Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యాలయాలు విలువలకు నిలయాలు. చదువులు సంస్కారాలద్దాల్సిన చోట ర్యాగింగ్ విషసంస్కృతి జడలు విప్పి యువత జీవితాలతో చెలగాట మాడుతున్న సంఘటనల నేపథ్యంలో వీటికి ఎవరు బాధ్యత వహించాలి? యజమానులా, ప్రభుత్వాలా, సమాజమా... ఓసారి తాజా పరిస్థితులను పరిశీలిద్దాం... ఉన్నత, వృత్తి విద్య, వైద్య విద్య కళాశాలలలో ర్యాగింగ్ విష సంస్కృతి, వేధింపుల కబంధ హస్తాల్లో ఎందరో యువతీ, యువకులు అర్థాంతరంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎన్నో ఆశ(ఆశయా)లు లక్ష్యాలతో ఉన్నత చదువుల కోసం వచ్చి ర్యాగింగ్ బారిన పడుతున్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్షలుపడే సంగతేమో గానీ, భరించలేని బాధితులు వాళ్లకు వాళ్లే శిక్షలు వేసుకుంటున్నారు. వాళ్ల తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతున్నారు. ఆయా రంగాల్లో సమాజానికి ఎంతోచేయూతను ఇవ్వాల్సిన యువతరం వారి బంగారు భవిష్యత్తును బలి చేసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య ఇద్దరు అమ్మాయిలు వైద్య విద్యార్థిని ప్రీతి, బీటెక్ విద్యార్థిని రక్షితలు ర్యాగింగ్ వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లకు ఎంతో ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యతలను విస్మరించి, ర్యాగింగ్ చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేయడం ముమ్మాటికీ మంచి పద్ధతి కాదు. శృతిమించుతున్న సీనియర్ల ఆగడాలు, బరితెగింపు వ్యాఖ్యలు, వికృత చేష్టల గురించి కళాశాలల యాజమాన్యాలు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక సీనియర్ల ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్యలకు లోనవుతు న్నారు. ఇటువంటి పరిస్థితు లలో ఈ సమాజం, ప్రభుత్వా లు లోపాన్ని సరిదిద్దడంలో ఉదాసీనత వీడాలి. ప్రజల ఆరోగ్యాలకు భరోసా ఇచ్చే వైద్యులను ''కనిపించే దేవుళ్ళుగా-ప్రాణబిక్ష పెట్టే ప్రాణప్రదాతలు''గా గౌరవిస్తారు. ఇలాంటి పవిత్రమైన బాధ్యతాయుతమైన వైద్య విద్యార్థులు ఎంతో ఓర్పును, నేర్పును కలిగి ఉండాలి. తమ తోటి వైద్య విద్యార్థు(మెడికో)ల పట్ల కిరాతకంగా, అమానవీయంగా ప్రవర్తించే వాళ్లు భవిష్యత్తు లో వైద్య పట్టాలు పుచ్చుకున్నాక, రోగులకు సాంత్వన, ఆరోగ్య భరోసా, నమ్మకం ఏర్పలచగలరా!. వీరిది ముమ్మాటికీ క్షమించ రాని నేరం. ఈ పైశాచిక విష సంస్కృతి మూలంగా ఉన్నత చదువులు చదివి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమాజానికి ఎంతో సేవలు చేయాలనే సదాశయాలను మరిచి తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. గడిచిన ఐదేండ్ల కాలంలో సీనియర్ల దౌర్జన్యాలను, తీవ్రమైన పని భారాన్ని వైద్య విద్యార్థులు తట్టుకోలేక 119మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు జాతీయ వైద్య మండలి (ఎన్.ఎం.