Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంజయ్ రాయ్
అదానీ గ్రూపు కంపెనీలపై హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదిక చూపించిన ప్రభావంతోను, దానికి భారత ప్రభుత్వం రాజకీయంగా స్పందించిన తీరుతోను భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చవిచూస్తున్న కొన్ని ఆందోళనకరమైన ధోరణులు బయటపడ్డాయి. భారత ప్రభుత్వం బడా పెట్టుబడికి రక్షణగా స్పందించిన విధానం అంత ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. నిజానికి గత రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రభుత్వం చేస్తున్నది అదే. ఇక ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అనేది కూడా అంత కొత్తదేమీ కాదని మనదేశంలో ప్రభుత్వానికి, పెట్టుబడి దారులకు మధ్య ఉండే సంబంధాల చరిత్రను పరిశీలించేవారికి తెలుస్తుంది. ఈ దేశంలో గుత్త పెట్టుబడిదారులు అమలులో ఉండే నియమ నిబంధనలను ప్రమాదకరమైన రీతిలో ఉల్లంఘించినప్పుడు వారిని అదుపు చేయవలసి వచ్చిన సందర్భాలలో ఏదో ఒక విధంగా వారికి ప్రయోజనాలు చేకూరేలా వ్యవహరిస్తూ, పాలకులు జాతీయ ప్రయోజనాలకు ద్రోహం చేస్తూనే ఉన్నారు.
తక్కినవారిని పక్కకు నెట్టి అత్యధిక ప్రయోజనాలను తమ స్వంతం చేసుకోడానికి అమలులో ఉండే నియమ నిబంధనలను మసిపూసి మారేడుకాయ చేయడం, అందుకోసం రాజకీయ అధినేతతో అత్యంత సన్నిహిత సంబంధాలను నెరపడం ఈ బడా పెట్టుబడిదారులకు మొదటినుంచీ అలవాటే. నయా ఉదారవాద విధానాల అమలు మొదలయే మునుపు కొన్ని రంగాలలో కొద్ది బడా వ్యాపార సంస్థలమీదే అతి ఎక్కువగా ఆధారపడవలసిన సందర్భాలు తటస్తించినప్పుడు దానిని లోతుగా పరిశీలించిన దరిమిలా ఈ వ్యవస్థ రూపొందించిన నియమ నిబంధనలు గౌరవింపబడేటట్టు చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా ఏర్పరచిన కట్టుబాట్లను సైతం అతిక్రమించడం, బడా గుత్త పెట్టుబడిదారులు మరింత ఎక్కువగా ఆర్థిక సంపదను పోగేసుకోవడం కొనసాగింది.
ఇప్పుడు అదానీ వ్యవహారం మీద దుమారం రేగుతున్నప్పుడు దేశంలోని అత్యున్నత పదవిని అధిష్టించిన వ్యక్తి ఆ చర్చను పూర్తిగా వేరే దిశలో పక్కదోవ పట్టించేవిధంగా జోక్యం చేసుకున్న తీరుకు ఈ దేశ ప్రజానీకం ఆశ్చర్యపోయింది. దేశ ప్రధాని తన అధికారాన్ని ఉపయోగించి ఒక వ్యాపార సంస్థకి అత్యధిక ప్రయోజనాలు కల్పిస్తూ తక్కినవారికి అవకాశం లేకుండా చేసిన విధానాన్ని, కొందరిని బలవంతంగా లొంగదీసుకున్న విధానాన్ని అనేకులు అనేక విధాలుగా ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగా సాగుతున్న అవినీతి పద్ధతులను, తప్పుడు మార్గాల ద్వారా అదానీ కంపెనీల షేర్లను ఎక్కువ విలువ ఉన్నట్టు చూపించడాన్ని ప్రశ్నించడం అంటే అది భారతదేశం సాధించిన విజయాలను ప్రశ్నించడమే అని, ప్రపంచవ్యాప్త మదుపుదారుల ముందు భారతదేశాన్ని తక్కువ చేసి చూపడమే అని ప్రధాని వ్యాఖ్యానించారు.
