Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల భారత వ్యవసాయకార్మిక సంఘం, అఖిల భారత కిసాన్ సభ, సీఐటీయూ నిర్వహిస్తున్న మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీకి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు లక్షల సంఖ్యలో ఢిల్లీకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూడు సంఘాలు గత కొన్నేళ్ళుగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉమ్మడి పోరాటాల్ని నిర్వహిస్తున్నాయి. మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ ఒక కీలకమైన సమయంలో నిర్వహించబడుతుండడంతో ఈ ర్యాలీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని విజయవంతం చేయడానికి పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం, సైకిల్ జాతాలు, వీధి మీటింగులతో పాటు అనేక ఉమ్మడి కార్యక్రమాల ద్వారా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీగా జరుగుతున్న ఏర్పాట్లలో మిలియన్ల సంఖ్యలో ప్రజలు భాగస్వాములవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని గత ప్రభుత్వాలు అమలు చేసిన ప్రజావ్యతిరేక విధానాలు ప్రజల్లో అసంతృప్తిని మిగిల్చాయి. పెట్టుబడిదారీ విధానం లక్షణమైన అవినీతి చాలా విశృంఖలంగా ఉండేది. ఈ పరిస్థితుల్ని అవకాశంగా తీసుకొని, పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి బీజేపీ అధికారం చేజిక్కించుకుంది, నరేంద్రమోడీ ప్రధాని అయ్యాడు. అయితే, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవే నయా ఉదారవాద విధానాలను కొనసాగించడమే కాక వాటి అమలును కూడా వేగవంతం చేస్తుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టుబడి ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కష్టకాలంలో నయా ఉదారవాద విధానాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం ముమ్మరం చేసింది.
స్వాతంత్య్రోద్యమ కాలంలో సమాజంలోని భిన్న వర్గాల ప్రజా సమస్యలు, డిమాండ్లు లేవనెత్తబడ్డాయి. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం సాధించడంతో పాటు స్వాతంత్య్రోద్యమ నాయకులు ప్రజాసమస్యలకు స్వాతంత్య్ర భారతదేశంలో వాటికి పరిష్కారాల్ని కూడా చర్చించారు. ఈ చర్చ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో సహాయపడింది. ఈ రాజ్యాంగం స్వాతంత్య్రోద్యమ విలువల్ని వారసత్వంగా పొంది, సమానత్వ సూత్రాల ఆధారంగా దేశాన్ని నిర్మించే వాగ్దానం చేసింది. ఈ సందర్భంగానే స్వాతంత్య్రం తరువాత అనేక చట్టాలు, సంస్థలు, పథకాలు అభివృద్ధి చేయబడ్డాయి. కానీ అవి నిజమైన స్ఫూర్తితో అమలు చేయబడలేదు. అయినప్పటికీ, మన హక్కులు రాత రూపంలో రాజ్యాంగం ద్వారా సాధించాం, ఆ రాజ్యాంగమే మన పోరాటాలకు ఆధారం. కార్మికవర్గం, రైతాంగం, గ్రామీణ కూలీల సంరక్షణ హామీ కోసం అనేక చట్టాలు చేశారు. సాంఘిక సంక్షేమ రాజ్య నిర్మాణాన్ని నెలకొల్పారు. అయితే కార్మికవర్గ సంరక్షణా చట్టాల్ని నీరుగార్చే క్రమంలో బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్రోద్యమ విలువలకు వ్యతిరేకంగా పని చేస్తూ, సాంఘిక సంక్షేమ రాజ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం డెబ్భై సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశం సాధించిన అభివృద్ధిని నాశనం చేస్తూ, భారతదేశ కార్మికవర్గం చెమటోడ్చి నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థల్ని కారుచౌకగా అమ్ముతుంది.
