Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నన్ను బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే...'' తనను రక్షించమని భక్త రామదాసు (కంచర్ల గోపన్న) ఆర్ద్రతతో మొరపెట్టుకున్న వైనం. రాముడు, లక్ష్మణుడు గోల్కొండ నవాబు తానీషాను కలిసి రామదాసు బాకీ తీర్చేసి అతన్ని ఖైదు నుండి విడిపించారన్న కథను తెలుగు రాష్ట్రాలలో వినని వారు ఉండరు. అయితే, దేశీయ బీమా రంగ ప్రయోజనాల కోసం బీమా ప్రీమియంపై జీఎస్టీ భారాన్ని తగ్గించమని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్(మొత్తం దేశీయ జీవిత బీమా కంపెనీల సమాఖ్య) గత కొన్నేళ్లుగా మొర పెట్టుకుంటున్నా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏమాత్రం కరుణించలేదు. తాజా జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో పెన్సిల్ షార్ప్ (నర్)లపై మాత్రం జీఎస్టీని 18శాతం నుండి 12శాతానికి తగ్గించారు. ఏడాదికి లక్షల కోట్ల రూపాయలు బీమా రంగం నుండి ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో అందుతున్నా, బీమా రంగ విన్నపాలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.
గత కొన్నేళ్లుగా అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ) బీమా ప్రీమియంపై 18శాతం పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ స్ఫూర్తి వంతమైన పోరాటాన్ని కొనసాగిస్తోంది. బీమా రంగంలో జీఎస్టీ భారాన్ని తగ్గించాలని ఉద్యోగులు, ఏజెంట్లతో కలిసి దేశవ్యాప్తంగా 46 లక్షల పాలసీదారుల చేత ఆనాటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖలు రాయించింది. ఇప్పుడు కూడా దాదాపు 450మంది పార్లమెంట్ సభ్యులను కలిసి వినతిపత్రాలను అందజేసింది.
దీనిపై దేశంలోని అనేక మంది పార్లమెంట్ సభ్యులు లోక్‌సభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. భారత ప్రభుత్వం 1 జూలై 2017 నుండి వస్తువులు, సేవా పన్ను (జీఎస్టీ) బిల్లును రూపొందించింది. ఇది ప్రజల, దేశం శ్రేయస్సు కోసం కంటూ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన పన్ను సంస్కరణ. ఆహార ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పాలు వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీని జీరోగా నిర్ణయించారు. ఆహారం, దుస్తులు, నివాసం తర్వాత, బీమా రక్షణ ప్రజలకు ముఖ్యమైన అవసరం. అందుకని, ప్రభుత్వం పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా బీమా పథకాల ద్వారా పొదుపును ప్రోత్సహించాలి. అప్పుడు మాత్రమే బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి బీమా చేయదగిన ప్రజలు ఆకర్షితులవుతారు. కాబట్టి ఇది దేశంలో ఎక్కువ బీమా వ్యాప్తికి సహాయపడుతుంది. పాలసీదారు అకాల మరణం సంభవించినప్పుడు అతని కుటుంబానికి అవసరమైన ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా, దేశ నిర్మాణ కార్యకలాపాల కోసం ప్రజల దీర్ఘకాలిక పొదుపును పెట్టుబడి పెట్టడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తుంది. జీవిత బీమా ఉత్పత్తులపై జీఎస్టీని నిర్ణయించేటప్పుడు ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని మేము అభిప్రాయపడ్డాము. కానీ, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్, యులిప్ పాలసీలపై జీఎస్టీ 18శాతంగా, లైఫ్, పెన్షన్ ఉత్పత్తుల సింగిల్ ప్రీమియంతో సహా కొత్త బిజినెస్ ప్రీమియంపై జీఎస్టీ 4.5శాతంగా నిర్ణయించబడింది. అయితే రెన్యూవల్ ప్రీమియంలకు 2.25శాతం సింగిల్ ప్రీమియం యాన్యుటీలకు 1.8శాతంగా జీఎస్టీ నిర్ణయించబడింది. జీవిత బీమా ఉత్పత్తులు, ప్రీమియంలపై జీఎస్టీ విధించడం పాలసీదారులపై భారం మోపడమే గాక వారి పొదుపును నిరుత్సాహ పరుస్తుంది. బీమా పరిశ్రమ వృద్ధికి ఇది ప్రతిబంధకంగా మారనుంది. ప్రభుత్వం బీమా రంగంలో జీఎస్టీను తగ్గించాలని అనేక మంది పార్లమెంట్ సభ్యులు వివిధ సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరారు. అయినా, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం లక్ష్య పెట్టడంలేదు.
