Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సైన్స్ రంగంలో పరిశోధనలు చేసి ఈ స్థాయికి చేరుకున్న యూనివర్సిటీ ఉన్నత అధికారులే... మానవ మరణాలకు యాగాలు విరుగుడని భావించే స్థితికి దిగజారితే ఇక సమాజానికి దిక్కెవరు? విద్యను కాషాయీకరణ చేయాలనే బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ భావజాల ప్రభావం ఎంత తీవ్రంగా విద్యాలయాల్లోకి చొరబడుతున్నదో అందునా విశ్వ విద్యాలయాల్లోకి ఎంత వేగంగా వస్తున్నదో ఈ ఘటన తెలియచేస్తోంది. బీజేపీ బలంగా ఉన్నచోటే దాని భావజాల ప్రమాదం ఎక్కువగా ఉంటుందనుకునే వారికి ఈ పరిణామం ఒక హెచ్చరిక.
ఏపీలోని అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యా లయంలో గత రెండు నెలల్లో కొందరు ఉద్యోగులు చనిపోయారు. ఈ మరణాలతో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ఆవేదన చెందారట! ఈ చావులను అడ్డుకునేందుకు బోధన, బోధనేతర సిబ్బందికి అత్యవసరంగా ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 24న యూనివర్సిటీ క్యాంపస్‌లో ధన్వంతరి మహా మృత్యుంజయ యాగం చేద్దాం, అందుకు బోధన ఉద్యోగులు రూ.500, బోధనేతర సిబ్బంది రూ.100 చెల్లించి తమ పేరిట పూజలు చేయించుకోవాలన్నారు. విద్యార్థి సంఘాలు, లౌకికశక్తులు ప్రశ్నించడంతో రద్దు చేసుకున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. తాత్కాలికంగా యాగ ప్రయత్నాలు రద్దయినా ఈ ఆలోచన ఒక్క వి.సి, రిజిస్ట్రార్లకు తట్టినది కాదని, దేశంలో అనేక యూనివర్సిటీలలో జరుగుతున్న ఛాందసవాద భావజాల విస్తృతిలో భాగమని గుర్తించాలి. వైస్‌ఛాన్సలర్, రిజిస్ట్రార్ ఇద్దరూ సైన్స్ విభాగాల్లోనే పిహెచ్‌డిలు చేశారు. వారు సైన్స్ అధ్యాపకులు కూడా. అయినా ఇలా ఎందుకు ఆలోచించారు. దీనికి మూలం దేశంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న మతఛాందసవాదుల ప్రయత్నాలు, అధికారంలో ఉన్న వారి మనసును ఆకట్టుకోగలిగితే... ఎంతటి ఉన్నత పదవులైనా రాత్రికి రాత్రి వచ్చి తమను వరిస్తున్న తీరు ఇందుకు కారణాలు.
తమ వ్యక్తిగత విశ్వాసాలకు యూనివర్సిటీని కేంద్రంగా చేసుకుంటూ వి.సి, రిజిస్ట్రార్లు అధికారికంగా ప్రయత్నాలు చేయడం తీవ్ర అభ్యంతరకరం. విజ్ఞాన కేంద్రాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలను అజ్ఞాన కేంద్రాలుగా మారుస్తారా? అని విద్యార్థి సంఘాలు, మేధావులు వి.సి.ని ప్రశ్నిస్తే, యాగం నిలిపివేసే ప్రసక్తిలేదని, అవసరమైతే యాగానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని వి.సి. యాగం నిర్వహించండి మీకు అండగా ఉంటామని ఎబివిపి నాయకులు ప్రకటించారు. డబ్బు తనది కావచ్చేమో కాని (అది కూడా ప్రజలు చెల్లించే పన్నుల నుండి వస్తుందని ఆయన గమనించడంలేదు). యాగం నిర్వహించాలనుకుంటున్న స్థలం తనది కాదని, అది ఉన్నత పరిశోధనలకు, భావాలకు, కుల, మత, ప్రాంతీయ సంకుచిత పరిధులకు మించిన విశాల విశ్వవిద్యాలయమనే విషయాన్ని ఆయన మరచిపోయారు. బోధన, పరిశోధన, విస్తరణ అనే మూడు రూపాలుగా పనిచేయడం విశ్వవిద్యాలయాల కర్తవ్యమని, ఈ కర్తవ్యాల అమలు, పర్యవేక్షణ బాధ్యతలను చూడాలిగాని, తన వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా యజ్ఞాలు, యాగాలు, బలులు, జాతరలు చేసుకోవడానికి కాదనే విషయాన్ని ఆయన గుర్తించాలి. సైన్స్ రంగంలో పరిశోధనలుచేసి ఈ స్థాయికి చేరుకున్న యూనివర్సిటీ ఉన్నత అధికారులే... మానవ మరణాలకు యాగాలు విరుగుడని భావించే స్థితికి దిగజారితే ఇక సమాజానికి దిక్కెవరు? విద్యను కాషాయీకరణ చేయాలనే బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ భావజాల ప్రభావం ఎంత తీవ్రంగా విద్యాలయాల్లోకి చొరబడుతున్నదో అందునా విశ్వవిద్యాలయాల్లోకి ఎంత వేగంగా వస్తున్నదో ఈ ఘటన తెలియచేస్తోంది. బీజేపీ బలంగా ఉన్నచోటే దాని భావజాల ప్రమాదం ఎక్కువగా ఉంటుందనుకునే వారికి ఈ పరిణామం ఒక హెచ్చరిక.
మృత్యుంజయ యాగం చేయాలని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అధికారులు ప్రయత్నించడం మొదలూ కాదు, ఆఖరూ కాదు. గతంలో మన ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య దోణప్ప వైస్ ఛాన్సలర్‌గా ఉన్న కాలంలో జ్యోతిష్యాన్ని డిగ్రీ, డిప్లమో కోర్సులుగా ప్రవేశపెట్టారు. దీనిపై పెద్ద వివాదం జరిగి చివరకు ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి హయాంలో జ్యోతిష్యం నిరూపితమైన శాస్త్రం కాదని తొలగించారు. అప్పుడు కూడా మతతత్వవాదులు అల్లరి చేశారు. ట్రినిటి కాలేజికి చెందిన 'ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ సెక్యులరిజం ఇన్ సొసైటీ అండ్ కల్చర్', భారత దేశానికి చెందిన 'సెంటర్ ఫర్ ఎంక్వైరీ' కలిసి దీనిపై పరిశోధన చేశాయి. 130 సంస్థలకు చెందిన 1100మంది సైంటిస్టుల మీద చేసిన సర్వేని ప్రకటించాయి. ఇందులో 24శాతం మంది దైవాంశ సంభూతులు ఉన్నారని, వారు అద్భుతాలు సృష్టిస్తారని, 49శాతం మంది ప్రార్థనల వల్ల ప్రయోజనం ఉంటుందని, 16శాతం మంది విశ్వాస స్వస్థతపై నమ్మకం ఉందని, 14శాతం మంది వాస్తుపై, మరో 14శాతం మంది జ్యోతిష్యంపై నమ్మకం ఉందన్నారని నివేదిక తెలిపింది. ఇలాంటి సర్వే నివేదికలు చూసేనేమో 'దేశంలో 90శాతం మంది మూర్ఖులు ఉన్నారని' జస్టిస్ మార్కండేయ కట్జూ ఆవేదన చెందారు. 'యూనివర్సిటీలో యాగం వద్దు' అనే కనీస రాజ్యాంగ స్ఫూర్తిని సహించ లేకున్నాయి. సరస్వతీ పూజలు, విగ్రహాల ఏర్పాటు, జన్మాష్టములు, తల్లిదండ్రులకు పాదాభివందనం లాంటి అనేక ముసుగులతో విద్యాలయాల్లోకి ఆర్ఎస్ఎస్ చొరబడి చిన్న వయసులోనే విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నది. విశ్వవిద్యాలయాలను తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని యూజీసీ లాంటి సంస్థల్లో తమ మనుషులను నియమించి వారి ద్వారా ఈ రకమైన యజ్ఞయాగాలు, క్రతువులు చేయిస్తున్నది. రాష్ట్ర పాలకులు ఈ ప్రమాదకరమైన పోకడలను మొగ్గలోనే అడ్డుకోకపోతే ప్రజల ఐక్యతకు, రాజ్యాంగ స్ఫూర్తికి తీరనిద్రోహం చేసినవారవుతారు.
-వి. రాంభూపాల్