Authorization
Sat April 05, 2025 06:19:33 pm
యాడ నుంచి వచ్చిందో
కాగడా పెట్టి వెతికినా దొరకని,
మానవత్వపు జాడలు
వర్ణించలేని వేదన సొంతమైన
''ర్యాగింగ్'' ఆట.
పైశాచిక వికృత చేష్టల చెరలో,
కఠినానుభూతులు
ఎదలో రొదపెడుతోన్న వేళ,
మనోతటాకంలో నిశ్చలత్వం
నిర్వీర్యమయ్యేదాకా
గద్దింపు గులకరాళ్లు
పడుతూనే ఉంటే,
మాటల శరాలు
మదిలో ముళ్ళై గుచ్చుకోగా,
కంటికి కనపడని ఘాతాలతో
మనసు గాయపడుతోంటే
మనుగడ మగతృష్ణకాగా
ఆకాంక్షలు, కలలు కల్లలై పోగా,
వడగాడ్పుకు మాడిపోయిన
లేత ఆకులా,
పొంగి పొంగి ఉరికే జలపాతంలా,
ఈ బాధలు నే తాళలేనంటూ
గుండెనిండా అలజడి
ప్రకంపనల వత్తిడిలో
మాటలు లేని మూగతనంతో
రెక్కలు తెగిన విహంగమై,
గుండెలుపిండే వ్యధనాగ్నిని
చల్లార్చే లేపనం ఆత్మహత్యేననుకుంటూ,
తిరిగిరాని లోకాలోకనకై
అనంత వాయువుల్లో కలిసిపోతున్న
ప్రాణాల విలువ తెలీకనేమో!
''ర్యాగింగ్ భూతం''
హుంకరింపులు, విజృంభణలు.
తనలో తానే తొంగిచూడలేని
అగాధాలను చూస్తూ
చీకటి తీవెల వీణను మీటుతోన్న
ఓ విద్యార్ధీ!
విద్యనర్ధించాలి కానీ
సాటివారి ప్రాణాలను కాదు.
- వేమూరి శ్రీనివాస్
9912128967