Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బండి నిండా క్యాలెండర్లు వస్తున్నాయి. ఓ కార్యకర్త కంగారు పడుతూ పరుగు పరుగున వచ్చాడు. సార్ ఘోరం జరిగిపోయింది. మన క్యాలెండర్ ఎవరో లీక్ చేశారన్నాడు. ఐతేగియితే పేపర్ లీకవ్వాలి కాని క్యాలెండర్ లీకా? అయినా మనమే ఇంకొకటి చూసి కాపీకొడితే దాన్ని లీక్ చేశారా? ఆశ్చర్యపోయాడు. యమలీల సినిమాలో అన్నా నీకోసం పోస్టల్ వ్యాన్ వచ్చిం దంటారు తనికెళ్ళ భరణి సహాయకులు. వస్తేగిస్తే నాకోసం పోలీస్ వ్యాన్ రావాలిగాని పోస్టల్ వ్యాన్ ఎందుకొచ్చిందంటాడు భరణి. తేడాలు తగ్గుతు న్నాయిప్పుడు.
ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకు నేవరకు ఎన్నో క్యాలెండర్ల గురించి వింటుంటాం. ఉగాదికి గంటల పంచాంగమని ఇంకోరకమైన క్యాలెండర్లూ దొరుకుతాయి. గంటగంటకు ఏమి జరుగుతుందో చెబుతారు. కాబట్టి గడియారం చూసుకుంటూ ఉంటారు కొందరు.
మనుషులు పుట్టినప్పటినుండి తమ జీవసంబంధమైన గడియారం ఎలా చెబితే అలా వింటారని కొందరు చెబుతారు. అంటే ఆ బయలాజికల్ క్లాక్ చెప్పినట్టే తినడం, తాగడం, రెస్టు తీసుకోవడం మొదలైన పనులన్నీ చేస్తారనీ చెబుతారు. దీన్నే మేము ఇంకో విధంగా అంటే పుట్టినవారు గిట్టక మానరని, పూర్వ జన్మ పాప ఫలాలే వాళ్ళ జీవితాలని నిర్ణయిస్తాయి అంటే నమ్మరెందుకు అనేవాళ్ళూ ఉన్నారు. దానిపేరే జ్యోతిష్యమని, దానికోసం విశ్వవిద్యాలయాలు పెట్టి మరీ తమ వాదనలకు బలం చేకూరుస్తారు. వాళ్ళ గడియారమూ, క్యాలెండరూ వేరు.
ఈ ఉద్యోగాల ప్రకటనలూ అంతే. వాటికీ ఉద్యోగ క్యాలెండరే కాదు గడియారమూ ఉంటుంది. ఎప్పుడు ప్రకటన ఇస్తారు, అందులో రూల్స్ ఏమేమి పెడతారు, ఆ ప్రకటనపై కోర్టుకు పోవడానికి తగిన కారణాలను జొప్పిస్తారు కూడా. అది గడియారం. ఇది ఏ ఒక్క పార్టీ ప్రభుత్వమో చేస్తుందంటే పొరబాటే, ఏవో కొన్ని ప్రజా ప్రభుత్వాలు తప్ప మిగతావన్నీ సేం టు సేం. తరువాత పరీక్ష జరగడం ఒక ఎత్తు. ఆ పేపర్ లీకైనట్టు చెప్పడం, చెప్పించడం తరువాతి స్టెప్పు. మళ్ళీ చెబుతున్నా, దీనికి ఇప్పుడు జరుగుతున్నదానికి లంకె పెట్టడం లేదు. ఇది కొత్తది కాదు, చివరిదీ కాదు. ఇంకా ఎన్నెన్ని ఎన్ని చోట్ల జరగాలో. అది ఉద్యోగ గడియారం ప్రకారం జరిగిపోతుందంతే. అందరూ ప్రేక్షక పాత్రధారులే. నిస్సిగ్గుగా రాజకీయాలకోసం పనిచేస్తున్నవారికేం తెలుస్తుంది కష్టం, ఉద్యోగంకోసం అహర్నిశలూ చదివి పరీక్షలు రాసేవాళ్ళకు తెలుస్తుంది జీవితమంటే ఏమిటో. ఉద్యోగం కోసం చూసే బదులు ఏదైన వ్యాపారం చేసుకోరాదా అని ఉచిత సలహా పడేసేవాళ్ళు కాదు కావలసింది. ఆ రాజకీయ వ్యాపారమేదో వాళ్ళనే చేసుకోనివ్వండి. ఈ చిన్న జీతాలు ప్రజలకివ్వమనండి చాలు.
