Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రిపుర నాగాలాండ్,మేఘాలయ ఫలి తాల తర్వాత ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ విజయాలు చారిత్రాత్మకమైనవైనట్టు మోతమో గుతున్నది. ఇందుకు ప్రధాని మోడీ వ్యక్తిగత ప్రభావం కారణమైనట్టు ఆయన పథకాలతో అభివృద్ధి, సంక్షేమం మెరుగయ్యాయని సంతోషించినందుకే ప్రజలు గెలిపించినట్టు పెద్ద ప్రచారం సాగుతున్నది. ఉత్తరాదికే పరిమితమైన పార్టీగా చెప్పుకునే బీజేపీ దేశం మూలమూలనా చొరబడిందని ఈ ఫలితాలతో తిరుగులేని విధంగా రుజువైందనే పల్లవి వినిపిస్తున్నది. త్రిపురలో వామపక్ష కూటమి, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడం కీలక పరిణామంగా చిత్రించబడుతుంది. ఎన్నికల్లో జయాపజయాలను బట్టి ఈ విధమైన వాదనలు ప్రచారాలు సాగడంలో ఆశ్చర్యం లేదు గాని పూర్తి వాస్తవమేమిటనేది కూడా అర్థం చేసుకోవడం అవసరం.ఈ ఫలితాలలో బీజేపీకి అంత సీన్ కనిపించిందా? ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాలలోనూ వాటితోపాటు జరిగిన ఉప ఎన్నికలలోనూ బీజేపీ సాధించిన ఫలితాలేమిటి పరిమితులేమిటి? లోతుగా చూడాల్సి ఉంది.అలా చూసినప్పుడు బీజేపీ నేతలు అంతగా జబ్బలు చరుచు కోవలసిన అద్బుత ఫలితాలేమీ కాదని, అవైనా అనేక అక్రమాలు ధనబలం నిర్బంధంతో లభించినవేనని స్పష్టమవుతున్నది. పైగా ఇవిచాలా చిన్న రాష్ట్రాలను వశపర్చుకోవడం కోసం ప్రపంచంలోనే పెద్దదిగా టముకు వేసుకునే పార్టీ పడరాని పాట్లుపడటం, ఫలితాలు రాగానే ప్లేటు మార్చడం కూడా కనిపిస్తుంది. ఈ చిన్న రాష్ట్రాలలో ఇతరులతో రకరకాల బేరసారాలు మత రాజకీయాలు నెరిపిన బీజేపీ ఇదేదో దేశవ్యాపిత విజయంలా చెప్పుకుంటే మీడియా కూడా వంతపాడటం వింత గొల్పుతుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో బీజేపీ అధికారానికి రావడం, మేఘాలయ మణిపూర్లలో మిత్రపక్షాల సాయంతో పాగా వేయడం గొప్ప పరిణామాలుగా చెప్పేవారు గతంలోనూ కేంద్రంలోని కాంగ్రెస్ ఈ తరహా ఆధిక్యత నడిపించుకుందని మర్చిపోతుంటారు. ఈశాన్య రాష్ట్రాలు గానీ జమ్మూ కాశ్మీర్గాని కేంద్రంలో ప్రభుత్వాన్ని బలపరిస్తే తప్ప బతకలేని దురవస్థ ఇందుకు కారణమని దేశమంతటికీ తెలుసు. మోడీ హయాంలో పెద్ద పెద్ద రాష్ట్రాలకే నిధులు కేటాయించకుండా వివక్షతో దాడులతో లోబర్చుకుంటున్న నేపథ్యం ఈశాన్యానికి మరింత ఎక్కువగా వర్తిస్తుందని చెప్పనవసరం లేదు.
