Authorization
Sat April 05, 2025 07:10:53 pm
కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు సాధించి, తమ కలలను సాకారం చేసుకోవాలనుకున్న నిరుద్యోగుల ఆశలు ఆవిరైపోయాయి. నాడు స్వరాష్ట్ర సాధన కోసం అగ్రభాగాన ఉండి పోరాడిన నిరుద్యోగులు, విద్యార్థులు నేడు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కూడా పోరాడుతున్నారు. తెలంగాణ సాకారమైతే మా నీళ్ళు మాకే, మా నిధులు మాకే, మా నియామకాలు మాకే అంటూ కేంద్రంతో ఆత్మహత్యల యుద్ధం చేసిన యువత, నేడు ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేస్తారో లేదో అనే ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ఎజెండాలో నియామకాలు అనే నినాదాన్ని ప్రధాన ఎజెండాగా చర్చ జరిగేలా చేసింది విద్యార్ధులే. ఎంతలా అంటే ఉమ్మడి రాష్ట్రంలో నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తే 'మా తెలంగాణ వచ్చినంకా పరీక్షలు రాసి మా రాష్ట్రంలో మేమే ఉద్యోగాలు చేస్తామని' వాటిని బహిష్కరించేంతంగా విద్యార్థులు నియామకాలను ఉద్యమ ఎజెండా చేశారు.
తెలంగాణ రాష్ట్రం సాధించినంక ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు స్వరాష్టంలో కనీసం ఉద్యోగాలు ఎలా భర్తీ చేయాలో ప్రణాళికలు లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ పనిచేసింది. జాబ్ క్యాలెండర్ లేదు. గ్రూప్స్ స్థాయి పోస్టుల భర్తీ లేదు. ఘంటా చక్రపాణి చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన గ్రూప్-2 కూడా అనేక వివాదాల నడుమ కోర్ట్ మెట్లెక్కింది. గత 8 ఏండ్లు నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు 165 ఇస్తే టీఎస్పీఎస్స్ ద్వారా 145 నోటిఫికేషన్లు ఇచ్చారు. వాటిలో 109 డైరెక్ట్ రిక్రూట్ మెంట్స్, 46 డిపార్టెెమెంటల్ రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్లు, వీటీలో భర్తీ చేసింది కేవలం సుమారుగా 79 వేల పోస్టులు మాత్రమే. తెలంగాణ ఎర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. చేసిన ఒక్క నోటిఫికేషన్ కూడా పేపర్ లీకేజీల పేరుతో రద్దైంది. మనతో పాటు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో రెండు సార్లు గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తే మనరాష్ట్రంలో ఒక్కటి నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సర్వీస్ కమిషన్ని దేశంలో ఎక్కడలేని విధంగా తీర్చిదిద్దుతామనీ, యూపీ ఎస్సీ మాదిరి క్యాలెండర్ ఇయర్ అమలు చేస్తామనీ పలికిన ప్రగల్బాలు నీటి మూటలే అయ్యాయి. కనీసం ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేని స్థితిలో సర్వీస్ కమిషన్ ఉంది. అసెంబ్లీలో సాక్షతూ ముఖ్యమంత్రి శుభవార్త చెబుతున్న అని చేసిన ప్రకటన కూడా నేరవేర్చకుండానే రద్దై పోయాయి.
