Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడ్జెట్లో విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారానికి నిలిచిపోయిన కేటాయింపులు, నాకు ''ద లాస్ట్ జార్స్'' అనే సినిమాను గుర్తు చేశాయి. వాస్తవానికి తాను రష్యాను ప్రేమిస్తూ, దానికి విధేయునిగా ఉంటున్నప్పటికీ తనను ఎందుకు బంధించారని, నికోలస్ అనే చక్రవర్తి తనను బంధించిన కమ్యూనిస్టులను ప్రశ్నిస్తాడు. ''నీవు రష్యాను ప్రేమించావు కానీ, ప్రజలను కాదని'' ఆయనను బంధించిన వారు సమాధానమిచ్చారు. నేడున్న పాలనా ప్రపంచంలో, తమను ఎన్నుకున్న ప్రజల కోసం మన నాయకుల్లో ఉండే ఈ లక్షణాన్ని అంచనా వేయడానికి బడ్జెట్లు సహేతుకమైన మార్గమేనా?
రెండవ ప్రపంచ యుద్ధం యునైటెడ్ కింగ్డమ్ను నాశనం చేసిన తరువాత, సమాజాన్ని పునరుద్ధరణ చేసే సాధనంగా జాతీయ ఆరోగ్య సేవ(నేషనల్ హెల్త్ సర్వీస్)ను ప్రారంభించారు. భవిష్యత్తు సంక్షేమ రాజ్యాన్ని ఊహిస్తూ, సామాజిక ఆర్థికవేత్త విలియం బెవరిడ్జ్ ''ఐదు పెద్ద కీడులైన కోరిక, వ్యాధి, అజ్ఞానం, మురికి పరిస్థితులు, నిరుద్యోగం'' లాంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాడు. ఒకవేళ భారతదేశ దార్శనికతను అలాంటి భావ వ్యక్తీకరణచే నడిపించాలంటే అప్పుడు విమానాశ్రయాలు, హైవేలు, వేగంగా నడిచే రైళ్ళ కంటే కూడా పౌష్టికాహారం, ఆరోగ్యం, ఉపాధి, విద్య, పర్యావరణ పారిశుధ్యం, పరిశుభ్రతల కోసం పెట్టుబడులలో అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
వాగ్దానాలను నెరవేర్చడం
80 కోట్ల మంది పేదప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించడం, 500 వెనుకబడిన బ్లాకులను అభివృద్ధి చేయడం, ఇళ్ళు, పరిశుభ్రమైన నీరు, మరుగుదొడ్లను విస్తృతంగా సమకూర్చడం వంటి వాటి ద్వారా ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం చాలా సానుకూలంగా వ్యవహరించిందని అనుకోవచ్చు. కానీ ఇవి కేవలం పాక్షికమైన ప్రయోజనాలను మాత్రమే సమకూర్చుతాయి. ఇవి పెరుగుతున్న అసమానతలు అనే సమస్యకు పరిష్కారం చూపించవు. దీనితోపాటుగా దీర్ఘకాలిక, సుస్థిరమైన అభివృద్ధి కోసం, ఉన్నతమైన నాణ్యత గల విద్య, ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారాలను (కేవలం ఆహార ధాన్యాలు మాత్రమే కాక ప్రస్తుతం అందుబాటులోలేని మాంసకృతులు, ఇతర అనుబంధ ఆహార పదార్థాలు) సార్వత్రికంగా విస్తృతపరచడం అత్యంత ఆవశ్యకం. దేశ జనాభాలో అత్యధిక సంఖ్యలో ప్రజలు నిరక్షరాస్యత, అనారోగ్యం లేదా పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే ఆ దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగలేదు. అభివృద్ధి చెందిన అన్ని దేశాలు నేడు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టుతున్నాయి. రోనాల్డ్ రీగన్ యుగం తరువాత, ప్రయివేటీకరణను ప్రోత్సహించేందుకు విద్యలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించిన సందర్భంలో నూతన ఆవిష్కరణలు, శాస్త్రీయ సామర్థ్యం బాగా దెబ్బతిన్నాయని అమెరికాలో అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తన ఆర్థిక వ్యవస్థ బాగా మందగించినప్పటికీ నికరాగ్వా ఆరోగ్యం, విద్యా రంగాలలో పెట్టుబడులు పెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి అభివృద్ధికి సార్వత్రిక విద్య, ఆరోగ్యరంగాలు ప్రధానమైనవనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో మన రాజకీయ నాయకత్వం వైఫల్యం చెందడం ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం.
