Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వియత్నాం! స్వాతంత్య్రం, మూడు సామ్రాజ్యవాద దేశాల కబంధహస్తాల నుంచి విముక్తి కోసం మూడున్నర దశాబ్దాల పాటు అపార రక్తం ధారపోసి, త్యాగాలు చేసిన ఒక చిన్న దేశం. ఇలాంటిది ప్రపంచంలో మరొకటి లేదు. ఖండాలన్నింటినీ తన చెప్పుచేతల్లో ఉంచుకొనేంత బలం కలిగిన అమెరికా సేనలను ప్రాణాలు దక్కితే చాలు బతుకుజీవుడా అంటూ పారిపోయేట్లు చేసి ప్రజాశక్తితో ఎంత పెద్ద మిలిటరీనైనా మట్టికరిపించవచ్చు అని నిరూపించిన దేశం కూడా అదే!! అలాంటి వీర గడ్డకు చెందిన గుయన్ థీ ధాన్ (62) వేసిన కేసును తొలిసారిగా విచారించిన దక్షిణ కొరియా కోర్టు వియత్నాంలో మారణకాండకు దక్షిణ కొరియా మిలిటరీ కారణమని ఫిబ్రవరి మొదటి వారంలో సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఫ్రెంచి వలసగా ఉన్న వియత్నాంను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఆక్రమించింది. అది పతనమైన తరువాత తిరిగి ఫ్రాన్స్ ఆక్రమణలోకి వెళ్లింది. దాన్ని ఓడించిన తరువాత అమెరికా రంగంలోకి దిగి ఉత్తర వియత్నాంలోని సోషలిస్టు సమాజాన్ని, కమ్యూనిస్టులను, దక్షిణ వియత్నాంలోని జాతీయవాదులు, కమ్యూనిస్టులను అణచేందుకు చూసింది. దానికి మద్దతుగా తైవాన్‌లో తిష్టవేసిన చాంగ్‌కై షేక్ మిలిటరీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లావోస్, కంపూచియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, దక్షిణ వియత్నాం మిలిటరీలు వచ్చాయి. ఉత్తర, దక్షిణ వియత్నాంలలోని కమ్యూనిస్టులకు మద్దతుగా చైనా, సోవియట్ యూనియన్, ఉత్తర కొరియా, లావోస్, కంపూచియాల్లోని కమ్యూనిస్టు గెరిల్లాలు బాసటగా నిలిచారు.
వియత్నాంలో అమెరికా కూటమి జరిపిన మారణకాండకు గురికాని గ్రామం, పట్టణం లేదంటే అతియోక్తి కాదు, ప్రతి చెట్టూ, పుట్ట, రాయి, రప్ప దేన్ని కదిలించినా దుర్మార్గాలు-వాటికి ప్రతిగా పోరులో ప్రాణాలర్పించిన వారి కథలు, గాధలు వినిపిస్తాయి. అతివల కన్నీటి ఉదంతాలు కోకొల్లలు. అలాంటి మారణకాండలో ఏడు సంవత్సరాల ప్రాయంలో గాయపడి కోలుకున్న గుయన్ థీ ధాన్ అనే 62ఏండ్ల మహిళ 2020లో వేసిన కేసులో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఒక కోర్టు తీర్పునిచ్చింది. దక్షిణ కొరియా మిలిటరీ జరిపిన దారుణంలోనే ఆమె గాయపడిందని చెప్పటమే గాక, కేసులో ప్రభుత్వం చేసిన వాదనలన్నింటినీ తోసి పుచ్చి ఆమెకు మూడు కోట్ల వన్లు (24వేల డాలర్లు) నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దీని మీద ప్రభుత్వ అప్పీలు చేస్తుందా? మరొకటి చేస్తుందా అన్నది వెంటనే వెల్లడి కాలేదు. ఫాంగ్ హట్ సమీపంలోని ఫాంగ్ నీ అనే వియత్నాం గ్రామంలో 