Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యం రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది. ఆయుష్ను కలుపుకుని ఆరోగ్య రంగానికి 2023-24 బడ్జెట్లో రూ.92,803 కోట్లు కేటాయించగా, 2022-23లో రూ.89,251 కోట్లు కేటాయించింది. ముందటేడాది కంటే రూ.3,552 కోట్లు పెంచినట్లు కన్పించినా, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే కేటాయింపులు రెండు శాతం తగ్గాయి. ఈ ఆరోగ్య ఖర్చులు జీడీపీలో 0.3శాతం, బడ్జెట్లో 2శాతం కంటే తక్కువుగా ఉన్నాయి. ఈ కేటాయింపుల కోతను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వా నికి సామాన్య ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ, బాధ్యత లేదన్నది స్పష్టమవుతోంది. దేశ జీడీపీలో కనీసంగా ఐదు శాతం ఆరోగ్యానికి కేటాయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కానీ ప్రభుత్వం ఏనాడూ ఆ దిశగా బడ్జెట్ కేటాయించలేదు.
'జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రామ్' (ఎన్హెచ్ఎమ్పి)కు కేటాయింపుల తగ్గుదల పిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రభావం చూపుతుంది. మహిళల ఆరోగ్యానికి సంబంధిం చిన ఇతర కీలక అంశాలను ప్రస్తుత బడ్జెట్లో విస్మరించింది. ప్రధాన మంత్రి మాతృవందన యోజన వంటి పథకాలకు 2022-23లో రూ.2,622 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2023-24లో రూ.2,582 కోట్లకు కుదించింది. అంగన్వాడీ, పోషణ్ వంటి పథకాలకు పరిమితంగా రూ.291 కోట్లు కేటాయించింది. ఈ పథకంలోనే అంగన్వాడీ సేవలు, పోషణ అభియాన్, కౌమార బాలిక పథకం, జాతీయ శిశు సంరక్షణ పథకం వంటి ముఖ్యమైనవి ఉన్నాయి. ప్రభుత్వం ఐసిడిఎస్కు చేసిన కేటాయిం పులను 2014-15తో పోల్చి చూసినప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 'జాతీయ ఆరోగ్య మిషన్'కు రూ.1438 కోట్లు కేటా యింపులు తగ్గాయి. ఎన్హెచ్ఎమ్కు కేటాయింపులు తగ్గడంతో రాష్ట్రాలకు బదిలీ చేసే నిధులు తగ్గనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య సేవలు పేద కుటుంబాలకు అందని పరిస్థితి ఏర్పడనుంది. సురక్షిత మాతృత్వం, యూనివర్సల్ టీకా, వివిధ వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలపై నిధుల కోత ప్రభావం పడనుంది.
ఆరోగ్య రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యత తగ్గుతున్నది. పరిశోధన రంగానికి ఆరోగ్య బడ్జెట్లో మూడు శాతం కేటాయించింది. 2020-21లో ఆరోగ్య పరిశోధనల వాస్తవ వ్యయం 3.8శాతం కాగా, ఈ బడ్జెట్లో 3.1శాతానికి తగ్గింది. కోవిడ్ వ్యాక్సిన్లతో పాటు పలు ఆరోగ్య పరిశోధనలను చేపట్టిన ఐసిఎమ్ఆర్కు నిధులు తగ్గించింది. 2021-22లో ఐసిఎమ్ఆర్కు రూ.2,358 కోట్లు, 20 22-23 రూ.2,198 కోట్లు కేటాయించింది. 17శాతం నిధులు పరిశోధనలపై తగ్గించింది. ఈ ఏడాది కేటాయింపులు రూ.2359 కోట్లు. 2021-22 నాటి కేటాయింపులకు సమానంగా ఉంది.
కోవిడ్ కాలంలో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పిఎమ్జెఎవై) పథకం పేద, అణగారిన వర్గ ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడంలో ఘోరంగా విఫలమైంది. బీమా చెల్లింపులలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. 2021-22లో పిఎమ్జెఎవైకు రూ.6,400 కోట్లు కేటాయించి, రూ.3,115 కోట్లు ఖర్చుపెట్టింది. వాస్తవానికి పిఎమ్జెఎవై పథకం కింద 75శాతం చెల్లింపులు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నాయి. ఈ ఆస్పత్రులకు ప్రజాధనం దోచిపెట్టే పిఎమ్జెఎవై పథకం కంటే, ప్రజా ఆరోగ్య వ్యవస్థను పటిష్ట పరచడానికి ఆ నిధులు వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
జాతీయ టెలీ మెంటల్ హెల్త్ పథకాన్ని ప్రకటించినప్పటికీ, ప్రస్తుత జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్ర మాలు నిధుల సమస్యతో సరిగా నిర్వహించడం లేదు. 2021-22లో రూ.20.46 కోట్లు ఖర్చు చేసింది. మానసిక ఆరోగ్య పథకాలకు ప్రోత్సాహం లేకపోవడంతో టెలీ మెంటల్ హెల్త్ ప్రారంభ లబ్ధి సమాజంలో కొన్ని ఉన్నత వర్గాలకే పరిమితమైంది. ఎన్హెచ్ఎమ్పి ప్రారంభించిన చాలా ఏండ్ల తరువాత కూడా ఈ అంతరం కొనసాగుతున్నది. ఆయుష్మాన్ భారత్ కింద చేసిన కేటాయిం పులలో అధిక భాగం ఖర్చు చేయడంలేదు. పబ్లిక్ హెల్త్ కేర్ డెలివరీ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తూ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల తయారీకి ప్రాధాన్యత ఇవ్వడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పెద్ద ఐ.టి కంపెనీలు, వాణిజ్య ఆరోగ్య బీమా కంపెనీలకు ప్రయోజనకరంగా ఈ పథకం ఉంది.
ఆరోగ్య రంగానికి ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు చూస్తే కోవిడ్ పాఠాల నుంచి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ప్రపంచ వ్యాపితంగా అనేక మంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు రాబోయే ఆరోగ్య ప్రమాదాలపై పలు హెచ్చరికలు, సూచనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నాయి. ప్రయివేటు, కార్పొరేట్ వైద్యాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ విధానాలు కొనసాగి స్తున్నాయి. మహిళలు, పిల్లల ఆరోగ్య సేవలు, మానసిక ఆరోగ్య పథకాలు, ప్రధాన ఆరోగ్య పరిశోధనా కార్యక్రమాలు కలిగిన ప్రధాన జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రామ్ను బలోపేతం చేసే ప్రజారోగ్య వ్యవస్థకు నిధులు పెంచాలి. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగు పర్చాలి. అప్పుడే ప్రజలకు మేలు.
- టి. కామేశ్వరరావు
సెల్: 9985250991