Authorization
Wed April 09, 2025 03:17:21 am
(నిన్నటి సంచిక తరువాయి)
బొగ్గు దిగుమతులు, పునరుత్పాదక ఇంధన వనరుల భారం
మోడీ సర్కార్ ఆరు శాతం వరకు విదేశీ బొగ్గును స్వదేశీ బొగ్గుతో కలిపి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని చెప్పింది. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ గత జనవరిలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు వాటి అవసరాలలో 10 నుండి 15శాతం వరకు స్వదేశీ బొగ్గును రైలు - రోడ్ - రైలు పద్ధతిలో రవాణా చేసుకోవాలని కూడా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలను, ఎన్టీపీసీని ఆదేశించింది. దీనివల్ల బొగ్గు రవాణా ఖర్చులు, రైల్వే యార్డులు, షిప్‌యార్డ్‌లో బొగ్గును దించటం, మళ్ళీ ఎక్కించటం, తదితర అనవసర ఖర్చులు తడిచి మోపెడవుతాయి. థర్మల్ విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి. ఆయా విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వాటి ప్రాజెక్టులకు కేటాయించ బడిన బొగ్గును సాధ్యమైన మేరకు త్వరితంగా, తక్కువ ఖర్చుతో రవాణా చేసుకునే మార్గాలను ఎంచుకోకుండా మోడీ ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎందుకు నిర్దేశించి నట్లు? అదానీ హస్తగతమైన ఓడ రేవులకు వ్యాపారం కోసం మోడీ ప్రభుత్వం ఈ తుగ్లక్ నిర్ణయం తీసుకుంది. తమ ఆదేశాన్ని పాటించకపోతే, అవసరమైన రైల్వే వ్యాగన్లను బొగ్గు రవాణాకు కేటాయించ బోమని కూడా కేంద్రం బెదిరిస్తున్నది.
డిస్కాములు వినియోగ దారులకు సరఫరా చేసే విద్యుత్‌లో కనీసం ఎంతశాతం మేరకు పునరుత్పత్తి అయ్యే విద్యుత్‌ను (సౌర, పవన, ఇతర సాంప్రదాయేతర విద్యుత్) కొనుగోలు చేసితీరాలో కేంద్రం నిర్దేశిస్తున్నది. విద్యుత్ నియంత్రణ కమిషన్లు ఇందుకు రెన్యూవబుల్ పవర్ పర్చేస్ ఆబ్లిగేషన్ (ఆర్పీఆర్ఓ) ఉత్తర్వులను నియతకాలికంగా జారీ చేస్తూ, డిస్కాములు కనీసం ఎంత శాతం మేరకు ఆర్ఈని కొనుగోలు చేయాలో నిర్దేశిస్తున్నాయి. అధికంగా ఉన్న ఆ కనీస శాతానికి మించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఈ కొనుగోలుకు డిస్కాములతో దీర్ఘకాలిక పీపీఎలు చేయిస్తున్నాయి. వీటికి రెగ్యులేటరీ కమిషన్లు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఎన్టీపీసీకి చెందిన వ్యాపార విభాగం ఎన్వీవీఎల్, ఎస్ఈసీఐ వంటి సంస్థల ద్వారా ఆశ్రిత పెట్టుబడి దారుల సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేయించి, రాష్ట్రాల డిస్కాములకు కేంద్రం అమ్మిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వార్ధ ప్రయోజనాలకు ఆ విద్యుత్ కొనుగోలుకు దీర్ఘకాలిక పీపీఎలు చేయించి, కమిషన్ల ఆమోదం పొందు తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కుతో, ఇలా అవసరానికి మించి విచక్షణా రహితంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేయిస్తున్నందున వినియోగ దారులపై విపరీత భారాలు పడుతున్నాయి. ఆర్ఈని తప్పని సరిగా కొనుగోలు చేసితీరాలన్న నిబంధన అవసరం లేకపోయినా కొనితీరేందుకు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలని ఆదేశించి, ఆ ప్రాజెక్టులకు ఆ మేరకు స్థిరచార్జీలను డిస్కాములు చెల్లించాల్సి వస్తున్నది. ఆ విధంగా, అవసరంలేని ఆర్ఈ కొనుగోలుకు అధిక చార్జీలు చెల్లిస్తూ, మరోపక్క, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు ఉత్పత్తి తగ్గించినందుకు స్థిరఛార్జీల చెల్లింపు రూపంలో వినియోగ దారులపై రెండు విధాలుగా భారాలు మోపుతున్నాయి. ఆర్ఈ పీక్ డిమాండ్‌ను తీర్చలేదు గనుక, ఒక పక్క భారీగా మిగులు విద్యుత్ ఉన్నా, డిస్కామ్‌లు ఎక్సేంజీల ద్వారా అధిక ధరలకు అదనంగా విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ఆర్ఈ కొనుగోలువల్ల తమకు ఏడాదికి రూ.5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నదని, ఆర్ఈ కొనుగోలు కోసమే తగ్గిస్తున్న ఉత్పత్తిలో 90 నుండి 95శాతం మేరకు థర్మల్ విద్యుత్ ఉంటున్నదని, ఏపీ డిస్కామ్‌లు పలుమార్లు ఎపీఈఆర్సికి నివేదించాయి. 2022-23 సంవత్సరానికి తెలంగాణ డిస్కామ్‌లు 5159 మిలియన్ యూనిట్లను ఎక్సేంజీల ద్వారా కొన్నాయి. తెలంగాణ డిస్కాములు 2023-24 సంవత్సరానికి ప్రతిపాదించిన విద్యుత్ విక్రయాలు 62970 మిలియన్ యూనిట్లను ఆర్ఈ లభ్యత 17375, 27.59శాతం అవుతుంది. అదే సంవత్సరానికి 13441 ఎంయూ మిగులు విద్యుత్ లభ్యతను చూపుతూ, ఆర్ఈని అనవసరంగా కొనటంవల్ల వినియోగదారులపై నివారిం చదగిన భారాలు పైన వివరించిన విధంగా పడుతూనే ఉంటాయి. ఇలాంటి భారాలన్నీ విద్యుత్ ఛార్జీల పెంపు, ట్రూ-అప్ ఛార్జీల రూపంలో పడుతున్నాయి.
-ఎం వేణుగోపాలరావు