1968 ఏప్రిల్ 12న దక్షిణ కొరియా మిలిటరీ మూకలు నిరాయుధులైన పౌరులపై అకారణంగా జరిపిన కాల్పుల్లో 70మంది మరణించగా 20మంది గాయపడ్డారు. వారిలో గుయన్ థీ ధాన్ ఒకరు. ఆ ఉదంతంలో అమెతల్లి, సోదరుడితో సహా కుటుంబంలోని ఐదుగురు మరణించారు. ఈ ఉదంతం గురించి అమెరికా మిలిటరీ రికార్డులలో నమోదు చేశారు. ఒక దక్షిణ కొరియా మిలిటరీ జవాను గెరిల్లాల కాల్పుల్లో గాయపడిన తరువాత ఈ ఉదంతం జరిగినట్లు పేర్కొన్నారు. అంటే గెరిల్లాలనేమీ చేయలేక సాధారణ పౌరుల మీద కక్ష తీర్చుకున్నట్లు స్పష్టం అవుతున్నది. ఈ దారుణానికి ఒడిగట్టిన తరువాత గెరిల్లాల దాడికి భయపడి సైనికులు పారిపోయినట్లు అమెరికా రికార్డుల్లో ఉంది.
దశాబ్దాల పాటు సాగిన దుర్మార్గం, దాన్ని ప్రతిఘటిస్తూ సాగిన పోరులో మరణించిన వారి కచ్చితమైన సంఖ్యలు అందుబాటులో లేవు. అనేక మందిని అంతర్థానం చేశారు, మిలిటరీ మరణాలను దాచారు. వియత్నాం పోరును రెండు భాగాలుగా చూడవచ్చు. 1945లో జపాన్ దురాక్రమణ నుంచి తిరిగి ఫ్రాన్స్ ఆక్రమించిన తరువాత 1954 జూలై 21వరకు ఒకటి, తరువాత జరిగిన పరిణామాలను రెండో అంకంగా చెబుతున్నారు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా సమాచారం ప్రకారం 1945 నుంచి 1954వరకు ఫ్రెంచి సామ్రాజ్యవాదులతో కమ్యూనిస్టు నేత హౌచిమిన్ తదితరుల నేతృత్వంలో సాగిన పోరును చరిత్రకారులు తొలి ఇండోచైనా వార్‌గా పిలిచారు. ఈ పోరులో కమ్యూనిస్టు గెరిల్లాలు, సాధారణ పౌరులు మూడు నుంచి ఐదులక్షల మంది వరకు ప్రాణాలర్పించారు. ఫ్రెంచి దళాలు, వారితో చేతులు కలిపిన స్థానికులు, కొద్ది మంది ఫ్రెంచి పౌరులు మొత్తం 92 నుంచి లక్షా పదివేల మంది వరకు మరణించారు. ఈ పోరు ముగింపు మరొక కొత్త పరిణామాలకు నాంది పలికింది. జెనీవాలో కుదిరిన ఒప్పందం ప్రకారం వియత్నాంను ఉత్తర-దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తరవియత్నాం కమ్యూనిస్టుల ఆధీనంలోకి వచ్చింది. రెండు సంవత్సరాల్లో దక్షిణ వియత్నాంలో ఎన్నికలు జరిపి రెండు ప్రాంతాల విలీనం జరపాలని దానిలో ఉంది. ఆ ఒప్పందం ప్రకారం ఎన్నికలు జరిగితే దక్షిణ వియత్నాంలో ఫ్రెంచి అనుకూల శక్తులు ఓడిపోవటం ఖాయంగా కనిపించింది. దాంతో ఆసియాలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికన్లు ఫ్రాన్స్ స్థానంలో ప్రవేశించి విలీనాన్ని అడ్డుకున్నారు. దక్షిణ వియత్నాంలోని దేశభక్తులు, కమ్యూనిస్టులు వియట్‌కాంగ్ పేరుతో ఒక దేశభక్త సంస్థను ఏర్పాటు చేసి అమెరికా, స్థానిక మిలిటరీ నుంచి విముక్తికోసం పోరు ప్రారంభించారు. దానికి ఉత్తర వియత్నాం పూర్తి మద్దతు ఇచ్చింది. అది 1975 ఏప్రిల్ 30వరకు సాగింది. అమెరికా దళాలు అక్కడి నుంచి పారిపోయాయి.