ఐఆర్డిఏ (బీమా నియంత్రణ సంస్థ) పూర్వ సభ్యులు నీలేష్ సాఠే ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు... ''దేశంలో అందరికీ సామాజిక భద్రతలేని పరిస్థితుల్లో, బీమా చేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. అన్ని నిత్యావసర వస్తువులు, సేవలు జీఎస్టీ పరిధిలోంచి తప్పిస్తున్న నేపధ్యంలో బీమా ప్రీమియంపై ఇంత పన్నా!! ప్రపంచంలో ఏ దేశంలో కూడా బీమా ప్రీమియం మీద ఇంత పన్ను వేయట్లేదు. ఆర్థిక సేవలు అయినప్పటికీ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్ల సేవల మీద జీఎస్టీ లేదు. బీమా ప్రీమియం మీద కనీ విని ఎరగని పన్ను భారం మోపుతున్నారు. యాన్యుటీ పాలసీలపై కూడా ఇంత పన్ను భారమా'' అని నీలేష్ సాఠే వాపోయారు.
ఎల్ఐసి చైర్పర్సన్ ఎంఆర్ కుమార్ సైతం బీమా ప్రీమియమ్‌లపై మాట్లాడుతూ... ''జీవిత బీమా ప్రీమియంలపై 18శాతం జీఎస్టీ లెవీ చాలా ఎక్కువగా ఉందన్నారు. భారతదేశంలో బీమా ఇప్పటికీ విక్రయించబడుతోంది. కొనుగోలు చేయబడలేదు. ప్రజలు బీమాను కలిగి ఉండటం ఒక సంపూర్ణ అవసరం. అందుకే ఎల్ఐసి సంస్థ దాని కోసం పని చేస్తోంది. మేము మా ఏజెంట్లు, మధ్యవర్తులకు ప్రజలకు బీమా రక్షణ ఇవ్వాలని చెబుతాము.'' ''జీఎస్టీలో ప్రజలకు కొంత తగ్గింపు చేసినట్లయితే అర్థవంతంగా ఉంటుంది. వాస్తవానికి, ఎల్ఐసి చాలా పాత పాలసీలపై జిఎస్టి భారాన్ని ఇప్పటికే భరిస్తూ ఉంది, అయితే, ప్రస్తుతం అది పాలసీ హౌల్డర్లకు బదిలీ అయ్యింది. వార్షిక బీమా ప్రీమియంలపై ఎటువంటి జీఎస్టీ విధించకూడదనే అంశం మరింత బీమాను విక్రయించడానికి కంపెనీకి సహాయపడవచ్చు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
విలాస వస్తువు లైన బంగారంపై 3శాతం, నగిషీ చెక్కిన డైమండ్లపై 0.25శాతం పన్ను విధిస్తూ ,ప్రాణాధార మందులు, ప్రాణవాయువుపై 12 నుండి 18శాతం జీఎస్టీ భారమా!! ప్రజలకు సామాజిక భద్రత, ఆరోగ్య బీమా సేవలు అందిస్తున్న బీమా రంగంపై 18శాతం జీఎస్టీ నా!! ప్రపంచంలో ఏ దేశంలో కూడా సామాజిక భద్రతపై 18శాతం పన్ను లేదు. ప్రజల పొదుపుపై పన్ను, మందులు, సామాన్యులు వాడే ఆహార పదార్థాలు, వస్తువులపై అధిక జీఎస్టీ విధించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి!!
2021-22లో జీవిత బీమా పరిశ్రమ నుండి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు రూ.49,52,187 కోట్లు) కాగా, అందులో ఒక్క ఎల్ఐసి (రూ.36,79,475కోట్లు) వాటా 74.3శాతం ఉంది. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో మొత్తం బీమా పరిశ్రమ రూ.18,94,074 కోట్లు పెట్టుబడులు పెట్టగా, అందులో ఎల్ఐసి వాటా రూ.15,40,381 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రాజెక్టులలో మొత్తం బీమా పరిశ్రమ రూ 10,79,100 కోట్లు పెట్టుబడులు పెట్టగా, అందులో ఎల్ఐసి వాటా రూ.10,04,957 కోట్లు ఉంది.
ఎల్ఐసి ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.లక్షల కోట్ల పెట్టుబడులు అందుతున్నాయి. ప్రభుత్వ అంతర్గత నిధుల సమీకరణలో ఎల్ఐసి వాటా 25శాతం పైబడి ఉంది. 31 మార్చి 2022 నాటికి ఎల్ఐసి రూ.36 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రజా సంక్షేమానికి అందించింది. ఇందులో రూ.26.86 లక్షల కోట్ల పైబడి నిధులను కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలలో, హౌసింగ్, నీటిపారుదల సౌకర్యాల కల్పన కోసం ఎల్.ఐ.సి కేటాయించింది. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (1 ఏప్రిల్ 2012 నుండి 31 మార్చి 2017 వరకు) రూ.14,23,055 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎల్.ఐ.సి సమకూర్చింది. 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (1 మార్చి, 2017 నుండి 31 మార్చి 2022) దాదాపు రూ.28 లక్షల కోట్ల పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసి అందించింది. దేశ అంతర్గత వనరుల సమీకరణలో ఎల్.ఐ.సి వాటా 25శాత పై మాటే. 99శాతం పైబడి క్లెయిమ్‌లను పరిష్కరించడం ద్వారా ఎల్ఐసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసి 2 కోట్ల పైబడి క్లెయిమ్స్ చెల్లించి ప్రపంచంలోనే క్లెయిమ్ పరిష్కారంలో అత్యుత్తమ బీమా సంస్థగా పేరెన్నికకంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశీయ జీవిత బీమా పరిశ్రమ 15.87లక్షల డెత్ క్లయిములు పరిష్కరిస్తే, అందులో ఒక్క ఎల్ఐసి సంస్థనే 13.49లక్షల డెత్ క్లైములను(రూ 28,408 కోట్ల మొత్తాన్ని) పరిష్కరించింది. బీమా ప్రీమియమ్‌లపై పన్ను భారాన్ని తగ్గిస్తే ఎల్ఐసి సంస్థ పాలసీదారులకి ఇంకా మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు అందించగలదు. పాలసీదారులు కూడా మరింత ఉత్సాహంతో పాలసీలు తీసుకునే అవకాశం ఉంది. స్విస్ రే అనే సంస్థ అంచనాల ప్రకారం 2032 కల్లా భారత్ ప్రపంచంలో 6వ అతిపెద్ద బీమా మార్కెట్‌గా ఎదగనుంది. 2021లో కోవిడ్ మహమ్మారి దెబ్బకు మన దేశంలో 22.5శాతం ఆరోగ్య బీమా ప్రీమియమ్‌లు పెరిగాయి. 2022లో ఆర్థిక వ్యవస్థ కోవిడ్ తదనంతర పరిస్థితుల నుంచి కోలుకున్నాక, మోటార్ ప్రీమియమ్‌లు సైతం దాదాపు 2.9శాతం పైబడి పెరిగాయి. మరి ఆరోగ్య బీమాపై, థర్డ్ పార్టీ ప్రీమియంపై 18శాతం పన్ను భారం మోపడం, ప్రజలు తమకు తాము కల్పించుకునే సామాజిక భద్రతపై భారం వేయడం కాదా!! బీమా వ్యాప్తి విషయంలో 2021-22లో మన దేశం (4.2శాతం) చైనా(2.4శాతం)ను, బ్రిటన్ (3.0శాతం)ను దాటి ఉండడం విశేషం. 2017-22 మధ్య కాలంలో దేశీయ బీమా పరిశ్రమ మొత్తం ప్రీమియం ఆదాయం విషయంలో 11శాతం, నూతన వ్యాపార ప్రీమియంలో 17శాతం కాంపౌండ్ వృద్ధి సాధించి ంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల నడుమ దేశీయ బీమా రంగం ఈ పురోగతి సాధించింది.
2047 కల్లా ప్రతీ పౌరునికి బీమా సౌకర్యం కల్పించాలనే నినాదాన్ని బీమా నియంత్రణ సంస్థ (ఐఅర్‌డిఏ) ఇచ్చింది. ఇది సాకారం కావాలంటే దేశంలో ఉన్న 44కోట్ల మిల్లెన్నియల్స్(యువ ఉద్యోగులు)ను జీవిత బీమా పరిశ్రమ ఆకర్షించాలి. మరి అలా జరగాలంటే, బీమా ద్వారా చేసే పొదుపు ఆకర్షణీయంగా ఉండాలి. బీమా పొదుపుపై ఇంతంత భారాలు మోపితే అది సంస్థకూ, పాలసీదారులకు భారం కాదా? 'ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా...' అని పాడి భక్త రామదాసు సాక్షాత్తూ శ్రీ రామచంద్రున్నే నిలదీశాడు. సహేతుకమైన అంశంపై ఎవరినైనా ప్రశ్నించే సంస్కృతి మనది. దేశీయ బీమా రంగం నుంచి దేశ సర్వతో ముఖాభివృద్ది పేరుతో ఏడాదికి రూ.5లక్షల కోట్ల పెట్టుబడులను జుర్రుకుంటున్న ప్రభుత్వాన్ని 40 కోట్ల పాలసీదారులు నిలదీయాల్సిన అవసరం ఉందా, లేదా?? ఏఐఐఈఏ, ఏజెంట్ల సంఘాలు ఇప్పటికే అనేక ఉద్యమాల, పోరాటాల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. బీమా ప్రీమియంపై అన్యాయంగా మోపుతోన్న జీఎస్టీ భారం తగ్గించాలని బీమా రంగ ఉద్యోగులు, ఏజెంట్లు, పాలసీ దారుల సహకారంతో సమరశీల పోరాటాలు భవిష్యత్‌లో కూడా కొనసాగించ వలసి ఉంది.
- పి. సతీష్
సెల్:9441797900