Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గర్భ సంస్కార్' పేరిట గర్భిణులకు శిక్షణ ఇవ్వడం ద్వారా పుట్టబోయే పిల్లలకు దేశభక్తి, స్త్రీల పట్ల గౌరవం, సాంస్కృతిక విలువలు ఏర్పడతాయన్న ప్రచారం గత కొద్ది సంవత్స రాలుగా మన దేశంలో సాగుతోంది. అందుకోసం శిక్షణా శిబిరాలు కూడా వెలుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ నెల 5వ తేదీన... ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్ధ ''సంవర్ధిని న్యాస్''... ఢిల్లీలోని జేఎన్‌యూ (జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటి)లో ''గర్భ సంస్కార్'' పేరిట ఒక వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో కొందరు గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు కూడా పాల్గొన్నారు. దేశభక్తి, స్త్రీల పట్ల గౌరవం పెంపొందాలంటే మహిళలు తమ గర్భధారణ సమయంలోనే భగవద్గీత, రామాయణ శ్లోకాలు పఠించాలని 'సంవర్ధిని న్యాస్' జాతీయ కార్యదర్శి మాధురి మరాఠే ఉద్బోధించారు. ఈ పఠనం వలన తల్లి గర్భంలోని శిశువుకు భారతీయ సాంస్కృతిక విలువలు అలవడతాయని ఆమె వ్యాఖ్యానించారు. గర్భధారణ సమయంలో ఇలాంటి గీతాలాపన చేయడం వలన గర్భస్థ శిశువులోని డిఎన్ఎ (జన్యువు)లో మార్పులు జరుగుతాయని కూడా కొందరు వక్తలు వ్యాఖ్యానించారు. మరికొందరు వక్తలు సంస్కృత శ్లోకాలు చదవడం వలన తల్లి గర్భాశయం, శిశువు మెదడు ప్రక్షాళన చేయ బడతాయని కూడా వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం వెయ్యి మంది గర్భిణీలకు గర్భ సంస్కార్ శిక్షణ గరపాలని అక్కడ హాజరైనవారు తీర్మానించారు.
దేశమంతటా గర్భిణులు అవలంబించా లంటూ ప్రవచించబడుతున్న ఈ ''గర్భ సంస్కార్'' సిద్ధాంతానికి ఉన్న శాస్త్రీయత ఏమిటనేది పరిశీలించాల్సి ఉంది. కొన్ని అంశాల ప్రాతిపదికగా దీనికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేయాలి.
గర్భస్థ శిశువుకు వినికిడి శక్తి ఎప్పుడు వస్తుంది?
వైద్య శాస్త్ర పరిజ్ఞానం ప్రకారం అండం, శుక్ర కణం ఫలదీకరణ చెందిన నాటి నుండి మొదటి ఎనిమిది వారాలు పూర్తయ్యేసరికి అన్ని ముఖ్య అవయవాలు ప్రాథమికంగా ఏర్పడతాయి. ఈ మొదటి ఎనిమిది వారాల కాలాన్ని ''పిండం'' (ఎంబ్రియో)గా పరిగణిస్తారు. తొమ్మిదో వారం నుండి శిశుజననం వరకూ ఉండే కాలాన్ని ''శిశువు'' (ఫెటస్)గా పరిగణిస్తారు. తల్లి గర్భంలో 22 నుండి 24 వారాల సమయంలో గర్భం బయట తల్లి శరీరంలో రక్తనాళాల్లోని రక్త ప్రసరణ, శ్వాస ప్రక్రియ వంటి 'లో ఫ్రీక్వెన్సీ' శబ్దాలను శిశువు వినగలగడం ప్రారంభమవు తుంది. 25 వారా ల తర్వాత వినికిడి శక్తి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే ప్రక్రియ కొనసాగుతుంది.
ఎపిజెనెటిక్స్ అంటే ఏమిటి?