దాడుల్లో 30లక్షల మంది అమెరికా సైనికులు పాల్గొన్నారు. దాడుల్లో అక్కడికక్కడే లేదా గాయాలు తగిలి చచ్చిన వారు గానీ 58,220 మంది, వీరుగాక దక్షిణ వియత్నాం కీలుబొమ్మ మిలిటరీ రెండు నుంచి రెండున్నరలక్షల మంది, మొత్తంగా మరణించిన వారు 3,33,620 నుంచి 3,92,364 మంది ఉంటారని లెక్క. ఈ కూటమికి చెందిన పదకొండు లక్షల మంది సైనికులు గాయపడ్డారని అంచనా. కమ్యూనిస్టు వియత్నాం మిలిటరీ, గెరిల్లాలుగానీ పదకొండు లక్షల మంది ప్రాణాలర్పించారు. అమెరికా దాని తొత్తుల దాడుల్లో ఇరవైలక్షల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంచనా.
దక్షిణ వియత్నాంలో అమెరికా జరుపుతున్నదాడులకు తోడుగా దక్షిణ కొరియా మూడు లక్షల 20వేల మంది సైనికులను అక్కడకు పంపింది. వారు అమెరికన్లతో కలసి లక్షల మందిని చంపారు. దాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ఇంతవరకు అంగీకరించలేదు. ఈ దారుణం తరువాత మై లాయి అనేచోట అమెరికా మిలిటరీ ఇలాంటి ఊచకోతకే పాల్పడి పెద్ద సంఖ్యలో చంపింది. విమానాలు, మిలిటరీ శకటాలతో అమెరికా దాడి జరపగా గెరిల్లాలు భౌగోళిక అనుపానులు ఎరిగి ఉన్నందున తప్పించుకొని శత్రువులను దెబ్బతీశారు. వారికి తినేందుకు తిండి కూడా లేని స్థితిలో ఆహారాన్ని కూడా పరిమితంగా తీసుకొంటూ పోరు జరిపారు. అనేక రోజులు పస్తులు కూడా ఉన్నారు. సరైన పడకలు, నిదురలేని రోజులు అనేకం. సొరంగాలు తవ్వి రక్షణ తీసుకోవటమే గాక అమెరికా మిలటరీ మీద దాడి చేసి అడవుల్లో కనిపించకుండా తప్పించుకొన్నారు. ఇదంతా ఒక రోజు, ఒకనెల, ఏడాది కాదు పందొమ్మిది సంవత్సరాల పాటు పోరాడారు.
మై లాయి మారణ కాండ అమెరికా దుష్ట చరిత్రలో చెరగని మచ్చ. ఇలాంటి అనేక దారుణాలు జరిపిన అమెరికా, ఫ్రాన్స్, అంతకు ముందు జపాన్ జరిపిన దారుణాలను ఇప్పటికీ ఆ ప్రభుత్వాలు అంగీకరించటం లేదు. మరోవైపు మానవహక్కులు, మన్నూ అంటూ ప్రపంచానికి కబుర్లు చెబుతున్నారు. మై లాయిలో మరతుపాకులతో అమెరికన్లు జనాలను ఊచకోత కోశారు. విలియం కాలే అనే లెప్టినెంట్ నాలుగు గంటల పాటు ఆ మారణకాండను పర్యవేక్షించాడు. వందలాది మహిళల మీద లైంగిక దాడులు జరిపి నరికి చంపటంతో పాటు రెండు వందల మంది పిల్లలతో సహా 504మందిని చంపారు. వారందరినీ గోతుల్లో దించి ఎటూ వెళ్లకుండా మరతుపాకులతో కాల్చి చంపారు. ఈ ఉదంతాన్ని తరువాత కాలంలో అమెరికా మిలిటరీలో పాఠంగా చెప్పారంటే దుర్మార్గాలను ఎలా జరపాలో శిక్షణ ఇచ్చారన్నది స్పష్టం. వైమానిక దళ మేజర్ లాగాన్ సిషన్ పాఠాలు చెబుతూ మనం వారిని హీరోలుగా పరిగణించవచ్చని, మై లాయిలో ఎవరైనా హీరోలు ఉంటే వారే అని చెప్పాడంటే ఎంత దుర్మార్గంగా ఉంటారో వేరే చెప్పనవసరం లేదు. ఆ మారణకాండ జరిపినప్పుడు జనం మీదకు హెలికాప్టర్‌ను తోలిన ముగ్గురు పైలట్లను మూడు దశాబ్దాల తరువాత హీరోలుగా అమెరికా సత్కరించింది. విలియం కాలే మీద తప్పనిసరై విచారణ జరిపి శిక్ష వేశారు. తరువాత దాన్ని గృహనిర్బంధంగా మార్చారు, అది కూడా మూడున్నర సంవత్సరాల తరువాత వదలివేశారు. ఇలాంటి దుర్మార్గులను వదలివేసిన కారణంగానే తరువాత 2005లో ఇరాక్‌లోని హడితా అనే చోట అమెరికా ముష్కురులు మహిళలు, పిల్లలతో సహా 24మంది పౌరులను ఊచకోత కోశారు. దానికి ఒక్కడిని బాధ్యుడిగా చేసి మందలించి వదలివేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా అమెరికన్లు ఇలాంటి దుర్మార్గానికే పాల్పడ్డారు.
వియత్నాంలో దక్షిణ కొరియా మిలిటరీ దుర్మార్గాన్ని కోర్టు నిర్థారించిన తరువాత కొరియాను ఆక్రమించినప్పుడు జపాన్ చేసిన దుర్మార్గాలను కూడా విచారించాలని, వాటిని జపాన్ అంగీకరించాలని దక్షిణ కొరియన్లు కొందరు ప్రదర్శన జరిపి డిమాండ్ చేశారు. జపాన్ సైనికులకు కొరియా మహిళలను బానిసలుగా మార్చి రాత్రుళ్లు బలవంతంగా అప్పగించి బలిచేశారు. వారిని ''సుఖ మహిళలు''గా అభివర్ణించి దుర్మార్గానికి పాల్పడ్డారు. జపాన్ మాదిరి అక్రమాలు జరగలేదని బుకాయించకుండా మానవ హక్కుల పట్ల గౌరవం ఉన్నదిగా కొరియా నిరూపించుకోవాలని కూడా వారు కోరారు. దక్షిణ కొరియా క్రైస్తవ మతాధికారులు కూడా వియత్నాం బాధితులకు క్షమాపణలు చెప్పారు. వియత్నాంలో మారణకాండతో పాటు అమెరికా జరిపిన మరొక దుర్మార్గం ఏమంటే ఏజెంట్ ఆరెంజ్ పేరుతో రసాయన దాడులకు కూడా పాల్పడింది. దీని వలన భూమి, నీరు కలుషితం కావటంతో జనాలు అనేక రుగ్మతలకు గురికావటం, పంటలకు దెబ్బతగిలింది.అమెరికా జరిపిన ఈ దాడి వలన తమకు జరిగిన నష్టాన్ని పూడ్చాలంటూ కొన్ని కేసులను దాఖలు చేశారు. దీని బాధితులకు కూడా న్యాయం చేయాలి. మరి ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ గురించి కబుర్లు చెప్పే అమెరికా, ఫ్రాన్స్, జపాన్ ఇండోచైనా దేశాలు, కొరియన్లకు క్షమాపణ చెప్పటమే కాదు, నష్టపరిహారం చెల్లిస్తాయా!
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288