Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''స్వామీ! శివరాత్రి పర్వదినాన నాదో కోరిక తీర్చరూ!'' గోముగా అడిగింది శివుడిని పార్వతి.
''దేవీ! నీవు అంతగా అడగాలా! నీవు కోరుట నేను తీర్చుట అను వేర్వేరు భావనలేల? మనిద్దరం అర్థనారీశ్వరులము కదా!'' అన్నాడు శివుడు.
''అయిననూ నేను అడగాలి! మీరు తీర్చాలి! అప్పుడే నాకు ఆనందము! నా కోరికను తీర్చండి!'' అన్నది పార్వతి.
''సరే నీ కోరిక ఏమిటో తెల్పుము!'' అన్నాడు శివుడు.
''శివరాత్రి పర్వదినమున మనిద్దరము భూలోక సంచారము చేయుదము! ఇదియే నా కోరిక!'' అన్నది పార్వతి.
''తప్పక చేయుదుము! నీ కోరిక తీర్చుటయే నా బాధ్యత.'' అంటూ శివుడు, పార్వతితో కలసి భూలోక యాత్రకు బయలు దేరారు.
భూలోకంలో శివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అభిషేక ప్రియుడైన శివుడిని ప్రజలు భక్తి భావంతో ఘనంగా అభిషేకిస్తున్నారు! తమ కోరికలు తీర్చాలని మనసులోనే వేడుకుంటున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కోకోరిక. మరి కొందరు ఒకటి కంటే ఎక్కువ కోరికలే కోరుకుంటున్నారు!
''స్వామీ! వీరి కోరికలు వింటుంటే చాలా తమాషాగా ఉంది. తమ కోరికల్లో పరస్పర విరుద్ధమైన కోరికలు కూడా ఉన్నాయి. ఈ కలియుగంలో నిస్వార్థమైన కోరికలు కోరేవారే కన్పించటం లేదు! నిజమైన భక్తుల కోసం ఎంతో ఎదురు చూడవలసి వస్తున్నది'' అన్నది పార్వతి.
శివుడు చిన్నగా నవ్వాడు.
''దేవీ! కోరిక అంటేనే స్వార్థమున్నట్లు! ఇక నిస్వార్థమైన కోరికలు ఎలా ఉండగలవు! భక్తకన్నప్ప, మార్కేండయులతో సహా భక్తాగ్రేసరులు అందరూ ఏదో ఒక విధమైన స్వార్థముతో కోరికలు కోరినవారే కదా!'' అన్నాడు శివుడు.
శివుడు అలా మాట్లాడుతుండగా పార్వతి కింద భూమిపై చూస్తూ ఆగిపోయింది. శివుడూ ఆగిపోయాడు. ఒక కాషాయ వస్త్రధారిని, మరి కొందరు కాషాయ వస్త్రధారులు చెట్టుకు కట్టేసి కొడుతున్నారు.
''స్వామీ! చెట్టుకి కట్టేసింది మన నారదుడిని. పదండి'' అంటూ శివుడితో సహా నారదుడి ముందు మారు వేషాలతో ప్రత్యక్షమయ్యారు.
''ఎందుకు నాయనలారా! అతనిని చెట్టుకు కట్టేసి మరీ కొడుతున్నారు!'' అడిగాడు మారువేషంలోని శివుడు.
''ఇతడు భారతదేశాన్ని దెబ్బతీసే కుట్రదారులతో చేయి కలిపి దేశద్రోహానికి పాల్పడుతున్నాడు! అందుకే చెట్టుకి కట్టేసి కొడుతున్నాం!'' అన్నారు కొడుతున్నవారు.
''దేశాన్ని కుట్ర చేసే వారితో చేతులు కలిపాడా? ఎవరితో?'' అడిగింది పార్వతి.
''బిబిసితో చేతులు కలిపాడు. అది విదేశీ సంస్థ. పైగా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. మన ప్రధానికి వ్యతిరేకంగా డాక్యుమెంటరీలు చూపుతున్నది!'' ఇతను బిబిసికి చెందినవాడినని తానే అంగీకరించాడు!'' అన్నాడు కాషాయ వస్త్రధారులు.
''ఏమయ్యా! నీవు బిబిసిలో ఎప్పటి నుండి పనిచేస్తున్నావు?'' నారదుడిని అడిగాడు శివుడు.
''అయ్యో! మహాప్రభూ నేను నారదుడినని చెప్పాను. అంతే!'' అన్నాడు నారదుడు గింజుకుంటూ.
