Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యంగ్యమే తన ఆయుధంగా సాంస్కృతికంగా పోరాడుతూ సమాజంలో నవ్వుల పూలు వెదజల్లుతూ, ప్రజల్ని సీరియస్‌గా ఆలోచించమని హెచ్చరించిన విదూషకుడు, మానవీయ విలువల పరిరక్షకుడు జస్పాల్ భట్టి. ఆయన గురించి ప్రత్యేకమైన ఉపోద్ఘాతం అక్కరలేదు. టి.వి. కార్యక్రమాలు చూసే ప్రేక్షకులందరికీ ఆయన పరిచయమే. ''ఉల్టా పుల్టా'', ''ఫుల్ టెన్షన్'', ''ఫ్లాప్ షో'' వంటి కామెడీ సీరియళ్ళతో ఆయన తనను తాను ఒక ప్రత్యేకమైన కళాకారుడిగా, దర్శకుడిగా పరిచయం చేసుకున్నారు. ఎంత హాస్యమో, అంత వ్యంగ్యం, ఎంత వ్యంగ్యమో అంత సీరియస్‌నెస్ ఆయన లోనూ, ఆయన టెలివిజన్ సీరియల్స్‌లోనూ ఉంటుంది. నవ్వించడమంటే మజాకా కాదు అంటా రాయన. అది ఆయనకొక సీరియస్ బిజినెస్. ఒక విద్యుక్త ధర్మం, ఒక బాధ్యత!! ఈ సమాజాన్ని, ఈ మనుషుల్ని ఆయన అమితంగా ప్రేమిస్తారు. అందుకే వారి లోపాల్ని, లొసుగుల్ని నిర్దాక్షిణ్యంగా వెల్లడిస్తారు.
రయిత, నటుడు, దర్శకుడు జస్పాల్ భట్టి (57) 2012 అక్టోబర్ 25న ఒక రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందడంతో హిందీ నాటక, టీవీ, సినీరంగాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. గత మూడు దశాబ్దాలుగా ఆయా రంగాలలో ఆయన చేసిన కృషి, భారతీయ ప్రేక్షక హృదయాల్లో తాజాగా ఉంది. పదునైన వ్యంగ్యం, సున్నిత హాస్యం, ప్రతి ప్రదర్శనలో అవినీతి పరులకు దిమ్మదిరిగే ముగింపు ఆయన స్వంతం. 1955 మార్చి 3న అమృత్‌సర్‌లో పుట్టిన ఈ పంజాబీ కళాకారుడు చదువుకునే రోజుల్లోనే హాస్య సంభాషణా చతురిడిగా గుర్తింపు పొందాడు. ప్రత్యేకమైన వ్యక్తిత్వం, అసమానమైన ప్రతిభ గలవాడిగా ప్రాచుర్యం పొందాడు. భార్య సవితా భట్టి కూడా కళాకారిణే! టీవీ సీరియల్స్‌లో ఆవిడ ఆయనకు భార్యగా నటించి రాణించారు. కొడుకు జస్రాజ్ భట్టి, కూతురు రాబియా భట్టి. కొడుకు జస్రాజ్ భట్టి నడుపుతున్నప్పుడే కారు అదుపుతప్పి, రోడ్డు పక్కన చెట్టుకు గుద్దుకోవడం వల్ల ప్రమాదం సంభవించింది. దేశంలో విపరీతంగా పెరిగిపోయిన విద్యుత్ కోతలను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసిన 'పవర్ కట్' పంజాబీ వ్యంగ్య చలనచిత్రానికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. ఆ చిత్రంలో హీరో పేరు కరెంట్. హీరోయిన్ పేరు బిజిలి. కొడుకు జస్రాజ్ అందులో హీరో పాత్ర పోషిస్తున్నా భట్టిసాహెబ్ తనదైన శైలిలో థర్మల్ పవర్‌స్టేషన్ దర్శించుకుని 'ఆశిస్సులు' పొందారట!
