Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కాలంలో హత్యలు, ఆత్మహత్యలు సమాజాన్ని వెంటాడుతున్న అతి ప్రధానమైన సమస్యలుగా మనముందు కనపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలుగా శారీరక మానసిక ఉద్రేకాలు, ఆర్థిక, కుటుంబ కారణాలు అని గ్రహించాలి. దీనికితోడు సామాజిక మాధ్యమాలు, వివిధ వెబ్సైట్లు, మద్యం, మత్తుపదార్థాలు... చదువుతున్న హైస్కూల్ విద్యార్థుల స్థాయి నుంచి పండు ముదుసలి వరకు ఈ హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతూ ఈ సమాజం ఎటు పోతుందో అనే ఆందోళన కలిగిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం, చిన్న చిన్న ఉద్రేకాలకు హత్యలు చేసే సంస్కృతి పెరగడం వలన సమాజంలో నేరప్రవృత్తి పరవళ్ళు తొక్కుతోంది. ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా ఆదిలోనే గుర్తించి, నివారణా చర్యలు కుటుంబ స్థాయి తల్లిదండ్రులు నుంచి సమాజంలో ఉపాధ్యాయులు, మీడియా స్వచ్ఛంద సంస్థలు పైనా ఈ బాధ్యతను గుర్తెరగాలి.
ముఖ్యంగా ప్రస్తుతం సమాజంలో వైయక్తిక కుటుంబాలు పెరగడం, తల్లిదండ్రులు తమ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మునిగి పోవడం వల్ల తమ పిల్లలకు సరైన మానసిక ఆరోగ్యం కల్పించకపోవడంతో పిల్లలు ఒంటరిగా ఉండటం, ఇతరులతో సావాసం చేయుడంతో కొన్ని రుగ్మతలకు లోనవుతున్నారు. ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. పిల్లలను ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉంచడానికి చిన్నప్పుడు నుంచే చదువు పేరుతో హాస్టల్లో చేరిపించుటచే విద్యార్థి దశలోనే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండుట వలన శారీరక మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తే, ధైర్యంగా ఎదుర్కోవాలి అనే భావన అందరిలో రావడానికి బదులు, ఆత్మహత్య అనే పిరికితన చర్యలకు పాల్పడుతున్నారు. ఇక మరికొందరు హింస, శృంగార (పోర్న్ సైట్లు) మాధ్యమాల్లో సంచరిస్తూ అనేక హత్యలు చేస్తున్నారు. తనకు కావలసిన రీతిలో ఏదైనా లభ్యం కాకపోతే ఎంతటికైనా దిగజారే స్థితిలోకి వెళుతున్నారు. యాసిడ్ దాడులు, చివరికి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కట్ చేసే భయంకరంగా తయారు అవుతూ ఉండటం అత్యంత బాధాకరం. ఇటీవల అనేక నేర దర్యాప్తు సంఘటనలలో ఇటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పెచ్చుమీరుతున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో ఈ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా విరాజిల్లుతోంది. దీనికి తోడు టీవీ సీరియల్స్, వివిధ షోలు అనేక కుటుంబాలు, వ్యక్తులు మీద తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రతీ అంశంలో మంచి చెడులు ఉంటాయి. దానిలో మంచి తీసుకుని ముందుకు సాగాలి. కానీ నేడు చెడు అంశాలతో ముందుకు సాగడం ప్రమాదకరం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచడం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. వారి అలవాట్లు, స్నేహాలు, చూసే వెబ్సైట్లు మీద దృష్టి సారించాలి.
సమాజంలోని అన్ని రంగాల్లో, వర్గాల్లో ఈ హత్యలు, ఆత్మహత్యలు నేరప్రవత్తి పరవళ్ళు తొక్కుతోంది. దీనికి ఇకనైనా చెక్ పెట్టాలి. ముఖ్యంగా కుటుంబ స్థాయి నుంచి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వాలు విద్యా వైద్య రంగా లకు ప్రాధాన్యత కల్పించాలి. ఉచితాలు కంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతీ వ్యక్తీ ఈ సమాజంలో ఉన్నతంగా జీవించాలి అంటే భారత రాజ్యాంగం ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద విధా నాలకు అనుగుణంగా పరిపాలన అందించాలి. విద్వేష ప్రసంగాలు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు కట్టడి చేయాలి. శారీరక మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబైఐదు సంవ త్సరాల పూర్తైనా, నేటికీ అందరికీ విద్య వైద్యం అందని ద్రాక్షగా ఉన్నది. సమాజంలో అనేక అసమానతలు మనవెంటే ప్రయాణం చేస్తున్నాయి. ఇకనైనా విడనాడాలి. ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులు మారితేనే ఆత్మహత్యలు ఆగుతాయి.ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో సంచరిస్తున్న యువత, పిల్లలు తమ బాల్యాన్ని విజ్ఞాన సము పార్జనకు, నూతన ఆవిష్కరణలకు, క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు మార్గాలు అన్వేషిం చాలి. ఒలింపిక్ పతకాలు, నోబెల్ బహుమతులు అందుకునే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి... నైతిక, కుటుంబ, మానవతా విలువలు పాటించాలి. జీవితాల్లో వెలుగులు నింపుకుని, నిండు నూరేళ్ళు హాయిగా జీవించాలి...
- ఐ.పి.రావు