలే కార్తికేయ-2 ద్వారకానగర పురాణంతో తీశారు. బాహుబలి ప్రభాస్‌తో ఆదిపురుష్ తీస్తున్నారు కూడా. రంగస్థలం, పుష్ప చిత్రాల దర్శకుడు సుకుమార్‌తోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా చెబుతూ పోతే సినిమా రంగంలో కాషాయ కథలజోరు బాగా పెరిగింది. ఇందుకు సమాంతరంగా షారుఖ్ వంటి వారిపై వ్యతిరేక ప్రచారమూ నడుస్తున్నది. ఇవన్నీ భరించలేకనే కోల్‌కతా చిత్రోత్సవంలో అమితాబ్ బచన్, షారుఖ్ ఖాన్లు గతంలోని చిత్రాలకూ ఇప్పటికీ తేడాను చెబుతూ ఆందోళన చెందారు.
ఇన్ని సవాళ్ల మధ్యనా ధైర్యంగానే పఠాన్ విడుదల చేశారు. చాలా కాలం తర్వాత వచ్చిన షారుఖ్ సినిమా వివాదాలన్నిటినీ తోసిపుచ్చి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే పద్నాలుగు కోట్లు వసూలు చేసింది. నాలుగేండ్ల తర్వాత ఆయనకు లభించిన ఘనవిజయం సంఫ్‌ు పరివార్ ప్రచారాలను వారు పట్టించుకోబోరని చాటింది. బహుశా ప్రధాని హఠాత్తుగా మారిపోవడానికి ఇదో కారణం కావచ్చు. విశ్వహిందూ పరిషత్ కూడా నిరసనను ఉపసంహరించు కుంటున్నట్టు ప్రకటించింది. ఇక మొదట్లో చెప్పుకున్న మధ్యప్రదేశ్ మంత్రి కూడా చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ పొందిన తర్వాత ఇంకా దాన్ని నిరసించడంలో అర్థం లేదని తోకముడిచారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనే ఫాసిస్టు నీతిని అమలు చేశారు. షారుఖ్ ఖాన్ విజయం పట్ల బాలీవుడ్లో ఆయన సన్నిహితులు, అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కరణ్ జోహార్ ప్రత్యేకంగా వ్యాసం రాశారు. ప్రకాశ్‌రాజ్ ఈ చిత్రం విజయాన్ని, వసూళ్లను గురించి ట్వీట్ చేశారు. ఇక జావేద్ అక్తర్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బారుకాట్ బాలీవుడ్ వంటి వాటిని గురించి మాట్లాడటమే దండగని, అవి పని చేయవనీ కొట్టిపారేశారు. షారుఖ్ పెద్దమనిషి మాత్రమేగాక నేను ఎంత లౌకికవాదిగా ఉన్నానో ఆయనా అంతేనని మెచ్చుకున్నారు.
ఇవన్నీ ప్రజలకూ పరిశ్రమకూ ఉన్న లౌకిక ధోరణులు చెబుతాయన్నది నిజమే. అయితే ఇదే సమయంలో కనిపిస్తున్న ఆందోళనకరమైన ఇతర కోణాలను విస్మరిస్తే పొరబాటవు తుంది. సినిమా వివాదాలు వద్దని చెప్పినందుకు మోడీని మెచ్చుకుంటున్న సమయంలోనే 'మోడీ క్వశ్చన్' పేరిట బిబిసి తీసిన డాక్యుమెంటరీని నిషేధించారు. వాటిని ప్రసారం చేయకుండా ట్విటర్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను ఆదేశించారు. వాస్తవానికి బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక సమాచారం మేరకు తీసిన ఆ డాక్యుమెంటరీలో కల్పన ఏదీ లేదు. ఆ కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ సర్కారు గురించిన వాస్తవాలను వెల్లడించింది. అప్పట్లో జరిగిన విచారణలనూ విమర్శలనూ వినిపించింది. బ్రిటిష్ మాజీహౌం మంత్రి అందులో మాట్లాడారు. అయినా సరే అవన్నీ దుష్ప్రచారా లంటూ దేశంలో ప్రసారం కానివ్వలేదు. అందుబాటులో ఉన్న ఇతర మార్గాలలో చిత్రం డౌన్లోడ్ చేసుకున్న ఎస్ఎఫ్ఐ వంటి సంస్థలు ప్రదర్శన ఏర్పాటు చేశాయి. గతంలో నిర్బంధానికి గురైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ వంటి చోట్ల ప్రదర్శనలపై పోలీసులు విరుచుకుపడ్డారు. అంతకన్నా దారుణం ఎబివిపి వంటి సంస్థలు దీనికి పోటీగా కాశ్మీర్ ఫైల్స్ ప్రదర్శన నిర్వహించారు. కళారంగంలో భిన్న శక్తుల ఘర్షణకు ఇంతకు మించిన ఉదాహరణ అక్కర్లేదు. దీపికా పదుకునే జేఎన్‌యూ పోరాటానికి కొన్నేండ్ల కిందట సంఘీభావం చెప్పడం కూడా పఠాన్ పాటపై దాడికి ఒక కారణం. ఇంతకూ ఈ చిత్రంలో ప్రకంపనాలు పుట్టించిన 'బేషరమ్...' పాటలో స్పానిష్ చరణాలు పాడిన కారాలిసా మాంటెరో మాట్లాడుతూ... ఈ దేశంలో బికినీ పాటపై వివాదాన్ని మించిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. కాషాయం రంగును జాతీయ జెండాలో చూడటం ఒక్కటే నాకు గుర్తున్న విషయం. దాన్ని ధైర్యానికి, నిస్వార్థతకు చిహ్నంగా భావిస్తాం. మధ్యప్రదేశ్ మంత్రికి అదే ఎందుకు పెద్ద సమస్య అయిందో నాకు తెలియదు అన్నారు. కారాలిసా గతంలో దిల్ చాహతా హై చిత్రంలో పాట పాడటంతో బాగా పాపులర్ అయిన గాయని. ఇలాంటి సానుకూల వ్యాఖ్యలు, వాస్తవాలు ఎన్నయినా ఇవ్వచ్చు. కానీ అవేవీ మన పాలకులకు అవసరంలేదు. సినిమాలే గాక ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలను కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తప్పని చెబితే తీసేస్తామని ప్రకటించారు. అయినా మీడియా కళ్లు తెరవకుండా స్వీయ సెన్సార్షిప్ పాటిస్తోందని సాయినాథ్ తీవ్రంగా ఆక్షేపించారు.
గాంధీలు, గాడ్సేలు మొత్తంపైన వెనక్కు తిరిగి చూసుకుంటే 2022లో బారుకాట్ బాలీవుడ్, బారు కాట్ విక్రమ్ వేద, బారుకాట్ పఠాన్... అంటూ వచ్చిన పిలుపులు పరిశ్రమను కుదిపేశాయి. ఈ సమయంలోనే దక్షిణాది చిత్రాల అఖండ విజయాలు బాలీవుడ్‌కు ఆందోళన కలిగించాయి. ప్రపంచ దేశాలను ఆకర్షించే దశకు చేరాయి. మన ఎగుమతులలో కాస్తో కూస్తో సొమ్ములు తెచ్చేది చిత్రాలే, మన నిర్మాణాల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ఇంగ్లీషు వారికి మన మార్కెట్ కూడా ఎక్కువే. ఈ సమయంలో బహిరంగ వివాదాలు, బారుకాట్లు దేశానికే హానికరమని ఆర్థికవేత్తలూ పరిశ్రమ వర్గాలు కూడా గుర్తించక తప్పని స్థితి. అదే సెగ ప్రధానినీ తాకినట్టుంది. కాని నిజంగా మార్పు లేదనడానికి గాంధీ గాడ్సే చిత్రం ఒక ఉదాహరణ. వివాదాల వల్ల మన గొప్పతనం చెప్పుకోలేకపోతున్నామని మోడీ అన్నది వచ్చే ఎన్నికల కోణం తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎంతమాత్రం కాదు! అందుకే పారాహుషార్ మరి!
-పీపీ