Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ (1861-1941), సాహిత్యంలో నోబెల్ బహుమతి సాధించిన భారతీయుడిగా మనందరికీ తెలుసు. గీతాంజలి -రచనకు 1913లో ఆ గౌరవం ఆయనకు దక్కింది. ఆయన హేతువాదో, నిరీశ్వరవాదో కాదు. అయినా కూడా, దేవుడి పట్ల ఆయన తన అభిప్రాయం స్పష్టంగానే చెప్పారు. I LOVE THE GOD, BECAUSE HE GIVES ME THE FREEDOM TO DENY HIM.. (నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. ఎందుకంటే, ఆయనను తిరస్కరించే స్వేచ్ఛ ఆయన నాకు ఇస్తాడు కాబట్టి!) అని మార్మికంగా చెప్పారు. ఇదే విషయం మీద ఆయన రాసిన చిన్న కథను తెలుగులో పొందుపరుస్తున్నాను.
''గుళ్ళో దేవుడు లేడు'' అని అన్నాడు సాధువు. రాజుకు కోపం వచ్చింది... ''ఏమిటీ? గుళ్ళో దేవుడు లేడా? ఏమిటీ? మీరు నాస్తికుడిలా మాట్లాడుతున్నారూ? మహాత్మా! అమూల్యమైన వజ్ర వైడూర్యాలతో పొదగబడిన సింహాసనంపై మెరుస్తున్న ఆ బంగారు ప్రతిమను చూసి కూడా మీరు దేవుడు లేడు అని అంటే నేనేమి చెప్పేదీ?''
''నిజమే! అది రాచరికపు ఆర్భాటాలతో రాజసంతో విరాజిల్లుతూ ఉంది. కాదనను కానీ, అది ప్రతిమ మాత్రమే! దేవుడు అనేవాడు ఎక్కడా లేడు'' సౌమ్యంగా బదులిచ్చాడు సాధువు. రాజుకోపంతో ఊగిపోయాడు. ''20లక్షల బంగారు నాణాలు ధారపోసి ఆకాశాన్నంటే అద్భుతమైన ఈ భారీ కట్టడం కట్టించాను కదా? అన్ని ఆచారాలు పాటించాకే సంప్రదాయ బద్ధంగా విగ్రహ ప్రతిష్ట చేయించాను కదా? అయినా మీరు గుడిలో దేవుడు లేడని అంటున్నారే? మీ వివేకం ఏమయ్యింది మహాత్మా? ఎందుకు అలా మాట్లాడుతున్నారూ?'' కసిగా పెద్ద గొంతుతో అన్నాడు రాజు. అందుకు సాధువు ప్రశాంత వదనంతో ఇలా అన్నాడు.
''ఇదే సంవత్సరం రెండు కోట్ల మంది నీ ప్రజలు కరువులో విలవిల్లాడారే? వేల మంది భిక్షకోసం నీ ఇంటిముందు నిలబడి అర్థించారే. అయినా ఉట్టి చేతులతో నిరాశతో తిరిగి పొయ్యారే-గుర్తుంది కదా? అప్పుడే దేవుడు ఈ ఆలయం వదిలి వెళ్ళిపోయాడు. కష్టకాలంలో తన వారికి అండగా నిలబడని ఓ లోభి నాకు ఇల్లు కట్టిస్తే... అందులో నేను ఎలా ఉండగలనూ? ప్రేమ, కరుణ, అహింసలు లేని చోట నేనెలా ఉండగలనూ?... అంటూ దేవుడు ఈ దేవాలయం వదిలి వెళ్ళిన విషయం నువ్వు గమనించలేదా రాజా...'' అన్నాడు సాధువు.
''అవునా? అయితే ఆయన ఎక్కడికి వెళ్ళాడూ?'' కంగారుగా అడిగాడు రాజు.
''రహదారికి ఇరువైపులా పడి ఆకలితో తల్లడిల్లుతున్న పేదల వద్దకు పోయాడు. సముద్రపు నురగవలె నువ్వు కట్టించిన గుడి అంతా శూన్యం. అందులో ఇక ఏమీ లేదు. ఏమీ ఉండదు'' నింపాదిగా చెప్పాడు సాధువు.
''నువ్వో మోసగాడివని గ్రహించాను. నీకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను'' అని అరిచాడు రాజు.
''అక్కర లేదు. నేనే నీ రాజ్యం వదిలి వెళుతున్నాను. దయ, మానవత్వం లేని ఈ చోటుని దేవుడే విడిచి వెళ్ళాడు. నువ్వు కట్టించిన గుడినీ, నీ రాజ్యాన్నీ వదిలి వెళ్ళిపోయాడు. మరి, నేను మాత్రం ఇక్కడ ఎలా ఉండగలనూ? నీ సంపదను చూసుకుని మురిసిపోతున్నావ్. అహంకారంతో దేవుణ్ణి వెళ్ళగొట్టిన వాడివి. దయచేసి నీ భక్తిని కూడా వదిలేరు. బాగుపడతావ్'' అని చెపుతూ సాధువు అక్కడి నుంచి కదిలాడు. ''దేవుడంటే ప్రతిమ కాదు, సేవా భావం! మానవత్వం!! అవి లేని వాడి దగ్గర నేను మాత్రం ఎందు కుంటానూ?'' అని అనుకుంటూ సాధువు వెళ్ళిపోయాడు.
