Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాధ్యత కలిగిన ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రి తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటన చేయడం ఏ మాత్రమూ సరైనది కాదు. కాని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అదే పని చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతూ రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల విషయంలో ''రాష్ట్రాలకు ఆర్థిక వనరుల కేటాయింపులు భారీగా పెంచినట్టు'' ఆమె ప్రకటించారు (హిందూ, ఫిబ్రవరి 11). ఈ ప్రకటన చూస్తే కేంద్రం చాలా ఉదారంగా వ్యవహరించిందన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ ఆ విధమైన పెరుగుదల వాస్తవంగా ఉన్నట్టు చూపించే అంకెల వివరాలను వేటినీ ఆమె ఇవ్వలేదు. బడ్జెట్లో ఉన్న అంకెలను పరిశీలిస్తే ఏ విధంగా చూసినప్పటికీ రాష్ట్రాలకు చేసిన కేటాయింపులలో పెరుగుదల లేకపోగా తరుగుదల కనిపిస్తున్నది. మన స్థూల జాతీయోత్పత్తితో పోల్చినప్పుడు కేటాయింపులలో నికరంగా తరుగుంది. మోడీ ప్రభుత్వం మొదటినుంచీ వనరులన్నింటినీ కేంద్రం వద్ద కేంద్రీకరించుకునే విధానాన్ని అమలు చేస్తున్నది. ఈ బడ్జెట్లో కూడా ఆ విధానమే కొనసాగింది.
కేంద్రం వద్ద జమ అయ్యే మొత్తం పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు ఎంత వాటా కేటాయించినదీ చూద్దాం. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 42శాతం పన్ను ఆదాయాన్ని కేటాయించమని సిఫార్సు చేసిన సంగతి మనకి గుర్తుంది. అప్పుడు కేంద్రం ఆ సిఫార్సును ఎటువంటి అరమరికలూ లేకుండా ఆమోదించినట్టు ప్రకటించింది. కాని ఇంకోపక్క వేరే వేరే పద్దుల్లో (ఆ పద్దులు ఆర్థిక సంఘం పరిధిలోకి రావు) రాష్ట్రాలకు రావలసిన వాటాలను భారీగా తగ్గించింది. నిజానికి జీడీపీ ఏ మేరకు పెరుగుతుందో అదే మోతాదులో రాష్ట్రాలకు కేటాయింపులు కూడా పెరగాలి. ఆ విధంగా చేయకుండా కోతలు పెట్టింది. అందువలన మొత్తం మీద జీడీపీ పెరుగుదలతో పోల్చి చూసుకు న్నప్పుడు రాష్ట్రాలకు వాటాలు తగ్గిపోయాయి. ఆ తర్వాతనుంచీ మొత్తం పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు దక్కే వాటా తగ్గిపోవడం మొదలైంది. 2018-19లో 36.6శాతం, 2021-22లో 33.2శాతం, 2022-23 (సవరించిన అంచనాల ప్రకారం) 31.2శాతం కేటాయించారు. ఇప్పుడు 2023-24లో 30.4శాతమే కేటాయించారు. పన్ను రూపంలో వసూలు చేస్తే రాష్ట్రాలతో పంచుకోవాలి కాబట్టి అదనంగా వసూలు చేసినదానికి పన్ను అని పేరు పెట్టకుండా స్పెషల్ లెవీ అని, సర్‌చార్జి అని, సెస్ అని రకరకాల పేర్లు పెట్టి ఆ రూపంలో వసూలైన ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా ఎగ్గొడుతోంది కేంద్రం. 2011-12 నాటికి అటువంటి పేర్లతో వసూలు చేసిన ఆదాయం మొత్తం ఆదాయంలో 10శాతం ఉండేది. 2021-22 నాటికి అది అమాంతం రెట్టింపై ఇరవై శాతం అయింది.
వసూలైన మొత్తం పన్నులో రాష్ట్రాల వాటా తగ్గడమే కాదు, జీడీపీతో పోల్చుకున్నా తగ్గింది. గతేడాదితో పోల్చుకుంటే 2023-24లో జీడీపీలో 10.5శాతం వృద్ధి ఉంటుందన్న అంచనాతో బడ్జెట్ తయారైంది. కానీ, రాష్ట్రాలకు కేటాయించిన వాటా మాత్రం రూ.9,48,406 కోట్ల నుండి (సవరించిన అంచనా) రూ.10,21,448 కోట్లకు మాత్రమే పెరిగింది. ఇది 7.7శాతం పెరుగుదల మాత్రమే. జీడీపీ పెరుగుదల 10.5 ఉంటుందన్నప్పుడు రాష్ట్రాల వాటా కూడా ఆ మేరకు పెరగాలి కదా. కాని అలా పెరగలేదు. మరి ఆర్థికమంత్రి భారీగా రాష్ట్రాల కేటాయింపులు పెరిగాయని ఏ విధంగా ప్రకటించారు? అటు పన్ను వసూళ్ళతో పోల్చి చూసినా, ఇటు జీడీపీ వృద్ధి రేటుతో పోల్చి చూసినా పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా వాస్తవంగా తగ్గిపోయింది.
