Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టార్ట్ రెండో ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన రష్యా!
అమెరికాతో ఉన్న నూతన వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం (స్టార్ట్) నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మంగళవారంనాడు రష్యన్ పార్లమెంటు సమావేశంలో ప్రకటించాడు. 1991లో కుదిరిన స్టార్ట్ ఒకటవ ఒప్పందం ప్రకారం రెండు దేశాలూ ఆరువేల చొప్పున అణ్వాయుధాలు, పదహారు వందల ఖండాంతర క్షిపణులు, బాంబర్లకు మించి కలిగి ఉండరాదు. దీని గడువు 2009లో ముగిసింది. తరువాత 2010లో కుదిరిన రెండవ ఒప్పందం ప్రకారం 2026 నాటికి రెండు దేశాలూ వాటిని ఇంకా తగ్గించాల్సి ఉంది. పుతిన్ ప్రకటన మీద అమెరికా స్పందన వెల్లడి కావాల్సి ఉంది. ఉక్రెయిన్ వివాదాన్ని పశ్చిమ దేశాలే ప్రారంభించాయని దాన్ని ముగించేందుకు రష్యా తన బలాన్ని వినియోగిస్తున్నదని పుతిన్ పార్లమెంటు సమావేశంలో చెప్పాడు. ఇప్పటికీ సంప్రదింపు లకు ద్వారాలు తెరిచే ఉంచామని పరస్పర సమానత్వం, భద్రత ప్రాతిపదికన అవి ఉండాలని అన్నాడు. నాటో విస్తరణ గురించి నిజాయితీలేని సమాధానాలు చెబుతున్నారని అన్నాడు. స్థానిక వివాదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు అమెరికా చూస్తున్నదని, ఉక్రెయిన్ పౌరులు తమ పశ్చిమ దేశాల యజమానుల చేతిలో బందీలుగా మారారని పుతిన్ అన్నాడు.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు జరిపిన అనేక యుద్ధాలు దశాబ్దాల తరబడి సాగినవి ఉన్నప్పటికీ 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కుదిపివేసింది. ఇప్పటికీ దాని ప్రతికూల పర్యవసానాలు ప్రభావం చూపుతూనే ఉన్నాయి. రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య శుక్రవారంనాడు రెండవ ఏడాదిలో ప్రవేశించనుంది. దాన్ని మరింతగా రెచ్చగొట్టేందుకు అవసరమైన అస్ర,్త శస్త్రాలను అందిస్తామని ఉక్రెయిన్ రాజధానికి సోమవారంనాడు ఆకస్మికంగా వచ్చిన అమెరికా అధినేత జో బైడెన్ వాగ్దానం చేసి వెళ్లాడు. ముందుగా ప్రకటిస్తే ఎటు నుంచి ఏ ముప్పు ఉంటుందోనని భయపడిన కారణంగానే కొద్ది గంటల ముందే సమాచారాన్ని వెల్లడించి కేవలం ఐదు గంటలు మాత్రమే కీవ్‌లో గడిపి పక్కనే ఉన్న పోలెండ్ వెళ్లాడు. గతవారంలో మ్యూనిచ్ నగరంలో జరిగిన భద్రతా సమావేశం తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
పదిహేను సంవత్సరాల తరువాత అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ రావటం ఇదే ప్రథమం. గతంలో బిల్ క్లింటన్ 1994, 1995, 2000 సంవత్సరాలలో, తరువాత 2008లో జార్జి డబ్ల్యు బుష్ కీవ్ సందర్శనకు వచ్చారు. జూనియర్ బుష్ పెట్టిన చిచ్చు చివరకు 2014లో ఉక్రెయిన్ ఏలుబడిలో ఉన్న తన ప్రాంతమైన క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పింది. దాని కొనసాగింపుగా సామ్రాజ్యవాదులు పన్నిన రష్యా ముంగిటకు నాటో విస్తరణ అన్న కుట్ర తన రక్షణకు 2022లో రష్యాను మిలిటరీ చర్యకు పురికొల్పింది. తొలుత సంప్రదింపు లంటూ లోకాన్ని నమ్మింప చేసేందుకు చూసినప్పటికీ తరువాత పశ్చిమ దేశాలకు అలాంటి ఉద్దేశ్యం లేదని స్పష్టమైంది. ఈ పూర్వరంగంలో ఇప్పుడు జో బైడెన్ పర్యటన ఏ కొత్త పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము.