అండం ఫలదీకరణం చెందిన తొలి రోజుల నుండి పిండ దశ పూర్తయ్యే మొదటి 8వారాల పాటు బాహ్య కారకాల ప్రభావం గర్భంలో ఎదుగుతున్న పిండంపైన ఉంటుంది. ఉదాహరణకు తల్లికి మధుమేహం వ్యాధి లేదా స్ధూలకాయం లేదా మానసిక వ్యాధి ఉన్నప్పుడు, తల్లి తినే ఆహారంలో లేదా పరిసర వాతావరణంలో అననుకూల పరిస్థితులు లేదా ప్రమాదకరమైన ఔషధాలు లేదా రసాయనాల ప్రభావం పడ్డప్పుడు పిండంలోని డిఎన్ఎ మిధిలేషన్ వంటి ప్రక్రియలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. వీటిని ఎపిజెనెటిక్ మార్పులుగా వైద్య పరిభాషలో పేర్కొంటారు. తత్ఫలితంగా జీన్స్ వ్యక్తీకరణలో జరిగే మార్పుల ప్రభావం శిశువు జన్మించిన తర్వాత పెరిగి పెద్దయ్యాక కూడా ఉంటుందని వైద్య శాస్త్ర అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎపిజెనోమ్ ఫలితంగా జీన్స్ వ్యక్తీకరణలో మాత్రమే మార్పులు జరుగుతాయి తప్పితే డి.ఎన్.ఎ నిర్మాణం (సీక్వెన్స్)లో కాదనే విషయం గుర్తించాలి.
శ్లోకాలు, మంత్రోచ్ఛారణ శబ్దాలు శిశువుకు వినపడి ఎపిజెనెటిక్ మార్పులు జరుగుతాయా?
ఫలదీకరణం పూర్తయిన తొలి రోజుల నుండి మొదటి 8వారాల పిండ దశలోనే బాహ్య కారకాల వలన సంభవించే ఎపిజెనెటిక్ మార్పులు చోటుచేసు కుంటాయని ఇంతకుముందే తెలుసు కున్నాం. కాబట్టి ఈ దశలోనే జెనెటిక్ ప్రోగ్రామింగ్ పూర్తవుతుంది. గర్భస్థ శిశువు శ్లోకాలు, మంత్రోచ్ఛారణ లాంటి బాహ్య శబ్దాలను వినగలగడం 25 వారాల తర్వాత మొదలవుతుందని తెలుసుకున్నాం.
వాదన కోసం... శ్లోకాలు లేదా మంత్రోచ్ఛారణ వంటి బాహ్య శబ్దాల వలన ఎపిజెనెటిక్ మార్పులు జరిగే అవకాశం ఉన్నదని అనుకుందాం. గర్భస్థ శిశువు 25వారాలు పూర్తయిన తర్వాత మాత్రమే శ్లోకాలు లేదా మంత్రోచ్ఛారణ లాంటి బాహ్య శబ్దాలను వినగల్గి నప్పుడు, మొదటి 8వారాలలోపు పూర్తయ్యే ఎపిజెనెటిక్ మార్పులు తర్వాత కాలంలో జరగడం సాధ్యం కాదు కదా! ఆ దశలో బాహ్య శబ్దాలకూ లేదా తల్లి పలుకులకూ, కదలికలకూ స్పందనగా గర్భస్థ శిశువు కదలికలు చోటుచేసుకోవడం మాత్రమే జరుగుతుంది.
మంత్రోచ్ఛారణలు, మత గ్రంథ పఠనాలతో దేశభక్తి,
స్త్రీల పట్ల గౌరవం, సాంస్కృతిక విలువలు ఏర్పడతాయా?
దేశభక్తి, స్త్రీల పట్ల గౌరవం, సాంస్కృతిక విలువలు అనే అంశాలు మన దేశంలోనే కాదు... ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ అత్యంత ఆవశ్యకమైనవి. అలాగే ఈ సద్భావనలు దేశంలోని అన్ని మతాల, కులాల ప్రజలలో పెంపొందించ బడాలి. ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, లింగ వైరుధ్యాలను బట్టి వ్యక్తుల ప్రతిస్పందనలు రూపొందుతాయి. అలాగే తల్లిదండ్రుల పెంపకం, ఉపాధ్యాయుల బోధనలో విలువలు, పరిసరాలు, సాహచర్యం ప్రభావం, ఆయా దేశాల్లో అమలయ్యే నియమ నిబంధనలు, సాంప్రదాయాలు, చట్టాలు వంటి అంశాలన్నీ వ్యక్తుల సంస్కారం, ప్రవర్తన రూపొందడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి.
