Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ మతాచార పద్ధతిని (కోడ్‌ను) విడిగా ఒక మతంగా వర్గీకరించాలనే ఆదివాసీల డిమాండ్ ఆరెస్సెస్, దాని శాఖోపశాఖల్లో గుబులు రేకెత్తిస్తోంది. నవంబర్ 2020లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ 'సర్నా' ప్రకృతిని మాత్రమే ఆరాధించే ఒక గిరిజన తెగ అని 2021 జనాభా లెక్కల్లో వారి మతాన్ని ప్రకృతి ఆరాధకులుగానే రాయాలని తీర్మానించింది. జార్ఖండ్ పక్క రాష్ట్రాల్లో కూడా ఈ తెగ ఉంది. తమ సంస్కృతీ సాంప్రదాయాలను విడిగా గుర్తించాలన్న వీరి డిమాండ్ చాలా కాలంగా ఉన్నా ఇటీవల ఊపందుకుంది.
2020లోనే వీరు తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు. 2021 ఫిబ్రవరిలో హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ... జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ''ఆదివాసీలు ఎప్పుడూ హిందువులు కారు, కాలేరు!'' అని నొక్కి వక్కాణించారు. అది ఆ రాష్ట్రంలోని అనేక మంది మేధావుల ప్రశంసలందుకుంది. 2020 నుండి అనేక రాష్ట్రాల్లోని గిరిజనులు ''గిరిజన మతాన్ని'' పరిగణనలోకి తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. 'సర్నా' మతాచారాన్ని (కోడ్‌ను) లెక్కలోకి తీసుకోవాలని పోరాడుతున్నారు. ఈ డిమాండ్ సాధనకై జార్ఖండ్, చత్తీస్ఘఢ్ వంటి అనేక రాష్ట్రాల గిరిజనులు ఆ మధ్య ఢిల్లీలో ధర్నా చేశారు. 2021 జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కాలేదు. 2022 జూన్‌లో ''తదుపరి ఉత్తర్వులు'' వెలువడేవరకు జనాభా లెక్కలు ఆలస్యమవుతాయని పార్లమెంటులో ప్రకటించింది మోడీ సర్కార్! కారణం 'కోవిడ్ 19' అని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతానికి జనాభా లెక్కల్లో హిందు, క్రిస్టియన్, ఇస్లామిక్, సిక్కు, బౌద్ధ, జైన అనే ఆరు మతాల పేర్లు రాసేందుకే అవకాశం ఉంది. ఆదివాసిక్రిస్టియన్లు తమ మతాన్ని క్రిస్టియానిటీగా ప్రకటించుకునే అవకాశం ఉండగా, ఇతరులకు ''ఇతర మత ఆచారాలు'' అని రాసుకునే అవకాశముంది. 'సర్నా' అని రాస్తేనే తమ సంస్కృతిని కాపాడుకోగలమనే నమ్మిక ఈ గిరిజనుల్లో ఉంది.
ఈ సర్నా 'కోడ్' డిమాండ్ సంఫ్‌ు పరివార్ ఆలోచనా ధోరణికి విరుద్ధమైంది. గిరిజనులు అడవుల్లో నివసించే హిందువులని (వనవాసులని) ఆరెస్సెస్ దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నది. వారి మతాన్ని విడిగా గుర్తించ నిరాకరిస్తున్నది. వేదాల వారసులైన హిందువులే అసలు సిసలైన భారతీయులనే వాదనకు ఈ గిరిజన మతం విరుద్ధమైంది. గిరిజనులను హిందువుల్లోకి తెచ్చేందుకు బాధ్యత తీసుకున్న ఆరెస్సెస్ 'అఖిల భారతీయ వనవాసి కళ్యాణ ఆశ్రమం' (ఎబివికెఎ) కృషికి దెబ్బే!
క్రిస్టియన్ మతంలోకి పెద్ద ఎత్తున గిరిజనుల మతమార్పిడులను అడ్డుకునే సాకుతో ఈ ఎబివికెఎను 1952లో స్థాపించారు. దీనికి సైద్ధాంతిక నేతృత్వం ఎం.ఎస్. గోల్వల్కర్. గిరిజనులు తగు సంఖ్యలో ఉన్న దేశంలోని అన్ని జిల్లాల్లో చిన్న చిన్న ఎబివికెఎ కేంద్రాలను ఆరెస్సెస్ స్థాపించింది. ఈ కేంద్రాలు పాఠశాలల నిర్వహణతో పాటు ఇతర సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు - హెల్త్ క్యాంప్‌లు, పెద్ద సంతల నిర్వహణ, ఆటలు ఆడించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. 'సర్నా కోడ్' కావాలనే పేర జరిగే ఉద్యమం హిందూ సమాజాన్ని 'చీల్చే కుట్ర' అని జార్ఖండ్‌లో పాలాము జిల్లా వనవాసి కళ్యాణ కేంద్ర కార్యదర్శి అశ్విని కుమార్ మిశ్రా చెప్పుకొచ్చారు. ''వనవాసీలా్లగ మేమూ చెట్లని, నదుల్ని, కొండల్ని పూజిస్తాం. ఏమితేడా లేదు. మేమంతా హిందువులమే'' అన్నారు.
ఇప్పుడు జరిగే ఉద్యమంలోని ఆదివాసీలను వ్యతిరేకం చేసుకోకుండా ఆరెస్సెస్ నిశ్చలంగా ఉంది. ఇటీవల బెంగుళూరులో జరిగిన ఆరెస్సెస్ జాతీయ సమ్మేళనం సందర్భంగా కూడా ఈ విషయంపై పెదవి విప్పలేదు. నవంబర్ 15న జన్ జాతీయ గౌరవ్ దివస్ నాడు మోహన్ భగవత్ చత్తీస్‌ఘర్‌లో ఒక ఉపన్యాసం చేశారు. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా భారతదేశం తమ మాతృభూమి అనుకునే వారంతా భారతీయులే వంటి సాదా మాటలతోనే మోహన్ భగవత్ ఉపన్యాసం ముగిసిపోయింది. ప్రపంచం మొత్తం మీద భిన్నత్వంలో ఏకత్వం కలది హిందుత్వం మాత్రమే'' అన్నారు మోహన్ భగవత్. విడిగా మతం కావాలనే డిమాండ్ కాకుండా హిందువుల్లోనే వారుండాలనే సలహా మినహా గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే ఏమాటా ఆయన ఉపన్యాసంలో లేదు. అయితే... దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలోకి ద్రౌపది ముర్ము ఎన్నికైన తర్వాత ఆదివాసి మతం కోసం డిమాండ్ మరింత ఊపందుకుంది.
గిరిజనుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వ్యతిరేకిస్తుందనే భరోసా ఆరెస్సెస్‌లో కనపడుతోంది. సర్నా కోడ్ కోసం పెద్ద సంఖ్యలో గిరిజనులు ఆందోళన చేస్తున్న మరో రాష్ట్రం చత్తీస్‌ఘర్. అక్కడి ఒక ఆరెస్సెస్ నేత ఈ పరిస్థితిని ఏదో ఒకరకంగా మోడీ సర్కార్ సరిచేస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. ''ఎట్టి పరిస్థితిలోనూ మరో మతాన్ని కొత్తగా సెన్సస్ లెక్కల్లో చేర్చరు'' అన్న గట్టి నమ్మకం తనకుందన్నాడీ మహానుభావుడు. ఈ లోపు హిందువులుగా ఉన్న మనల్ని చీల్చే ఏ కుట్రలనూ సాగనీయరాదని తాము వనవాసీలను ''ఒప్పిస్తా''మన్నాడు.
