Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మత నాయకులారా! మా అడ్డు తొలగండి.' ఇప్పుడు ఈ నినాదం మత రాజ్యం ఇరాన్లో దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తున్నది.
ఇరాన్లో రాజరికం కుప్పకూలి 44ఏండ్లు కావస్తున్నది. 1979లో ఇరాన్రాజు షా మహమ్మద్ రెజా పెహ్లావి రాజరికం కూలిపోయిన తర్వాత అయితుల్లా ఖొమైనీ నాయ కత్వంలో అక్కడ ఇస్లామిక్ మత ప్రభుత్వం ఏర్పడింది.
ఆసియా ఖండంలో ఇరాన్ ఓ మధ్య ప్రాచ్యదేశం. జనాభా దాదాపు ఏడుకోట్లు. గతంలో ఇరాన్‌ను పర్షియా అని కూడా పిలిచేవారు. ఇరాన్ పేరుకు అర్థం స్థలి ఆర్యన్. అంటే ఆర్యభూమి.
ఇప్పుడు ఆ దేశంలో ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం. గతంలోని మత రాజరికం కన్నా ఏ విధంగానూ మెరుగైనది కాదని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గత నాలుగైదు నెలలుగా ఇరాన్లో ప్రజల నిరసనాగ్రహ జ్వాలలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి.
గత సెప్టెంబర్‌లో 'మహసా ఆమినీ' అనే యువతి హిజాబ్ వస్త్రధారణ సరీగా పాటించలేదనే నెపంపై ఆమెను పోలీసులు నిర్బంధించారు. ఆ నిర్బంధంలో చిత్రహింసలు పెట్టిన కారణాన ఆమె మరణించడంతో ప్రజా నిరసన మిన్నంటింది. ఆ నిరసనను అణగదొక్కాలనే కాంక్షతో ప్రభుత్వం రకరకాల నిరంకుశ చర్యలకు ఒడికట్టింది. నిరసన చెలరేగుతున్న ప్రాంతాలను గుర్తించి అంతర్జాల (నెట్) సౌకర్యాన్ని బంద్ చేసింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. ఉద్యమ శీలురుపై పోలీసుల దమనకాండ నిత్యకృత్యమైపోయింది. బలైపోతున్నది, బాధలు పడుతున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. అయినా హిజాబ్ వస్త్రధారణను బాహాటంగా ఉల్లంఘిస్తూ సివంగిల్లా యువతులు రుద్రనేత్రలై కదలడం ప్రభుత్వ అధికారులకే కాదు మత ఛాందసులకు మింగుడు పడలేదు.
మహిళల జీవితం మహిళలదే! మతం ముసుగులో మగ పెత్తనం ఏమిటి? మహిళలకు స్వేచ్ఛ కావాలి? నియంతలు నశించాలి. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు లేవా? మగవాళ్ళు ఎక్కువేంటి? ఆడవాళ్ళు తక్కువేంటి. ఇలాంటి నినాదాలకు అక్కడి మహిళాలోకంతో పాటు ప్రజాస్వామ్య వాదులూ గళం కలుపుతున్నారు. ఇప్పుడు ఈ నినాదాలు విద్యాసంస్థల్లో కూడా వ్యాపిస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి.
ఇటీవల ఫ్రాన్స్‌లోని స్ట్రాన్బర్గ్ నగరంలో ఇరాన్ నిరసన కారులకు సంఘీభావంగా వేలాదిమందితో ప్రదర్శన జరిగింది 3కానిక్ ఈఫిల్ టవర్కూడా ఆ ఉద్యమంలో భాగమైంది. మద్దతుదారులు ఈఫెల్ టవర్‌ను విద్యుత్ కాంతులతో నింపివేసారు. వుమెన్ లైఫ్ ఫ్రీడం - స్టాప్ ఎగ్జిక్యూషన్ ఇన్ ఇరాన్ (మహిళకు కావాలి స్వేచ్ఛా జీవితం, ఇరాన్లో అణచివేత చర్యలు ఆపండి) అన్న నినాదాలు మిన్నంటాయి. ఇదంతా ట్విటర్ ద్వారా వైరల్ అయింది.
