Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉంటే వ్యవసాయానికి పశుసంపద వెన్నెముకగా ఉంది. తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ అధ్యయనం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2023 నాటికి మూడు కోట్ల యాభై లక్షల పశు సంపద ఉంటుందని అంచనా. రాష్ట్రంలో 70శాతం జనాభా వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. పాడి పశువుల పెంపకం చిన్న, సన్నకారు రైతులకు అదనపు ఆదాయ వనరుగా ఉండగా నిరుపేద కూలీలకు ప్రధాన జీవనోపాధి కల్పిస్తోంది. నేడు రాష్ట్రంలో సుమారు 29లక్షల కుటుంబాలు పశుపోషణ పై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు.
పశు సంవర్థకశాఖ ప్రధాన ఉద్దేశం సమస్త మానవాళికి బలవర్థకమైన ఆహారంగా పాలు, గుడ్లు, మాంసం అందించడం. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చేపట్టడం ద్వారా పేద, నిరుపేదలకు సంవత్సర మంతా నిలకడైన ఆదాయం లభించేలా చూడటం. ఇందుకోసం గ్రామ స్థాయిలో ఉత్పత్తి దారుల సంఘాలను ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతులలో పశుపోషణ చేపట్టి, అదనపు ఉత్పత్తిని సాధించడం ప్రభుత్వ లక్ష్యం.
జాతీయ వ్యవసాయ కమిషన్ సూచనల ప్రకారం ప్రతీ ఐదువేల పశువులకు ఒక వెటర్నరీ ఉండాల్సి ఉండగా మన రాష్ట్రంలో ఇరవై వేల పశువులకు కూడా లేదు. పశువైద్యం అందుబాటులో లేక రైతులు అవస్థలు పడుతున్నారు. చాలా గ్రామాలలో పశువుల ఆరోగ్యానికి సంబం ధించిన సూచనలు, సలహాలు అందుబాటులో లేక పశువులు వ్యాధుల బారినపడి మృత్యువాత పడుతు న్నాయి. దీన్ని నివారించి పశువులకు క్షేత్ర స్థాయిలో ప్రాథమిక వైద్యం అందించడానికి స్వయం సహాయక బృందాలలో చురుకుగా ఉన్న మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి రైతుల ఇంటి ముంగిటే పశు వైద్య సేవలు అందిచడానికి ప్రభుత్వం కేంద్ర గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులతో సెర్ప్ సంస్థ ద్వారా పశుమిత్రలను నియమించింది.
దేశంలో వ్యవసాయ సంబంధిత ఆర్థికాభివృద్ధిలో ప్రముఖమైన పశు సంపదకు గ్రామ స్థాయిలో పశుమిత్రలు నిరంతరం అందుబాటులో ఉంటారు. వీరు వెనుకబడిన సామజిక తరగతుల పేద మహిళలు. మూగ జీవాలకు కండ్లు, ముక్కు, నోటి నుండి నీరు కారుట, ముట్టి తడి ఆరిపోయి ఉండుట, కుడితి తాగకపోవుట, మేత మేయక పోవుట, నెమరవేయకుండుట, పేడ పలుచగా ఎక్కువ సార్లు వేయుట వంటి లక్షణాలను ఎంతో నైపుణ్యంతో గుర్తించడం తోపాటు పురుగులు పడి చీము నెత్తురు కారుతున్న పశువులను అదుపులోనికి తెచ్చుకొని వాటి గాయాలకు ప్రాథమిక వైద్యం చేస్తారు. పశువులకు సోకే ఇరవై రకాల వ్యాధులకు, వైరస్లకు వ్యాక్సిన్లు వేస్తూ ప్రథమ చికిత్స చేస్తారు. వైద్యం చేస్తున్న క్రమంలో వాటి దాడులకు గురవుతూ, పశు వైరస్లు అంటుకొని అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత గల పని చేస్తున్న పశుమిత్రలకు ఎలాంటి వేతనం లేదు. గుర్తింపు కార్డులు లేవు. ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం లేదు. ప్రమాద బీమాలేదు. యూనిఫాం లేదు. ఇతర మౌలిక సదుపాయాలు లేకుండా ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకోవడం దుర్మార్గం. దేశ ప్రజలందరికీ ఉపాధి చూపవలసిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి స్కీమ్ వర్కర్ల పేరిట కార్మికుల శ్రమను దోచుకోవడం బాధ్యతా రాహిత్యం. ఇతర స్కీమ్ వర్కర్లకు ఇస్తున్నట్టుగా పశుమిత్రలకు కూడా వేతనం నిర్ణయించి బడ్జెట్ కేటాయించాలి.
రైతులకు సబ్సిడీ మీద పశువులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం పశువుల ఆరోగ్య పరిరక్షణ చేస్తున్న పశుమిత్రలకు వేతనం ఇవ్వకుండా రైతుల వద్దనే సేవా రుసుం వసూలు చేసుకోమనడం సరైందికాదు. ఇది రైతుల నెత్తిన భారం మోపడమే. 'ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అంటున్న ముఖ్యమంత్రి రైతుపై భారం మోపకుండా, పశుమిత్రల పనిని గుర్తించి పనికి తగిన వేతనం చెల్లించే వరకు రైతులను కలుపుకుని పశుమిత్రలు ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలి.
- సెల్:9492585106
కాసు మాధవి