ఇంటరులో మా ఇంగ్లీషు ప్రొఫెసరు ఉండేవాడు, ఆ సారే మళ్ళీ మాకు డిగ్రీ మొదటి సంవత్సరానికి వచ్చాడు. మొదటి క్లాసులోనే కళ్ళు దిమ్మతిరిగి మైండు బ్లాక్ అయిపోయే విషయమొకటి చెప్పాడు. అదేమంటే ఇంటరు రెండో సంవత్సరం ఏ ఇంగ్లీషు పేపరు రాసి మేమంతా పాస్ అయ్యామో ఆ ప్రశ్న పత్రం తయారుచేసింది తానేనని. మాకు చెప్పలేదు కద సార్ అంటే నవ్వి అలా ఇవ్వడం నేరమనీ, అంతే కాక తన ఆదర్శం కూడా అలా ఇవ్వడానికి ఒప్పుకోదనీ చెప్పాడు. ఇప్పుడివన్నీ చెబితే హాస్య కథ రాసుకో ఎర్రంసెట్టి సాయికంటే పైకొస్తావనే ఛాన్సుంది. ఆదర్శాలు ఫేకుగా మారినప్పుడు ఇలాంటి లీకులే చూస్తాం. అంతా జరిగాక సాకులెన్నో చూపొచ్చు. జాతి రత్నాలు సినిమాలో అన్నట్టు ఇప్పుడు అసలైన నేరస్తులెవరో బయట పడతారు అనేలోపు వాళ్ళ పేర్లే వస్తాయి టీవీ వార్తల్లో. అలా ఇప్పుడు గట్టిగా అరిచేటోళ్ళే లోలోన దీనికి కారకులని అప్పుడే వార్తలూ వస్తున్నాయి. ఓట్ల కోసం ఇంత కక్కుర్తి పడాలా అని మనకు అనిపించవచ్చు. తాము రాజకీయాల్లో చేరి పదవులు సంపాదించి, జీతాలు తీసుకొని, ఆ తరువాత పెన్షన్లు కూడా తీసుకొనే వీళ్ళు నిరుద్యోగుల నోర్లు కొడుతున్నారన్న నిజం మేధావులనబడేవాళ్ళు తెలుసుకోవాలి. మతాలను, సెంటిమెంట్లను సాకుగా చూపే వీరి నిజరూపాన్ని తెలుసుకోవాలి ముందు.
మీరంతా ఒక్కటే. మీ రాజకీయ గడియారం కోసం అందులో పావులుగా నిరుద్యోగులను వాడొద్దని మీకు నిరుద్యోగులందరూ మనవి చేస్తున్నారు. మీ పరమపదసోపానంలో ఎక్కవలసిన నిచ్చెనకోసం యువతను పామునోట్లో పెట్టొద్దు. ఉద్యోగాలు తీయడమే తెలిసినోళ్ళు ఉద్యోగాల క్యాలెండర్ ఇస్తామనడం పెద్ద జోకు. తప్పులు చేస్తూనే ఉన్నోళ్ళు వాటిని కప్పిపుచ్చుకోడానికి పదే పదే అబద్దాల ప్రకటనలీయంగ లేనిది ఆ విషయాన్ని అందరికీ తెలియడంకోసం పదే పదే రాయవలసి వస్తుంది. తప్పులేదు. తప్పులు చేయొద్దని ఎన్నిసార్లు రాసినా రాసుకున్నా అది తప్పు కాదు.
పాత పెన్షన్ అడగొద్దు, అడిగితే అది నేరమని, ప్రభుత్వ వ్యతిరేకమని చెప్పే నియంతల రాజ్యం నడుస్తోంది. నీవు ఊపిరి పీలిస్తే చట్ట వ్యతిరేకమని చెప్పినట్టుంది. చిన్న పిల్లలు పాలు తాగడం ఎంత సహజమో ఉద్యోగులకు సమ్మె హక్కూ అంతే సహజంగా వచ్చింది. దాన్ని తూట్లు పొడిచే వాళ్ళు జాబ్ క్యాలెండర్ అనడమే హాస్యాస్పదం. నియంత పోకడలు పోయే వారికి ఎక్కడైనా ఎదురుదెబ్బలు తగుల్తాయి. తగలాల్సిందే. ఇది కూడా అంతే సహజం. అందుకే అలాంటి నియంత పోకడలు నీకుంటే అవి మానుకొమ్మని రాజులందరికీ అంటే పాలించేటోళ్ళందరికీ మనవి. లేదంటే గతమైపోతావు, చరిత్రలో మిగలవు గుర్తుపెట్టు కొమ్మని మరీ మరీ గుర్తు చేస్తున్నారు ప్రజలు. పాత పెన్షన్ అందరికీ ఇవ్వాలని ధర్నా చెయమని కోరుతున్నారందరూ! అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తే నిరుద్యోగు లంతా కదిలొస్తారు, కేంద్రం కూడా ఉద్యోగాలు పోయే సంస్కరణలు చేయడం ఆపమని ధర్నాలు చేయండి. అప్పుడు అందరూ నమ్ముతారు.
చెప్పలేదంటనకపొయ్యేరు అని పోతులూరి వారు ఎప్పుడో చెప్పారు. ఆయన కాలజ్ఞానాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదు, ఆయన సంఘానికి చెప్పిన మంచిమాటల్ని పాటల్నీ ఇక్కడ గుర్తుచేసుకోవాలి. అప్పుడే ఫేకు మాటలు చెప్పేవాళ్ళెవరో, సాకులు చెప్పేవాళ్ళెవరో చాలా సింపులుగా తెలుసుకోవచ్చు. అలాగే మేడి పండు చూడ అని, ఉప్పుకప్పురంబు అని వేమన కూడా చెప్పాడు. అందుకే ఉప్పేదో కప్పురమేదో ప్రజలూ గ్రహించాలి. చెప్పలేదంటనకపొయ్యేరు అని ప్రజలకూ చెప్పాలి. అది గ్రహిస్తే భవిష్యత్తులో ఎవరు ఎక్కడ ఉంటారన్న విషయం లీక్ అయినట్టే. ఈ విషయం మాత్రం ఫేకు కాదు. అది దిమ్మ తిరిగే షాకు అని గ్రహించాలి.
- జంధ్యాల రఘుబాబు
సెల్: 9849753298