బీజేపీ ప్రభుత్వ కార్పోరేట్ అనుకూల విధానాలు శ్రామికులకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఓవైపు కార్పొరేట్లు అధిక లాభాల్ని గడిస్తుంటే సామాన్య ప్రజలు పొట్టకూటి కోసం పోరాటాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా నిరంతర వ్యవసాయ సంక్షోభం, భారీ స్థాయిలో నిరుద్యోగం నెలకొనడంతో దినసరి కూలీలు, వ్యవసాయ కార్మికులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితికి నెట్టబడ్డారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, 2021 లెక్కల ప్రకారం వ్యవసాయ రంగంలో పని చేస్తున్న 10,881 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014 నుండి దినసరి వేతన జీవుల ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతూవచ్చాయి. 2021లో నమోదైన 1,64,033 మంది ఆత్మహత్యా బాధితుల్లోని ప్రతీ నలుగురిలో ఒకరు దినసరి వేతన కూలీ అని ఎన్సీఆర్బీ తాజా నివేదిక పేర్కొంది.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, భారత ప్రజల ఆస్తులైన ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తుంది. దానితోపాటు సాంఘిక సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడం లేదు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏకు నిధుల కోతను ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏకు 2.72లక్షల కోట్ల రూపాయల కేటాయింపు డిమాండ్ ఉండగా ప్రభుత్వం నేరపూరితంగా కేవలం 60 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. ఇది 2023 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ 98 వేల కోట్ల రూపాయల కన్నా చాలా తక్కువ.
మోడీ ప్రభుత్వం కార్మికవర్గాన్ని, రైతాంగాన్ని కార్పొరేట్ శక్తులు లూటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ అనేక చట్టాల్ని సవరించడం లేదా కొత్తగా చట్టాల్ని తెస్తుంది. ప్రస్తుత కార్మిక చట్టాల్ని నీరుగార్చేందుకు, దారి మళ్ళించడానికి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు, ప్రభుత్వం నుండి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా కార్మికవర్గాన్ని దోపిడీ చేయడానికి కార్పొరేట్లకు కల్పించే పూర్తి స్వేచ్ఛ తప్ప మరొకటి కాదు. మూడు వ్యవసాయ చట్టాల్ని కూడా ఇలాంటి లక్ష్యంతోనే తెచ్చారు.ఇది వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ల ప్రవేశానికి చేసే ప్రయత్నమే. ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేసి, కార్పొరేట్లకు ఆహార మార్కెట్‌ను తెరవడమే ఈ కొత్త చట్టాల లక్ష్యం.
శ్రామికులు స్వాతంత్య్రోద్యమం సాధించిన విజయాలను ఎలా కోల్పోతున్నారో చెప్పడానికి గడిచిన కొన్ని దశాబ్దాల్లో భూసంస్కరణలు ఎలా తలకిందులయ్యాయో ఉదాహరణగా చెప్పవచ్చు. స్వాతంత్య్రోద్యమ పోరాటానికి మిలియన్ల సంఖ్యలో గ్రామీణ శ్రామికుల్ని ఆకర్షించిన స్వాతంత్య్రోద్యమ ప్రధాన నినాదాల్లో ''దున్నే వానికి భూమి'' నినాదం ఒకటి. అయితే స్వాతంత్య్రానంతరం పాలకవర్గం ప్రజల్ని వంచించింది. కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపుర, జమ్మూకాశ్మీర్ మినహా దేశంలో ఎక్కడా భూసంస్కరణల్ని అమలు చేయలేదు.
నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా భారతీయ సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయి. ధనవంతులు, కార్పొరేషన్లు మరింత ధనవంతులుగా మారుతుంటే పేద ప్రజలు బతుకుదెరువుకు అవసరమయ్యే వేతనాల కోసం పోరాటాలు చేస్తున్నారు. ప్రాథమిక ప్రభుత్వ సేవలు,విద్య,వైద్యంలోకి వారికి ప్రవేశం లేకుండా పోయింది. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం భారతదేశ సంపదలో 40శాతం పైగా, జనాభాలోని కేవలం 1శాతం మంది చేతిలో కేంద్రీకృతమై ఉంది. మన దేశంలో 10మంది సంపన్నుల సంపద 2022లో 27.52 లక్షల కోట్లు పెరిగింది. దీనికి భిన్నంగా జనాభాలో దిగువనున్న 50శాతం ప్రజలు, మొత్తం సంపదలో కేవలం 3శాతం సంపద మాత్రమే కలిగి ఉన్నారు. 2021లో 102 మందిగా ఉన్న బిలియనీర్ల సంఖ్య 2022 నాటికి 166కి పెరిగింది. ప్రపంచంలోనే అధికంగా దాదాపు 23కోట్ల మంది ప్రజలు భారతదేశంలో పేదరికంలో జీవిస్తున్నారు. పైనున్న 10శాతం వారితో పోలిస్తే, దిగువనున్న 50శాతం మంది ప్రజలు, 10శాతం వారు చెల్లించే పన్నుల కన్నా 6 రెట్లు పరోక్ష పన్నులు చెల్లిస్తున్నారని, ఆహారం, ఆహారేతర నిత్యావసరాల నుండి వసూలైన మొత్తం పన్నుల్లో దిగువనున్న 50శాతం ప్రజలు చెల్లించే మొత్తం 64.3శాతంగా ఉంది.