ఈ ఉద్యమంలో ఇరాన్ ప్రభుత్వనేత అయితుల్లా ఖొమైనీని ధిక్కరించడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే 'మత నాయకులారా! మాకు అడ్డుతొలగండి' అనే నినాదం సార్వజనీనమైన నినాదంగా ముందుకొచ్చింది.
ఇరాన్ ప్రభుత్వం మహిళలను ఇప్పటికే రెండవ శ్రేణి పౌరులుగానే గుర్తించడం ఎంత దారుణం? వారిని పాలకులు సక్రమంగా ఎదగనివ్వడం లేదు. బాలికలను చదువుకోనివ్వడం లేదు. ఇష్టమైన వృత్తిని, జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను యువతులకు ఇవ్వడం లేదు. దాంపత్యం నరకప్రాయమైనప్పుడు విడాకులు తీసుకునే స్వేచ్ఛ ఆ మహిళకు లేదు. ఇక వస్త్రధారణ విషయంలో అయితే అటు ప్రభుత్వ ఆధిపత్యాన్నే కాదు మత ఛాందస మూక వేధింపులను ఆ మహిళా లోకం ఎదుర్కొవలసి వస్తున్నది.
ఆప్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ఆంక్షలు అక్కడి మహిళాలోకం ఎలా ప్రతిఘటిస్తున్నదో, ఇరాన్లో కూడా ఇప్పుడు జరుగుతున్న ఘటన అదే తీరులో ఉంటున్నది. అణచివేత ఎక్కువైనప్పుడు ప్రతిఘటన అనివార్యమనే సత్యం ఎల్లెడలా తెలుస్తున్నది.
ఇరాన్ పరిణామాల పట్ల నెదర్లాండ్స్ గామాన్ సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. దాదాపు రెండు లక్షల మంది ఇరాన్ మహిళల అభిప్రాయాలు సేకరించింది. వారంతా ఇస్లామిక్ ప్రభుత్వ పాలనను తెగనాడుతున్నట్టు సంస్థ తెలిపింది. అలాగే ఇరాన్ ప్రజల అంతర్జాతీయ సంస్థ కూడా ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నది. తమకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా కూడా కుట్ర పన్నుతున్నట్టు ఇరాన్ ప్రభుత్వం మరో పక్క ఆరోపిస్తున్నది.
పశ్చిమాసియాలో పెల్లుబికే ప్రజా ఉద్యమాలు ఆయా దేశాల ప్రభుత్వాలను గద్దెదింపడంలో కీలకపాత్ర వహిస్తాయనేది రాజకీయ పరిశీలకుల భావన. 2019-20లలో లెబనాన్, అల్జీరియా, ఇరాక్, సుడాన్లలో ఆ ప్రభుత్వాలు కూలిపోవడానికి ప్రజా ఉద్యమాలే ముఖ్యకారణం అని వారంటున్నారు. అందుకే ఇరాన్లో ఆరని కుంపటిలా రగులుకుంటున్న ప్రజా ఉద్యమం స్వభావం తెలుసుకునేందుకు గట్టిప్రయత్నం చేస్తున్నారు.
వెన్వెంటనే సమూలమైన మార్పులు రాకపోవచ్చు. కానీ ఉద్యమ తీవ్రత ప్రభావం త్వరగా సమసిపోతుంది అని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే ఇది తరతరాల అణచివేత, 80శాతం మంది మహిళలు ప్రస్తుత ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఉండాల్సిన అవసరం లేదని నిర్ద్వందంగా చెప్పినట్టు ఆ సర్వే పేర్కొన్నది. అలాగే విదేశాల్లోని 99శాతం ఇరానియన్లు ఇస్లామిక్ రిపబ్లిక్‌ను వ్యతిరేకిస్తున్నారు. ప్రజా నిరసనోద్యమాల్లో న్యాయం ఉంటుందని, సమానత్వం హక్కులు ఉంటాయని, మార్పు తప్పదని, ప్రజాస్వామ్య వాదులు భావిస్తున్నారు. 'ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది' అని చెప్పిన మహాకవి గురజాడ దార్శనికత ఇదే కదా!
-కె. శాంతారావు
9959745723