Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశానికి ఏటా దాదాపు రూ.4లక్షల కోట్ల మేరకు నిధులు అందించే ప్రభుత్వ బీమా పరిశ్రమకు 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. ఎల్.ఐ.సి సంస్థకు, పాలసీ దారులకు భారంగా మారిన బీమా ప్రీమియం పైన అన్యాయంగా విధిస్తున్న 18శాతం జీఎస్టీ ఏమాత్రం తగ్గించలేదు. పైపెచ్చు ఏప్రిల్, 2023 తరువాత తీసుకునే పాలసీల ఏడాది ప్రీమియమ్ రూ.5 లక్షలు దాటితే, వాటి మెచ్యూరిటీపై పన్ను వేసే విధంగా పద్ధతి ప్రతిపాదించారు. అంటే దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇఇఇ పద్ధతికి స్వస్తి పలికి, ఈఈటి (Exempt, Exempt, Tax) పద్ధతి తీసుకొస్తున్నారు. ఆరోగ్య బీమా చేస్తే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితులు మరింత పెంచాలన్న విజ్ఞప్తులను పెడచెవిన పెట్టారు. దేశీయ పొదుపు ప్రస్తుతం దేశ జీడీపీలో 28శాతం నుండి 29శాతం మధ్యలో ఉంది. కొన్ని ఏండ్ల క్రితం ఇది 37శాతం ఉండేది. ప్రజల పొదుపు సామర్థ్యం పడిపోవడం, ఉద్యోగాల లేమి, మితిమీరిన ద్రవ్యోల్బణం, గ్యారెంటీలేని ఉద్యోగాల వలన దేశీయ పొదుపు క్రమేపీ క్షీణిస్తూ వస్తోంది. దేశీయ పొదుపు మూడు విధాలుగా ఉంటుంది. 1. కుటుంబ పొదుపు 2. కార్పొరేట్ పొదుపు 3. ప్రభుత్వ రంగ సంస్థల పొదుపు.
1. కుటుంబ పొదుపు - ఇది మొత్తం దేశీయ పొదుపులో సుమారు 60శాతం ఉంటుంది. ఇందులో రెండు భాగాలు. ఆర్థిక పొదుపు (అంటే బ్యాంక్, బీమా, పీఎఫ్, పెన్షన్, పోస్ట్ ఆఫీస్‌లలో చేసే పొదుపు). భౌతిక పొదుపు (బంగారం, భూములు, రియల్ ఎస్టేట్ తదితర పొదుపు)
2022-23లో సుమారు రూ.17లక్షల కోట్లు ఆర్థిక పొదుపు రూపేణా సమీకరించబడగా, 2023-24 నాటికి అది రూ.25 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ సొమ్మంతా ప్రభుత్వ పెట్టుబడులకు ఉపయోగపడతాయి. కార్పొరేట్ పొదుపు - ఇది మొత్తం దేశీయ పొదుపులో 34శాతం ఉంటుంది. ఇది ఆయా కార్పొరేట్ల సొంత ప్రయోజనాల కోసం వినియోగించబడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సమీకరించబడే పొదుపు-ఇది కేవలం 5శాతం మాత్రమే. ప్రజల పొదుపు ప్రభుత్వ నియంత్రణలో ఉంటేనే, ప్రజా సంక్షేమం కోసం దానిని ఉపయోగించు కునే అవకాశం ఉంటుంది. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ప్రజా పొదుపు, వారికి విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతుంది తప్ప, సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. అందుకే కుటుంబ పొదుపుని ప్రోత్సహించాలి. కానీ, దానికి విరుద్ధంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి.
బీమా రంగానికి ప్రత్యేక ఆదాయపు టాక్స్ స్లాబ్‌ను కల్పించాలన్న బీమా రంగ విజ్ఞప్తులను ఆర్థికమంత్రి ఏమాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు ఆదాయపు పన్ను కట్టేవారిని నూతన టాక్స్ విధానంలోకి తీసుకువచ్చే విధంగా ఈ బడ్జెట్లో స్లాబ్స్‌లో మార్పులు ప్రతిపాదించారు. ఈ చర్య ఆదాయపు పన్ను రాయితీ కోసం జీవిత బీమా పాలసీలు తీసుకునే వారిని నిరుత్సాహ పరిచినట్టే అవుతుంది. సార్వత్రిక సామాజిక భద్రత లోపించిన మన దేశంలో, ఇటువంటి చర్యలు ప్రజలు స్వచ్చందంగా కల్పించుకునే సామాజిక భద్రతను, పొదుపు అలవాటుని దెబ్బ తీస్తాయి.
ప్రభుత్వ బీమా రంగంపై అలుపెరగని దాడి!!
2021-22 బడ్జెట్లోనే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఒక ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీని ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయబో తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. జీఐబిఎన్ఎ చట్టం-2021 ద్వారా ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు లభించాయి. ప్రభుత్వం అనుకుంటే ఏ పీఎస్, జిఐ కంపెనీలోనైనా ప్రభుత్వ ఈక్విటీని 51శాతం కన్నా దిగువకు తగ్గించవచ్చు. అందువల్ల ఈ చట్టం ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రయివేటీకరణకు మార్గం సుగమం చేసింది. అయితే, ఏఐఐఐఏ మడమ తిప్పకుండా చేసిన పోరాటాల వల్ల ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీ అమ్మకం తాత్కాలికంగా నిలుపుదల అయ్యింది. అయితే, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలలోని కొన్ని బ్రాంచ్‌లు, డివిజనల్ కార్యాలయాలను మూసివేయడానికి లేదా విలీనం చేయడానికి ఇటీవలి జరుగుతున్న ప్రయత్నాలు ప్రయివేటీకరణ దిశగా అడుగులు మాత్రమే అని గమనించాలి.