అదేవిధంగా దేశంలో అన్ని రంగాలు దాడికి గురవుతున్నాయి. కుల, మత అస్థిత్వ రాజకీయాల ఆధారంగా బీజేపీ, శ్రామికుల మధ్య అనైక్యతను సృష్టిస్తుంది. భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన హిందూత్వ ఎజెండాను కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా అమలు చేస్తుంది. భారతీయ సమాజంలో హిందూత్వ ప్రాజెక్టును రుద్దేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్ని ఉపయోగిస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసి, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత గల వ్యక్తులే దానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన లాంటి చర్యలు రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాల ఉల్లంఘనల్ని సూచిస్తాయి.
మైనారిటీలు, దళితులు, గిరిజనులే లక్ష్యంగా నిత్యం హింసలకు పాల్పడుతున్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ప్రభుత్వ పెద్దలు పథకం ప్రకారం ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. మనుస్మృతి ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి దళితులకు వ్యతిరేకంగా ఒక క్రమపద్ధతిలో హింసను సృష్టిస్తున్నారు. దళితులకు వ్యతిరేకంగా నమోదవుతున్న నేరాల సంఖ్య పెరుగుదలలో ఇది ప్రతిబింబిస్తుంది. రిజర్వేషన్లపై కూడా తీవ్రమైన దాడి జరుగుతుంది. అణగారిన వర్గాల వారికి చేసే బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధిస్తున్నారు. మతోన్మాద, కులోన్మాద హింసలకు బాధ్యులైన వ్యక్తులు వీధుల్లో స్వేచ్ఛగా విహరించడమే కాక వారి చర్యల్ని సమర్థిస్తూ, బహిరంగ వేదికలపై వారిని సన్మానిస్తున్నారు. సమాజంలో అణగారిన వర్గాల వారికి అభద్రతా భావాన్ని కలిగించే విధంగా దేశంలో ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
వ్యవసాయరంగ నిరంతర సంక్షోభం వ్యవసాయ కార్మికుల్ని కష్టాల పాల్జేస్తుంది. కొనసాగుతున్న ఈ వ్యవసాయ సంక్షోభం చిన్న సన్నకారు రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితుల్లోకి నెట్టివేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వ్యవసాయ పనిదినాల సంఖ్య గణనీయంగా తగ్గాయి. ఫలితంగా వ్యవసాయ కార్మికుల్లో నిరుద్యోగం పెరిగి, గ్రామీణ నిరుద్యోగులు, ఇతర పేదలు వలస పోతున్నారు. ఆర్థిక సంక్షోభం ఫలితంగా మందగించిన పారిశ్రామిక వృద్ధి ఈ ప్రజలకు ప్రత్యామ్నాయ గ్రామీణ, పట్టణ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైంది. వ్యవసాయకార్మికుల నిజ వేతనాలు కాలానుగుణంగా పెరగడం లేదు. ఇంతకు ముందు పేర్కొన్నట్లు, నయా ఉదారవాద విధానాల ప్రభావం వల్ల భూమిలేని, ఇళ్ళులేని వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సాంఘిక సంక్షేమ రాజ్యం క్షీణించడంతో వ్యవసాయ కార్మికుల జీవితాలు మరింత అనిశ్చితంగా, అభద్రతగా మారుతున్నాయి. వ్యవసాయ కార్మికులకు తగిన పని, సరైన పని పరిస్థితులు, వేతనాలు, సామాజిక భద్రతా చర్యలకు హామీ ఇచ్చే సమగ్ర కేంద్ర చట్ట రూపంలో ఓ చట్టబద్ధమైన భద్రత కోసం డిమాండ్ చేసే కీలక సమయమిది. వ్యవసాయ కార్మికుల ఉనికి కోసం పోరాటం చేయడం తప్ప వేరే మార్గం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో మన జీవనాధారాల్ని కాపాడుకోవడమే కాక లౌకిక, ప్రజాస్వామ్య, భిన్నత్వంతో కూడిన భారతదేశాన్ని కూడా రక్షించుకోవడం మనందరి బాధ్యత. ఇవే ప్రస్తుతం కార్మికవర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్ళు. సామాజిక సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ఐక్య పోరాటాలే దీనికి సరైన సమాధానం.
- బి. వెంకట్
అనువాదం:బోడపట్ల రవీందర్,
9848412451