Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టణాలు, నగరాలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను 2023-24 కేంద్ర బడ్జెట్ విస్మరించింది. ఈసారి చిన్న పట్టణాలపై గురిపెట్టింది. ప్రయి వేట్ పెట్టుబడులు, ప్రయి వేట్ రుణాలు ప్రోత్సహిం చటం ద్వారా టైర్-2, టైర్-3 పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందుకుగాను చిన్న పట్టణాల మౌలిక సదుపాయాల కల్పన నిధిని రూ.10 వేల కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ నిధితో పాటు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో వివిధ పథకాలకు కేటాయించిన నిధులను కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ నిధులను వినియోగించుకోవటానికి ఒక షరతుపెట్టారు. ఈ నిధులను ఉపయోగిం చుకునే పట్టణం తప్పనిసరిగా యూజర్ ఛార్జీలను ప్రజల నుండి అమలు చేయాలని నిబంధన విధించారు.
''రింగ్ ఫెన్సింగ్'' విధానాన్ని అమలు చేయడం ద్వారా చిన్న పట్టణాల్లో సైతం పట్టణ సంస్కరణలను అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం తెరలేపింది. రింగ్ ఫెన్సింగ్ అంటే పట్టణ పరిపాలనా వ్యవస్థ నుండి కొన్ని భాగాలను వేరుచేసి నిర్వహించటం. ప్రస్తుత మున్సిపల్ పరిపాలనా విధానంలో భాగంగా ఉన్న విధులు, కార్యకలాపాలు, ఆదాయాలు, వ్యయాలు, ఆస్తులు మొదలగు వాటిని వేరు చేసి ప్రత్యేక సంస్థల ద్వారా నిర్వహించటం. ఈ సంస్థలను చట్టపరంగా, ఆర్థికంగా స్వతంత్రంగా పనిచేసేలా ఏర్పాటు చేస్తారు. వీటికి ప్రత్యేక ఎస్క్రో అకౌంట్స్ ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు నీటి సరఫరా. ఇది మున్సిపాలిటీ ముఖ్యవిధి. ప్రస్తుతం ఈ విభాగం మున్సిపల్ కార్యకలాపాల్లో భాగంగా ఉంది. దీని ఆస్తులు, నిర్వహణ, కేటాయింపులు, ఖర్చులు వంటివన్నీ మున్సిపల్ కౌన్సిల్ పరిపాలనలో ఉన్నాయి. దీని లాభనష్టాలకు కూడా మున్సిపల్ కౌన్సిల్ బాధ్యత వహిస్తుంది. ఆదాయ-వ్యయాలను కూడా మున్సిపల్ బడ్జెట్లో చూపిస్తున్నారు. ఇప్పుడు ''రింగ్ ఫెన్సింగ్'' విధానంలో వీటిని మున్సిపల్ విధుల్లో చూపరు. మున్సిపల్ అకౌంట్స్‌లో కూడా చూపరు. ఈ విధానం అమలు చేసిన చోట మున్సిపల్ కౌన్సిల్‌కు ఈ రంగం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉండదు. స్వతంత్రంగా పని చేస్తూ కౌన్సిల్‌కు జవాబుదారీగా ఉండదు.
మంచినీటి సరఫరాయే కాదు. పారిశుధ్యం, మురుగునీరు, పార్కులు, వీధి లైట్లు, ఖాళీస్థలాలు వంటి వాటన్నిటి నిర్వహణను విడివిడిగా చేయడమే ''రింగ్ ఫెన్సింగ్'' లక్ష్యం. వీటిని తరువాత ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పజెప్తారు. ఈ రింగ్ ఫెన్సింగ్ విధానంలో నిర్వహణకు అయ్యే ఖర్చును మొత్తం ప్రజల నుండి వసూలు చేయడం ప్రధాన విధి. నీటి సరఫరా, పారిశుధ్యం, మురుగునీరు, వీధిలైట్లు, పార్కులు ఇలా ప్రతి రంగంలో ఏడాదికయ్యే ఖర్చును యూజర్ ఛార్జీల రూపంలో వసూలు చేయాలి. అలాగే టైర్-2, టైర్-3 పట్టణాలకు ఇచ్చే నిధులన్నీ సంస్కరణలకు ముడిపెట్టి ఇచ్చేవే. మౌలిక సదుపాయాల కల్పన నిధి ఏర్పాటు అందుకే. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు, పట్టణ ప్రాంతాలకు కేంద్ర బడ్జెట్లో కేటాయించే అమృత పథకం వంటి నిధులన్నీ షరతుల పరిధిలోకి వెళ్ళనున్నాయి. కేంద్రం విధించిన షరతులు అమలు చేస్తేనే వీటిని వినియోగించుకోవడం సాధ్యమవుతుంది.