ఎదుటివారిని చెప్పుతో కొడితే పెద్ద గొడవ అయిపోతుంది. అదే మఖ్మల్ గుడ్డలో చుట్టికొడితే గొడవ కాదు సరికదా, ఎదుటివాడు సంతోషిస్తాడు. జస్పాల్ భట్టి చేస్తున్న పని ఇదే! ఏ విషయాన్ని తీసుకున్నా నెగటివ్ ఎప్రోచ్‌తో హాస్యం పండించడం, నవ్వులొంచి తేరుకున్నాక మఖ్మల్ గుడ్డలోంచి చెప్పుతీసి చూపించడం ఆయన స్వభావం! ఓహౌ ఇప్పటిదాకా ఆనందించి ఎవరినో చూసి కాదు కదా, నన్ను చూసి నేనే కదా? అని ప్రతిమనిషీ ఆలోచనలో పడతాడు. జస్పాల్ భట్టి ఎలక్ట్రికల్ ఇంజనీయర్. చండీఘర్‌లో స్థిర నివాసం. ఆయన చదువుకుంటున్న రోజుల్లో కళాశాల సాంస్కృతిక కార్యక్రమాల పోటీ జరిగింది. ఎందరో ఎన్నో వేషాలు కట్టారు. ఎన్నో రకాల ప్రదర్శన లిచ్చారు. జస్పాల్ భట్టి సాదాసీదాగా, మేకప్ లేకుండా రంగస్థలం మీద కాలు పెట్టాడు. ఏవో రెండు మూడు చిన్న చిన్న మాటలు చెప్పాడు. జనం కడుపుబ్బ నవ్వారు. ఇంకా చెప్పమని గోల పెట్టారు. ఆనాడు ఆయన ఎన్నుకున్న విషయమేమంటే... ''స్త్రీ కన్నీళ్ళు'' ఆయన ఉపన్యాస ధోరణి ఈ విధంగా సాగింది...
''మనం స్త్రీలను ఎక్కువగా ఏడిపించాలి. స్త్రీ కన్నీళ్ళతో గనక వరదలొస్తే ఆ నీటికి ఆనకట్టలు వేసి, డామ్లు నిర్మించి, విద్యుత్తు ఉత్పత్తి చేయాలి. విద్యుత్తు మనదేశానికి ఎంతో అవసరం'' ఎవరో వెనక నుండి 'ఫన్నీ' అని అరిచారు. జస్పాల్ భట్టి ''ఫన్నీ కాదు, నేను లాజిక్ మాట్లాడుతున్నాను'' అని సమయస్ఫూర్తితో సీరియస్‌గా చెప్పేసరికి యువప్రేక్షకులు మరింతగా గగ్గోలు పెట్టి, చప్పట్లు చరిచి, ఉత్సాహం చూపారు. వారి ఉత్సాహం చూసి ఆయన మరికొంత సేపు మాట్లాడారు. పోటీలో ప్రైజ్ రాలేదుగాని ''తన ఆలోచనలో, తన మాటలలో ఏదో ప్రత్యేకత ఉంది. కొత్తదనం ఉంది. జనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. దాన్ని వృధాగా పోనీయొద్దు'' అని ఆయన తన గురించి తాను ఒక కచ్ఛితమైన అభిప్రాయం ఏర్పరుచుకున్నారు. ఫలితంగానే 'నాన్సెన్స్ క్లబ్' అవతరణ జరిగింది. దాని ద్వారా సమాజానికి చురకలంటించే ప్రదర్శనలు కొనసాగాయి. ఆయన తన ప్రదర్శనల్ని 'కార్టూన్ స్ట్రీట్ షో'గా అభివర్ణించుకున్నారు.