పార్లమెంటులో ఏ ప్రశ్న లేవనెత్తినా, తమకు మెజారిటీ ఉంది అన్న వాదనతో ఆ ప్రశ్నలను పట్టించుకోకపోవడమో, పక్కకు నెట్టివేయడమో, లేక బలవంతంగా తమ మాట నెగ్గించుకోవడమో పరిపాటి అయిపోయింది. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం తెచ్చిపెట్టే ధోరణి. తమ పార్టీకి మెజారిటీ ఉంటే చాలు. ఇక ప్రజలకు ఏ విషయంలోనూ జవాబు చెప్పనవసరం లేదన్నమాట!
సరళీకరణ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ యావత్తూ ఎటువంటి ఆర్థిక నిర్మాణ చట్రం పరిధిలో బిగించివేయ బడుతుందంటే అందులో ద్రవ్య పెట్టుబడి, కార్పొరేట్ల ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా,ప్రజల ప్రయోజనాలుగా పరిగణించబడే పరిస్థితి ఏర్పడుతుంది. బడా కార్పొరేట్లు దేశ ఆర్థిక వ్యవస్థతో అంతకంతకూ మరింత ఎక్కువగా పెనవేసుకుపోతున్నారు. మరో పక్క ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు ఉపసంహరించ బడుతున్నాయి. వాటి వాటాలు స్టాక్మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. ఆ స్టాక్‌మార్కెట్ పదే పదే కుదేలవుతూ, షేర్ల విలువలు కరిగిపోతున్నాయి. మదుపుదారులలో అవి తీవ్ర ప్రకంపనలు కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా లేదన్నదానికి సంకేతాలు. ఆర్థిక వ్యవస్థలో అంతకంతకూ ద్రవ్య పెట్టుబడి పాత్ర పెరుగుతూ పోతోంది. ఆ స్టాక్‌మార్కెట్ జూదంలో కార్పొరేట్ల లాభాలు అంతకంతకూ పెరుగుతుంటే మరోపక్క అక్కడ సంభవించే నష్టాలు మాత్రం సామాన్య మదుపుదారుల నెత్తిమీద పడుతున్నాయి. ఈ విధంగా జరగడం దేశ ప్రయోజనాలకోసమే అన్న భ్రమ, కార్పొరేట్ల ప్రయోజనాలే దేశ ప్రజల ప్రయోజనాలు అన్న భ్రమ అంతకంతకూ మరింత బలపడుతోంది. ఇప్పుడు అదానీ పెట్టుబడులు దేశంలో ఎంత ఎక్కువగా ఉన్నాయంటే, స్వయానా ప్రధాని ఆదరణతో అవి ఎంత విస్తరించాయంటే, దాని పర్యవసానంగా ఇప్పుడు అదానీ కుప్పకూలడం అంటే భారతదేశమే కుప్పకూలడం అన్న ఆందోళన కలుగుతుందన్నమాట.
మౌలిక వసతుల కల్పన రంగంలో అదానీ గ్రూపు
సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీకి చెందిన క్యాప్ ఎక్స్ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం అదానీ గ్రూపు ప్రస్తుతం చేపట్టినవి గాని, చేపట్టనున్నట్టు ప్రకటించినవి గాని మౌలిక వసతుల కల్పన రంగపు ప్రాజెక్టులు 191 దాకా ఉన్నాయి. వాటిలో సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు ఉన్నాయి. ఇవి గాక ఇప్పటికి 123 పెద్ద ప్రాజెక్టులు పూర్తి అయాయి. వాటి విలువ లక్ష కోట్ల రూపాయలకు పైబడే ఉంటుంది.
కొత్తగా పెట్టుబడులు పెడుతున్న ప్రాజెక్టులలో 13పోర్టులు, 33సౌర, పవన, జల విద్యుత్తు ప్రాజెక్టులు, 12సాంప్రదాయ విద్యుత్తు ప్రాజెక్టులు, విద్యుత్తు ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు, సిమెంటు ప్రాజెక్టులు వంటివి ఉన్నాయి. భారీ ప్రాజెక్టుల పెట్టుబడులు రెండేండ్లపాటు పెడతారు. ప్రస్తుతం కొనసాగుతున్న పెట్టుబడుల విలువ సుమారు రూ.7.168 లక్షల కోట్లు. మన దేశంలో ఒక ఏడాదిలోపు పూర్తి అయ్యే మొత్తం ప్రాజెక్టుల విలువతో సమానమైన విలువ కల ప్రాజెక్టులు తాము చేపడుతున్నట్టు అదానీ గ్రూపు ప్రకటించింది. దానిని బట్టి భారతదేశంలో మౌలిక వసతుల కల్పన రంగంలో అదానీ గ్రూపు సంస్థలదే సింహభాగం అని స్పష్టం అవుతోంది.