పైన పేర్కొన్న అంశాలను దృష్టిలో ఉంచుకుంటే... బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది. కోవిడ్-19 కారణంగా 230 మిలియన్ల మంది భారతీయులు నెమ్మదిగా పేదరికంలోకి నెట్టబడ్డారని ఒక అధ్యయనం తెలియజేస్తోంది. యాన్యువల్ స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ఏఎస్ఈఆర్)విద్య ఘోరమైన పరిస్థితిని తెలియజేస్తుంది. అనేకమంది ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు రెండవ తరగతి పాఠ్య పుస్తకాలను చదవలేక పోతున్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో 35.5శాతం మందిలో ఎదుగుదల నిలిచిపోయింది. 32.1శాతం మంది పిల్లలు ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువు ఉన్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయినా విద్య, పౌష్టికాహారానికి బడ్జెట్లో కేటాయింపులు నిలిచిపోయాయి. ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకుండానే మధ్యాహ్న భోజనానికి బడ్జెట్లో 9శాతం కేటాయింపుల్లో కోత విధించారు. ప్రయివేట్ విద్య అందుబాటులో లేకపోవడంతో ప్రయివేటు పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. సంక్రమించడానికి అవకాశంలేని వ్యాధులు, మానసిక ఆరోగ్యం, వృద్ధాప్య సంరక్షణతో వ్యాధుల భారం బాగా పెరుగుతోంది. భారతదేశంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, అందరికీ రోగ నిర్దారణా సౌకర్యాలు, చికిత్సలు అందుబాటులో ఉండడం లేదు.
తప్పుడు అంశాలు
కోవిడ్-19, మూడు ప్రధానమైన తప్పుడు అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఒకటి, ఆర్థిక నష్టాలకు రక్షణ లోపించిన కారణంగా ప్రజల ఆదాయాలు పడిపోయినప్పటికీ, వారు భారీ మొత్తంలో ఖర్చు చేశారు, 70 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారనేది ఒక అంచనా. రెండు, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా అధ్వాన్నమైన పరిస్థితిలో ఉన్న కారణంగా(నివారించడానికి అవకాశం ఉన్నప్పటికీ) భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. మూడు, అవసరానికి తగ్గట్టుగా అన్ని సౌకర్యాలుండి, పని చేస్తున్న జిల్లా ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడం. ఈ సమస్యల పరిష్కారానికి సాహసోపేతమైన భావాలను కలిగి ఉండే సామర్థ్యంతో పాటు వనరులను ఉపయోగించుకోవడం భారతదేశానికి అత్యంత అవసరం.
దీనితోపాటు నియంత్రణ చట్రం(రెగ్యులేటరీ ఫ్రేంవర్క్) యొక్క గందరగోళమైన పరిస్థితిని కూడా మనకు చూపించడం జరిగింది. అనేక చట్టాలలో చాలా ప్రమాదకరమైన బలహీనతలున్నాయి. ఆ చట్టాలు ప్రయోజనాల వైరుధ్యాలను పొందుపరిచాయి. ఆ చట్టాల్లో కొన్నింటిని రద్దు చేయాలి, కొన్నింటిని సవరించాలి. ఎందుకంటే, సరియైన పాలన లేకుండా, ఆరోగ్యాన్ని మార్కెట్ శక్తులకు అప్పజెప్పడం వల్ల విఘాతం కలుగుతుంది. రోగులు ముఖ్యంగా పేదలకు హాని జరుగుతుంది. మన వ్యాధి నిఘా వ్యవస్థను నిర్మించడానికి, ఆకస్మిక వ్యాకులత (షాక్)ను తట్టుకునే శక్తిని బలోపేతం చేయడానికి ప్రజా ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని కూడా కోవిడ్-19 నొక్కి చెప్పింది.
ఈ సమస్యలన్నీ పరిష్కారించడం అత్యవసరం ఎందుకంటే, చెడు లేకుండా పోయిందనే గ్యారెంటీ లేదు. ఆరోగ్య సంరక్షణా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా, దుర్భలత్వాన్ని తగ్గించడం ద్వారా ఇలాంటి సంఘటనలకు వ్యతిరేకంగా తన పౌరులను రక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ పునర్నిర్మాణానికి, శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించేందుకు, ఆరోగ్య భద్రతను విస్తరించేందుకు తగినన్ని నిధులతో కూడిన రాజకీయ నాయకత్వం మనకు అవసరం. 157 నర్సింగ్ కళాశాలలను నిర్మించడం, అసాధ్యమైన జన్యుపరమైన వ్యాధిని ''నిర్మూలించడానికి'' ప్రయత్నించడం మాత్రం నిర్మాణాత్మక సమస్యలకు సమాధానం కాదు.
ధర్మం, న్యాయం అనేవి, ఒక దేశాన్ని నిర్మించడానికి ఒక పౌర పాలనా వ్యవస్థకు దిశానిర్దేశం చేసే విలువలు. విధానాలు, డబ్బు కేటాయింపులు కేవలం రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడతాయి. అవి తాత్కాలికం, స్వల్పకాలికమైనవి కూడా. ఇలాంటి వ్యవస్థలు, నిర్మాణాలు కుప్పకూలినప్పుడు భారీగా నష్టపోయేది పేదలు, అట్టడుగు వర్గాల ప్రజానీకం మాత్రమే. కానీ అలాంటి సందర్భంలో వ్యాధి అందర్నీ సమానంగా చూస్తుంది. కోవిడ్-19 వ్యాప్తి కాలంలో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్లేక అనేక మంది ధనవంతులు కూడా మరణించారు. అప్పుడు మనం చెల్లించిన మూల్యం, నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యరంగాన్ని నిర్లక్ష్యం చేయడం, పెట్టుబడులను తిరస్కరించడం వల్ల తీవ్రమైన దుష్పరిణామాలు సంభవిస్తాయి.
(''ది హిందూ'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
- కే.సుజాతారావు