మరొక ప్రమాదకర నిర్ణయం ఏమిటంటే లక్షలోపు జనాభా ఉన్న పట్టణాలను కూడా అప్పుల్లోకి దించబోతున్నారు. ఇప్పటి వరకు దేశంలో టైర్-2, టైర్-3 పట్టణాలు అప్పులు చేయలేదు. ఎక్కువ భాగం స్వంత పన్ను ఆదాయాలు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర పట్టణ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక గ్రాంట్ల మీదనే ఆధారపడి నడుస్తున్నాయి. ఇప్పుడు వీటి రుణ సామర్ధ్యాన్ని పెంచటానికి రింగ్ ఫెన్సింగ్ ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. రింగ్ ఫెన్సింగ్ కింద వేరు చేసిన విభాగాలకు నిధులను ప్రయివేట్ రుణాల ద్వారా, బాండ్ల ద్వారా సమకూర్చుకోవాలి. లేదంటే వీటి నిర్వహణ పూర్తిగా ప్రయివేట్ సంస్థలకు ఇవ్వాలి. ప్రతి విభాగంలో ఆదాయ-వ్యయాలు సమానం అయితేనే ఆ రంగంలో పెట్టుబడుల కల్పనకు రుణాలు ఇస్తారని లేదా బాండ్ల విడుదల ద్వారా పెట్టుబడులు సమకూర్చుకోవటం సాధ్యమవుతుందని ప్రభు త్వం అడ్డగోలుగా వాదిస్తున్నది.పట్టణ రంగానికి సంబంధించి మొత్తం సంస్కరణలను అమలు చేయాలన్నదే ఈ బడ్జెట్ కేంద్ర లక్ష్యంగా ఉంది. పట్టణాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సవాళ్లను ఏ మాత్రం పట్టించుకోలేదు. వీటన్నింటి కోసం అప్పుల ద్వారా ఆదాయాలు సమకూర్చుకోవాలని, ప్రయివేటీకరణ చర్యలు చేపట్టాలని, వినియోగ చార్జీలు వసూలు చేయాలని నివేదించింది. గత ఏడాది కన్నా 2023-24 బడ్జెట్లో పట్టణ రంగానికి కేటాయింపులు స్థూల జాతీయోత్పత్తిలో 0.5శాతం నుండి 0.3శాతానికి కోత పెట్టింది. స్మార్ట్ సిటీలకు రూ.8800 కోట్ల నుండి 8వేల కోట్లకు తగ్గించింది. ఈ పథకం అమలు ఈ ఏడాది జూన్‌తో ముగిసిపోతుంది. పట్టణ బడ్జెట్లో 33.32శాతం మెట్రో రైళ్ల నిర్మాణానికి కేటాయించింది. ఇవి కూడా పిపిపి కింద చేపట్టేవే. కొన్ని నగరాలకే పరిమితం.
గత రెండు దశాబ్దాల నుంచి పట్ణణ రంగంలో ప్రయివేటీకరణ విధానాల అమలుకు ప్రయత్నం చేస్తున్నారు. పథకాలు, నిధులు ఎరజూపి సంస్కరణల అమలుకు పూనుకుంటున్నారు. గతంలో జెఎన్ఎన్యుఆర్ఎమ్ పథకం తీసుకొచ్చి దేశంలో 63 నగరాల్లో సంస్కరణల అమలుకు ప్రయత్నం చేశారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను కూడా సంస్కరణలకు ముడిపెట్టి ఇస్తున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణ సంస్కరణల అమలుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే స్మార్ట్ సిటీ పథకాన్ని 100నగరాల్లో అమలుకు ప్రయత్నం చేస్తున్నది. దేశంలో తొలిసారిగా స్మార్ట్ సిటీలో పథకం అమలుచేస్తున్న నగరాల్లో ఎన్నికైన కౌన్సిళ్లకు, స్మార్ట్ సిటీ కింద చేపట్టే ప్రాజెక్టులకు సంబంధం లేకుండా చేసింది. ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలో నిర్ణయించుకొనే అధికారం కూడా కౌన్సిల్‌కు లేకుండా చేశారు. నిర్వహణ మొత్తం వేరు చేశారు. ఈ పథకాన్ని పూర్తిగా స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ పథకంలో చేపట్టిన పనుల్లో ఎక్కువ భాగం ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం కింద చేపడుతున్నారు. దీని కింద ఖర్చు పెడుతున్న నిధులను తిరిగి వినియోగదారుల నుంచి తప్పనిసరిగా వివిధ రూపాల్లో వసూలు చేయాలన్న నిబంధన కూడా విధించారు.
మరొకవైపు నగరాల మధ్య పొటీ పెట్టి ర్యాంకులు ఇస్తూ... ప్రయివేటీకరణ విధానాల అమలు, మౌలిక సదుపాయాలకు సమీకృత పెట్టుబడి అనే దానిని కూడా ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే ఎ.పి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థను ఏర్పాటుచేసింది. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు కూడా ఈ తరహా సంస్థలను ఏర్పాటు చేశాయి. మరొకవైపు ప్రపంచబ్యాంకు, ఎడిబి డిఎఫ్‌ఐఎ, యుఎస్ ఎయిడ్ వంటి సంస్థలన్నీ నేడు మనదేశ పట్టణ స్థానిక సంస్థలలో ప్రత్యక్ష జోక్యం చేసుకుంటున్నాయి. నిధుల సహకారం పేర పౌరసేవలన్నింటినీ ప్రయివేటీకరించాలని షరతులు విధిస్తున్నారు. కోవిడ్‌ను ఆసరా చేసుకొని మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే అప్పులకు పట్టణ సంస్కరణలకు ముడిపెట్టింది.
వాస్తవంగా పట్టణ రంగం రాష్ట్ర జాబితాలోనిది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర జాబితాలోని అనేక రంగాలను తన పరిధిలోకి బలవంతంగా గుంజుకుం టున్నది. మున్సిపల్ చట్టాలను మార్చేస్తున్నది. అన్ని స్థాయిల్లోని పట్టణాలన్నింటిలో ఈ సంస్కరణల అమలు లక్ష్యంగా కొత్తకొత్త పథకాలను ప్రవేశపెడుతున్నది.
- బి. గంగారావు
సెల్:9490098792