పైగా అధికార అవకాశవాదంలోనూ వేర్పాటువాద పోకడలలోనూ అక్కడి పాలకపక్ష నాయకులు ఆరితేరారు గనక ఆ పని మరింత తేలికే. 35 ఏండ్లు వామపక్ష పాలనలో స్థిరత్వం కాపాడుకున్న త్రిపుర మినహా అన్నిచోట్లా ఇదే జరిగేది. దాన్నే మోడీ, హోంమంత్రి అమిత్‌షా వంటివారు తమవైపునకు తిప్పుకోవడంలో గొప్పతన మేమీ లేదు. వీటిలోని హెచ్చరికను గుర్తించడం అవ సరమే అయినా అతిశయోక్తులను ఆమోదించనవసరం లేదు.
త్రిపురలో జరిగిందేమిటి?
ఇప్పుడు ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లోనూ ఒక్క త్రిపురలో మాత్రమే బీజేపీ తానుగా ఆధిక్యత సాధించింది. అందుకోసం ఎన్ని దౌర్జన్యాలూ నిర్బంధాలు జరిగాయో గతవారం చెప్పుకున్నాం. స్వేచ్చగా ఓటేయనిస్తే తప్ప గెలుస్తామని మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ చేసిన వ్యాఖ్య నేను గుర్తుచేశాను. అలా జరగడం లేదనీ దాడులతో పాటు అక్రమాలు ధనప్రలోభాలు పెరుగుతు న్నాయని సీపీఐ(ఎం) నాయకులు అనేకసార్లు ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. కాని అవి ఆగిందిలేదు.. గిరిజన ప్రాంతాలలో ఎన్నికల ముందే పుట్టుకొచ్చిన త్రిప్రిమోతె పార్టీ ఓట్ల చీలికలోనూ, సీట్ల చీలికలోనూ పెద్ద ప్రభావమే చూపింది. దాంతో కేంద్ర బీజేపీ నాయకులు మంతనాలాడారు. ప్రత్యేక రాష్ట్ర్రం, ప్రత్యేక దేశం అంటున్నా వారి మంతనాలు ఆగలేదు. ఆ ఒక్కటి తప్ప అన్నిటికీ సిద్ధమని బాహాటంగానే సంకేతాలిచ్చారు. ఇంతకూ ఈ పార్టీ ఎవరిదంటే పీసీసీ అధ్యక్షుడుగా ఉండి నిష్క్రమించిన మాజీ యువరాజు ప్రద్యుమ్నది. అంటే ఆయన కాంగ్రెస్ ఓట్లలోనూ గండిపెట్టాడనేది స్పష్టమే. సీట్ల సర్దుబాటులోనూ చివరిదాకా సాగదీసిన కాంగ్రెస్ నాయకత్వం పాత్ర మరొకటి. ఇన్నిటి మధ్య సీపీఐ(ఎం) వామపక్షాల నాయకులు ప్రాణాలకు వెరవకపోరాడారు. బీజేపీ విచ్చిన్నశక్తుల దాడులను ఎదుర్కొన్నారు. ఫలితాలు వచ్చాక చూస్తే కాంగ్రెస్‌తో కలిసినప్పటికీ వామపక్షాల ఓట్లశాతం పెరక్కపోగా గతసారి కన్నా పదిహేను శాతం వరకూ తగ్గినట్టు కనిపిస్తుంది. ఈ పొత్తే పొరబాటనే వాదనలు మీడియాలో మొదలైనాయి. విధాన పరమైన నిర్ణయం గనక ఇప్పుడు దానిపై తర్జనభర్జనల కన్నా సమగ్ర సమీక్ష కోసం ఎదురు చూడటం మంచిది. కాని అసలు సమస్య మాత్రం మరోసారి వేర్పాటు వాద విచ్చిన్నకర పోకడలు పెంచే శక్తులకు ఊతమివ్వడం. గతంలో ఆస్సాంలో కాంగ్రెస్ ఇలాగే చేయడం గుర్తుండే వుంటుంది. ఇప్పుడు బీజేపీ అదేపని చేస్తున్నది. ఇంతా చేసినా ఐటిపిఎప్తో కలిసి కూడా అది అత్తెసరు ఆధిక్యతనే తెచ్చుకోగలిగింది. బీజేపీని వ్యతిరేకించేది తానేనన్నట్టు గొప్పలు పోయే తృణమూల్ కాంగ్రెస్ కూడా అన్నిచోట్ల పోటీ పెట్టి ఓట్ల చీలికకు కారణమైంది. వీటన్నిటినీ ఉపయోగించుకున్న బీజేపీి నేతలు