జెలెనెస్కీ కోరుతున్న విమానాలు తప్ప టాంకులతో సహా ఉక్రెయిన్ పౌరులను రక్షించేందుకు అన్ని రకాల అస్త్రాలను మరింతగా సరఫరా చేస్తామని, రష్యామీద మరిన్ని ఆంక్షలను అమలు చేస్తామని జో బైడెన్ చెప్పాడు. ఒక వైపు ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పశ్చిమ దేశాల నాటో కూటమి మరోవైపు శాంతికోసం పుతిన్ వైపు నుంచి ఎలాంటి సూచనలు లేవంటూ ప్రచారదాడి చేస్తున్నది. ఇప్పటి వరకు పది దఫాలుగా రష్యా మీద ఆంక్షల తీవ్రతను పెంచుతున్నారు. మరో దఫాను ప్రతిపాదించారు. నాటో కూటమి ప్రకటనలను చూస్తుంటే మరో యుద్ధ రంగాన్ని తెరిచేందుకు సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు. మ్యూనిచ్ భద్రతా సమావేశం(ఎంఎఎస్‌సి) సందర్భంగా శనివారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్ స్టోలెన్‌బర్గ్ మాట్లాడుతూ ఈ రోజు ఐరోపాలో జరుగుతున్నది రేపు ఆసియాలో జరగవచ్చు అన్నాడు. ఎప్పటి నుంచో ఇప్పుడు ఉక్రెయిన్ తదుపరి తైవాన్ అన్న ప్రచారం సంగతి, వరుసగా చైనాను రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రష్యాకు మరింతగా చైనా ఆయుధాలు అంద చేయనున్నది అనే ప్రచారం కూడా జరుగుతున్నది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అదే సమావేశంలో దాన్ని పునశ్చరణ గావించారు. భారత్-చైనా రెండూ ఉక్రెయిన్ వివాదంలో తటస్థంగా ఉన్నాయి. రష్యా నుంచి మన దేశం ఎంత చమురు కొనుగోలు చేసినా ఆ మేరకు పుతిన్ సర్కార్‌కు లబ్ది చేకూర్చినా కనపడని తప్పు అదేపని చేస్తున్న చైనాలో పశ్చిమ దేశాలు చూస్తున్నాయి. రష్యా చమురును మన దేశం శుద్ది చేసి డీజిల్ ఇతర ఉత్పత్తులను అమెరికా, ఐరోపాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది.
నాటో కూటమిలోని జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు రష్యాను శత్రువుగా పరిగణిస్తున్న మాదిరి చైనా పట్ల లేవు. కానీ మొత్తం నాటోను, ఐరోపాను తమ గుప్పిట్లో ఉంచుకోవాలంటే రెండు దేశాల నుంచీ ముప్పు ఉందని, ఐరోపాను తాము తప్ప మరొకరు కాపాడలేరని నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. అందుకే రెండు దేశాలూ ఒకటే అని నూరిపోస్తున్నది. తైవాన్ సమస్యలో కూడా అందరం కలసి కట్టుగా ఉండాలని చెబుతున్నది. రష్యా గనుక ఉక్రెయిన్‌లో గెలిస్తే మొత్తం ఐరోపాకే ముప్పు అని చెబుతున్నది. తాము తమ దేశ స్వేచ్ఛ కోసమే గాక మొత్తం ఐరోపా కోసం పోరు సల్పుతున్నట్లు నిరంతరం జెలెనెస్కీతో చెప్పించటం కూడా దానిలో భాగమే. రష్యాను బూచిగా చూపి ఐరోపా రక్షణ బడ్జెట్లను పెంచుకోవాలని ఆ సొమ్ముతో తమ ఆయుధాలను కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నది. మరోవైపు జర్మనీ వంటి కొన్ని దేశాలు అమెరికా పట్ల అనుమానంతో చూస్తున్నాయి. రష్యా నుంచి ఐరోపా దేశాలకు ఇంథనాన్ని సరఫరా చేసే నోర్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ పేలుళ్ల వెనుక అమెరికా హస్తం ఉందని తెలిసిన తరువాత అవి ఉలిక్కిపడ్డాయి.
ఏడాది కాలంలో ఉక్రెయిన్ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగిస్తున్న నష్టం ఎంత అన్నది ఎవరూ చెప్పలేని స్థితి. ఈ ఏడాది చివరి నాటికి నష్టం 2.8లక్షల కోట్ల డాలర్లని ఓయిసిడి దేశాల సంస్థ అంచనా. ప్రపంచ ఆర్థికవేదిక ప్రపంచంలోని 87.4శాతం జనాభా ఉన్న 116దేశాలలో ఇంధన ధరల పెరుగుదల గురించి సర్వే జరిపింది. ప్రత్యక్ష, పరోక్ష కారణాలతో ఒక్కో కుటుంబానికి 63 నుంచి 113శాతం వరకు పెరిగాయి. అనేక దేశాల్లో చలికాచుకొనేందుకు అవసరమైన ఇంధనాన్ని కొనుగోలు చేయలేని కారణంగా ఇంధన దారిద్య్రంలో మునిగిన వారు, ఇతర జీవన వ్యయం పెరుగుదల వలన ప్రపంచబ్యాంకు దారిద్య్ర, దుర్భర రేఖకు దిగువకు వెళ్లిన వారు 7.8 నుంచి 14.1 కోట్ల మంది వరకు ఉంటారు. అమెరికా అంచనా ప్రకారం నలభైవేల మంది ఉక్రెయిన్ పౌరులు, రెండు దేశాలకు చెందిన సైనికులు లక్ష మంది చొప్పున మరణించి ఉంటారు. మరి కొందరు చెప్పినదాని ప్రకారం రెండు లక్షల మంది పుతిన్ సైనికులు మరణించిగానీ గాయపడి గానీ ఉంటారు. వీటిని ఎవరూ నిర్ధారించలేదు. అరవైఎనిమిది లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు దేశం విడిచి వెళ్లగా మరో 66లక్షల మంది స్వదేశంలో నెలవులు తప్పారు. జర్మనీకి చెందిన కెల్ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం గతేడాది జనవరి-అక్టోబరు కాలంలో పశ్చిమ దేశాలు అందించిన మిలిటరీ మద్దతు విలువ 40బిలియన్ డాలర్లు కాగా మానవతా పూర్వక సాయం15బి.డాలర్లు మాత్రమే. ప్రపంచ దేశాల సరఫరా గొలుసులన్నీ ఈ సంక్షోభంతో దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్దరించటం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేసుకొనేందుకు ఎంతో సమయం పడుతుంది.
