Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్ష తేదీలు ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో టెన్షన్ ప్రారంభమైంది. పరీక్షా విధానంలో మార్పులు, తప్పులులేని ప్రశ్నాపత్రాలు ఇవ్వడంలో విఫలం, లీక్‌లు సర్వసాధారణంగా జరుగుతుండడంతో ఈసారి ఎలా ఉంటుందోననే ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉండే పదోతరగతి, ఇంటర్మీడియేట్, కొన్ని యూనివర్సిటీలు నిర్వహిస్తున్న డిగ్రీకోర్సులు, ఎంసెట్, నీట్ లాంటి ఇతర కామన్ ఎంట్రన్స్ పరీక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంత సమర్థవంతంగా నిర్వహించలేక పోతున్నాయనేది కాదనలేని వాస్తవం. ఎప్పటికప్పుడు తప్పులు జరగకుండా ప్రశ్నాపత్రాలు రూపొందించి పరీక్షలు పటిష్ట నిర్వహణకు చర్యలు తీసుకుంటామని పాలకులు పాతపాటే పాడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ హామీలపై విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రుల్లోనూ నమ్మకాలు కలగడం లేదు. లీక్‌లు, ఒకపక్క తప్పులు, పాలకుల చేతకానితనానికి నిదర్శనంగా మిగులుతున్నాయి. దీంతో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపో తుంది. అధికారంలో ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా పరీక్షల నిర్వహణలో విఫలమవు తున్నాయనే ఆరోపణలను తోసి పుచ్చలేం. గతంలో ప్రశ్నాపత్రాలు లీక్ అయిన విషయం కొన్ని సందర్భాల్లో బయటపడుతున్నది. ప్రభుత్వాలు విధిలేని పరిస్థితుల్లో పరీక్షలు వాయిదావేస్తున్నాయి. కొన్నిసార్లు ఈ లీక్‌ల విషయం రాజకీయ పార్టీలు పత్రికావిలేకరుల సమావేశాలు పెట్టి వెల్లడిస్తేకానీ తెలియనిపరిస్థితి. ఈలీక్ గుట్టురట్టు కాకుండా ఉంటే వారు పరీక్షలు రద్దు చేసే ప్రసక్తేరాదు. రద్దయిన పరీక్షలకు తిరిగి హాజరు కావాల్సిన విద్యార్థుల పరిస్థితి ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు తయారై రాయాల్సిన సమయానికి వాయిదాపడినా రాసిన పరీక్షలు మళ్లీ రాయాలన్నా విద్యార్థులు ఎంతటి నిరాశానిస్పృహలకు గురవుతారో పాలకులు ఆలోచించడంలేదు. ఇక ప్రశ్నా పత్రాలు లీక్ అయి అది బయటపడకుండా ఉంటే ఆ ప్రశ్నాపత్రాలు కొన్నవారు అందలమెక్కిపోతున్నారు. ప్రశ్నాపత్రాల జవాబులు కంఠస్తం చేసిన ప్రబుద్ధులు ఎలాంటి కష్టం లేకుండా మేధావులుగా పైకి వెళ్లిపోతుంటే, సంవత్సరం పొడవునా శ్రద్ధాసక్తులతో కష్టపడి చదివిన మెరికల్లాంటి విద్యార్థులు వెనుకబడి పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరీక్షావిధానంలో ఉన్న లొసుగులను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవి అసలు ఏ దశలో లీక్ అవుతున్నాయి? బాధ్యులెవరు? ప్రశ్నా పత్రాలు తయారు చేసేవారా? లేక సరిచూసి సక్రమంగా ఉన్నాయా? లేదా అని నిర్ధ్థారించేవారా? లేక ఈ పత్రాలు రహస్యంగా ముద్రించేందుకు లక్షలాది రూపాయలు అదనంగా పొందుతున్న ప్రింటింగ్ ప్రెస్ యజమానులా? లేక రెట్టింపు మొత్తంలో ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ రవాణా చేస్తున్న ట్రాన్స్ పోర్టర్‌లా? లేక పరీక్షా కేంద్రాలకు చేరిన తర్వాత అది నిర్వహిస్తున్న అధికారులా? తదితర విషయాలు లోతుగా పరిశీలించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. గతంలో మెడికల్ ప్రశ్నాపత్రాలు రూపొందించిన ప్రొఫెసరే లీకు బాధ్యులు కాగా మరొకసారి ప్రశ్నాపత్రాలు ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ యజమాని బాధ్యుడైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. అంతేకాదు ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమానికి తనకు ఈ ప్రశ్నాపత్రాల ముద్రణ కాంట్రాక్టు విషయంలో సహాయపడిన కొందరు అధికారులకు ఏమేరకు ప్రతిఫలంగా దక్షిణతాంబూ లాలు చెల్లించారో అధికారులు కూపీలాగగలిగారు. అవన్నీ రికార్డులకే పరిమితమయ్యాయి. ఇలాంటి సంఘటనలన్నీ విద్యావ్యవస్థ ప్రతిష్టతను దెబ్బతీస్తున్నాయి. చదువులతల్లి సరస్వతీదేవిని నడిబజారులో విక్రయించే ఘోరపరిస్థితికి చేరడం, చదువే జీవన్మరణ సమస్యగా రాత్రింబవళ్లు కృషి చేస్తున్న విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచిస్తే ఆవేదన కలగక తప్పదు. నిత్య అధ్యయనంతో విజ్ఞానం ఆర్జించి పరిశోధనతో మేథాసంపత్తిని పెంచాల్సిన విద్యావిధానం డబ్బుతో కొనుక్కునే స్థాయికి దిగజారడం అత్యంత బాధాకరం. ఇందుకు కోచింగ్ సెంటర్లను కానీ, మరికొన్ని విజిలెన్స్ కాలేజీలను కానీ నిందించి ప్రయోజనంలేదు. విద్యను వ్యాపార వస్తువుగా మార్చి స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించిన వారిని నిందించాలి. అయితే వారిని విమర్శించే ముందు ఈ పరీక్షల నిర్వహణకు వేలాది రూపాయల జీతభత్యాలు తీసుకుంటూ బాధ్యత వహిస్తున్న కొందరు అధికారులను నిలదీయాలి. ఆయాశాఖల్లోని కొందరు అధికారుల అవినీతి, ఆశ్రితపక్షపాతం, అశ్రద్ధ వీటన్నింటిని మించి రాజకీయజోక్యం వల్లనే ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆరోపణలను కాదనలేం. పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు పటిష్టచర్యలు తీసుకుంటామని పాలకులు పదే పదే చెపుతున్నా అవి ఆచరణలో మాత్రం కన్పించడం లేదు. కేవలం కొందరు అధికారుల వల్లనే ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతున్నది. పాలకులు ఇప్పటికైనా కళ్లుతెరిచి ఈసారి జరగబోయే పరీక్షలన్నింటిని పకడ్బందీగా నిర్వహించాలి. అక్రమాలకు బాధ్యులైనవారిని ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేసివారి ఫొటోలను పత్రికలలో వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచురించి ప్రజలకు తెలియ చేయాలి. పాలకులు అలాంటి కఠిన చర్యలు తీసుకోకపోతే డబ్బులతో ర్యాంకులు కొనుక్కోవాలని ఆశపడేవారికి, ప్రశ్నాపత్రాల వ్యాపారం చేసేవారికి జంకు, భయం ఉండదు. ప్రశ్నాపత్రాల కొనుగోలులో భాగస్వాము లవుతున్న కళాశాల యజమానులపై క్రిమినల్ చర్యలు చేపట్టి వారి పేరుపై విద్యావ్యాపారం చేయకుండా నిరోధించాలి. ర్యాంకులు రాత్రికి రాత్రే కుబేరులు కావాలనుకునే వీరి దురాశలకు అడ్డుకట్టవేయాలి.
- సభావట్ కళ్యాణ్
9014322572