Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయ మూర్తిగా పదవీ విరమణ చేసిన నెల రోజుల్లోపే జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితుడయ్యాడు. రామజన్మభూమి సమస్యను పరిష్కరించిన రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఒక భాగస్వామిగా ఉండటం కాకతాళీయం కాదని చాలామందివలె నేను కూడా విశ్వసిస్తాను. ఈయన, 2014 నుండి నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వ పాలనా కాలంలో పదవీవిరమణ చేసిన తరువాత ఉన్నతస్థాయిలో రాజకీయంగా నియమించబడిన మూడవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. మిగిలిన ఇద్దరిలో ఒకరు కేరళ గవర్నర్గా నియమించబడిన జస్టిస్ పీ.సదాశివన్, మరొకరు రాజ్యసభ సభ్యుడిగా నియమితుడైన జస్టిస్ రంజన్ పీ.గొగోరు.
ఒకవేళ తాము అనుకూలమైన తీర్పులు ఇస్తే, తమకు తగిన విధంగా బహుమతులు అందిస్తారనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సభ్యులకు తెలియజెప్పే విధంగా ఈ నియామకాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ చర్యలు సూచిస్తున్నాయి. మన అత్యున్నత న్యాయస్థానంలో కొంతమంది న్యాయమూర్తులను చూస్తే, ఇలాంటి బహుమతులు ఇవ్వజూపడం అనేది న్యాయమూర్తులను అవినీతిపరులుగా తయారుచేయడంగానూ, ముఖస్తుతి సంస్కృతిని ప్రోత్సాహించేదిగాను ఉంది. ఇది కూడా న్యాయవ్యవస్థ పట్ల ప్రజలలో విశ్వాసాన్ని తగ్గిస్తుంది. ''న్యాయమూర్తులు రాజకీయ విజయాలు సాధించిన రాజకీయ నాయకులకు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, అభినందన లేఖలు పంపించడం, ఉన్నత స్థానాలను పొందారని ప్రశంసించడం మొదలుపెట్టినట్లైతే, ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉండే విశ్వాసం చెదిరిపోతుందని'' 1980 లోనే జస్టిస్ వీ.డీ.తుల్జాపుర్కార్ అన్నారు.
న్యాయవ్యవస్థను బలహీన పరచడం
గవర్నర్ నియామకం చూడటానికి లాంఛనప్రాయంగానే కనపడుతుంది కానీ, వాస్తవానికి అది కచ్చితంగా రాజకీయ నియామకమే. ఎలాగైతేనేం, న్యాయవ్యవస్థను అస్థిరపరచడం, వివిధ మార్గాలలో దాని పనితీరును బలహీనపరచడం పాలక పార్టీ వ్యూహాత్మక చర్యల్లో భాగంగా కనపడుతోంది. ఒకసారి వెనక్కి తిరిగి పరిశీలించి చూస్తే, న్యాయవ్యవస్థ నెమ్మది నెమ్మదిగా బలహీనపడుతూ ఉండడాన్ని మనం గమనిం చవచ్చు.
వాస్తవంగా చెప్పాలంటే... ఈ ప్రభుత్వం న్యాయ మూర్తులను ఇలా అవినీతిపరులుగా మార్చడానికి సాహసం చేసిన మొదటి ప్రభుత్వమేమీ కాదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ముఖ్యంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నాయకత్వంలోని ప్రభుత్వాలు కూడా ఇలాంటి సాహసాలు చేశాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీని కూడా అంతే సమానమైన దోషిగా పేర్కొనడం పిరికితనంతో కూడిన ఆత్మరక్షణ కోసం తప్ప మరొకటి కాదు. గతంలో జరిగిన దుష్టాంతం ప్రస్తుత ఉల్లంఘనను సమర్థించదు కూడా. పాలనా యంత్రాంగం శాఖల స్వతంత్రతకు హామీ ఇవ్వడం, ప్రజాస్వామిక విలువలు కాపాడబడేట్లు చూడడమే ఎలాంటి సహేతుకమైన కార్యనిర్వహక వ్యవస్థ ఉన్నత లక్ష్యం. కానీ నిశ్చయాత్మకమైన అధికసంఖ్యాక వర్గం ఆదేశాలు, ఏ వ్యక్తినైనా అధికారంతో ఉద్రేకసహితుడ్ని చేసి, ఆ అధికార నిర్వహణకు, తరువాత ఆ అధికారం సంఘటితపడడానికి అవసరమైన సృజనాత్మకమార్గాల పరిశోధన కోసం ఒత్తిడి చేస్తాయి. ఇదే నేటి భారత ప్రభుత్వంలో జరుగుతున్న తంతు కూడా.