కొద్ది వారాల్లోనే ఉక్రెయిన్ను దారికి తెచ్చుకుంటామన్న పుతిన్ అంచనాలు ఎలా తప్పాయో రష్యాను తరిమికొట్టామని చెప్పిన జెలెనెస్కీ మాటలు, పశ్చిమదేశాల ప్రచారం కూడా వాస్తవం కాదని ఏడాదిలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి. నిజానికి ఒక్క ఉక్రెయిన్ మిలిటరీ మాత్రమే రంగంలో ఉంటే వారాలు కాకున్నా నెలల్లో పరిష్కారం దొరికి ఉండేది. కానీ పశ్చిమ దేశాలు తమ సైనికులను పంపలేదు తప్ప తమ దగ్గర ఉన్న అధునాతన అస్త్రాలన్నింటినీ రంగంలోకి దించటంతో అంచనాలు తప్పాయి. ఇరవైశాతం ఉక్రెయిన్ ప్రాంతం స్వాతంత్య్రం ప్రకటించుకొని గానీ, రష్యా అదుపులో ఉందని గానీ చెబుతున్నారు. అనేక ఎదురు దెబ్బలు తగిలిన తరువాత పుతిన్ సేనలు ఎత్తుగడలు మార్చుకున్నాయి. ఒక వైపు సాధారణ పౌరుల ప్రాణనష్టం జరగకుండా చూడటం, పశ్చిమ దేశాల దన్ను ఉన్న జెలెనెస్కీ సేనలు, కిరాయి దళాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు సరికొత్త దాడులకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు. ఐరోపాలో చలికాలం ముగిసిన తరువాత అవి ప్రారంభం కావచ్చు. దానికి గాను అవసరమైన సరంజామా సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కొత్తగా మిలిటరీలోకి మూడులక్షల మందిని చేర్చుకున్నట్లు పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. జెలెనెస్కీ కోరినంత వేగంగా పశ్చిమ దేశాల సరఫరా ఉండటం లేదు.
రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఇచ్చేందుకు చైనా సిద్ధం అవుతున్నదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి బ్లింకెన్ సిబిఎస్ టీవీలో ఆరోపించాడు. ఇప్పటికే మారణాయుధాలు కాని వాటిని ఇస్తున్నదని త్వరలో వాటిని కూడా అందచేయ నుందని చెప్పాడు. చైనాలో ప్రయివేటు, ప్రభుత్వ కంపెనీలకు తేడా లేదని ఎవరు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినట్లుగానే భావిస్తామన్నాడు. పశ్చిమ దేశాల ఆంక్షలను నీరు గార్చేందుకు చైనా పుతిన్‌కు తోడ్పడుతోందని, చమురు, గ్యాస్, బొగ్గు దిగుమతి చేసుకుంటున్నదని ఆరోపించాడు. అనవసరంగా తమ వైపు వేలు చూపితే, బెదిరింపులకు దిగితే అంగీకరించేది లేదని చైనా స్పష్టం చేసింది. మ్యూనిచ్ సమావేశంలో చైనా ప్రతినిధి మాట్లాడుతూ కొన్ని శక్తులు సంప్రదింపులు జయప్రదం కావాలని గానీ పోరు త్వరగా ముగియాలని గానీ కోరుకోవటం లేదన్నాడు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించటం పాతబడిన సంగతి. పోరును సాగదీసేందుకు, కొత్త ప్రాంతాలలో ఏదో ఒకసాకుతో చిచ్చుపెట్టేందుకు పూనుకోవటం అన్నది తాజా పరిణామాలు ప్రపంచానికి ఇస్తున్న సూచికలు. రష్యాతో సాగుతున్న ప్రతిఘటన కార్యకలాపాలను చక్కదిద్దేందుకు ఉక్రెయిన్ వెళుతున్నట్లు అధికారికంగా చేసిన ప్రకటనలో జో బైడెన్ పేర్కొన్నాడు. ప్రపంచ శాంతి కోసం సామ్రాజ్యవాదుల పన్నాగాలను మరింతగా వివరించటం, జనాన్ని కూడగట్టేందుకు శాంతిశక్తులు మరింతగా రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288