Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిష్యుడు: చూశారా చూశారా గురువుగారూ.. 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అన్న చందాన ఇప్పుడిక కేంద్రం సరాసరి బిబిసి వార్తా సంస్థపైనే ఇన్కంటాక్స్ దాడులు చేయిస్తుంది. పైగా అవి దాడులు కాదు ఉత్తుత్తి సర్వేలే అని అబద్దాలు ఆడుతుంది. ఎంతనాటకం?
గురువు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇరకాటంలో పడి గందరగోళానికి లోనవుతున్నట్టు నీ మాటలే చెపుతున్నాయి శిష్యా. ప్రజాస్వామ్యంలో కక్షసాధింపు చర్యలు సమర్థనీయం కాదు. ఎంతటి నేతలైనా ప్రజల మేలుకోరి తమ తప్పులను, లోపాలను సరిదిద్దుకోవాల్సిందే.
శిష్యుడు: ఈ ఐటీ దాడులను మీరు కక్షసాధింపు చర్యలు అని ఎలా చెప్పగలుగుతున్నారు?
గురువు: ఇందులో రహస్యం ఏముంది. 2002 గుజరాత్లో జరిగిన నరమేధంపై సుప్రీంకోర్టు ప్రధాని మోడీకి క్లీన్చిట్ ఇచ్చాక, ఇప్పుడు ఇలా అభండాలు... అదీ ఒక విదేశీ వార్తా సంస్థ, ఆనాటి వార్తా కథనాలను మరల తెరమీదకు తీసుకురావడం ఏమిటి?' అని బీజేపీ మండిపోతున్నది.
శిష్యుడు: పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది కదండీ.
గురువు: వేరే చెప్పాలా. 'ఇండియా', ది మోడీ క్వచ్చిన్ పేరిట రెండు భాగాలుగా బిబిసి డాక్యుమెంటరీలు తాజాగా విడుదల చేసింది. ఆ నరమేధంలో కచ్ఛితంగా మోడీ పాత్ర ఉందని బిబిసి తేల్చేసింది. మోడీ గూడుపుఠాణిని, గూడుకట్టిన మత విద్వేషాన్ని నిర్ద్వందంగా ఎండగట్టింది. ఇది తట్టుకోలేకనే ఇప్పుడీ దాడులు. ఇంతకు ముందు ఈ బిబిసి డాక్యుమెంటరీలను ట్విటర్ వంటి వేదికల ద్వారా ప్రచారం కావడాన్ని నిషేధించింది బీజేపీ.
అయితే ఈ సాంకేతిక యుగంలో ఇలాంటి పప్పులేవీ ఉడకవని త్వరలోనే తెలుసుకుంది. ఆ డాక్యుమెంటరీలు చూడవద్దని నిషేధింపులు, హెచ్చరికలు పెచ్చరిల్లిన కొద్దీ, వాటిని సామూ హికంగా చూడటం తమ హక్కుగా భావించింది ప్రజానీకం. ముఖ్యంగా విద్యార్థిలోకం, ఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీ, బెంగాల్ జాదవ్పూర్ యూనివర్సిటీ తదితర విశ్వవిద్యాలయాల్లో సామూహికంగా తిలకించి మోడీకి ప్రతిసవాలు విసిరింది.
శిష్యుడు: ఆ... ఆ... ఇంత తతంగం జరిగిందా గురువుగారూ...
గురువు: లేకపోతే ఏమిటి శిష్యా. గతంలోనే గుజరాత్ నరమేధంపై ఎన్నో నివేదికలు వచ్చాయి. నిజ నిర్ధారణలు జరిగాయి. ప్రగతిశీల మేధావి వర్గానికి ఇదంతా తెలిసిందే. అయితే ఇప్పుడు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధాని అయిన మోడీని నిట్టనిలువునా బోనులో నిలబెట్టి దోషిగా చూపడమే బీజేపీకి మింగుడు పడటం లేదు. మరో ప్రక్క మోడీని ఆకాశానికి ఎత్తిన గోదీ మీడియా ప్రచారం అంతా పటాపంచలైంది.
శిష్యుడు: అదా సంగతి.
గురువు: శిష్యా! మనం ఎప్పుడూ మీడియాను రెండు విధాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి పాలకవర్గాలకు భజన చేసే మీడియా. రెండు, ప్రజల పక్షాన నిలబడి పాలకవర్గాన్ని ప్రశ్నించే మీడియా. అందుకే సర్వేపేరుతో జరుగుతున్న ఈ దాడుల్ని భారత ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. అధికారపార్టీ అక్రమ చర్యలను విమర్శించే మీడియాను ప్రభుత్వం వేధిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొంది. భారత్ ప్రెస్ క్లబ్ అయితే మీడియాను బెదిరించడానికి అధికార దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. అలాగే జర్నలిస్ట్ ప్రొటెక్ట్ కమిటి, రిపోర్ట్స్ వితౌట్ బోర్డర్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఈ దాడుల్ని తప్పుపడుతున్నాయి.
శిష్యుడు: కోతిపుండు బ్రహ్మ రాక్షసి అయిందన్న మాట.
గురువు: అన్నమాట కాదు. ఉన్నమాటే. అంతులేని అదాని ఆర్థిక మహాకుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే దర్యాప్తు చేయించాలని ఒక ప్రక్క మేం డిమాండ్ చేస్తుంటే, పార్లమెంటు వెలుపల బీజేపీ ప్రభుత్వం మరోప్రక్క ఇలా బిబిసిపై దాడులు చేయిస్తున్నదని ప్రతిపక్షాలు విమర్శించాయి. విపక్షాలపైనా, మీడియాపైనా ఇలా కక్షపూరిత దాడులు జరిగితే ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుందని ఆందోళన వెలిబుచ్చాయి, ప్రశ్నించాయి.
శిష్యుడు: అలానా గురువుగారు. చెప్పండి.. చెప్పండి..
గురువు: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రధాని అదే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా వ్యవహరించడాన్ని ఇప్పుడు యావత్ ప్రపంచం స్పష్టంగా తిలకిస్తున్నది. మోడీ కళంకిత చరిత్రలో ఈ బిబిసిపై దాడి మరో నిరంకుశ పర్వం అయింది.
శిష్యుడు: ఎలా.. ఎలా... ఎలా...
గురువు: బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అనే బిబిసి వార్తా సంస్థ ఈ నాటిది కాదు. దాదాపు వందేండ్ల చరిత్ర దానికి ఉన్నది. విశ్వవ్యాప్తంగా విశ్వసనీయత ఉన్న వార్తా సంస్థ. ప్రపంచ మంతటా ఏభైకోట్లకు పైగా పాఠకులు, శ్రోతలు, వీక్షకులు బిబిసికి ఉన్నారు. ఏదేశంలో లేనంతగా మన దేశంలోనే ఆరున్నర కోట్లమంది ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ ఉన్నది. బిబిసిలో ప్రచారమైంది నిజమైన నిఖార్సైన వార్త అనే అభిప్రాయం ఎల్లెడలా ఉన్నది. అందుకే సత్య నిష్టా గరిష్టులు ఏనాటి నుండో ఒక లోకోక్తిని ఉటంకిస్తున్నారు.
శిష్యుడు: ఏమని?
గురువు: 'వార్త లందు ధరణి వర్థిల్లు' అని.
- కె శాంతారావు
9959745723