ఇక అదానీ గ్రూపు సంస్థల ఆర్థిక పరిస్థితి చూద్దాం. అదానీ గ్రూపు సంస్థల మొత్తం ఆస్తులకు, ఆ కంపెనీలు చెల్లించవలసిన దానికి మధ్య నిష్పత్తి 2021-22లో 0.74గా ఉంది. మన దేశంలోని తక్కిన బడా కార్పొరేట్ కంపెనీల ఆస్తులు-అప్పుల నిష్పత్తితో పోల్చితే అదానీ గ్రూపు సంస్థలదే అతి తక్కువగా ఉంది. ఇక అప్పులకు, వాటాల విలువకు మధ్య నిష్పత్తి చూస్తే 1.5 నుండి 1.1మధ్య ఉంది. తక్కిన బడా కార్పొరేట్ సంస్థలతో పోల్చితే ఇదే అత్యధికంగా ఉంది. దీనిని బట్టి అదానీ గ్రూపు సంస్థలు తక్కిన కార్పొరేట్ సంస్థలకన్నా చాలా ఎక్కువ మోతాదులో రుణాల మీద ఆధారపడి నడుస్తున్నాయని కనపడుతోంది. చాలా ఎక్కువ పెట్టుబడులు మౌలిక వసతుల కల్పన రంగంలో పెడుతున్నా, అదానీ సంస్థల స్థిరాస్తులలో పెరుగుదల రేటు తక్కిన సంస్థల (ఆర్థికేతర సంస్థల) కన్నా చాలా తక్కువగా ఉంది. ఇది ఆసక్తి రేకెత్తించే మరో అంశం. గత మూడేండ్ల కాలంలో తక్కిన ఆర్థికేతర సంస్థల స్థిరాస్తుల విలువ పెరుగుదల రేటు (2019 నుంచి 2022 మధ్య) 5.3శాతం ఉంటే, అదానీ సంస్థల స్థిరాస్తుల పెరుగుదల రేటు మైనస్1.7గా ఉంది. ఈ వాస్తవ వివరాలన్నీ దేశంలోను, బయట ఉన్న మదుపుదారులకు ఆందోళన తప్పకుండా కలిగించే అంశాలే. హిండెన్‌బర్గ్ నివేదిక కూడా అదానీ గ్రూపు సంస్థలు తలకు మించిన అప్పులు చేశాయని, వాటి షేర్ల విలువను కృత్రిమంగా పెంచి చూపించాయని ప్రధానంగా ఆరోపించింది. అందుకే ఆ నివేదిక బహిర్గతం అయ్యాక ఆ షేర్ల విలువలు భారీగా పడిపోయాయి. దాని ఫలితంగా అదానీ గ్రూపు సంస్థలు తాము ప్రకటించిన రూ.20,000 కోట్ల విలువ గల ఫాలో అప్ ఆఫర్‌ను వెనక్కి తీసుకోవలసివచ్చింది. అంతేకాక, తమ రెవెన్యూ వృద్ధి లక్ష్యాలను, పెట్టుబడి వ్యయం లక్ష్యాలను కూడా కుదించుకోవలసివచ్చింది.
''జాతీయప్రయోజనాలు అనే చిత్త భ్రమ''
అదానీ కంపెనీల వాటాల్లో చిక్కుకున్న ఎస్బిఐ పెట్టుబడుల విలువ రూ.27,000 కోట్లు వరకూ ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు కూడా అదానీ షేర్లలో పెట్టుబడులు ఉన్నాయి. ఇక ఎల్.ఐ.సి. పెట్టుబడులు రూ.36,500 కోట్లు వరకూ ఉన్నాయి. అయితే ఆర్థిక మంత్రితో సహా ఉన్నతాధికారులందరూ ఈ పెట్టుబడుల మోతాదు ఆ సంస్థలు తట్టుకోలేనంత ఎక్కువేమీ కాదని గట్టిగా చెప్పారు. ఒక వేళ అదానీ షేర్లు ఇంకా పడిపోయినా, ఎల్.ఐ.సి వద్ద బీమా క్లెయిములు చెల్లించడానికి కావలసినంత నిల్వలు ఉన్నాయని కూడా ప్రకటించారు. అదానీ గ్యాస్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీల్లో కూడా ఎల్.ఐ.సి పెట్టుబడులు ఉన్నాయి. మంత్రిగారు ఎంత నమ్మబలికినా, అదానీ షేర్ల విలువ ఇదే విధంగా పడిపోతూవుంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థల షేర్ల విలువలు కూడా పడిపోక తప్పదు.
స్టాక్ మార్కెట్ జూదానికి ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ఫతరతణం ఒడ్డడం వలన కలిగే పర్యవసానాలు చాలా అవాంఛనీయమైనవిగా ఉంటాయి. అదానీ షేర్లు పడిపోవడం కొనసాగితే మదుపుదారుల విశ్వాసం సన్నగిల్లుతుంది. దాని వలన అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా మార్కెట్ నుండి పెట్టుబడులు సేకరించడం దుస్సాధ్యం అవుతుంది. దాని వలన పెట్టుబడులు పెట్టే క్రమం దెబ్బ తింటుంది. ప్రస్తుతం నడుస్తున్న, త్వరలో మొదలు కానున్న మౌలిక వసతుల రంగ ప్రాజెక్టులు పూర్తి కావడం కష్టం అవుతుంది. కాబట్టి అదానీ ప్రయోజనాలు గనుక దెబ్బ తింటే దేశానికే నష్టం అనే చిత్త భ్రమ ఇక్కడి నుండే మొదలవుతుంది. కాని ఈ పరిస్థితి ఏ విధంగా ఉత్పన్నం అయింది? కేవలం ఒక్కరి చేతుల్లో సంపద కేంద్రీకరించ బడడం, అందుకు ప్రధాని కార్యాలయం నేరుగా తోడ్పాటు, ఆశ్రయం కల్పించడం మాత్రమే ఈ పరిస్థితికి కారణాలు. అందువల్లనే పెట్టుబడుల కోసం ఒకే ఒక బడా కార్పొరేట్ సంస్థ మీద అతిగా ఆధారపడవలసిన పరిస్థితి దాపురించింది.
కేవలం అదానీ కంపెనీల షేర్లు కిందా మీదా అయినంతమాత్రాన దేశానికి, సామాన్య ప్రజానీకానికి అదేమీ పెద్ద సమస్యగా మారదు. నిజానికి ఇటువంటి స్టాక్‌మార్కెట్ జూదంలో ఎక్కువగా దెబ్బ తినేది చిన్న మదుపరులే. పెద్ద మదుపుదారులకి ఆ యా కంపెనీల లోపల జరుగుతున్న వ్యవహారాల గురించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. అంతే కాదు, ఇలా తరుచూ షేర్ల సూచిక పడిపోవడం, మళ్ళీ పెరగడం అనే ప్రక్రియ క్రమంగా కొద్దిమంది చేతుల్లో పెట్టుబడులు కేంద్రీకృతం కావడానికి దోహదం చేస్తుంది కూడా. అందుకనే ప్రస్తుతం అదానీ ఉదంతం తర్వాత కూడా ఏ విధంగా జోక్యం చేసుకుంటే స్టాక్ మార్కెట్ విశ్వసనీయత పెరుగుతుంది? అన్న కోణం నుంచే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత నయా ఉదారవాద చట్రం పరిధిలోనే పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక్కడ ఆర్థిక వ్యవహారాలు అన్నీ సజావుగానే సాగుతున్నట్టు చిత్రీకరించడానికి, ఏదో విధంగా జాతీయ, అంతర్జాతీయ మదుపుదారులలో విశ్వాసాన్ని నెలకొల్పడానికి తంటాలు పడుతున్నారు. కాని ఈ విధమైన పరిస్థితి ఉత్పన్నం కావడానికి మూలకారణాలైన సంపద కేంద్రీకరణ, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలోని వ్యవస్థీకృత అంతర్భాగాలే. అందుచేత ఇప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థనే పూర్తిగా చక్కదిద్దడం, అందులో భాగంగా స్పెక్యులేటివ్ లావాదేవీలను పూర్తిగా నియంత్రించడం జరిగితేనే సరైన పరిష్కారం దొరుకుతుంది.
(స్వేచ్ఛానుసరణ)