ఇక రాష్ట్రాలకు మొత్తంగా జరిగే నిధుల బదలాయింపుల సంగతి చూద్దాం. ఈ బదలాయింపు నాలుగు రకాలుగా ఉంటుంది. ఒకటి: మొత్తం వసూలైన పన్నుల్లో రాష్ట్రాల వాటా. రెండు: ప్రత్యేక సహాయంపేరుతో పెట్టుబడుల వ్యయం కోసం రాష్ట్రాలకు ఇచ్చే రుణాలు, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం వగైరా. మూడు: కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు కోసం, కేంద్ర పథకాల కోసం ఇచ్చే గ్రాంట్లు, నాలుగు: ఆరోగ్యరంగం మెరుగుదల, స్థానిక సంస్థల నిర్వహణ మెరుగుదల తదితర లక్ష్యాలకోసం ఆర్థిక సంఘం ప్రత్యేకంగా సిఫార్సు చేసిన గ్రాంట్లు. ఈ అన్ని రకాల బదలాయింపులనూ మొత్తంగా లెక్క వేస్తే 2022-23 (సవరించిన అంచనాలు)లో రాష్ట్రాలకు రూ.17.11 లక్షల కోట్లు కేటాయించారు. 2023-24 బడ్జెట్ అంచనాల్లో అది రూ.18.63 లక్షల కోట్లు అయింది. అంటే 8.88శాతం పెరిగి ంది. కాని జీడీపీ వృద్ధి రేటు 10.5శాతం కన్నా ఇది తక్కువ కదా!
ఈ విధంగా ఆర్థిక వనరులను కేంద్రీకరించడం మోడీ ప్రభుత్వం హయాంలో యాదృచ్ఛికంగా జరుగుతోందను కోలేం. ఉన్న పరిమిత వనరుల్లో తమవద్ద ఎక్కువ వాటా ఉండాలన్న తాపత్రయం కొద్దీ చేస్తున్న పని అని కూడా అనుకోలేం. ప్రపంచంలోని ఏ ఫాసిస్టు ప్రభుత్వపు చరిత్ర చూసినా, దాని మౌలిక సిద్ధాంతం కేంద్రీకరణే. మన దేశంలోనైతే ఇది ''సహకార ఫెడరలిజం'' అనే ముసుగులో అమలు జరుగుతోంది. ఫాసిస్టు ప్రభుత్వాలలో కేవలం సంస్థాగత నిర్మాణంలోనే గాక, ప్రభుత్వ పాలనా వ్యవస్థలోనూ కేంద్రీకరణ అమలు జరుగుతుంది. తమకు అధికారం అప్పజెప్పిన ప్రజలు లేవనెత్తిన డిమాండ్లను పరిశీలించి అమలు జరపడం అనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఫాసిస్టు ప్రభుత్వాలకు నమ్మకం ఉండదు. ఒకసారి అధికారం చేతిలోకి వచ్చాక ఒక ఆ ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలా అన్నదే వారి దృష్టి. అందుకే తరచూ ప్రజల మధ్య మతాల పేరుతో చిచ్చు రాజేసి ఘర్షణలను రెచ్చగొడుతూవుంటారు. మైనారిటీ తరగతుల ప్రజలు తమకు శత్రువులు అని మెజారిటీ తరగతుల ప్రజలు నమ్మేటట్టు ప్రచారం చేస్తూ ఉంటారు. అధికారం తమకు ఏ ప్రజలనుంచి సంక్రమించిందో, ఆ ప్రజలనే నిస్సహాయులుగా మార్చేస్తూవుంటారు. నాయకుడే సర్వశక్తిమంతుడు అన్న భావనను కలిగించడానికి ప్రయత్నిస్తూంటారు. అందుకే ఫాసిస్టు పాలనలో సమిష్టి నాయకత్వం ఉండదు. అంతేకాదు. ఆ నాయకుడు ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగాలలో హేతుబద్ధమైన వాదన ఏదీ ఉండదు. ప్రజల చైతన్యాన్ని కదిలించే ప్రయత్నం ఎక్కడా ఉండదు. దానికి బదులు నాటకీయంగా మాట్లాడుతూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి పూనుకుంటారు.
