Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నంలో 2023 మార్చి 3,4 తేదీల్లో భారీ ఏర్పాట్లతో ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మేళనానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్నాహాలు చేసింది. 40 దేశాల నుండి ప్రతినిధులు, దేశంలోని బడా పెట్టుబడిదారులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కొలువుదీరనున్నారు. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబాయి, బెంగళూర్, హైదరాబాద్‌లలో సదస్సులు పెట్టి కార్పొరేట్ కంపెనీలను విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023కు ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వాని స్తున్నారు. దేశాభివృద్ధికి పారిశ్రామిక ప్రగతి ఎంతో అవసరం. 1991లో పి.వి.నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో సరళీకరణ పేరుతో పారిశ్రామిక విధానాలను పూర్తిగా మార్చివేశారు. బడా పెట్టుబడిదారులకు, విదేశీ బహుళజాతి పెట్టుబడిదారులకు అను కూలంగా పారిశ్రామిక విధానం మారి పోయింది. వామపక్ష ప్రభుత్వాలు తప్ప వీరికి రాయితీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. సింగిల్ విండోతో ప్రారంభమై నేడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాయి. మూడు వారాల్లోనే అన్ని అనుమతులు ఇస్తూ దేశంలోనే ఫస్ట్ ర్యాంకులో ఉన్నామని పాలకులు జబ్బలు చరుచుకుంటున్నది.
గత నాలుగేండ్లలో పారిశ్రామిక అభివృద్ధికి చేసిన కృషి నామమాత్రం. పారిశ్రామిక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి నేడు ఆర్భాటంగా ప్రచారం సాగిస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాలకు సమ్మిట్‌ను ఉపయోగించుకుంటున్నారు. కార్పొరేట్లకు భూములు అప్పగించడం తప్ప కొత్తగా పరిశ్రమలు వస్తాయని ఆశించలేం. గతంలో 2013 భూ సేకరణ చట్టాన్ని రాష్ట్రంలో నేటికీ అమలు చేయలేదు. 2016 నుండి వరుసగా మూడేండ్లు సమ్మిట్లు సాగాయి. రూ.18.6 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. కానీ వచ్చింది రూ.1.84 లక్షల కోట్లుగా గత ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ పెట్రోలియం విస్తరణకు ఖర్చుచేసిన రూ.25 వేల కోట్లు కూడా ఉంది. ప్రభుత్వరంగ పెట్టుబడులను కలిపినా 10వ వంతు కూడా వాస్తవంగా పెట్టుబడులు రాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అనేక అవకాశాల వల్ల వచ్చిన పరిశ్రమలే తప్ప సమ్మిట్ల వల్ల వచ్చింది లేదు. ఆంధ్రప్రదేశ్ వంటలు, గారెలు, బూరెలు తిని... వచ్చిన ప్రతి నిధులు ప్రభుత్వాన్ని ప్రశంసించి ఎం.ఓ.యు.లు చేస్తారు. విశాఖ లోని రిషికొండలో డేటా సెంటర్ కోసం అదానికి 3సార్లు 199 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి. 60వేల ఉద్యో గాలు వస్తాయని అదాని ఆశలు పెట్టాడు. నేటికీ డేటా సెంటర్ నిర్మాణం కానీ, ఒక్కరికి ఉద్యోగం కానీ రాలేదు. ఇటీవల గౌతం అదాని బండారం గాలిబుడగలా బద్దలైనా ఈ సమ్మిట్‌కు ఆయనను ఆహ్వానించడంలో అర్థం ఏమిటి? పెట్టుబడిదారుల ముందు సాగిలా పడటాన్ని నలుగురు నవ్విపోతారని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనకాడటంలేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారు లకు, విదేశీ బహుళజాతి పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను రూపొందిస్తున్నాయి. కానీ దానిని కప్పి పుచ్చి పరిశ్రమల కోసం ప్రజల ఆర్థికాభివృద్ధికి పాటుపడు తున్నట్లు హైడ్రామాలు ఆడుతున్నాయి. విశాఖ సమ్మిట్‌కు సుమారు రూ.250 కోట్లు ప్రజాధనం ఖర్చు కాగలదని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు అనేక రూపాల్లో రాయితీ లిస్తున్నది. భూములు, గనులు, సముద్రతీరం, విద్యుత్‌ను చౌకగా పెట్టుబడిదారులకు అప్పగిస్తు న్నారు. పెట్టుబడిదారులు మార్కెట్ రేటుకు రైతులు నుంచి భూములు కొనాలి. కానీ ప్రభుత్వాలే రైతులపై ఒత్తిడి చేసి బలవంతంగా రైతుల నుంచి భూములు చౌకగా లాక్కుంటున్నాయి. గత విద్యుత్ బోర్డు విధానం ప్రకారం పేదలకు విద్యుత్‌ను క్రాస్ సబ్సిడీ ద్వారా చౌకగా అందించాలి. నేడు పారిశ్రామిక వేత్తలకు విద్యుత్‌ను చౌకగా అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలను పోటీ చూపించి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఎర్రతివాచీలు వేసి ఆహ్వానిస్తున్నాయి. మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్‌లోని ముంద్ర పోర్టును అదానికి అప్పనంగా అప్పగించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పోర్టులన్నింటినీ ముఖ్యమంత్రి జగన్ నేడు అదానికి అప్పగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అదానిప్రదేశ్‌గా మారుస్తున్నారు. ఈ విధానం రాష్ట్రానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. రాష్ట్ర ప్రయోజనం ఇందులో సున్నా. కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఉల్లంఘిస్తున్నాయి. 50లక్షల మంది షెడ్యూల్ రంగంలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు పెంచలేదు. కాని ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కార్మికుల నిజ వేతనాలు పడిపోతున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ ప్రతి రోజూ ఒక రంగం ప్రోత్సాహం గురించి ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఫుడ్ ప్రొసెస్ ఇండిస్టీ అభివృద్ధికి బ్రహ్మాండమైన అవకాశాలున్నాయని ఊదరగొట్టారు. 2022లో 6 షుగర్ ఫ్యాక్టరీలు ప్రభుత్వం మూసివేస్తూ జీఓ జారీచేసింది. షుగర్ పరిశ్రమను అభివృద్ధి చేయటానికి 'ఇధనాల్' ఉత్పత్తిని జోడించే ప్రక్రియ అన్ని ప్రయివేట్ షుగర్ ఫ్యాక్టరీలూ ప్రారంభించాయి. కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా కోఆపరేటీవ్ షుగర్ ఫ్యాక్టరీలన్నింటినీ మూసి వేశారు. షుగర్ ఫ్యాక్టరీల స్థలాలు అమ్ముకోవటానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్ర పన్నింది. ప్రజానీకానికి వంద సంవత్సరాలు తీపి తినిపించిన చెరుకు రైతుల పొట్టలు కొట్టింది. అధికారంలోకి వచ్చిన మొదటి మూడునెలల్లోనే విశాఖలోని చిట్టివలస, విజయనగరంలోని మరో మూడు జ్యూట్ మిల్లులు మూతపడ్డాయి. ఈ పరిశ్రమల్లో పనిచేసే 15వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం నడిరోడ్డుపై నెట్టింది. పంచదార, జ్యూట్ పరిశ్రమల కంటే ఫుడ్ ప్రొసెసింగ్ గొప్పదా? గత నాలుగేండ్లలో వచ్చిన పరిశ్రమలన్నింటిలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఉన్న పరిశ్రమలు మూసివేసిన కారణంగా... పోయిన ఉద్యోగాలు ఎన్ని? రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించాలి.
భారీ పరిశ్రమలు ఎందుకు రావడం లేదు? ప్రయివేటు అంటే లాభాలు. ఎన్ని సమ్మిట్లు పెట్టినా బాగా లాభాలు వస్తాయంటేనే పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. 2008 నుండి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతూ ఉంది. ఉపాధి భారీగా వచ్చే స్టీల్, అల్యూమినియం, జింక్, రాగి వంటి పరిశ్రమలన్ని నష్టాల్లో ఉన్నాయి. భారీ పరిశ్రమల్లో ప్రయివేటు వారు పెట్టుబడులు పెట్టడానికి శ్రద్ద చూపటం లేదు. దీనికి కారణం పెట్టుబడులు ఎక్కువ పెట్టాలి. పరిశ్రమ నిర్మాణానికి కనీసం 5 నుండి 10 సంవత్సరాలు పడుతుంది. అంటే లాభాలు రావడానికి ఆలస్యం అవుతుంది. ప్రయివేటు పెట్టుబడిదారులకు అర్జెంట్‌గా లాభాలు కావాలి. రాష్ట్రంలో గత 30సంవత్సరాల్లో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాలేదు. స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఇజెడ్)లు మాత్రమే వస్తున్నాయి. ఈ జోన్లో పరిశ్రమలకు ఐదేండ్లపాటు పన్నులు ఉండవు. ఇవి సర్కస్ కంపెనీలు. కొంత కాలం తర్వాత వెళ్లి పోతాయి. తిరుపతి జిల్లా శ్రీసిటీ, అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీలు ఈ కోవకు చెందినవే. 20సంవత్సరాల నుంచి విశాఖ - చెన్నరు పారిశ్రామిక కారిడార్‌లో భారీగా పరిశ్రమలు వస్తాయని ప్రభుత్వాలు ఎంత ఊదరకొట్టినా... అవి రావడంలేదు. ఈ కారిడార్‌లో ప్రతిపాదించిన కార్బన్, పెట్రో, పెట్రో రసాయనాల కాలుష్య పరిశ్రమలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. నిర్దిష్ట కార్యచరణ, అమలు లేని వ్యవహారశైలి వల్ల ఇలాంటి సమ్మిట్లు ఎన్నిపెట్టినా నిష్ప్రయోజనమే.
- సిహెచ్. నర్సింగరావు