Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.90 లక్షల కోట్లతో బాహుబలి బడ్జెట్ను శాసనసభలో ఈనెల 6న ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమం గురించి ఆర్థికశాఖ మంత్రి కితాబునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు కీలక భాగస్వామ్యం వహిస్తున్నారని, వారి సంక్షేమమే పరమావధి అని చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా అత్యధిక వేతనాలు ఇస్తున్నామని, వారి ప్రయోజనాల విషయంలో ఏనాడు తక్కువ చేయలేదంటూ పేర్కొ న్నారు. ఎక్కువ జీతాలేమోగానీ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రతినెల జీతంకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండేండ్లుగా వేతనాల చెల్లింపు విషయంలో జాప్యం జరుగుతున్నది. మరోపక్క ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక బిల్లులన్ని నిలిచిపోయాయి. రుణాలు, అడ్వాన్సులు, రీయంబర్స్మెంట్ బిల్లులకు గత కొన్ని నెలలుగా మోక్షం లభించడం లేదు. ఖజానా కార్యాలయం నుంచి టోకెన్లు జనరేట్ అవుతున్నాయే తప్ప 'ఈ-కుబేర్' నుంచి డబ్బులు మాత్రం ఉద్యోగుల ఖాతాల్లో జమ కావడం లేదు.
ఒకప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రతినెల 1వ తేదీన జీతాలు వచ్చేవి. సాధారణ పరిపాలన శాఖ ఏప్రిల్ 1990లో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు నెం.223 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతభత్యాలు చెల్లించాలి. కానీ గత రెండేండ్లుగా ధనిక రాష్ట్రంలో జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో సచివాలయం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతంవస్తే ఆయా శాఖాధిపతి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు 2వ తేదీ నుండి 5వ తేదీ లోపు జీతాలు అందుతాయి. కానీ మిగతా జిల్లాల్లో ఏ తేదీన జీతాలు జమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా పలాన తేదీన జీతం వస్తుందని నమ్మకాన్ని ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించడం లేదు. వివిధ మార్గాల ద్వారా వస్తున్న రాబడులు సంక్షేమ పథకాల సబ్సిడీలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతుండడంతో ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు చెల్లించడం కష్టమవుతున్నది. సరైన సమయానికి జీతాలురాక ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, ఈఎంఐల చెల్లింపులకు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి దాపురించింది.
ఉద్యోగుల బిల్లులన్నీ పెండింగ్...
ఉద్యోగుల సరెండర్ లీవ్, మెడికల్ రీయంబర్స్మెంట్, టీఎస్ జిఎల్ఐ క్లైములు, జిపిఎఫ్, పిఆర్సీ బకాయిలు మొదలైన బిల్లులన్నీ ట్రెజరీశాఖలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) కింద ప్రతి ఉద్యోగ మూలవేతనం నుంచి ప్రభుత్వం 6శాతం మినహాయింపులు చేస్తుంది. దీని సొమ్ము రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీశాఖలో జమవుతుంది. 20ఏండ్ల సర్వీస్ పూర్తయిన ఉద్యోగ ఉపాధ్యాయులు జిపిఎఫ్ ఖాతాల నుండి పాక్షిక ఉపసంహరణ కింద సొమ్ము తీసుకుంటారు. ఈ విధంగా తీసుకుంటున్న జిపిఎఫ్ బిల్లులు గత కొన్ని నెలలుగా అనేక జిల్లాల్లో నిలిచిపోయాయి. ఫలితంగా గృహ నిర్మాణం, ఆరోగ్య సంబంధ విషయాలు, వివాహ శుభకార్యాలు, పిల్లల చదువులు మొదలైన వాటికి ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు జమ చేసుకున్న సొమ్ము ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకోవడం వల్ల అవసరాల నిధి అక్కరకు రాకుండాపోయింది. అలాగే పిఆర్సీ ఏరియర్స్ బిల్లులు, సిపిఎస్ ఉద్యోగుల డి.ఏ బకాయిలు చాలా నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. సమయం ముగిసిన లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్ల క్లైముల యొక్క బిల్లులు అందక రిటైరైన ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉద్యోగుల వైద్యానికి సంబంధించిన రూ.2లక్షల లోపు అత్యవసర మెడికల్ బిల్లులు కూడా మంజూరు కావడం లేదు.
నూతన పద్ధతిలో నేరుగా ఖాతాలోనికే...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) రూపొందించింది. దీని ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులను డిడిఓలు తయారుచేసి ఎస్టిఓ కార్యాలయాలకు పంపిస్తారు. ఆ వెంటనే టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాని ఆధారంగా సొమ్ము మంజూరు కావాలి. ఇంతకు ముందు టోకెన్ జనరేట్ అయినా కొన్ని రోజులకే ఉద్యోగుల ఖాతాల్లో బిల్లుల సొమ్ము జమయ్యేది. కానీ ప్రస్తుతం బిల్లు క్లియర్ కావాలంటే ఆర్థికశాఖ అనుమతి ఉండాల్సిందే. ట్రెజరీశాఖకు చెందిన ఆడిట్ అధికారులు ఆడిట్ చేసిన అనంతరం బిల్లులు ఈ-కుబేర్ పోర్టల్లో అప్ లోడ్ చేస్తారు. ఖజానా శాఖకు వస్తున్న రాబడుల ఆధారంగా బిల్లులను మంజూరు చేస్తారు. ఓ నెలలో రైతుబంధు... ఇంకో నెలలో ఇంకో పథకం... ఇలా ప్రతి నెలలో సంక్షేమ పథకాలకే వచ్చిన నిధులన్నీ ఖర్చవుతున్నాయి. జీతాల కోసం నిధులు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరగడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమయానికి వేతనాలు రావడం లేదు. ప్రయివేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులకు ఆయా సంస్థలు ఒక తేదీని నిర్ణయించి జీతాలు జమ చేస్తాయి. కానీ ప్రభుత్వోద్యోగులకు అలా ఎందుకు ఇవ్వడంలేదనే ప్రశ్నలు వారి నుండి వ్యక్తమవుతున్నాయి. ధనిక రాష్ట్రంలో జీతాల కోసం, బిల్లుల మంజూరు కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి వేతన జీవుల వెతలు తీర్చాల్సిన అవసరమున్నది.
- అంకం నరేష్
సెల్: 6301650324