కపటపూరిత ప్రవర్తన
పదవీవిరమణ తరువాత చేపట్టే న్యాయనియామకాలను నివారించాలని గతంలో అరుణ్ జైట్లీ రూపొందించిన ప్రభుత్వ స్వంత మ్యానిఫెస్టోను ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వ ప్రవర్తన కూడా కపటపూరితంగానే ఉంటుంది. వాస్తవానికి, అలాంటి నియామకాల ద్వారా న్యాయమూర్తులను ప్రభావితం చేయడం అనేది కాంగ్రెస్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతాపార్టీ మార్గదర్శకత్వంలో చేసిన నిర్దిష్టమైన ఆరోపణ.
ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ కూడా నిందార్హమైన తప్పిదాలకు పాల్పడింది. భారతదేశంలో న్యాయమూర్తులను చాలా బలమైన గుణగణాలతో తయారుచేస్తారు. ఒక్కసారి కూడా మోసాలకు పాల్పడరని నేను విశ్వసిస్తాను. ఇటీవల జస్టిస్ అఖిల్ ఖురేషీ చేసిన విధంగా న్యాయమూర్తులు నైతిక బాధ్యత, నైతిక వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలి. తన గొప్పతనాన్ని నిర్లక్ష్యానికి గురిచేసి, దేశంలోని వివిధ హైకోర్టులకు తనను తరలించిన తీరుపై ఆయన పదవీవిరమణ తరువాత, తన గురించి ప్రభుత్వానికి గల ''ప్రతికూల అవగాహనను'' ఒక ''స్వేచ్ఛా ధృవీకరణ పత్రం'' అని, ఏ మాత్రం చెక్కుచెదరకుండా తాను చాలా గర్వంగా న్యాయవ్యవస్థను వదిలివేస్తున్నానని అన్నాడు. రాజకీయ నియామకాల రూపంలో ప్రభుత్వం నుంచి పొందే చేయూత ఒక మార్గం కాదనీ, ఇచ్చే వాడు ఉంటే, పుచ్చుకునే వాడు కూడా ఉంటాడనే విషయాన్ని న్యాయమూర్తులు గుర్తించాలి. రాజకీయ ఆదరణలకు, పదవీవిరమణ తరువాత ఉపాధి అవకాశాలకు మధ్య ఉండే వ్యత్యాసాలను భారతీయ న్యాయవ్యవస్థ గుర్తించాలి.
పాత్రల విభజన
ట్రిబ్యునల్ లేదా కమిషన్ లాంటి న్యాయపరమైన అధికారానిది స్పష్టమైన విలువ, అవసరం ఉండే పాత్రకు, ఆ అధికారం లేనిచోట ఉండే పాత్రకు మధ్య సరిహద్దులు ఉండాల్సిన అవసరం ఉంది. జస్టిస్ గొగోరు, రాజ్యసభకు తన నియామకం గురించి మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థకు, శాసనసభకు మధ్య ఉండే అంతరాన్ని పూడ్చాలనే ఉద్దేశం తనకున్నట్లు ప్రకటించాడు కానీ పార్లమెంటరీ వ్యవహారాలలో ఆయన హాజరైన తీరు, ప్రజల భాగస్వామ్యం అలాంటి ఏ ఉద్దేశాన్ని సూచించలేదు. అదేవిధంగా జస్టిస్ సదాశివం, తాను ప్రజలకు గవర్నర్ పాత్ర ద్వారా సేవలు అందించాలనుకున్నాననీ, కానీ అదే లక్ష్యాన్ని ఇతర నియామకాల ద్వారా ఖచ్చితంగా చేసి ఉండెడివాడిననీ, అది భారత ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్న వారికి మరింత సానుకూలంగా ఉంటుందని అన్నాడు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తుల మహాసభలో న్యాయనిపుణుల సమాజం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. పదవీవిరమణ అనంతరం, న్యాయమూర్తులు రాజకీయ ప్రోత్సాహాన్ని సూచించే ఎలాంటి నియామకాలను స్వీకరించకూడదని మహాసభ అంగీకరించాలి. న్యాయ వ్యవస్థకు ప్రమాదం లోపలే పొంచి ఉన్నదని జస్టిస్ వై.వీ. చంద్రచూడ్ అన్నారు. పదవీవిరమణ అనంతరం ధనలాభం లేదా గౌరవం లభించే పదవుల కోసం స్వతంత్రతతో వ్యాపారం చేయడం ద్వారా న్యాయవ్యవస్థ సభ్యులు రాజీపడలేరు. ఒక వ్యక్తి న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఒక ధర్మంతో కూడిన స్వతంత్రతతో కూడిన న్యాయానికి హామీని నిర్వహిస్తామని ప్రమాణం చేసి సంతకం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రమాణంపై రాజీపడకూడదు. మన న్యాయమూర్తులు భారతదేశ ప్రజలతో చేసుకున్న ఈ అలిఖిత ఒప్పందాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
(''ద హిందూ'' సౌజన్యంతో)
అనువాదం బోడపట్ల రవీందర్, 9848412451
- ఏ.పీ.షా