Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియ సఖీ!
నీకై యోచిస్తూ
గడియైనా సడిచేయని ఘడియన
మబ్బులు కమ్మిన ఆకాశంలో
జాబిల్లి జాడలు వెతుకుతున్న నాకు
నిశ్శబ్దం నిజంగా ఒక శాపమయ్యింది.
నిను గూర్చిన ఆశలు ఎదకమలంలో
తుమ్మెదలైపోతోంటే
ఎద భారంకాగా,
చలిగాలి సైతం చమటలు పట్టిస్తోంది
ఈ వెన్నెల రాత్రిలో.
అదేంటో...
నాలోని ఎన్నో ఆలోచనల మధ్య
అకస్మాత్తుగా నువ్వొచ్చేస్తావు,
మనోరంజకమైన
నీ పిలుపు వినిపిస్తుందని
వేచిచూసే మనసుకు... అంతలోనే
అది సాధ్యం కాదని గుర్తొచ్చి
గొంతు తడారిపోతుంటుంది,
ఎగసిన కనురెప్పల తడి
ఉప్పెనల జడి సష్టిస్తుంది.
ఆహ్లాద శుభోదయమే కాదు,
సంధ్య కెంజాయలోనూ
నా అస్తిత్వ చిరునామా నీవేనంటూ
నీ అనురాగం పొదిగిన ముత్తెపునవ్వులు
నాపై కురిపించి,
వలపులు రంగరించిన విరితూపులు
నాపై సంధించి,
శిశిరమెరుగని వసంతగానమై
నా మదినల్లుకుపొమ్మని
నేనెంతగ నిను వేడుకున్నా
సంతసాల సౌరభాలను తొలుస్తూ,
నాలో వేదనల
కుంపటి రగులుస్తూ దూరమయ్యావు.
తెరచాపలాంటి నీవు లేని
నా ఈ జీవన పయనం
ఏ దరికి చేరుతుందో తెలియక
ఏడ్చి ఏడ్చిన నా హదయానికి సేదతీర్చ
నువ్వో ముందడుగు వేసి,
నీకూ నాకూ మధ్య ఉన్న
పరదా తొలగించి
శిశిరమై మోడువారిన నా ఎదలో
అనురాగసుధలూరిస్తూ దరిచేరవా!
- వేమూరి శ్రీనివాస్
9912128967