''అదే! నారదుడు అంటే బిబిసినే. బిబిసి లేనప్పుడు నారుదుడే వార్తలు అందరికీ చెప్పేవాడంట. బిబిసికి పూర్వ రూపమే నారదుడని మా యూనివర్సిటీలో ఎప్పుడో చదువుకున్నాము! కొత్త బిబిసిని విడిచిపెట్టలేదు. ఇన్‌కం టాక్స్‌తో దాడి చేయించాము! నిన్ను వదులుతామా? చెప్పు
బిబిసి వద్ద ఎంత జీతం తీసుకుంటున్నావు? అల్రెడీ ఇన్‌కం టాక్స్ శాఖకి ఫోన్ చేశాము!వచ్చేస్తారు! ఈడీకి, సిబిఐకి, ఇంటలిజెన్స్శాఖకి అందరికీ చెప్పేశాం! వారంతా వచ్చేలోగా చెప్పావా సరే! లేదా, నీకు పుట్టగతులుండవు!'' అన్నారు కాషాయులు.
''అయ్యో! నేను ఎవరి వద్ద పనిచేసేవాడిని కాను! హరినామ స్మరణ చేసేవాడను! నన్ను నమ్మండి!'' అన్నాడు.
''హరి పేరు తలిస్తే ఓప్పుకోం! నీవు నిజంగా బిబిసి వద్ద పనిచేయకుంటే నమో! అని స్మరించు! వదిలిపెడ్తాం!'' అన్నారు కాషాయులు.
''లేదు! నేను హరినామ స్మరణ దక్క మరొకటి నామస్మరణ చేయనంటే చేయను!'' అన్నాడు నారదుడు.
దాంతో నారదుడిని మళ్ళీ కొట్టబోయారు. పార్వతి వారించింది. వాషింగ్టన్ పోస్టు లాంటి పత్రికలు మోదీని పొగిడాయని, అంత గొప్ప నాయకుడే లేడని ప్రకటించాయని మీరు గొప్పగా చెప్పుకున్నారు కదా! అవి కూడా విదేశీ పత్రికా సంస్థలే కాదా! అప్పుడు లేని విదేశీయత ఇప్పుడెందుకు వచ్చింది?'' అన్నది.
''ఎందమ్మో! లాజిక్ మాట్లాడుతున్నావు! ఎవరైనా, ఏ సంస్థలైనా ఒకటే నిబంధన! మోడీని మెచ్చుకుంటున్నారా? లేక విమర్శిస్తున్నారా? దాన్ని బట్టే దేశభక్తులా లేక దేశ ద్రోహులా అని నిర్ధారిస్తాము!'' అన్నారు కషాయులు.
''అయితే ఈ నారదుడు మోడీని విమర్శించలేదు కదా!'' అడిగాడు శివుడు.
''నారదుడంటేనే బిబిసి అని యూనివర్సిటీలో చదివామని చెప్పాము కదా! అదీకాక నమో అనమంటే నారాయణ, నారాయణ అంటున్నాడు. ఇతని దేశద్రోహానికి ఇంతకన్నా సాక్షమేమి కావాలి?'' ప్రశ్నించారు కాషాయులు.
''మీరే దేశద్రోహం నేరం మోపుతారు! మీరే దేశద్రోహానికి శిక్షలు విధిస్తారు? ఇదెక్కడి న్యాయమయ్యా! ఈ దేశంలో న్యాయస్థానాలు లేవా?'' అడిగాడు శివుడు.
''న్యాయమూర్తుల్లో కూడా కొందరు మేం చెప్పిందే అనటం లేదు! అన్నవారికి తగిన బహుమతులు అందుతూనే ఉన్నాయి.'' నేరం మోపేదీ, శిక్షలు విధించేదీ మేమే! అయినా అప్పటి నుంచీ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు! మీరు కూడా బిబిసిలో పని చేస్తున్న విలేకరులా, మీ వద్ద కెమెరాలు, మైక్రో ఫోన్లు ఉన్నాయా? చెప్పండి!'' అంటూ మారువేషంలో ఉన్న శివపార్వతులవైపు దూసుకుని వచ్చారు. కాషాయ వస్త్రధారులు!
రాబోయే ప్రమాదాన్ని గుర్తించి, నారదుడితో సహా శివపార్వతుల అదృశ్యమైపోయారు.
- ఉషాకిరణ్