రవీంద్రుడు విశ్వకవి గనుక, ప్రపంచ స్థాయి రచయిత గనుక, ఆయన చెప్పాలనుకున్నది ఈ కథలో స్పష్టంగానే చెప్పారు. ఎవరైనా అర్థం చేసుకోలేకపోతే అది వారి తప్పు. రవీంద్రుడిది కాదు. 2022 జులై చివరిలో 'నేనంటే ఎవరు?' రచనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు స్వీకరించడానికి నేను కలకత్తా వెళ్ళినప్పుడు జొరసంకొ -తాకూర్ బారి (రవీంద్రుడి ఇల్లు) వెళ్ళి చూశాం. ఇల్లంతా తిరుగుతూ ఉంటే, గదులన్నీ పరిశీలిస్తూ ఉంటే ఒక చిత్రమైన అనుభూతికి లోనయ్యాను. ఆ ఇంట్లో ఆయన పుట్టిన గది, పెరిగి తిరుగాడిన వరండాలు, అతిథులను కలిసే హాలు, రాసుకునే బల్ల, ఆయన పడక గది, దాని పక్కనే ఆయన కన్ను మూసిన గది- చూసే సరికి అవన్నీ అప్పుడే నా కళ్ళమందు జరిగిపోయాయన్న భావన! భావుకతను కాలం అడ్డుకోలేదు కదా? సముద్రంలోంచి విడివడ్డ ఒక నీటి చుక్కవలె నేను బయటికి నడుస్తున్నప్పుడు ఉచ్ఛాసా నిశ్వాసాలు ఎందుకో బరువెక్కాయి.
ఎవరు రాశారో తెలియదు గానీ, దాదాపు ఇలాంటి కల్పిత కథే మరొకటి ఉంది. కథ కల్పితమే అయినా, సారాంశం సమాజ వాస్తవికతను ప్రతిబింబించేదే! అది ఇలా సాగుతుంది.
ఒకసారి దెయ్యం, మనిషీ కలిసి హాయిగా వెన్నెల్లో నడిచి వెళుతున్నారు. వారికి ముందు మరొకరు నడిచి వెళుతున్నారు.
''అదెవరూ?'' అని అడిగాడు మనిషి.
''ఇంకెవరూ? నీకు లాంటి ఓ మనిషే! మన ముందు నడుస్తున్నాడు'' అంది దెయ్యం. కొద్ది దూరం వెళ్ళాక ముందు నడిచే వ్యక్తి ఆగి, నేలను పరీక్షగా చూసి, ఏదో చేతిలోకి తీసుకుని, గబగబా పరుగులాంటి నడకతో ముందుకు వెళ్ళాడు. అది గమనించిన మనిషి మళ్ళీ అడిగాడు.
''అదేమిటీ? అతనికి అక్కడ ఏదో దొరికింది'' అన్నాడు.
''అవును! అతనికి అక్కడ 'సత్యం' దొరికింది'' అంది దెయ్యం.
''దానితో అతనేం చేస్తాడూ?'' -మనిషి
''ఏం చేస్తాడూ? తన బంధు మిత్రులకు గొప్పగా చూపించుకుంటాడు'' - అని చెప్పింది దెయ్యం. ''ఇతను చెబితే వాళ్ళంతా నమ్మేస్తారా?''
దయ్యం పెద్దగా నవ్వింది. ''నమ్మినా, నమ్మక పోయినా వాళ్ళంతా కలిసి ఆ సత్యానికి అక్కడ ఓ గుడి కడతారు'' అని చెప్పింది.
''గుడి కడితే సత్యం అందులో ఉండి పోతుందా?'' అడిగాడు మనిషి అమాయకంగా - దెయ్యం మరింత పెద్దగా నవ్వింది.
''పిచ్చివాడా! నీకు తెలియదేమో. సత్యాన్ని బయట వీధిలో పడేసిన తరువాతే గుళ్ళో ఓ బొమ్మకు ప్రాణ ప్రతిష్ట చేస్తారు. అలాఓ శూన్యానికి పూజలు, భజనలు చేస్తుంటారు.
''మరి అప్పుడేమవుతుందీ?''
''ఏమవుతుందంటే... అప్పుడే నా పని మొదలవుతుంది. బయటపడేసిన సత్యాన్ని నేను చేజిక్కించుకుంటాను. దానితో ఇక ఓ ఆట ఆడిస్తాను చూస్కో - లోకంలో మారణ కాండ జరిపిస్తాను. పాలకుల మూర్ఖత్వాన్ని ఉపయోగించుకుని, మతకలహాలు, కొట్లాటలూ, సృష్టిస్తాను. అలా చూపిస్తానన్న మాట నా తడాఖా'' అంది దెయ్యం! మనిషి భయకం పితుడయ్యాడు.
