Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామఫోన్‌లో పాటలు విన్నవారికి హెచ్ఎంవీ కంపెనీ పేరు తెలిసి ఉంటుంది. దానిమీద ఒక శునకరాజం బొమ్మ ఉంటుంది. దాని బ్రాండ్‌నేమ్ 'హిజ్ మాస్టర్స్ వాయిస్'. నేడు దేశంలో జరిగే పరిణామాలను చూస్తే ఆ పాత రీల్ కండ్లెదుట దర్శనమిస్తుంది. మీడియా ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలని ప్రజల కోరిక. అప్పుడే నిజాలు వెలుగులోకి వస్తాయని, తద్వారా ప్రజా సమస్యలు ఎంతో కొంతైనా పరిష్కరించ బడతాయని ఆశాభావం. కానీ ప్రశ్నిం చాల్సిన మీడియా, జవాబుదారిగా ఉండాల్సిన సమాచారాన్ని మతసంస్థ, హిందూత్వ సర్కార్ కొనుగోలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటిదే దేశంలో ఇటీవల జరిగింది. భారత్‌లో ప్రముఖ వార్తా సంస్థలు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో (ఎఐఆర్)లను నడిపే ప్రసారభారతితో హిందుస్తాన్ సమాచార్ ఒప్పందం చేసుకుంది. ఇది ఆర్ఎస్ఎస్కు చెందిన వార్తా సంస్థ కావడం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. దీంతో ఒప్పందం కోసం అతిపెద్ద ప్రొఫెషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ)తో సభ్యత్వాన్ని ప్రసార భారతి రద్దుచేసుకుంది. వాస్తవానికి 2017 నుంచి కూడా ప్రసారభారతికి 'మూల్యాంకన పద్ధతి'న ఉచితంగా హిందుస్తాన్ సమాచార్ వార్తలు అందిస్తుంది. అయితే ఈనెల 9న ఈ రెండు సంస్థలు మధ్య రూ.7.7 కోట్ల విలువైన అధికారిక ఒప్పందం కుదిరింది. రెండు సంవత్సరాల వ్యవధి కలిగిన ఈ అగ్రిమెంట్ 2025 మార్చిలో ముగుస్తుంది.
హిందుస్తాన్ సమాచార్‌ను 1948లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వాల్కర్, శివరామ్ శంకర్ ఆప్టే స్థాపించారు. ఇది 1986లో వచ్చిన సంక్షోభంతో మూతపడింది. అనంతరం వాజ్‌పేరు ప్రధానమంత్రిగా ఉన్న సమయం 2002లో దీన్ని పునరుద్ధరించారు. కొంతకాలం నత్తనడకన సాగినప్పటికీ కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం నుంచి వ్యాపార ప్రకటనలు విరివిగా లభించాయి. ఇప్పుడు జుండేవాలన్లో ఉన్న తన చిన్న కార్యాలయాన్ని నోయిడాలోని పెద్ద ఆఫీసుకు మార్చాలని కూడా యోచిస్తున్నది. హిందుస్తాన్ సమాచార్‌తో ప్రసార భారతిని అధికారికంగా చేర్చడం కోసం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పిటిఐ, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యుఎన్ఐ)తో చేదుగా వ్యవహరిస్తోంది. ఈ రెండు సంస్థలు నిటారు వార్తలు అందించడం, ప్రభుత్వానికి అనుకూల వార్తలు ఇవ్వక పోవడంతో మోడీ గుర్రుగానే ఉన్నారు. అయితే ఈ రెండు ఏజెన్సీలు అసమంజసమైన సబ్స్క్రిప్షన్ ఫీజులను వసూలు చేస్తున్నాయని, ఈ సంస్థల సేవలను రద్దు చేయాలని ప్రసారభారతిని కొన్నేళ్ల కిందటే కేంద్రం ఆదేశించింది.
2016లో పిటిఐ ప్రధాన సంపాదకులుగా ఎంకె రజ్దాన్ పదవీ కాలం ముగిసిన తరువాత ఆ స్థానంలో తమ చెప్పు చేతల్లో ఉండే వ్యక్తిని నియమించడం కోసం మోడీ ప్రభుత్వం లాబీయింగ్ జరిపినట్టు తెలుస్తోంది. అయితే పిటిఐ బోర్డు అవి పట్టించుకోకుండా ప్రముఖ జర్నలిస్టు విజరు జోషిని ఆ స్థానంలో నియమించింది. 2017లో మధ్య ఢిల్లీలో ఉన్న పిటిఐ భవనం నుంచి ప్రసారభారతి కార్యాలయం ఖాళీ చేసిన తరువాత ఈ రెండు సంస్థల మధ్య సత్సంబంధాలు తగ్గాయి. పిటిఐ అద్దె ఎక్కువగా వసూలు చేస్తుందని ఈ భవనాన్ని ప్రసార భారతి ఖాళీ చేసింది. అలాగే దేశ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తుందని కూడా పిటిఐపై కేంద్రం ఆరోపణలు చేసింది. దేశంలోని చైనా రాయబారి, చైనాలోని భారత్ రాయబారితో పిటిఐ ఇంటర్వ్యూలు చేయడం కేంద్రానికి కోపం తెప్పించింది. ఈ పిటిఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌కు ప్రసారభారతి సీనియర్ అధికారి సమీర్‌కుమార్ లేఖ కూడా రాశారు. ఈవార్తలు భారత దేశ ప్రాదేశికతను బలహీన పరిచాయని ఆరోపించారు. దీన్ని సాకుగా చూపుతూ 2020 అక్టోబర్‌లో పిటిఐ సభ్వత్వాన్ని ప్రసారభారతి రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.
సామాన్య ప్రజలకు అండగా ఉండే ఫ్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను అంగట్లో సరుకుల్లా కొనుగోలు చేయడం దేశసమాచార వ్యవస్థను అస్థిరపరచడమే. అధికారంలో ఉన్నవారు పత్రికలు, మీడియాలో వచ్చే కథనాలను పరిష్కరించి ప్రజలకు మేలు చేయాల్సిందిపోయి అనుకూలపు వార్తలు రాయడంలేదని ఆంక్షలు విధించడం, లొంగదీసుకునే ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికే 2002లో గుజరాత్ మారణ హోమానికి మోడీయే కారణమని బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేస్తే దాన్ని నిషేధించింది. కరోనా రావడానికి మోడీ అసమర్థతే కారణమని చెప్పిన దైనిక్‌భాస్కర్, భారత్ సమాచార్‌లపై ఐటీ దాడులు చేసింది. ఇలా ఎంతకాలం చేస్తారు? ప్రముఖ వార్త సంస్థ పిటిఐను తొలగించి, దాని స్థానంలో అంతగా తెలియని హిందుస్తాన్ సమాచార్‌తో ఒప్పందం కుదుర్చు కోవడంపై అనేక విమర్శలు వెల్ల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ సానుకూల వార్తలను, కాషాయ వార్తలను ప్రచారం చేయడం కోసమే ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందనేది స్పష్టం. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇకనుంచి దూరదర్శన్, ఆలిండియా రేడియాలో ప్రజలకు సంబంధించి వార్తలు కాకుండా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, బీజేపీ వార్తలే కనిపించనున్నాయి. వినిపించనున్నాయి!
- ఎన్. అజయ్‌కుమార్
9490099140