Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెకనుకు రూ.3.5లక్షలు, నిమిషానికి రూ.2.1కోట్లు, గంటకు రూ.126కోట్లు, రోజుకు రూ.3,024కోట్లు, నెలకు రూ.90,720కోట్లు, ఏడాదికి రూ.10.88లక్షల కోట్లు, గడిచిన ఎనిమిదన్నరేండ్లలో రూ.92లక్షల కోట్లు... ఏంటి ఈ లెక్కలన్నీ? భారతదేశానికి ఏ ఎగుమతుల రూపంలో వచ్చిన ఆదాయమో, లాభాలో అనుకుంటే మీరు కచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన అప్పు. 2014-15లో భారతదేశం అప్పు రూ.62,78,553కోట్లు ఉండగా, ఇప్పుడది 2022-23వ ఆర్థిక సంవత్సరానికి రూ.147.19లక్షల కోట్లకు పెరిగింది. మరి ఇప్పుడెందుకు ఈ లెక్కలనేగా మీ సందేహం. తాజాగా బుధవారం దేశంలో మరోసారి పెరిగిన గ్యాస్ ధరలను చూస్తే ఈ లెక్కలను గుర్తుచేయాల్సి వచ్చింది. అంటే దేశంలోని ప్రతీ భారతీయుని నెత్తిన సగటున రూ.1లక్షకు పైగా తలసరి అప్పు ఉందన్న మాట. మరి ఇంత భారీ స్థాయిలో అప్పులు చేస్తున్న భారతదేశంలో నిత్యావసర ధరలెందుకు మండుతున్నాయో భారతీయులకు అర్థం కాక జట్టుపీక్కుంటున్నారు. ఒకసారి గ్యాస్ ధరల పెరుగుదలను గుర్తుచేసుకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అంటే 2014లో రూ.414లు ఉంది. ఆ వెంటనే 2015లో రూ.606కు పెరిగింది. 2016లో రూ.747కు పెరిగింది. ఈ లెక్కన 2021లో రూ.819, 2022లో రూ.1150 తాజాగా 2023 మార్చి1న హైదరాబాద్ నగరం సహా వివిధ ప్రాంతాల్లో రూ.1170 దాటి 1200లకు చేరువ అవుతోంది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఒక పక్క ఎడతెరిపి లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, మరో పక్క గ్యాస్ ధరలు పెంచడం సామాన్యులకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. గతేడాది జూలై నుండి కాస్తంత స్థిరంగా ఉన్నట్టు కనిపించినా ఎవరూ ఊహించని విధంగా మళ్లీ కేంద్రం షాకిచ్చింది. దీంతో వంటింట్లో గ్యాస్ మంటలు చెలరేగినట్టయింది. అంతకంతకూ పెరుగుతున్న దేశ అప్పుతో పాటు తలసరి అప్పు, నిత్యావసర ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే జీఎస్టీతో చాలా సరుకుల ధరలు పెరిగి కునారిల్లుతున్న దేశ జనాభాపై గ్యాస్ భారం అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు డొమెస్టిక్ సిలిండర్‌పై ఉన్న సబ్సిడీని ఎత్తేసినట్టే కాగా గడిచిన ఎనిమిదేండ్లుగా కేంద్ర బడ్జెట్లోనూ పెట్రోల్ గ్యాస్ అధారిత సబ్సిడీలకు మంగళం పాడినట్టుగా తెలుస్తోంది. 2019లో లోక్‌సభ ఎన్నికల ముందు గ్యాస్ సబ్సిడీ దేశీయంగా సుమారు రూ.34వేల కోట్లుగా ఉండగా, తీరా ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుని ప్రస్తుతం రూ.5వేల కోట్లకు కుదించడం బట్టి గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తేసినట్టేనని రుజువు అవుతోంది.
గ్యాస్ కనెక్షన్లేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మొదటి సారిగా మే 1, 2016న ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతగా దేశంలోని 1,47,43,862 మందికి ఉజ్వల గ్యాస్ పంపిణీ చేసింది. ఆ తర్వాత రెండో విడతగా 10 ఆగస్టు 2021న పీఎంయూవై 2.0 కింద ఉత్తరప్రదేశ్‌లోని మహౌబా జిల్లాలో వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించారు. ఇప్పటికే కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 8.03కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ పంపిణీ చేయగా అందులో అగ్రభాగం బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇచ్చినట్టు విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెంచుకుంటూ పోతుండటంతో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు గ్యాస్ కనెక్షన్ ఉన్నా రీఫిల్ నింపుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానురానూ గ్యాస్ వినియోగం కూడా చాలా వరకూ తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక వైపు నిత్యావసర ధరలు పెరుగుతుండటం, మరోవైపు ఆదాయ వనరులు సన్నగిల్లడంతో అనివార్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు కష్టాల్లోకి నెట్టబడుతున్నారు. ఇక కూలీ పనులకు వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. గ్యాస్ ధరల పెంపుపై దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసనలు పెరిగినా కేంద్రం పట్టించుకోకపోవడం బాధాకరం.
- వి. నాగయ్య
9441877695