ఏ దేశంలో అయినా, ఏ మతానికి చెందిన వారైనా, వాళ్ల వ్యక్తిగత విశ్వాసాల వలన ఆయా మత గ్రంథాలను పఠించినప్పుడు, ఆయా పద్యాలు లేదా సూక్తులు ఉచ్ఛరించినప్పుడు వారి మనసు ప్రశాంతంగా ఉండటం, వారికి స్వాంతన కలగడం సహజమే. ఇంపైన, మధురమైన సంగీతానికి మానసిక అలజడిని తగ్గించే స్వభావం ఉన్నదన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. అందుకే మనం వాడుక పరిభాషలో ''సంగీతంలో ఓలలాడారు, పారవశ్యం చెందారు'' అంటుంటాం. బాధలు మరచి పారవశ్యం చెందేలా చేయగల్గిన ఏ మతంలోని ఏ ప్రార్థనైనా, ఏ జానపద గీతమైనా, ఏ మెలొడియస్ రాగమైనా సగటు మనిషికి ఉపయోగమే. అందులోనూ విశ్వాసంతో కూడినప్పుడు ఖచ్చితంగా మేలు చేకూరుస్తుంది. మనిషి ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నప్పుడు డోపమిన్, ఎండార్ఫిన్స్ వంటి హర్మోన్లు విడుదలై ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకానీ ఆ పేరిట మతగ్రంథాలు పఠిస్తే, శ్లోకాలు వల్లిస్తే దేశభక్తి, స్త్రీల పట్ల గౌరవం, సాంస్కృతిక విలువలు ఏర్పడతాయనీ, డి.ఎన్.ఎ.లో మార్పులు జరుగుతాయనీ సిద్ధాంతీకరించడం అశాస్త్రీయం, కుట్రపూరితం. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాల్ని తణప్రాయంగా అర్పించిన భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి అమరవీరులు తమ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ గర్భ సంస్కారాలు చేయించుకున్నారు? స్త్రీల హక్కుల్ని కాపాడే బిల్లును ఆమోదించనందుకు నిరసనగా కేంద్ర న్యాయశాఖామంత్రి పదవికి రాజీనామా చేసిన మహనీయుడు బి.ఆర్.అంబేద్కర్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ మతగ్రంథాల పఠనం గావించారు?
గర్భధారణ సమయంలో
ఏం చేయాలని వైద్యశాస్త్రం చెప్తోంది?
గర్భధారణ సమయంలో మానసికంగా ప్రశాంతంగా ఉండటం, అవసరమైన మేరకు తేలికపాటి వ్యాయామం చేయడం, చెవులకు ఇంపైన, మృదువైన సంగీతం వినడం, పాజిటివ్ ఆలోచనలు కలిగివుండటం, పజిల్స్ పూరించడం, ప్రకృతిలో గడపడం, మంచి విషయాలు మాట్లాడటం, సమతుల ఆహారం తీసుకోవడం, కాలుష్య రసాయనాలకు, కల్తీ ఔషధాలకు దూరంగా ఉండటం... వంటి అన్ని అంశాలు పాటించాలనీ, తద్వారా తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఆరోగ్యానికి కూడా సానుకూల ఫలితాలు కల్గుతాయనీ ఎప్పటి నుండో వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవన్నీ శాస్త్రీయమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు ఏ మత గ్రంథాల పఠనంతోనూ, గర్భ సంస్కారాలతోనూ సంబంధం లేదు.
వ్యక్తి సంస్కారం, ప్రవర్తనలు రూపొందడంలో కీలకమైన అనేక అంశాల్ని కావాలని పక్కకు పెట్టి... రుజువు చేయలేని, శాస్త్ర విజ్ఞాన ప్రాతిపదిక లేని సంకుచిత భావోద్వేగాలతో మిళితమైన సిద్ధాంతాల్ని ప్రజలందరి పైనా రుద్దడానికి ప్రయత్నించడం వెనుక విభజన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది సుస్పష్టం. సైన్సు పురోగతితో స్వేచ్ఛ, సమానత్వం, విశాల దృక్పథం కల్గిన ఆరోగ్యకరమైన సమాజం రావాలని ఆశించే ప్రజాహితులందరూ ఇలాంటి అశాస్త్రీయ తిరోగమన సిద్ధాంతాల్ని తిప్పికొట్టాల్సి ఉంది.
- డాక్టర్ కె. శివబాబు