స్విస్ రే సిగ్మా అధ్యయనం ప్రకారం... ప్రపంచంలోనే పది అతిపెద్ద బీమారంగ మార్కెట్లలో ఇండియా ఒకటిగా నిలిచింది. భారతదేశంలో బీమా రక్షణ అంతరం (ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ గాప్)16.5 ట్రిలియన్ డాలర్లుగా గుర్తించింది. ఈ బీమా అంతరంలో అత్యధిక వాటాను చేజిక్కించుకోవడానికి మార్కెట్లో తీవ్రమైన పోటీ నడుస్తోంది. 2015లో మొదటిసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బీమా రంగంలో ఎఫ్‌డిఐ పరిమితిని 26 నుంచి 49శాతానికి పెంచారు. 2021లో దానిని 74శాతానికి పెంచారు. విదేశీ యాజమాన్యాన్ని, ప్రయివేటు బీమా కంపెనీలపై వారి నియంత్రణను కూడా అనుమతించారు.
మన దేశీయ కంపెనీలపై విదేశీ పెట్టుబడి
నియంత్రణ సాధించడం వల్ల, మన దేశీయ కుటుంబ పొదుపులో అధిక వాటాను పొందాలని, తద్వారా లాభాలు పోగేసుకోవాలని వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీమారంగ పరిశ్రమలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రాబోయే రోజులలో దేశీయ బీమా రంగంలో కంపెనీల మిళితాలు బాగా పెరుగుతాయని తెలుస్తోంది. ఇటీవల హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎక్సైడ్ లైఫ్‌ను రూ.6687 కోట్ల ఒప్పందం మేరకు కొనుగోలు చేసింది. ఐసిఐసిఐ లాంబార్డ్, భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని కొనుగోలు చేసింది. అమెరికా ఆధారిత బీమా సంస్థ మెట్ లైఫ్, ఐజిఐ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ప్రో లో 15.27శాతం వాటాను పొందింది. ప్రయివేటు బీమా కంపెనీల మెర్జర్స్ ప్రభుత్వ రంగ బీమా కంపెనీల మార్కెట్ ఆధిపత్యానికి పెద్ద సవాలుగా పరిణమిస్తోంది.
సాంకేతిక అంశాల్లో నూతన సవాళ్లు!!
సాంకేతిక ఆవిష్కరణ, నవీకరణకు సంబం ధించి నూతన సవాళ్లు ఎదురవుతున్నాయి. బీమా రంగం ఎక్కువగా డిజిటలైజేషన్ వైపునకు పయని స్తోంది. భారతదేశంలో బీమా వ్యాప్తి సుమారు 4శాతం ఉండగా, ఇంటర్నెట్ యొక్క వ్యాప్తి 45శాతంగా ఉంది. భారతదేశంలో 139కోట్ల మందిలో సగం మంది ఇంటర్నెట్ను కలిగి ఉన్నారు. క్లిక్, కొనుగోలు' సౌలభ్యం ఆన్లైన్ కొనుగోలుకు గణనీయమైన ఊపు వస్తోంది. భారతదేశంలో ఆన్లైన్ బీమా మార్కెట్ 2024 నాటికి రూ.22,000 కోట్లకు పెరగగలదని అంచనా. బీమా ఉత్పత్తుల విక్రయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం అనేది నేడు అనివార్యమైంది. స్టాండర్డ్ అండ్ పూర్ తాజా నివేదిక ప్రకారం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం రెండవ అతిపెద్ద బీమా సాంకేతిక మార్కెట్‌గా నిలిచింది. బీమా కంపెనీలు కస్టమర్లను తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మెరుగైన డేటా విశ్లేషణలు, కృత్రిమ మేధస్సు (ఎఐ)ను ఉపయోగించటం ద్వారా, పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా కంపెనీలు ఉత్పత్తు లను అభివృద్ధి చేస్తున్నాయి.
దేశీయ బీమా పరిశ్రమపై మిలీనియనల్స్ లేదా యువ ఉద్యోగులు ప్రభావం గణనీయంగా ఉంది. మొత్తం ఉద్యోగుల్లో వీరు 46శాతం దాకా ఉండడం విశేషం. అందువల్ల బీమా పాలసీలు అమ్మడంలో, పాలసీ సేవలు అందించడంలో కొత్త పద్ధతులు అవసరం. ఎందుకంటే... వారు ముఖాముఖీ సర్వీస్ కన్నా డిజిటల్ సర్వీస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫిజిటల్ మార్కెట్ ప్లేస్- భౌతిక శాఖలతో బాటు ఫోన్ ఆధారిత కాంటాక్ట్ సెంటర్లు, చాట్బాట్లు, వాట్సాప్, మొబైల్ యాప్‌లు, సామాజిక మాధ్యమాలు వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈరోజు అనివార్యమయ్యాయి.
ఇప్పటికే మన ప్రభుత్వ రంగ బీమా సంస్థలు మరింతగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇటు ఉద్యోగుల ప్రయోజనాలను, అటు సంస్థ ప్రయోజనాలను అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. ప్రపంచ దేశాలలో పదవి విరమణ చేసిన వారి పొదుపు ఎక్కువగా ఉన్న దేశాలలో మన దేశం ఒకటి. కాబట్టి ప్రభుత్వ బీమా రంగ పరిశ్రమ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ దిశగా బీమా ఉత్పత్తులను అభివృద్ధి చేయాలి.
- పి. సతీష్
9441797900