వనరుల కేటాయింపుల విషయంలో కూడా కేంద్రానికి ఎంత వాటా ఉండాలి? రాష్ట్రాలకు ఎంత వాటా ఉండాలి? అన్న చర్చను హేతుబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా జరిపే ప్రయ త్నం ఏదీ ఉండదు. ఏదో ఒక సాకుతో వనరులను కేంద్రీకరిం చడమే పనిగా వ్యవహరిస్తారు. కేంద్రంలో అధికారం ఫాసిస్టు శక్తుల చేతుల్లో ఉండి, కొన్ని రాష్ట్రాల్లో ఆ ఫాసిస్టు విధానాలకు తలొగ్గని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్ష- పాలిత రాష్ట్రాలకు ఊపిరి సలపకుండా చేయడానికి ఈ వనరుల కేంద్రీకరణ పద్ధతిని మరింత ఉధృతంగా అమలు చేస్తారు.
ఈ కేంద్రీకరణ విధానం వెనక మరో బలమైన కారణం కూడా ఉంది. ప్రతీ ఫాసిస్టు ప్రభుత్వానికీ కొన్ని గుత్త పెట్టుబడిదారీ సంస్థలతో ప్రత్యేకమైన సాన్నిహితం ఉంటుంది. అందుకే ఇటీవల బయటపడిన అదానీ సంస్థల కుంభకోణాల ఉదంతం విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి మౌనాన్ని పాటిస్తోంది. ప్రజా సంక్షేమం కోసం ఆర్థిక వనరులను వికేంద్రీకరించేబదులు కేంద్రీకరిస్తే ఆ నిధులను తన అభిమాన గుత్త సంస్థలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయడానికి వీలవుతుంది.
ఈ ఏడాది బడ్జెట్‌ను ఇందుకు సరైన మచ్చుతునక. కరోనా మహమ్మారి నుండి కోలుకున్నప్పటికీ, ప్రయివేటు వ్యక్తుల వినిమయం బాగా కుదించుకుపోయింది. ఇది అనేకమంది ప్రజలను దుర్భర దారిద్య్రంలోకి నెట్టింది. వారిని ఆ పరిస్థితి నుండి బయట పడవేయడానికి కావలసిన ఏ చర్యలూ ఈ బడ్జెట్లో లేవు. జీడీపీ వృద్ధి రేటు కన్నా కూడా తక్కువ స్థాయిలోనే ప్రభుత్వ వ్యయాన్ని ఉండేలా పరిమితం చేశారు. కాని అదే సమయంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకోసం కేటాయింపులు బాగా పెంచారు. ఈ ప్రాజెక్టులలో అదానీ గ్రూపునకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండడమే దీనికి కారణం. వాటిలో కొన్ని ప్రాజెక్టులలో ప్రభుత్వానికి తోడు భాగస్వామిగా అదానీ గ్రూపు ఉంటుంది. మరి కొన్నింటికి ఇన్‌పుట్స్‌ను సరఫరా చేస్తుంది. అదానీ సంస్థలకు కావలసిన మార్కెట్‌ను సృష్టించడానికే ఈ బడ్జెట్ కేటాయింపులన్నీ తోడ్పడతాయి.
ఆర్థిక వనరులను కేంద్రం గుప్పెట్లో పెట్టుకునే ధోరణి ఒక్క ఫాసిస్టు ప్రభుత్వాలకే ఉంటుంది అని అనుకోలేం. గుత్త పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలన్నింటికీ ఈ లక్షణం ఉంటుంది. ప్రజలనుండి పోగేసిన వనరులను ప్రయివేటు గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసం వెచ్చించాలన్నదే వాటి విధానం. అలా కాకుండా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడం అంటే అది వారి దృష్టిలో ''సంపదను వృథాగా ఖర్చు చేయడమే.'' ఈ ధోరణి ఫాసిస్టు ప్రభుత్వాలున్నప్పుడు మరింత ప్రకోపిస్తుంది. ప్రజల్ని మత విద్వేష రాజకీయాలలో ముంచెత్తి తమ భౌతిక జీవితంలో మెరుగుదల గురించి ఆలోచించకుండా వారు ఉండేలా చేస్తూ మరోపక్క తమకు నచ్చిన గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసం ఆర్థిక వనరులను మళ్ళిస్తారు. మోడీ ప్రభుత్వం ఈ కేంద్రీకరణను తారాస్థాయికి తీసుకుపోతున్నది.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్