ఇప్పుడు మాత్రం మహిళలు యువత తమకు బాగా ఓటేశారని చెప్పుకుంటున్నారు. ఏమైనా రాజకీయంగా బీజేపీకి అంతర్గత కలహాల మధ్య వచ్చిన త్రిపుర విజయం కీలకమే అవుతుంది. ఇన్ని నిర్బంధాల మధ్య సీపీఐ(ఎం) వామపక్ష కార్యకర్తలు పునాది కాపాడుకున్న తీరు అభినందనీయం. త్రిప్రిమోతె రానున్న రోజులలో ఎలాంటి సమస్యలు, సవాళ్లు సృష్టించేది బీజేపీ అవకాశవాదం ఏ పరిణామాలకు కారణమయ్యేది చూడాల్సిందే.
మేఘాలయలో వెనకడుగు, నాగాలాండ్‌లో జూనియర్ పాత్ర
ఈశాన్య విజయం అంటూ అతిగా చెప్పుకుంటున్న బీజేపీ మిగిలిన రెండు రాష్ట్రాలు నాగాలాండ్ మేఘాలయలో స్వంతంగా సాధించిందేమీ లేదు. మేఘాలయలో కొర్నార్డ్ సంగ్మా నాయకత్వంలోని నాగాలండ్ పీపుల్స్‌పార్టీ (ఎన్పీపీి) 26 స్థానాలతో పెద్దపార్టీగా వచ్చింది. ఈపార్టీతో కలిసి మిశ్రమ కూటమిలో ఉన్న బీజేపీ ఎన్నికల ముందే వైదొలగింది. ఈశాన్యంలో అన్నిటి కన్నా అవినీతికరమైన ప్రభుత్వం అది అని స్వయంగా హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. కాని ఇప్పుడు రెండుస్థానాలు గెలిచిన బీజేపీ ఆ పార్టీతోనే చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తున్నది. ఈ మేరకు సంగ్మా గవర్నర్‌ను కలిసి అవకాశం కోరాడు. అమిత్ షా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం చూసుకుంటున్నారు. హిల్పీపుల్స్పార్టీకి చెందిన ఇద్దరు మరో ఇద్దరు స్వతంత్రులు కూడా తమతో ఉన్నారని సంగ్మా చెబుతున్నా ఆ పార్టీలు మరోలా మాట్లాడుతున్నాయి. కేంద్రం వారిని దారికి తెచ్చినా ఆశ్చర్యం లేదు. 11 స్థానాలు తెచ్చుకున్న మాజీ పాలక కూటమి భాగస్వామి యూడీపీి, రెండు తెచ్చుకున్న విపీపీపార్టీ కూడా బేరసారాలు సాగిస్తున్నాయి. ఇక నాగాలాండ్‌లో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నలెల్ఫూరియో నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధ మవుతున్నది. నేషనలిస్టు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్పార్టీ (ఎన్డీపీపీి) నాయకుడైన రియోకు 12 మంది బీజేపీ సభ్యుల మద్దతు ఉన్నది. ఇక్కడ కూడా బీజేపీ జూనియర్ భాగస్వామి గానే వుంది. కనుక బీజేపీ ఈ రెండుచోట్ల గెలిచేసినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదమే. పైగా అది మోడీ ప్రతిష్ట, బీజేపీ విధానాల విజయంగా చెప్పడం మరీ విడ్డూరం. ఈసర్కార్లు స్థిరంగా వుండటం కూడా కష్టమే. అయితే ముందే చెప్పుకున్నట్టు కేంద్రం మీద పరాధీనీత వల్ల వారు అని వార్యంగా లోబడిపోతుంటారు. అందులో నిలబడినవారిని బీజేపీ తనవైపునకు తిప్పుకుంటుంది. ఈ ప్రక్రియకు ఆధ్వర్యం వహించే అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిస్వాస్శర్మను కొందరు మరో మోడీగా వర్ణిస్తుంటారు కూడా.