సి) గణాంకాలు చెపుతున్నాయి. మెడికో పీజీ విద్యార్థులకు వారానికి 48గంటలే పనిచేయాలనే ఆదేశాలు ఆచరణలో అమలు కావడం లేదు. దీనికి తోడు సీనియర్ల కళాశాలలో, వసతి గృహాల్లో పరాకాష్టకు చేరి హద్దులు దాటిపోతోంది. గుంజీలు తీయించడం, గోడకుర్చీలు వేయించడం, దుస్తులు విప్పించడం, ఆహారం, మద్యం తెమ్మనడం, ఒత్తిళ్లు, శారీరక హింసలు చేస్తూ ఉన్నట్లు ఇంతకుముందే ఈ బాహ్య ప్రపంచానికి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో వైరలైన విషయం అందరికీ తెలిసిందే. వాటి నుంచైనా కఠిన శిక్షలు, కౌన్సిలింగ్ చేసి జాగ్రత్తలు తీసుకుంటే నేడు ప్రీతి, రక్షితలలా ఇంకొందరి మరణాలు జరిగేవి కావు. ఈ నిర్లక్ష్యం ఇంకెన్నాళ్లు? ఇంకెంతమంది ఈ ర్యాగింగ్ భూతానికి బలవాలీ! అని బాధిత కుటుంబాలు, సమాజం దిగ్భ్రాంతికి గురవుతోంది. ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలలలో వసతి గృహాల్లో, భోజనశాలల్లో తదితర చోట్ల సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉంచాలి, వాటిని ఎప్పటి కప్పుడు పనిచేసేలా ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలి. జాతీయ వైద్య కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి వైద్య కళాశాలలో ర్యాగింగ్ నిరోధక బందాన్ని ఏర్పరిచి పర్యవేక్షణ పెంచాలి. ఇవి ఉత్సవ విగ్రహం కారాదు. ర్యాగింగ్ బాధితులు ఫిర్యాదు చేయడానికి వీలుగా ఫిర్యాదు పెట్టెలను, ఫోన్ నెంబర్లను కనబడేలా ఉంచాలి. కొత్త, పాత విద్యార్థుల మధ్య ప్రత్యక్షంగా పరిచయాలు చేయాలి. ర్యాగింగ్ చర్యలకు పాల్పడితే శిక్షలు, జరిమానాలు, కఠిన చట్టాల గూర్చి అవగాహనపరచాలి. అనునిత్యం కౌన్సిల్ నిర్వహిస్తూ గాడి తప్పుతున్న విధానాలను, గురుతర బాధ్యతలను, ఒకరినొకరు గౌరవించుకునే విధానాన్ని నైతిక విలువలను కళాశాలలో పెంపొందించాలి. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలి. ర్యాగింగ్‌కు పాల్పడిన తోడ్పడిన వారిని వైద్య విద్యకు అనర్హులుగా ప్రకటించా లనే చట్టాన్ని ఈ మధ్య జరుగుతున్న వరుస అమానవీయ ఆత్మహత్య సంఘటనలతో అమలు చేయాలనే డిమాండ్ ముందు కొస్తున్నదని విద్యార్థులను హెచ్చరించాలి. విద్యార్థుల భవిష్యత్ అంధ కారమవుతుందని మానవీయ దృక్పథంతో ఉపేక్షించడం వల్ల వీరి ఆగడాలు మితిమీరి పోతున్నాయి.
వరుస సంఘటనల దృష్ట్యా.. ర్యాగింగ్ నిరోధక కమిటీలు, నిఘా బృందాలు, కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వాలు ఉదాసీనత వీడి కఠిన చర్యలకు పూనుకోవాలి. ర్యాగింగ్ ను, ఆత్మహత్యలను తగ్గించడానికి ఎప్పటి కప్పుడు కళాశాలలో విద్యార్థుల మధ్య కౌన్సిలింగ్ శిబిరాలు నిర్వహించాలి. ర్యాగింగ్ శృతి మించి పరాకాష్టకు చేరి హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ర్యాగింగ్‌కు ఆస్కారం ఉన్న కళాశాలైన, కార్యాలయాలైన, వసతిగృహాలైన, పబ్లిక్ ప్రదేశాలైన ర్యాగింగ్ వేధింపులను నివారించడానికి బలమైన యంత్రాంగం, ఫిర్యాదు అందగానే ఆ ప్రదేశానికి చేరి బాధితులను రక్షించడం, బాధ్యులను శిక్షించేలా నిఘా యంత్రాంగాన్ని పెంచాలి. ర్యాగింగ్ వేధింపులను ఎదుర్కొనే వారు మౌనంగా భరించవద్దు. ఆ సమస్యను తల్లిదండ్రులతోనో, సన్నిహితులతోనూ పంచు కుంటే పరిష్కారం దొరుకుతుంది. ఆత్మహత్య లే అంతిమమార్గం కారాదు. మనసు నుంచి ఆత్మహత్యల ఆలోచనను తరిమివేయాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఉన్నత చదువు లు, మహౌన్నత ఆశయాలు, లక్ష్యాల ముందు క్షణికావేశానికి లోనుకారాదు. ప్రపంచంలో అతి విలువైనది ఏదైనా ఉందా అంటే? అది ''ప్రాణం'' ఒక్కటే. అంత విలువైన జీవితాన్ని చేజార్చుకోవద్దు.
- మేకిరి దామోదర్
సెల్ 9573666650