ఆదివాసీలను ఆరెస్సెస్ నుండి కచ్చితంగా వేరుచేసే గీత ఈ 'సర్నా'కోడ్. ''ఆరెస్సెస్ సర్నాకోడ్ను వ్యతిరేకిస్తున్నది. వనవాసీలు పేర ఆదివాసీలను హిందువులుగా మార్చేందుకు అది ప్రయత్నిస్తోంది. ఇంతకాలం ఆదివాసీలను ఒకరికి వ్యతిరేకంగా మరొకర్ని రెచ్చగొట్టి అది తన పబ్బం గడుపుకుంది'' అంటారు జార్ఖండ్‌లోని ఆదివాసి గ్రూపుల కేంద్రీయ సమితి నాయకుడు అజరు టిర్కే. సర్నాకోడ్ కోసం సాగే ఉద్యమానికి నాయకత్వం వహించే సంస్థ ఇది. ఈ ఉద్యమం ఊపందుకునే సరికి ఆరెస్సెస్ మరో పల్లవి లంకించుకుంది. మరో మతాన్ని (సర్నాను) గనుక ఎంచుకునేట్లయితే హిందువులుగా ఇప్పటిదాకా అందుకున్న రాయితీలేవీ వర్తించవని ప్రచారం చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల్లో దాదాపు 50లక్షల మంది గిరిజనులు ''ఇతరులు'' అని తమ మతాన్ని రాశారని టిర్కే అంటారు. ఇది 40లక్షలుగా ఉన్న జైన్ల కంటే ఎక్కువ అని టిర్కే చెప్పారు.
ఆదివాసీల సాంస్కృతిక అస్తిత్వాన్ని ఇది దిగమింగే చర్య. ''ఆరెస్సెస్ ఆదివాసీలను హిందువులుగా పేర్కొనడాన్ని నేను అంగీకరించను'' అంటారు జార్ఖండ్‌కు చెందిన ప్రఖ్యాత ఆదివాసి కవి అనుజ్ లుగూన్. ''ఆదివాసీలు ప్రత్యేక అస్తిత్వం ఉన్నవారు. హిందువుల నమ్మకాల కంటే మా విశ్వాసాలు వేరు. మా తాత్విక చింతనే వేరు'' అంటారాయన. వర్ణాశ్రమ ధర్మం హిందువులకు కీలకం. ఆదివాసీలకు దానికి సంబంధమే లేదు. వర్ణాశ్రమ పద్ధతికి వెలుపల వారుంటారు.
'సర్నా' మతాన్ని అనుమతించకపోతే తానే జనాభాలెక్కల్లో ఓఆర్పీ (అదర్ రెలిజియస్ ప్రాక్టీసెస్) అని రాస్తాన''ని లుగూన్ తెగేసి చెప్పారు. ''ఆదివాసీల సాంస్కృతిక వారసత్వం, మతపరమైన తాత్విక చింతన, ఆదివాసీ గ్రూపులు ఎంత భిన్నమైనవైనా అవన్నీ 'జల్, జంగల్, జమీన్'తో ముడిపడివున్నాయి'' అంటారు లుగూన్. ''ఆదివాసీల డిమాండ్‌ను అంగీకరించడం మంచిది. ఎందుకంటే అది రాజకీయాలతో సంబంధం లేనిది. అది ఆదివాసీల సాంస్కృతిక అస్తిత్వంతో ముడిపడి ఉంది'' అని లుగూన్ తేల్చి చెప్పారు.
ఒక మతం వారిని మరో మతంలో బలవంతంగా కలిపే ప్రయత్నం గాని, లేదా ఒప్పించే ప్రయత్నంగాని సంక్లిష్టమైనవి. ఇది ఊహించలేని పరిణామాలకు దారితీయవచ్చు. లోతులు తెలియనంత క్రోధాన్ని రగిలించవచ్చు. తనపై సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గిరిజనులను హిందువుల్లో కలిపేసు కోవచ్చని ఆరెస్సెస్ భావిస్తోంది. ఇంత తీవ్రమైన ప్రతిఘటన రావడంతో సర్ సంఫ్‌ు చాలక్ నుండి సామాన్య కార్యకర్త వరకు ఆరెస్సెస్ పరివారం గందరగోళంలో పడింది.
- ధీరేంద్ర కే ఝా
(కారవాన్ సౌజన్యంతో) స్వేచ్ఛానువాదం: ఆరెస్బీ.