వార్తా పత్రికల్లో కార్టూన్లు జనాన్ని నవ్విస్తూనే తీవ్రంగా ఆలోచింపజేస్తుంటాయి. నాటక రంగానికి - స్ట్రీట్ - ప్లేకు, కార్టూన్‌కు ఎటువంటి సంబంధమూ లేదు. కానీ రెండూ ఒక కోణంలో జన చైతన్యానికి ఉపయోగపడుతున్నాయి. ఈ రెండింటి ప్రాముఖ్యాన్ని, విలువను, అవసరాన్ని అర్థం చేసుకుని, జస్పాల్ భట్టి తనదైన శైలిలో వినూత్న ప్రదర్శనలకు రూపలక్పన చేశారు. ఆయన ప్రదర్శనల గొప్పతనమేమంటే... అందులో డ్రామా ఉండదు. సంభాషణలుండవు. సంగీతముండదు. పాత్రల ప్రవేశమూ, నిష్క్రమణమూ ఉండవు. అయినా ఆయన తీసుకున్న ఇతివృత్తమేమిటో ప్రేక్షకులకు సులభంగా అర్థమవుతుంది. ఆయన ఇచ్చే సందేశమేదో తెలిసిపోతుంది. ఆయన ఎంత వ్యంగ్యంగా, విపరీతార్థాలతో, ఎంత ముక్కుసూటిగా విషయం చెపుతున్నా దాని వెనక కళాకారుడిగా ఆయన భుజాన వేసుకున్న బాధ్యతేమిటో తెలిసిపోతూనే ఉంటుంది.
ఒక కార్టూనిస్ట్ తనకు కేటాయించిన చిన్న స్థలంలో కావల్సిన వాతావరణాన్ని సృష్టిస్తాడు. పాత్రల హావభావాలు చిత్రిస్తాడు. కార్టూన్ కింద ఒక కాప్షన్ ఇస్తాడు. అందులో కావల్సినంత హాస్యం, వ్యంగ్యం ఉంటూనే ఒక కొత్త కోణంలో ఆలోచించమన్న సూచన ఉంటాయి. జస్పాల్ భట్టి ప్రదర్శనల్లో సరిగ్గా ఇవన్నీ ఉంటాయి. ఆయనకు ప్రత్యేకమైన రంగస్థలం అక్కర్లేలేదు. వీధిలోనే అతి సామాన్యంగా ప్రదర్శన ఇప్పించేవాడు. దానికి సంబంధించిన పాత్రలు కొద్దిపాటి మేకప్ చేసుకుని ఉంటాయి. ఆ ప్రదర్శనకు సంబంధించిన నినాదం ఒక బ్యానర్ మీద రాసి ఉంటుంది. లేదా ఆయనే స్వయంగా చిన్న ఉపోద్ఘాతం ఇస్తారు. అంతే... ఉదాహరణకు మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద సెంటర్లో ''పెళ్ళికొడుకుల అమ్మకం - గ్రాండ్ బంపర్ సేల్'' అనే పెద్ద బ్యానర్ కడతారు. దాని కింద పెండ్లి కొడుకుల్లా తయారైన ఓ ఇరవై మంది యువకుల్ని నిలబెడతారు. వాళ్ళ ధరవరలు, వాళ్ళ విద్యార్హతలు వాళ్ళకే వేళ్ళాడుతూ ఉంటాయి. డాక్టర్, ఇంజనీయర్, లెక్చరర్, ఐఏయస్, పిహెచ్డి, క్లర్కు, బ్యాంక్ ఆఫీసర్, సాఫ్ట్వేర్ ఉద్యోగి వగైరా... ధరవరలంటే ఇక్కడ వారు తీసుకోబోయే కట్నం. ఇంత కట్నానికి అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నామని పెండ్లికొడుకులు అలా నిలబడ్డారన్నమాట! పైగా భట్టి ఆ బ్యానర్ మీద మరో విషయం కూడా రాయిస్తాడు. మహిళా దినోత్సవ సందర్భంగా ముప్పయిశాతం తగ్గింపు అని! అంటే మహిళా దినోత్సవ పర్వదిన సందర్భంగా ముప్పయిశాతం తగ్గింపునకే వరులు దొరుకుతున్నారని చెప్పడం.
మరో ప్రదర్శనలో జస్పాల్ భట్టి వివాహమహౌత్సవం జరిపిస్తారు. బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతాడు. తాళి కట్టడం అయిపోతుంది. అప్పగింతలు అయిపోతాయి. ఆ తర్వాత అమ్మాయి అత్తగారు (పెళ్ళికొడుకు తల్లి) రంగప్రవేశం చేస్తుంది. శాస్త్రోక్తంగా అమ్మాయి మీద కిరోసిన్ జల్లి, అగ్గిపుల్ల గీస్తుంది. ఇన్ని వేల మంది కొత్త కోడళ్ళు అత్తల చేతుల్లో చస్తూ ఉంటే మనం ఊరుకోవడమెందుకూ? ఆ పనేదో శాస్త్రోక్తంగా పెండ్లి తంతులో ఒక భాగంగా చేస్తే సరిపోతుంది కదా? అని జస్పాల్ వాదం. ఈ సమాజం వరకట్నపు చావుల్ని ఆపలేకపోతే ఇక ఇలాగే చేయాలి అని చెప్పడమన్నమాట! మన మెంత హీనమైన సమాజంలో బతుకుతున్నామో ఆలోచించుకొమ్మని చెప్పడమన్న మాట! ఇలాంటి అత్తల వల్లనే మన దేశం ప్రపంచంలో మంచి ప్రాచుర్యం పొందిందట!
చిన్న పిల్లల సమస్యలకు స్పందిస్తూ కూడా జస్పాల్ కొన్ని ప్రదర్శనలు రూపొందించారు. ఒక ప్రదర్శనలో నర్సరీ క్లాసు పిల్లలు డిక్షనరీలు, ఎన్సైక్లో పీడియాలు మోసుకెళ్తుంటారు. దీని శీర్షిక ''భవిష్యత్తు కూలీలు''. మరో ప్రదర్శనలో ''మిస్ వల్గారిటీ మిస్టర్ చీప్''ల ఎన్నిక జరిగింది. ఇందులో అమ్మాయిలు నాలుగువందల గ్రాముల బరువు గల బట్టలు వేసుకుని శరీరంలో ఇరవై అయిదుశాతం భాగాన్ని మాత్రమే కప్పుకోవాలట. దీన్ని లోకల్బస్తీ 'గుండా దర్దీదళ్' వాళ్ళు స్పాన్సర్ చేశారట. ఈవ్ టీజింగ్‌లో గొప్ప ప్రావీణ్యమున్న వాళ్ళు ఈ ప్రదర్శనకు న్యాయ నిర్ణేతలట!? ఒక ప్రదర్శనలో తన నాన్సైన్స్ క్లబ్ ''హవాలా పార్టీ'' స్థాపించిందని దానిలో సభ్యత్వానికి అవినీతి పరులనే ఆహ్వానిస్తోందని ప్రకటించారు. మన రాజకీయాలెంత భ్రష్టు పట్టిపొయ్యాయో ఆలోచింప చేస్తుందీ ప్రదర్శన! ఒక సూట్‌కేస్‌లో కోటి రూపాయలు పడతాయా లేదా అని మహా మహా మేధావులు చర్చలు జరపడాన్ని జస్పాల్ భట్టి ఎద్దేవా చేశారు. విషయం అందరికీ తెలిసిందే గనక, 'సూట్ కేస్ పెద్దది చేయించడం, లేదా కరెన్సీ నోట్లు మరింత పలుచగా తయారు చేయించడం చేయాలి' అని సూచించారు. అవినీతిని చట్టబద్ధం చేయమని అన్ని పార్టీల నాయకులు ప్రదర్శనలివ్వాలి - అని ఆయన వాదం! ఈ రకంగా తీవ్రంగా ఆలోచించాల్సిన అంశాలను తన నాన్సెన్స్ క్లబ్ తరఫున ప్రదర్శించారు. 'నాన్ సెన్స్ అంటూనే ఎంతో 'సెన్స్'కు ఆయన పునాదులు వేశారు. ఆరోగ్యకరమైన హస్యం, సన్నితమైన విమర్శ ఉన్నందువల్ల ఆయన 'కార్టూన్ స్ట్రీట్ షో'లు, దూరదర్శన్, టెలివిజన్ సీరియల్స్, పంజాబ్, హిందీ సినిమాలు అన్నీ రక్తికట్టాయి. 'పవర్‌కట్' సినిమా ప్రమోషన్‌కు వెళుతూ తన జీవితపు పవర్‌కట్ చేసుకోవడం విషాదం! మొదటిసారి జస్పాల్ భట్టి ఒక సీరియస్ విషయంలో తన ప్రేక్షకుల్ని సీరియస్‌గా బాధపెట్టారు. అయితే అదే చివరిసారి కూడా కావడం మహా విషాదం! మరణానంతరం ఈ కళాకారుడికి భారత ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ ప్రకటించింది.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.