మరోవిడత తర్వాతే!
హిందూత్వమే తమ సిద్దాంతమని రెచ్చగొట్టే బీజేపీ ఈశాన్య భారతంలో అధికంగా వున్న క్రైస్తవ ఓటర్ల కోసం మరెవరికంటే అధికంగా బుజ్జగింపు విధానాలు అనుసరిస్తుంది. వారి మతపరమైన కోర్కెలకు పెద్దపీట వేస్తూ గిరిజనాభివృద్ధిని ఉపేక్షిస్తుంది. ఉత్తరాదిన గోరక్షణ గురించి గగ్గోలు పెట్టి అనేకమంది ప్రాణాలు పోవడానికి కారణమైన సంఘపరివార్ ఈశాన్యంలో మాట మారుస్తుంది. గొడ్డుమాంసం తినడం అక్కడ సర్వసాధారణం గనక ఆవును పక్కనపెట్టేస్తుంది!
సెరూసలేము యాత్రలకు సహాయం వాగ్దానం చేస్తుంది. ఇవన్నీ మతసహనంతో చేస్తే పర్వాలేదు గాని ఓట్లకోసమే కావడం విపరీతం. అస్సాంలో అత్యుత్సాహంతో హిందూత్వ పాఠాలు చెప్పే ముఖ్య మంత్రి శర్మ తక్కిన ఇతర చోట్ల మొత్తం మార్చేసి అదే తన చాణక్యమంటారు. ఇవన్నీ అవకావవాద రాజకీయ విన్యాసాలే.ఉత్తరాదిలోనే పూర్తిగా గెలవలేని బీజేపీ దక్షిణాన పాగా వేసేందుకు నిరంతరం విఫలయత్నాలు చేస్తు న్నది. తూర్పు పశ్చిమాలలో కూడా దానికి ప్రత్యర్థి రాజకీయ శక్తులున్నాయి. ఒరిస్సా, బెంగాల్‌వంటి చోట్ల గెలవలేక పోతున్నది. దక్షిణాన సరేసరి. కర్నాటక కూడా చేజారి పోతుందని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ మూడు, బీజేపీ, మిత్రులు మూడు తెచ్చుకున్నారు. బెంగాల్లో కాంగ్రెస్ ఈ అసెంబ్లీలో చోటు సంపాదించింది. తమిళనాడులోని ఈరోడ్లోనూ మహారాష్ట్ర లోనూ గెలిచింది. ఇవి మిత్రపక్షాల తోడువల్ల గెలిచినవే కావడం గమనార్హం. కాంగ్రెస్ ఇప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా సరైన విధానం తీసుసకోలేకపోవడం, తనే నాయకత్వం వహించాలన్నట్టు మాట్లాడుతుండడం కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా ఉన్నా బీజేపీ ఈశాన్యాన చిన్నచితక పార్టీలతోకలసి సాగించే కపటనాటకాన్ని దేశవ్యాపిత విస్తరణకు సాక్ష్యంగా చూపాలనుకోవడం కుదిరేది కాదు. ఈ ఏడాది కర్నాటక, చత్తీస్‌ఘర్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్తాన్, తెలంగాణ, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీల ఎన్నికల తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రం మరింత స్పష్టమవుతుంది.
- తెలకపల్లి రవి