పరీక్షలు నిర్వహణలో అతి ముఖ్యమైనది పేపర్లు తయారీ, ప్రింటింగ్, భద్రపర్చడం సాధారణంగా పాఠశాల స్థాయిలో జరిగే పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలకే అత్యంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహాణ ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయిలో అత్యంత ముఖ్యమైన పరీక్ష నిర్వహణలో చాలా నిర్లక్ష్యంగా కమిషన్ చైర్మన్ ఉన్నారు. ఎవరికి తెలియ పర్చకూడని కాన్ఫడెన్సీయల్ విభాగం పనులు సాధరణ సెక్షన్ ఆఫీసర్‌గా బాధ్యతలు చూసే వ్యక్తికి పేపర్లు పోల్డర్లో ఉంటాయో కూడా తెలిసి దొంగలించేంత నిర్లక్ష్యంగా కమిషన్ ఉందంటే వారికి ఈ రాష్ట్ర నిరుద్యోగుల పట్ల, ఉద్యోగాల భర్తీ పట్ల ఎంత చిత్తశుద్ది ఉందో అర్థం చేసుకోవచ్చు. పరీక్ష ఆన్లైన్ కాకుండా భౌతికంగా జరిగితే కమిషన్ చైర్మైన్కు పేపర్ ఇతర రాష్ట్రల నుండి ఎంచుకున్న పేపర్ సెట్టర్స్ 3 పేపర్లను సీల్డ్ కవర్లో పంపితే వాటిలో రెండింటిని కమిషన్ చైర్మన్ పేపర్ చూడకుండా ఎంచుకోని కేంద్ర ప్రభుత్వ ఆథారైజిడ్ ప్రింటింగ్ కేంద్రాలకు పంపి అక్కడ పేపర్ ఓపెన్ చేసి పరీక్ష ముందు డైరెక్ట్‌గా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు పంపాలి. అదే కంప్యూటర్ టెస్టు అయితే ఇతర రాష్ట్ర పేపర్ సెట్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించుకోని చైర్మన్ తన అధీనంలో ఉండే ల్యాప్ ట్యాప్, లేదా కంప్యూటర్లోకి పాస్ వర్డ్స్ పెట్టుకుని తన దగ్గరే భద్రంగా ఉంచుకుని పరీక్ష రోజు మాత్రమే ఓపెన్ చేయాలి. ఇన్ని పద్ధతులు పాటించాల్సిన దగ్గర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పని చేస్తున్న చిన్నస్థాయి ఉద్యోగికి ఎలా పాస్వర్డ్ తెలిసింది. అతను కంప్యూటర్ లోనుండి పేపర్ ఎత్తుకెళ్ళిన గమనించలేని స్థితిలో కమిషన్ ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
నేడు తెలంగాణలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త పర్సనల్ సర్వీస్ కమిషన్‌గా మారింది. ఉద్యోగాలు భారీగా భర్తీ చేస్తాం అని ప్రకటించిన ప్రభుత్వం అసలు ఉద్యోగాలు భర్తీ చేసే కమిషన్‌లో ఉద్యోగాలు భర్తీ చేయడంలేదు. టీఎస్పిఎస్లో 450 శాంక్షన్డ్ పోస్టులు ఉండే దగ్గర కేవలం 125పోస్టులు ఉన్నాయి. అందులో 82 మంది రెగ్యూలర్ ఉద్యోగులు. 20 మంది మాత్రమే ఆఫీసర్ స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం తెలంగాణ వచ్చినంకనే మొదటిసారి 23వేల ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇక్కడ ఉన్న ఉద్యోగులు న్యాయ, ఇతర పనులు చూసుకోవడానికే సమయం సరిపోతుంటే పరీక్షలు పారదర్శకంగా జరగడానికి అవకాశం ఎలా ఉంటుంది. ఇక్కడ ఉద్యోగులు లేకుండా ఎలా భర్తీ చేసే పక్రియ అమలవుతుంది. దేశంలోనే నెం.1 సర్వీస్ కమిషన్ అయితే మరీ దీనిపై దృష్టి ఏది? వీటి గురించి ఎనాడు మాట్లడరు. ఎవరు స్పందించరు. కింది స్థాయి ఉద్యోగులే పై స్థాయి అధికారి పని చేస్తుంటే అనేకతప్పులు దొర్లుతున్న ప్రభుత్వం పట్టించునే స్థితిలో లేదు.
- టి. నాగరాజు
9490098292