ఈ కథలో మనిషితో కలిసి నడిచే దెయ్యం అంటూ ఏదీలేదు. అది మనిషిలోని వికృత భావనలకు ఒక సంకేతం! మనిషిలో మంచీ చెడూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందులో అతను దేన్ని ఎప్పుడు ఎలా ఉపయోగిస్తాడన్న దాని మీదే సమాజ క్షేమం ఉంటుంది. ప్రజల జీవితాల్లో శాంతి భద్రతలు ఉంటాయి.
1980లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సర్వమత సభలు జరిగాయి. ఇందులో ప్రపంచంలోని పద్నాలుగు మతాలకు చెందిన మతాధికారులు, పీఠాధిపతులు, స్వామీజీలు, పాస్టర్లు, ఇమామ్లు అందరూ పాల్గొన్నారు. దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం మీద మూడు రోజులు ఏకధాటిగా చర్చలు జరిగాయి. చివరకు ఏకగ్రీవంగా అందరూ తీర్మానించింది ఏమిటంటే... ''నమ్మిన వారికి దేవుడున్నాడు. దెయ్యమూ ఉంది - నమ్మనివారికి ఏమీ లేదు''అని! కాబట్టి, గుడి, మసీదు, చర్చి, గురుద్వారా లాంటి అన్ని ప్రార్థనా స్థలాలలో ఈ తీర్మానాన్ని స్పష్టంగా రాసి బోర్డులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఒక్కచోట కూడా ఏ ఒక్కరూ అలా ఎందుకు బోర్డులు పెట్టడం లేదు? జనాన్ని ఎందుకు ఆలోచించుకోనివ్వడం లేదూ? మత పెద్దలు ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలి! ఇచ్చుకోకపోతే పెద్ద ఎత్తున సర్వమత మహాసభలు నిర్వహించడం అందులో తీర్మానం చేయడం ఎందుకూ? వృథా ప్రయాస? సామాన్య ప్రజలకు ఏదో ఒక సందేశం ఇస్తే కదా ఆ సభల నిర్వహణ సార్థకమైనట్టూ? పురాతన ధార్మిక సంస్థలలో, గుడి, చర్చ్, మసీదు లాంటి ప్రార్థనా స్థలాలలో ఏదైనా అద్భుతం దాగి ఉందంటే... అది మతానిదో, దేవుడిదో కాదు. వాటిని నిర్మించిన మనిషిదే ఆ గొప్పదనం. జనం ఈ సత్యాన్ని గ్రహిస్తే సగం సమస్యలు పరిష్కారమవుతాయి.
''విద్యార్థుల ఇష్టంతోనూ, వారి మేధస్సుతోనూ వారిలో పెరుగుతున్న చైతన్యంతోనూ సంబంధం లేకుండా వారిపై ఒక ముందస్తు లక్ష్యాన్ని రుద్దే విధంగా విద్యాలయాలు ఉండగూడదు. విద్యాలయాల్లో వారికి స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛగా సృజన చేసే అవకాశం ఉండాలి. అంతేగాని, అవి బానిసత్వంతో కూడిన యాంత్రికమైన కచ్ఛితమైన లక్ష్యాలు సాధించే విధంగా ఉండగూడదు.''
- అంటోనియో గ్రాంసి;
ఇటాలియన్ మార్క్సిస్టు తత్త్వవేత్త.
మన భారతదేశంలోని విద్యా సంస్థల్లో ఇటీవలి కాలంలో ఏం జరుగుతూ ఉందో మనందరికీ తెలుసు. బెంగుళూరు మహానగర పాలక సంస్థ, బెంగుళూరు విశ్వవిద్యాలయంలో ఆలయం నిర్మించాలని నిర్ణయించింది. విద్యార్థులు తీవ్రంగా నిరసించారు. ఆ స్థలంలో గ్రంథాలయం నిర్మిస్తే విద్యార్థు లందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డిమాండ్ చేశారు. కర్నాటక రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను కాషాయీకరణ చేయాలని కుట్ర చేస్తోందని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది.
''కర్మ, నుదిటిరాత, పునర్జన్మ సుకృతం అనే నమ్మకాలు దేశ ప్రగతికి అవరోధం. కులం, మతం ప్రాతిపదికగా గాక, లౌకికవాదం ప్రాతిపదికగా, సమానత్వం ఆధారంగా భారత పౌరులు మెలగాలి'' అని సూచించారు. ప్రఖ్యాత ఇంజనీర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య. భారతరత్న సాధించిన ఈ కన్నడి గుడి మాట నేటి ఈ కన్నడ రాష్ట్ర ప్రభుత్వపు చెవికి ఎక్కడం లేదా?
- వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు