Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది పెళ్ళిళ్ళ సీజన్, రిసెప్షన్ల సీజన్. ఎక్కడ చూసినా జనం జనం. నగరం మధ్యలో పార్కింగు లేక తాము ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఈ పెళ్ళిళ్ళ మండపాలు గార్డెన్లుగా అవతార మెత్తి ఊరి బయటకు దారితీశాయి. కొంత ప్రయోజనమే. కొంత దూరమే అయినా తప్పదు. ఆ రెండు గంటలూ హాయిగా ఉండొచ్చు. ఈ సీజనంతా పెళ్ళి చుట్టూ ఉండే అవసరాలతో ఎందరికో జీవనోపాధి. వాళ్ళలో ఫొటోగ్రాఫర్లు ఒకరు. ఎంతో ఓపిక, సహనం, పట్టుదల ఉంటే కాని ఈ రంగంలో ఉండడం కష్టం. కష్టమైనా సరే వాళ్ళు ఎంతో కొంత టేస్ట్ ఉండబట్టి అలా ఫొటోగ్రాఫర్లుగా నిలబడగల్గుతారు.
విత్ ద ఫొటోగ్రాఫర్ అని రచయిత స్తీఫెన్ లీకాక్ ఒక చిన్న కథ రాస్తాడు. నలుపు తెలుపు ఫొటోలున్న కాలంలో ఫొటో తీసుకుందామని స్టూడియోకు పోతాడు రచయిత. ఈయన మొహం చూస్తేనే ముభావంగా చూస్తాడు ఫొటోగ్రాఫర్. అంటే నీ మొహం ఫొటోకు పనికి రాదు అన్నట్టు. ఎలాగో తీయించుకొని బయటపడతాడు. చెప్పిన రోజుకు ఫొటో తీసుకుందామని పోతే ఒక ఫొటో చేతిలో పెడతాడు. ఆ ఫొటోలో కనిపించే తల, కళ్ళు, ముక్కు, చెవులు తనవి కాదు, ఏమంటే అవి బాగా లేవని మార్చానంటాడు, టచప్‌లు ఇచ్చానంటాడు. ఇది నా చిత్రం కాదు నీదగ్గరే ఉంచుకో అని బాధగా వెళ్ళిపోతాడు రచయిత. ఆ కథలో ఎంతో వ్యంగ్యం ఉంటుంది. ఫొటోగ్రాఫర్లు ఇలా కూడా ఉండేవారన్నమాట. ఓ తెలుగు సినిమాలో బ్రహ్మానందానికి ఇలాంటి సీను పెట్టారు కూడా. ఇప్పుడు కూడా హెచ్.డి అని, బ్యూటిఫై అని ఎవరినైనా సినిమా హీరోల్లా చూపేవాళ్ళూ ఉన్నారు. సెల్లుల్లో అలా చేసేవాళ్ళూ ఉన్నారు.
ఫొటోగ్రాఫర్లు ఈ సీజనంతా యమా బిజీ. ముందుగానే మాట్లాడుకోకపోతే వాళ్ళు కూడా ముక్కు పిండి వసూలు చేస్తారంటారు. కానీ ఎవరు మాత్రం ఆ పని చేయడం లేదు చెప్పండి. ఆ లెక్కన పురోహితుడి దగ్గరి నుండి అందరూ చెట్టుపైన కూచొని ఉంటారు. ఎలాగోలా వాళ్ళను దింపుకొని తమ పనైపోగుట్టుకున్నాక వారిని కామెంట్ చేసే ఈ సో కాల్డ్ మనుషులు తరువాత పలకరించను కూడా పలకరించరు. సంవత్సరంలో ఎన్నోరోజులు వాళ్ళు రెస్టు తీసుకోవలసిందే పాపం. ఏమైతేనేం ఇతరత్రా ఎన్నో చోట్ల పనిచేసి కాలం గడుపుకొస్తారు ఈ ఫొటోగ్రాఫర్లు. మస్తు స్మార్టు సెల్లులు వచ్చి వీళ్ళ డిమాండ్ తగ్గింది. కానీ నలుపు తెలుపు ఫిల్ముల కెమెరాలనుండి, రంగురీళ్ళు వచ్చాక తమను తాము చూసుకునే పనిలో ఈ ఫొటోగ్రాఫర్లే సహాయం చేశారని మరుస్తారు కొందరు.
ఇక పెళ్ళిలో వీళ్ళ హడావుడి అంతా ఇంతా కాదు. కొందరైతే తమ ప్రతాపాన్ని, నైపుణ్యాన్ని కలగలిపి ఎన్నెన్నో కోణాల్లో ఫొటోలు తీస్తారు. పైత్యాన్ని కూడా కలుపుతారని మా మిత్రుడంటూ ఉంటాడు. తాళి మళ్ళీ కట్టమన్నా, దండ మళ్ళీ వేయమన్నా, తలంబ్రాలు తిరిగి వేయమన్నా చేయాల్సిందే. అది ఫొటోగ్రాఫర్ పవరంటే. ఎందరో పురోహితులు ఈ ఫొటోగ్రాఫర్లు తమ పనికి అడ్డు తగులుతున్నారని అంటూ ఉంటారు. వీళ్ళు వింటూ ఉంటారు కాని తాము చేసేది చేస్తూనే ఉంటారు. తలంబ్రాలు వేస్తుంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ల మధ్యలో దూరిపోయి పెళ్ళికొడుకు తలంబ్రాల చేతుల కిందినుంచి ఫొటో తీస్తున్న ఒక ఫొటోను వాట్సప్‌లో పెట్టారు మిత్రులు. అది నిజమైనా కాకున్నా వాళ్ళు పడే కష్టమంతా పెళ్ళివాళ్ళకోసమే కదా!
పెళ్ళిలో ఫొటోలు, వీడియో తీస్తుంటారు కాబట్టి జనాలు ఓ క్రమశిక్షణతో కూర్చొని ఉంటారు. కొద్దిగా నవ్వు మొహం కూడా పెడుతుంటారు. సడన్‌గా డ్రోన్ కెమెరా పైనుండి పోతుంటుంది హెలికాప్టరు లాగా. అంతకు ముందు క్రేన్ లాంటి యంత్రాలతో తీసేవారు. ఇలా టెక్నాలజీ కొత్త కొత్త రూపాలు ధరించినప్పుడంతా ఈ ఫొటోలు కూడా అతీతం కాదు కాబట్టి అవీ వాటిని ఉపయోగించుకుంటాయి. ఫొటోగ్రాఫర్లు లేదా ఆపరేటర్లు ఉంటేనే ఈ వీడియోలు, ఫొటోలు వస్తాయా అంటే లేదు అని సమాధానమొస్తుంది. సీసీ కెమెరాలు వాటంతట అవే ఇరవైనాలుగు ఇంటూ ఏడు అన్నట్టు పనిచేస్తుంటాయి. చివరికి క్రికెట్ మ్యాచుల్లో కూడా మూడో అంపైర్ రూపంలో వీడియో చూసి మరీ బల్లేబాజ్ అవుటా కాదా! అని నిర్ణయిస్తారు. ఇక గూగుల్‌లో కూడా కృత్రిమ ఉపగ్రహాలు పంపే చిత్రాల ద్వారా మనం చూడొచ్చు.
సినిమా షూటింగులు తీసే ఫొటోగ్రాఫర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్నిచోట్లా ఉన్నట్టుగానే అక్కడా శ్రమదోపిడీ ఉంటుంది. హీరో ఎంతబాగా చేసినా సరిగా రానట్టు తీసి అందరి సమయాన్ని వేస్టు చేయొచ్చు వాళ్ళు కోపమొస్తే. కాని అలా చేయరు. ఎందుకంటే శ్రమ విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి. ఎక్కడో కొండల్లో, అడవుల్లో, ఎడారుల్లో ఇంకా సెట్టింగుల్లో పగలూ రాత్రి తేడా లేకుండా షూటింగులో జరిగేదంతా షూట్ చేస్తుంటారు. మూడు షిఫ్టులు చేసిన హీరోల గురించి, హీరోయిన్ల గురించి రాస్తారు కాని వీళ్ళ గురించి రాయాల్సినంతగా రాయరు. ఏ అవార్డో వచ్చినప్పుడు మాత్రం ఆకాశానికెత్తేస్తారు.
ముందే అనుకున్నట్టు ఈ ఫొటోలు, వీడియోలు ఓ నిఘాగా మనం అర్థం చేసుకోవాలి. సమాజాన్ని చిత్రించే కవులు, కళాకారులు తమ కలాలతో, తమ కళారూపాలతో దేశంలో, రాజకీయాల్లో ఏమి జరుగుతోందని ఆరా తీస్తూ వాటిని ప్రజలకు చూపిస్తుంటారు. ఒక విధంగా వాళ్ళు జరుగుతున్న దాన్ని చూపే ఫొటోగ్రాఫర్లే అనుకోవాలి. జరిగే ప్రతి విషయాన్ని రికార్డు చేస్తుండడం వారి ప్రత్యేకత. ఆ భయంతోనే వారి నోరు నొక్కేసే వాళ్ళూ ఉన్నారనుకొండి, అయినా ఈ రికార్డు చేసేవాళ్ళు వెనక్కు పోరుగాక పోరు. ఎంత శంఖమూదినా చెవిటి ప్రభుత్వాలు వినిపించినా విననట్టు నటిస్తుంటాయి. చెవుల్లేని పాము కూడా ఆడించేవాడు తిప్పినట్టు తన తలను ఆడిస్తుంది. వినబడీ వినబడనట్లు నటించేవాడిని ఎవ్వరూ మార్చలేరు. అటు శంఖం ఊదేవాళ్ళు విసిగిపోయినా మళ్ళీ మళ్ళీ ఊదుతూనే ఉంటారు. ప్రజలు కూడా విసుగొచ్చి వాత ఎక్కడ పెట్టాలో ఎప్పుడు పెట్టాలో నిర్ణయిస్తూ ఉంటారు. మూడో అంపైర్ వీడియో క్లిప్పింగులు చూసి నిర్ణయం ప్రకటించినట్టు మొత్తం చూసి మరీ అవుట్ చెబుతారు. అప్పుడు కానీ నిత్యం గమనించే ఫొటోగ్రాఫర్లు ఉన్నారని తెలియదు కొందరు జనాలకు.
పైన చెప్పుకున్న ఓపిక, సహనం, పట్టుదల ఎక్కువగా ఉండబట్టి వాళ్ళు ప్రజలవైపే నిలబడతారు. కొద్దిమందైనా ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా నిలబడి ప్రజల గొంతును తమగొంతుగా వినిపిస్తారు. ప్రజలవైపు నిలబడే పత్రికల్లో రాస్తారు, ఏ టీవీయైనా ప్రజల గొంతుతోనే మాట్లాడతారు, ప్రజలకూ, నిజాలకు భయపడేవాళ్ళు ఎన్ని ట్రోలింగులు చేసినా విసుగు చెందక, సహనం కోల్పోక తాము చెప్పేది నిజం కాబట్టి తగ్గేదే లేదని మరీ దూసుకుపోతారు. వీళ్ళంతా ప్రజలకు చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లూ కాక మరేమిటి చెప్పండి!!
- జె. రఘుబాబు
సెల్: 9849753298